Previous Page Next Page 
అశ్వభారతం పేజి 29


    "మీ కనురెప్పల కదలిక ఫెంటాస్టిక్" అన్నాడు భరత్ తమాషాగా నవ్వుతూ.

    సీరియస్ గా చూసింది త్రివేణి.

    "మీ చూపులకు నా కుట్లు ఊడిపోతాయేమో అన్నాడు ఉడికిస్తూ.

    విసురుగా పక్కకు తిరిగింది వెళ్ళేందుకు.

    "నేనంటున్నది నిజమే. అతను శశాంక తేజదత్త."

    త్రివేణి తిరిగి చూసింది.

    "మరొకటి కూడా నిజమే మీ కనురెప్పల కదలిక.

    త్రివేణీకి భరత్ మీద ఎంతో కోపం తెచ్చుకుంటున్నా సాధ్యం కావటం లేదు.

    "మీకు అతనికి సంబంధం?...."

    "ఆయన హార్స్ ఓనర్, నేను జాకీని అంతే."

    "మీరు జాకీనా....?"

    "ఎందుకంత ఆశ్చర్యం? జాకీనే."

    "మీకు గాయం అయింది రేస్ లోనేనా?"

    "అవును...."

    "ఓ క్షణం మౌనంగా వుండిపోయింది.

    "ఎన్నో కుటుంబాల్ని కూల్చివేస్తున్న ఆ రేసెస్ లో, నీ పాత్ర నీకు షేమ్ పుల్ గా లేదూ?"

    చిత్రంగా చూసాడు భరత్.

    "మీకు రేసెస్ అంటే అయిష్టమా," అడిగాడు భరత్ త్రివేణి కళ్ళలోకి చూస్తూ.

    "అవును...."

    భరత్ మాట్లాడలేదు. ఆలోచిస్తున్నాడు.

    "ఆ జాబ్ మానేయకూడదూ?" త్రివేణి అడిగింది.

    "మీకెందుకూ ఇంట్రస్టు అన్నట్లుగా చూసిన భరత్ వేపు చూడలేక వడివడిగా వెళ్ళిపోయింది త్రివేణి.

    గదిలోంచి బయటకు వచ్చిన త్రివేణికి తనమీద తనకే ఆశ్చర్యమేసింది.

    అంత చనువుగా గతంలో ఎప్పుడూ, ఎవర్ని అలా అనలేదు. ఆ మాత్రం శ్రద్ధ చూపించలేదు.

    తనకు తెలియకుండానే అతని మీద తనకెందుకు ఇంట్రస్టు ఏర్పడుతోంది....


                               *    *    *


    "హలో....నేను శశాంకను మాట్లాడుతున్నాను...."

    "చెప్పండి సార్."

    "మా బాబు ఎలా ఉన్నాడు....?"

    "ఫైన్ సార్, ఏదన్నా నేను చేయవల్సింది ఉందా సార్?"

    "ఎనీథింగ్ రాంగ్."

    "అంతగా ఏం లేదు. కాని మఫ్టీలో నలుగురయిదుగురు పోలీస్ డిపార్టుమెంట్ వ్యక్తులు హాస్పిటల్ ఆవరణలో తిరుగుతున్నట్లు అనుమానంగా ఉంది సార్. అబిడ్స్ స్టేషన్ సర్కిల్ రోజుకు రెండుసార్లు బాబు రూమ్ ముందునుంచి అటూ ఇటూ తిరుగుతూ కనిపిస్తున్నాడు?

    "అంతేనా?"

    "అంతే సార్."

    "బాబును 20 రోజులు కాగానే డిస్చార్జి చేయాల్సింది, లేంది రాత్రికి నీకు ఇన్ ఫర్మేషన్ అందిస్తారు మా వాళ్ళు. పంపించమంటే పంపించు. లేదంటే ఇంకేదో రాసి మాక్కావలసినన్ని రోజులు అక్కడే అట్టే పెట్టు...."

    ఆ వెంటనే ఫోన్ కట్టయింది.

    నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటూ కుర్చీలో జారగిలబడ్డాడు ఉస్మానియా హాస్పటల్ సూపర్నెంట్.

    తను లేని జబ్బు ఉన్నట్లుగా రాసినట్లు సర్కిల్ పసిగట్టినట్లు తెలిసిం దగ్గర్నుంచి సూపర్నెంట్ కి భయంగా ఉంది.

    ఓ పక్క పోలీసులు మరోపక్క! శశాంక తేజదత్త!


                                *    *    *


    అర్దరాత్రి కావటానికి మరికొన్ని నిముషాలుందనగా శుక్రాచార్య, సుదర్శన్ క్లబ్ లోకి ఎంటర్ అయ్యారు.

    విశాలమైన హాలు. ఓ మూలగా లిక్కర్స్ కౌంటర్. హాలంతా చిందర వందరగా కుర్చీలు, టేబుల్స్ - వాటి చుట్టూ వ్యసన ప్రపంచానికి ప్రతినిధులు - బ్రాంది, రమ్ము, విస్కీ, మార్ఫిన్, మాండ్రెక్స్, హెరాయిన్, ఛరస్ తాగుతూ, పీలుస్తూ మరో రంగుల ప్రపంచంలో విహరిస్తూ ఆవేశంతో ఊగిపోతున్నారు.

    ముందుగానే శుక్రాచార్య ఇచ్చిన సూచనల మేరకు సుదర్శన్ శుక్రాచార్య ఎవరో తెలియనట్లుగా దూరంగా వెళ్ళి ఓ మూల టేబుల్ దగ్గర కూర్చున్నాడు.

    శుక్రాచార్య నెమ్మదిగా కౌంటర్ దగ్గరున్న టేబుల్ ముందు కూర్చున్నాడు.

    లక్షలు, కోట్లూ కట్టలు కట్టలుగా రమ్మీ కాస్తున్నారు కొందరు.

    అన్ని కట్టల నోట్లూ తీసుకురావాలంటేనే పెద్ద పెద్ద గోతాలు ఉపయోగించాల్సినంత సొమ్ము.... నల్లడబ్బు.... చీకట్లో ప్రవహిస్తూ ఎకౌంట్స్ పుస్తకాల వెనుక నడిచేసొమ్ము, ఇన్ ప్లేషన్ ని పెంచే సొమ్ము_ ప్యారలర్ ఎకానమీ.

    ఆ క్లబ్ అక్కడుందని, అక్కడ డబ్బు, మందు, మగువ, మార్పిన్ ప్రవాహంలా కదిలిపోతుంటాయని తెల్సినా ఏం చేయాలో తెలియని పోలీసు శాఖ....

    కోటీశ్వరుల కొడుకులు, మిలియనర్స్, కూతుళ్ళు, లంచగొండి అధికారుల అల్లుళ్ళు అక్కడ రాజ్యమేలతారు. ఆ సామ్రాజ్యానికి వీరే అధిపతులు_ వీర్ని వీరి సామ్రాజ్యాన్ని రక్షించే కవచాలు వాళ్ళ తండ్రులు, మామలు, అన్నలు, బావలు.

    కరక్టుగా 12_40 శుక్రాచార్య ఎదురుచూస్తున్న వ్యక్తి వచ్చాడు. అతడు సరాసరి వచ్చి శుక్రాచార్య పక్క కుర్చీలో కూర్చున్నాడు.

    అతను శుక్రాచార్య వేపు చూసాడు. శుక్రాచార్య కళ్ళతోనే మాట్లాడుతాడు.

    అతను లేసి పక్క సీటులోకి వెళ్ళాడు.

    అక్కడ యజ్ఞభూపతి ముద్దుల కొడుకు గంజాయి మత్తులో, దాని తాలూకు ప్రేలాపనలతో పెట్రేగి పోతున్నాడు.

    "ఇప్పుడు సరదాగా ఒక పందెం కాద్దాం....ఎంతమంది రడీ? ఆ వ్యక్తి అడిగాడు భూపతి కొడుకు వేపు ఓరగా చూస్తూ.

    "ఏ పందానికైనా రడీ....ఎంత పందానికైనా రడీ ఎవరు? నాతో కాయగల దమ్మెవరికుంది?" రెచ్చిపోయాడు భూపతి కొడుకు.

    ఆ మాటలు శుక్రాచార్యకు వినిపించాయి.

    భూపతి కొడుకు అంత త్వరగా రెచ్చిపోతాడని ఊహించలేదు.

    చాలు....సమయం వచ్చింది. రెండో దుర్మూహుర్తం సమీపించింది. శుక్రాచార్యకు ఆనందంగా ఉంది. జరగబోయే కురుక్షేత్ర సంగ్రామానికి మరో సమరశంఖం.

    "నాకుంది...." అక్కడే ఉన్న మరో మిలీయనీర్ కొడుకు అంతకంటే రెచ్చిపోయాడు.

    ఘర్షణ మొదలైంది.

    చిలికి చిలికి గాలివాన కాబోతుంది.

    ఆ వ్యక్తి మర్మగర్భంగా శుక్రాచార్యవేపు చూసాడు. 

    శుక్రాచార్య కళ్ళల్లో ప్రశంస కనిపించింది.

    "ఎన్ని లక్షలైనా కాస్తాను. పందెం ఏంటి? భూపతి కొడుకు మాటలు ముద్దగా వస్తున్నాయి.

    "ఎన్ని కోట్లయినా కాస్తాను. బోడి లక్షలు ఎవరు కాస్తాడు? ఈ పౌరుషాల్ని ఓ పావుగంటపాటు రాజుకోనిచ్చాడా వ్యక్తి. పావుగంట తరువాత అన్నాడు "లక్షలు, కోట్లు ఒక్క లెక్కలోదికాదు మీకెవరికీ. కనుక నేనో థ్రిల్లింగ్ గా ఉండే పందెం చెబుతాను. ఓ.కే....?"

    "ఓ.కే" ఇద్దరూ ఒకేసారి అన్నారు.

    "మీ దగ్గర పిస్టల్ ఉందా....?" అడిగాడా వ్యక్తి.

    ఉందంటూ వేరే వ్యక్తి అందించాడు.

    ఆ వ్యక్తి దాని బుల్లెట్స్ మేగ్ జైన్ ఓపెన్ చేసాడు.

    "ఇందులో ఆరుగుళ్ళున్నాయి. ఐదు తీసేస్తున్నాను" అంటూ ఐదు బుల్లెట్స్ ని తీసి అక్కడే ఉన్న టేబుల్ మీద పెట్టాడు.

    "ఇప్పుడు నేనీ మేగ్ జైన్ ని రవుండ్ చేస్తాను. ఆ బుల్లెటు ఏ రవుండ్ లోకి వస్తుందో తెలియదు. ఇప్పుడో కాయిన్ వేస్తాను, చిత్తువస్తే నీవు_ బొమ్మవస్తే నీవు ఈ పిస్టల్ తీసుకొని ఎవరి తలకు వారు గురిపెట్టుకుని ట్రిగ్గర్ నొక్కాలి. ఆ రవుండ్ లో బుల్లెట్ లేకుంటే వారు సేవ్ అయినట్లు_వారు గెలిచినట్లు. ఆ తరువాత చాన్స్ రెండవ వాళ్ళది. ఆ రవుండ్ లోనూ బుల్లెట్ లేకపోతే అతను గెలిచినట్లు. అప్పుడు నేను ఓడినట్లు అపుడు నేను చెరో యాభై లక్షలిస్తాను. ఒకవేళ ఎవరయినా రవుండ్ లో బుల్లెట్ తగిలి చనిపోతే దాన్ని సాహసంగా తీసుకోవాలేగాని పోలీసుల్ని ఇంటర్ ఫియర్ కానీయకూడదు...."

    "అసలీ క్లబ్ లోకి పోలీసులు రావటానికి ఎన్ని దమ్ములుండాలి?" అన్నాడు భూపతి కొడుకు పొగరుగా.

    "అంతే. పందెం అంటే ఇదీ. ఎవరు ఛస్తారో తెలియదు, ఎవరు బ్రతుకుతారో తెలియదు అంతా సస్పెన్స్, థ్రిల్లింగ్. నేను రడీ నీవో" అడిగాడా యువకుడు భూపతి కొడుకు వేపు హేళనగా చూస్తూ.

    భూపతి కొడుక్కి కోపం కస్సున వచ్చింది. ఆ ఇద్దరూ రడీ అనగానే అతను కాయిన్ వేసాడు. ముందు ఛాన్స్ భూపతి కొడుక్కి వచ్చింది. అతను పిస్టల్ చేతిలోకి తీసుకున్నాడు.

    అంతమత్తులోనూ అక్కడున్న అందరికి ఆ డెత్ గేమ్ ఆశ్చర్యంగానూ, వింతగానూ అనిపించింది.

    ప్రాణాలు బిగపట్టి చూస్తున్నారు అంతా.

    శుక్రాచార్య లేచాడు.

    ఆ వ్యక్తి కదిలాడు.

    శుక్రాచార్య కదలికను చూసి సుదర్శన్ కూడా లేచాడు.

    అంతలోనే వినిపించింది ఢాం అన్న శబ్దం....ఆ వెంటనే భూపతి కొడుకు ఆర్తనాదం ఆ అండర్ గ్రవుండ్ అరణ్యంలో మార్మోగిపోయింది.

    కరెక్టుగా ఆ ఆర్తనాదం వినిపించటం శుక్రాచార్య క్లబ్ బయటకు రావటం ఒకేసారి జరిగాయి.


                               *    *    *


    యజ్ఞభూపతి ప్రపంచంలో అన్నిటికన్నా ఆఖరికి గుర్రాలకన్నా ఎక్కువగా ప్రేమించేది తన కొడుకునే. 

 Previous Page Next Page