నాగేశ్, రఘు చేసిన సలాములు అందుకున్నాడు. వారికి స్వాగతము పలికి, కుర్చీలు చూపించాడు. అవసరం లేదన్నా వినకుండా చాయ్ తెప్పించాడు. పరిచయాదులు, క్షేమసమాచారాలు ముగిసిం తరువాత చర్చ ప్రారంభం అయింది. చర్చ సాంతం ప్రధానంగా ఇంగ్లీషులోనూ, కొంత ఉర్దూలోనూ జరిగింది. చర్చలో పాల్గొన్నవారు రఘు, అన్సారీలే. నాగేశ్ శ్రద్ధగా వింటూ కూర్చున్నాడు.
ప్రపంచ యుద్ధాన్ని గురించీ, 1942 ఉద్యమాన్ని గురించి, కమ్యూనిస్టుల పాత్రను గురించీ, జిన్నా పాకిస్తాన్ వాదాన్ని గురించీ వివరంగా చర్చించుకున్నారు.
మహమ్మదలీ జిన్నాను గట్టిగా ఖండించాడు అన్సారీ. జిన్నా బ్రిటీష్ వాళ్ళ ఏజంటన్నాడు. ముసల్మానులు తమ సంక్షేమాన్ని తెలుసుకోలేక పోతున్నారన్నాడు. మతం ఆర్ధిక సమస్యలను పరిష్కరించలేదన్నాడు. ముసల్మానులూ భారతీయులేననీ, భారతదేశాన్ని చీల్చడంవలన ప్రమాదమేగాని ప్రయోజనం లేదని చెబుతూ ఇఖ్బాల్ గేయం "సారే జహాఁసె అచ్చా" చదివి వినిపించాడు.
రఘు ఆశ్చర్యపోయాడు. నిజాం రాష్ట్రంలో అదీ జాగీరులో ఇలాంటి వారుండడం అతనికి ఆశ్చర్యం కలిగించింది.
తరువాత చర్చ పుస్తకాలమీద సాగింది. ప్రేమ్ చంద్ 'గోదాన్' ను ఎంతో మెచ్చుకున్నారు అన్సారీ. అతడు భారతదేశపు గోర్కీ అన్నాడు రఘు. కొంతసేపు 'మదర్'ను గురించి చర్చ సాగింది.
చర్చ మంగళ్ళ సమ్మెనుంచి జాగీరులోకి పత్రికలు రానివ్వకుండా ఉండడం మీదికి వచ్చింది. భయం భయంగానే తాసిల్దారును గురించి ప్రస్తావించాడు రఘు.
"వాడు రాక్షసుడు, హిట్లరును మించినవాడు. పేరుకు నేను మేజిస్ట్రేటును గాని ఇంతవరకు పోలీసులు ఒక్క కేసు నా దగ్గర ప్రవేశ పెట్టలేదు. ఈ జాగీరు పరిస్థితి భయంకరంగా ఉంది. నేను ఏమి చేయలేకున్నాను. వాడికి జాగీర్దారు అండవుంది" అన్నాడు అన్సారీ.
"పత్రిక తేవడం, రఘుకు అవమానం జరగడం తమకు తెలుసుననుకుంటా" ప్రారంభించాడు నాగేశ్.
అన్సారీ సిగరెట్ ముట్టించి గట్టిగా పొగ వదలి వినడానికి ఉద్యుక్తుడై కుర్చీలో చేరగిలపడి 'విన్నాను' అన్నాడు.
"తరువాత పత్రికలు చందా కట్టాం. అది బ్రిటిషిండియాకు పోవాలి. కాబట్టి ఆమోదించనన్నాడు పోస్టుమాష్టరు. ఖాల్సా ప్రాంతానికి వెళ్ళమని ఆర్డరు చేశాం. అయినా పత్రిక రాలేదు. తదుపరి తెలిసిందేమంటే పత్రిక వస్తున్నదనీ తాసిల్దారు ఆజ్ఞ ప్రకారం దాన్ని ప్రతిరోజూ తగలపెట్టడం జరుగుతూందనీ, శాసనరీత్యా మాకు పత్రిక చదివేహక్కు ఉండగా ఇలా చేస్తున్నాడు తాసిల్దారు. దీనికేమైనా మందుందంటారా?"
దీర్ఘంగా ఆలోచించాడు అన్సారీ. పత్రిక మీకు అందించవలసిందని పోస్టుమాష్టరుతో చెప్పగలను. అతడు ఎంతవరకు అమలుపరుస్తాడో చెప్పలేను. అయినా చెప్పి చూస్తాను" అన్నాడు.
"పత్రిక కోసం ఇన్ని సిఫార్సులూ, ఇంత దేబరింపూ ఘోరం" ఉద్రేకంగా అన్నాడు రఘు. "నేను బహిరంగంగా పత్రికలు తెచ్చి ఊళ్ళో పంచాలని నిర్ణయించా, ఏం జరుగుతుందో చూస్తా. కాకుంటే నాలుగు దెబ్బలు కొడ్తారు. జైలుకు పంపుతారు. అంతకంటే ఏం చేయగలరు. ఈ ఘోరాన్ని ధిక్కరిస్తాను."
ఇద్దరూ ఆశ్చర్యంగా చూచారు రఘును. రఘు కళ్ళలో రక్తం చిమ్మింది. పెదవులు వణికాయి. చెప్పవలసింది అయిపోవడంతో సిగరెట్టు కాల్చాడు.
ముగ్గురూ దేని గురించో ఆలోచిస్తున్నారు. గది నిశ్శబ్దంగా ఉంది. గడియారం మాత్రం టిక్కు టిక్కు మని సాగుతూనే ఉంది. వారి మనసుల్లో ఏముందో ఊహించడం కష్టం. కాని ఉప్పెన రేగుతూందని వారి గాంభీర్యం చెపుతూంది.
"రఘు చెప్పింది నాకు నచ్చింది. తాసిల్దారేం తల తీస్తాడా" మౌనాన్ని భంగపరిచాడు నాగేశ్.
"మంచిదే. సత్యాగ్రహం ఎప్పుడు సాగేది చెప్పండి. నేనూ స్టేషనుకు వస్తా" అన్నాడు అన్సారీ.
"థాంక్స్. వస్తా" అని లేచి శలవు తీసుకొని వెళ్ళిపోయారు రఘు, నాగేశ్.
వారిని సాగనంపి చూపందినంత దూరం వారిని చూచి లోపలికి వెళ్ళిపోయాడు. మేజిస్ట్రేటు అన్సారీ.
ఆ రాత్రి సమావేశానికి మంగలి రావఁడు, వీరయ్యగారూ వచ్చారు. రఘు ప్రతిపాదనను గురించి తీవ్రంగా చర్చ జరిగింది. వీరయ్యగారు ముందు కాస్త జంకారు. కాని నాగేశ్ వాగ్దాటే కాక జానకి పట్టుదల వారిని లొంగదీసింది.
"ఉన్న భూములన్నీ అమ్మిపెడ్త ఎట్ల గిరఫ్తార్ (అరెస్టు) చేస్తరో చూస్త హైకోర్టుదాకా పురస్త్" అన్నారు వీరయ్యగారు.
ఆయన ధ్వనిలో పట్టుదల విని అంతా ఆశ్చర్యపోయారు.
"నీ బాంచను గట్లమరి మీరు నిలబడుండి మల్లసూడిరి? మొఁడాలడ్డమేస్తం సాగుతాంటె సాగిస్తాన్రు. వీండ్ల అమ్మల...కాల్మొక్త నాకు సుత చదువు నేర్పురి. పత్రిక చదువుత. పొదిల పత్రిక పెట్కపోయి, తాసిల్దారు ముంగల్నే చదువుత కాల్మొక్త" అన్నాడు రావఁడు.
"చెప్పిందంత బాగానే చెప్పినవుగాని ఆ బాంచను కాల్మొక్త మరువులే. చదువు నేను చెప్త. ఇయ్యాల్టినుంచే మొదలుపెట్టు. ఈడ చదువుకొని మల్ల మీ వోండ్లకు చెప్పాలె" అన్నది జానకి.
"చదువు రానోండ్లకు పత్రికేం పనికొస్తది? హరిజనవాడలో బడి పెట్టాలె" నాగేశ్ ప్రతిపాదన.
"పలకలు, పుస్తకాలు నేనిస్తా" వీరయ్యగారి ఔదార్యం.
"చదువు నేను చెప్పుత" రఘు స్థిర సంకల్పం.
"ఆడదాన్ని నన్నేం చెయ్యమంటరు?" జానకి నిరాశ.
"ఆదిశక్తివి ఊరికెందుకుంటవు? ఆడవాళ్ళకు పత్రిక చదివి చెప్పు" బావగారి హాస్యం.
పత్రిక తెచ్చే రోజు నిర్ణయించబడింది. మెల్ల మెల్లగా ఊరంతా పత్రిక తేవడాన్ని ప్రచారం చేయాలని తీర్మానించబడింది.
జానకి చాలా రాత్రిదాకా నిద్రపోలేదు. క్రమంగా నాగేశ్ ఉద్రేకం మీద ఆమెకు మోజు తగ్గసాగింది. నాగేశ్ ఆమె మనసులోంచి క్రమం క్రమంగా మాయంకాసాగేడు. పూచికపుల్లలాంటి మంట నాగేశ్ ది. అమాంతంగా వెలుగుతుంది, ఇట్టే ఆరిపోతుంది. ఎంత ఆవేశపడ్తాడతను? ఇతరులను ఎంతలో ఆవేశంలో ముంచుతాడు? తానేమయ్యేది ఎదుటి వాడు ఏమయ్యేది గమనించడు. అతని ఆవేశాన్ని అరికట్టలేకపోతే ఎన్ని ఘోరాలు చేసేవాడో. అసలు అతను ఎక్కడ ఉండేవాడో?
బావ తనబావ ఎంత గంభీరంగా ఉంటాడు! అతన్ని పిరికివాడనుకుంది తాను. పిచ్చిది? ఎంత చక్కగా వాదిస్తాడు! ఎంతటి వాణ్నయినా ఓడించగలడు. ఎంత ప్రతిభ ఉంది తన బావలో? మనిషి అంటే ఎంత మమత ఉంది, అతనిలో! మనసున్నవాడు! మంచివాడు! కాని తాసిల్దారు? వాడు రాక్షసుడు డేగవంటివాడు - మంచితనం వాని ముందు సాగుతుందా? బావ, తనబావ పత్రికలు తెస్తాడు వీరుడుగా తెస్తాడు. నిజమే ఒక్క పత్రిక పొరపాటున తెచ్చినందుకే కొట్టాడే అమీను! ఎన్ని దెబ్బలు కొడ్తారో తన బావను. ఛీ ఏమిటి అంత ఉద్రేకంగా మాట్టాడింది. తాను ఆడది కాదూ!
ఆమెలో స్త్రీత్వం పొంగింది. ప్రేమ పెల్లుబికింది. ఆ వెల్లువకు పట్టుదల అడుగంటింది. గుండె నిండింది. ఎందుకో తన బావ తనకు దక్కడంలేదనిపించింది. దుఃఖం గుండెలో నిండింది. ఏడుపే వచ్చేసింది. ఏడ్చింది తలగడ తడిసింది. కన్నీటితోనే లేచింది. బావ గదికి పోయింది. రఘు నిద్రపోతున్నాడు! అతనికి ఈ బాధలు లేవా? పసిపిల్లవానిలా నిద్రపోతున్నాడే! మంచం మీద కూర్చుంది. మెల్లగా 'బావా' అని పిలిచింది.
రఘు లేచాడు జానకిని చూచాడు. ఆమె శోకమూర్తిలా ఉంది. జానకి! ఏడుస్తున్నావా? ఏమైంది?" అని ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు.
"బావా పత్రికలు తేవద్దు" అవి మాటలు కావు దుఃఖపు మూటలు!
"పిచ్చిపిల్లా" ఓదార్చసాగాడు రఘు. భుజంమీద తలవాల్చి వింటూంది జానకి. "ఇంత పిరికి అయితే ఎట్ల?" వెంట్రుకలు సవరిస్తూ చెపుతున్నాడు. ఆ స్పర్శలో ఏదో ఆనందం ఉంది. ఆ మాటలో సుఖం ఉంది. ఆ మాటలు వెచ్చ వెచ్చగా ఉన్నాయి. "నువ్వు కస్తూర్బా, సరోజనీ నాయుడు, విజయలక్ష్మి, అరుణ, వీరివలే తయారు కావాలె. కాని ఇట్ల ఏడ్చుకుంట కూర్చుంటారు? భయాన్ని కాస్త దూరం పంపించు. ఏమీ ఉండదు."
"జానకీ! కుటుంబం మేలుకోసం స్వంత క్షేమాన్ని వదులుకోవాలి. గ్రామం కోసం కుటుంబ క్షేమాన్ని, రాష్ట్ర శ్రేయస్సు కోసం గ్రామ శ్రేయస్సునూ, దేశ శ్రేయస్సు కోసం రాష్ట్ర శ్రేయస్సునూ వదులుకోవాలి. మానవత శ్రేయస్సు కోసం దేశాన్ని సహితం వదులుకోవచ్చు. నువ్వు నన్ను వదులుకోవాలె తప్పదు."
చివరి వాక్యం కఠినంగా ఉంది. కాని ఏదో పట్టుదల ఉంది. కొద్దిగా పుంజుకుంటున్న జానకి ధైర్యంలో మళ్ళీ గండిపడింది.
"జానకీ! నా ఒక్కనికి రాబోయే దుఃఖాన్ని గురించి దుఃఖిస్తున్నావు" ముఖాన్ని తన రెండు చేతులలోనూ తన ముఖానికి ఎదురుగా తెచ్చి చెప్పుతున్నాడు. "ఎందుకు నన్న ప్రేమిస్తున్నవనే గద" జానకి బుగ్గలు జేవురించాయి. కనులలో సిగ్గుల దొంతరలు దొర్లాయి. "ఒక్కని ప్రేమలోనే ఇంత దుఃఖం, ఇంత ఆనందం ఉన్నది కద! దేశాన్నంత ప్రేమించు. ఎంత ఆనందం కలుగుతున్నదో చూడు" కళ్ళు పెద్దవిచేసి చూసింది జానకి. "అంత ఆనందానికి ఈ కొద్ది త్యాగం గొప్పా? ఏమంటావు."