"మరొక్క విషయం"
"అడుగమ్మా...."
"ఈ బ్లాంక్ పేపర్ పాతదో, కొత్తదో, దానిమీదున్న సంతకం ఎన్నాళ్ళక్రితం చేసిందో వూహించగలరా?"
"అది నా జాబ్ కాదు- అయినా చూస్తాను" అని తిరిగి కళ్ళజోడు పెట్టుకొని, టేబుల్ లైట్ ఆన్ చేసి. మేగ్ని ఫైయింగ్ గ్లాస్ ని చేతిలోకి తీసుకొని పరిశీలనగా చూశాడో నిమిషం.
"కాగితం కొత్తదే- దీనిమీద సంతకం ఈ మధ్య చేసిందే అయివుండాలి. ఎందుకంటే ఇంక్ కి స్వభావసిద్ధంగా వుండే గ్లేజింగ్ తగ్గలేదు. కరెక్ట్ గా తెలుసుకోవాలంటే ఒక పని చేయమ్మా.... అబిడ్స్ ఎమరాల్డ్ హోటల్ వెనుక అపార్ట్ మెంట్స్ లో వున్న బి-7కి వెళ్ళు. అక్కడ ఫ్రాన్సిస్ అనే వ్యక్తి వుంటారు. ఆయన ఫోరెన్ సిక్ కెమిస్ట్- ఆయనైతేనే అథెన్ టిక్ గా చెప్పగలరు" అన్నాడాయన సౌమ్యంగా.
"ఈ రెండు కాగితాలమీదున్న సంతకాలు ఐడెంటికలేనని మీ లెటర్ హెడ్ మీద ఒక సర్టిఫికెట్ యివ్వగలరా....?" అడిగింది మనోజ్ఞ సందేహిస్తూనే.
ఆయన ఏ మూడ్ లో వున్నాడో- వెంటనే ఆ రెండింటి మీద తన స్టాంప్ వేసి, సంతకాలు చేసి, తన లెటర్ హెడ్ మీద ఆ రెండు సంతకాలు ఒకరివే- ఐడెంటికలే అని నేను ధృవీకరిస్తున్నాను అని రాసి సంతకం చేసి యిచ్చాడు.
ఆయనకు థాంక్స్ చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది మనోజ్ఞ.
* * * *
జైల్లోని గుబురైన పండ్లతోట మధ్య వున్నారు వివేక్, రామదాసులు.
వివేక్ నడుముకి వెయిస్ట్ బ్యాండ్ బెల్ట్ బిగించి ,డమ్మీ రివాల్వర్ని అందులో వుంచి, మెరుపు వేగంతో దాన్ని తీయడం ప్రాక్టీసు చేయించాడు రామదాసు.
వెయిస్ట్ బ్యాండ్ లోంచి రివాల్వర్ లాఘవంగా- వేగంగా తీయటం, వెయిమ్ చేయటం, తిరిగి అందులో వుంచటం ఒక్క పూటలోనే బాగా నేర్చేసుకున్నాడు వివేక్.
"షూటర్ - ఏంకర్ నైలాన్ తాడు ఈ రాత్రికి జైల్లోకి వస్తాయి. ఒక బిల్డింగ్ మీంచి మరో బిల్డింగ్ మీదకి దాని ద్వారా వెళితేనే కింద పహరాకాసే పోలీసులకుగానీ, సివిలియన్స్ కిగానీ నువ్వు కనిపించకుండా వుంటావు. ఎందుకైనా మంచిదని ఇది కూడా నేర్పాలనుకుంటున్నాను. పూర్వకాలంలో కూడా ఈ పద్ధతి వుండేది. అడవుల్లో ఒక చెట్టు ఊడను పట్టుకొని మరో చెట్టుకి సంధించటాన్నిబట్టే ఇవి కనిపెట్టడం జరిగింది. పద.... లంచ్ టైమ్ అయినట్లుంది" అన్నాడు రామదాసు అప్పుడే వినిపించిన లంచ్ బెల్ ని అర్ధం చేసుకుంటూ.
ఒంటికి పట్టిన చెమటను తుడుచుకొని వివేక్ బయలుదేరబోతుండగా-
"గ్లాస్ కట్టర్ - వ్యాక్యూమ్ క్రియేటర్ - వ్యాక్యూమ్ హోల్డర్ లాంటివి జైలుకి తెప్పించే ప్రయత్నంలో ఉన్నాను. అవి రాగానే వాటితో ప్రాక్టీస్ చేయిస్తాను" అంటూ రామదాసు ముందుకి కదిలాడు.
* * * *
మనోజ్ఞ ఫోరెన్సిక్ కెమిస్ట్ ఫ్రాన్సిస్ ని కలిసేసరికి మధ్యాహ్నం ఒంటిగంటయిపోయింది.
ఆయన మరీ నిర్మొహమాటపు వ్యక్తి.
మనోజ్ఞ ఆఫర్ చేయకముందే, అయిదువేలని ఫిగర్ తేల్చేసి, సుచిత్ర సంతకమున్న బ్లాంక్ పేపర్ తీసుకుని లాబ్ లో కెళ్ళిపోయాడు.
క్షణాలు....నిమిషాలు....గడిచిపోతున్నాయి. మనోజ్ఞ ఆ టెన్షన్ ని భరించలేకపోతోంది.
తన అనుమానం, ఊహా నిజమో, అబద్ధమో కాబోయే ఆఖరి అంకం అది. ఆ ఉద్విగ్న క్షణాల్ని ఆమె తట్టుకోలేకపోతోంది.
పావుగంట....అరగంట....గంటయింది.
అప్పుడొచ్చాడాయన లాబ్ లోంచి బయటకు. ఆయన నుదురంతా చెమటతో తడిసిపోయుంది.
ఆయన ఏం చెప్పబోతున్నారు?
తనాశించేదేనా? భగవంతుడా! తనాశించే రిజల్ట్సే రావాలి- నా వివేక్ రక్షింపబడాలి....
ఒక్కోక్షణం ఆమెపరంగా ఒక్కో యుగంగా గడుస్తుండగా-
"దీనిమీద సంతకం చేసి రెండు మూడు రోజులయి వుంటుందంతే! అన్నారాయన ఎంతో కాన్ఫిడెంట్ గా.
అన్ కంట్రోలబుల్ ఎక్సైట్ మెంట్ ఆమెనో క్షణం ఊపివేసింది.
ఆ క్షణాన ఆమె పొందిన ఆనందం బహుశా ఆమె జీవితంలో ఎప్పుడూ పొంది వుండదు.
మెరుస్తున్న కళ్ళతో ఆయనకేసి చూస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంది. ఆయన అడక్కుండానే వేనిటీ బ్యాగ్ లోంచి పదివేలకట్ట తీసి ఆయన చేతిలో పెట్టింది.
ఈసారి ఎక్సైట్ అవ్వటం ఆయన వంతయింది.
"దయచేసి అలా అని సర్టిఫికెట్ ఇస్తారా" అడిగింది మనోజ్ఞ అర్థింపుగా.
ఆయన తలూపి సుచిత్ర సంతకం కింద తన స్టాంప్ వేసి, సంతకం చేసి అక్కడే పై సంతకం ఎప్పుడు పెట్టినదీ తాను శాస్త్రీయంగా సర్టిఫై చేస్తున్నట్టు తన హేండ్ రైటింగ్ తోనే రాసేసి, దానికింద మరోసారి సంతకం చేసి మనోజ్ఞకిచ్చాడు.
ఆ క్షణమే ఆమె అక్కడినుంచి సుడిగాలిలా బయలుదేరి హరికుమార్ ఆఫీసుకి వెళ్ళిపోయింది.
* * * *
హరికుమార్ ఆమె చెప్పింది విని ఆ ఇద్దరి ఎక్స్ ఫర్ట్ ధృవీకరణ పత్రాల్ని చూడటంతోనే దిగ్భ్రాంతికి గురయ్యాడు.
"సో...సుచిత్ర బ్రతికే వుందన్నది రుజువైపోయింది. ఫెంటాస్టిక్" అంటూ మెరిసే కళ్ళతోటే ఆమెని అభినందించాడు.
"లాంగ్ రేంజ్ డమ్మీ రైఫిల్ దాని పైన అమర్చేందుకు టెలిస్కో పిక్ లెన్స్ కూడా లోపలకు పంపించమని ఈ రోజే కిట్టూకి కబురు పంపిస్తాను. అసాసినెషన్స్ ఎప్పుడూ దూరంనుంచే జరుగుతాయి. పబ్లిక్ మధ్య కుటుంబ సభ్యులమధ్య, సెక్యూరిటీ మధ్య వుండే వ్యక్తుల్ని ఆసాసినేట్ చేయాలంటే లాంగ్ రేంజ్ రైఫిల్ విత్ టెలిస్కోపిక్ లెన్స్ తోటే సాధ్యమవుతుంది" అన్నాడు రామదాసు. నెమ్మదిగా లంచ్ ముగించి చేతులు కడుక్కుంటూ.
"ఇన్ని వస్తువుల్ని ఎలా రప్పిస్తున్నారు జైల్లోకి?" పిచ్చెత్తిపోతూ అడిగాడు వివేక్.
రామదాసు పెద్దగా నవ్వాడు. చాలాసేపు నవ్వుతూనే వున్నాడు.
"చెప్పానుగా, లంచగొండి రాజకీయ నాయకులు, లంచగొండి ప్రభుత్వోద్యోగులు మన దేశాన్ని, దేశ చట్టాన్ని తమ గుప్పిట్లో బిగించుకొని పిండుకుంటున్నారు. వాళ్ళున్నంతకాలం డబ్బిస్తే ఇండియాలో ఏ పనయినా జరిగిపోతుంది. కోట్లుంటే నేనీ జైల్నే కొనేసేవాడ్ని. దానిగురించి ఇక ఆలోచించకు. మనం విధించుకున్న గడువు దగ్గరకొచ్చేస్తోంది.
ఒక రాత్రిని నాయుడు నుంచి కొనే బేరానికి త్వరలోనే శ్రీకారం చుడతాను. ఆ రాత్రే నువ్వీ జైలునుంచి తప్పించబడతావ్. సాయంత్రం ఆరింటికి నువ్వీ జైలునుంచి బయటకు వెళ్ళితే ఉదయం ఆరులోపు తిరిగి జైలుకొచ్చెయ్యాలి. సో....నేను నాయుడి నుంచి నీకు సంబంధించిన పన్నెండు గంటల్ని కొనేస్తానన్నమాట. ఆ బేరమయిపోతే మన మార్గం సుగమమయినట్టే....పద" అన్నాడు రామదాసు.
వివేక్ దిగ్భ్రాంతినుంచి తేరుకొని రామదాసుని ఫాలో అయ్యాడు.
* * * *
"వాళ్ళింటి ఫోన్ నెంబర్ తెలుసుకున్నాను. 244442. ఈరోజు నుంచి జూబ్లీహిల్స్ టెలిఫోన్ ఎక్సేంజ్ మీద నిఘా వేస్తాను. అలాగే ఆ ఏరియా పోస్ట్ మేన్ ని పట్టుకుంటాను. వేనిటీ బ్యాగ్ తెరుస్తాను. నిజాలు అవే బయటకొస్తాయి" పట్టుదలగా అంది మనోజ్ఞ.
"ఈ రెండు ఆధారాలు సరిపోవేమోకదా?" హరికుమార్ అడిగాడు.
"సరిపోవు....వెరీ థిన్ ఎవిడెన్స్.... ప్రధాన సాక్ష్యమేదన్నా దొరికితే దాని అనుబంధ సాక్ష్యాలుగా ఇవి పనికొస్తాయేతప్ప ప్రధానమైనవిగా పనికిరాకపోవచ్చు. అదీ లాయర్ భూషణరావుగార్ని అడిగి తెలుసుకుంటాను" అంది మనోజ్ఞ.
"హి ఈజ్ గ్రేట్ క్రిమినల్ లాయర్. నీ స్పీడ్ కి తగ్గ లాయర్ నే ఎన్నుకున్నావ్. ఏదిఏమైనా వివేక్ ఉరిశిక్షను హైకోర్టు ధృవీకరించేలోపే ప్రధాన సాక్ష్యం లభించి తీరాలి."
"టెలిఫోన్ ఎక్సేంజ్ లో నా వేనిటీ బ్యాగ్ తెరుస్తాను" అంది ఆమె.
"అర్ధమైంది....అనఫీషియల్ టాపింగ్....సుచిత్ర బతికుంటే ఎప్పుడో ఒకసారన్నా ఫోన్ చేయకపోతుందా? కనీసం ఉత్తరమైనా రాయకపోతుందా? ఎస్....యూ ఆర్ కరెక్ట్....నీ రీజనింగ్ సరయినదే ప్రొసీడ్" అన్నాడు హరికుమార్.
"హైకోర్టులో వివేక్ ఉరిశిక్ష ధృవీకరణ ఏ స్టేజ్ లో వుందో కూడా తెలుసుకోవాలి. అవసరమైతే మనం సేకరించిన సాక్ష్యాల్ని జడ్జిగారి ముందుంచితే వారిలో డౌట్ తలెత్తుతుంది. దాంతో వారు ఫర్ దర్ సాక్ష్యం కోసమో, ఫర్ దర్ పరిశోధన కోసమో సెషన్స్ కోర్టుని ఆదేశించవచ్చు. అలా కొంత జాప్యం మనకు లభిస్తేచాలు. ఈలోపు మరికొన్ని సాక్ష్యాల్ని సేకరించగలగాలి. కేశవమూర్తిమీద నిఘా వేయాలి.
కేశవమూర్తి ఫ్రాడ్ అని రుజువు చేయగలిగితే అతని సాక్ష్యానికి విలువుండదు. ఆపైన పద్మనాభన్, ఆదిరెడ్డి విషయం చూడాలి. తనలో తానే అనుకున్నట్లుగా అంది ఆమె.
అసలు సుచిత్ర బతికేవుందా? ఉంటే ఎక్కడుంది? ఎందుకలా చేసింది?
ముందా నిజాన్ని బయటకు లాగితే కేసు దూదిపింజలా ఎగిరిపోతుంది.