Previous Page Next Page 
నిశీథి నియంత పేజి 29


    నువ్వు ఎవరిమీదయితే నీ పగా ప్రతీకారాలు తీర్చుకోవాలనుకుంటున్నారో- వాళ్ళ పేర్లు చెబితే రేపటినుంచే కిట్టూవాళ్ళ అడ్రస్ ల్ని- దినచర్యని- వాళ్ళకుండే సెక్యూరిటీ అరేంజ్ మెంట్స్ ని - వాళ్ళు ఏ సమయంలో ఎక్కడికెళ్ళేది- ముఖ్యంగా రాత్రిళ్ళు- మొదలయిన వివరాల్ని సేకరించి పంపిస్తాడు.

    నా శత్రువైన జస్వంతరావు వివరాల్ని ఎలాగూ నీకు నేను అందిస్తాను. చెప్పు....ఎవరిమీద నీ పగా, ప్రతీకారం?" అడిగాడు రామదాసు.

    ఒకింతసేపు ఆలోచిస్తూండిపోయాడు వివేక్.

    "జాగ్రత్తగా ఆలోచించి చెప్పు- నిర్దోషుల జోలికి వెళ్ళకు."

    "మొదటి వ్యక్తి కె. కేశవమూర్తి - ప్రైమ్ విట్ నెస్.

    రెండవవ్యక్తి నా డిఫెన్స్ లాయర్ ఆదిరెడ్డి.

    మూడవ వ్యక్తి చంద్రనాథ్.

    నాల్గవ వ్యక్తి సి.ఐ. పద్మనాభన్.

    ఐదవ వ్యక్తి జస్వంతరావు."

    "శెభాష్" అన్నాడు రామదాసు వివేక్ చెప్పిన చివరి పేరు వింటూనే.

    చిరునవ్వు నవ్వాడు వివేక్.

    "పైవాళ్ళ ఇంటి అడ్రస్ లు- వాళ్ళు రాత్రిళ్ళు తిరిగే ప్రదేశాలు, రూట్స్, సెక్యూరిటీ వివరాలు రాగానే ప్లాన్ చేస్తాను. ముందెవర్ని అసాసి నేట్ చేయాలి? తరువాతెవర్ని చేయాలి? ఏ రూట్ లో వెళ్ళాలి? అప్పుడే నిర్ణయిస్తాను. ఈ రోజు పైనుంచి వేలాడే పైప్స్ ని పట్టుకొని వేగంగా జారిపోవటం నేర్పిస్తాను....పద...." అన్నాడు రామదాసు లేస్తూ. రామదాసు తీసుకుంటున్న స్ట్రెయిన్ కి, పెయిన్ కి వివేక్ ఆశ్చర్యపోతూ లేచాడు.


                             *    *    *    *


    మరుసటి రోజు ఉదయం సరిగ్గా ఎనిమిదిన్నరకే మెహిదీపట్నం చౌరస్తాకు చేరుకుంది మనోజ్ఞ.

    అప్పటికే సుచిత్ర తండ్రి అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరూ అరగంట వెయిట్ చేశాక సిండికేట్ బ్యాంక్ లోకి వెళ్ళారు. మనోజ్ఞ ముందు వేసుకున్న పథకం ప్రకారమే మాట్లాడింది. 

    "సుచిత్రకి ఈ బ్యాంక్ లో వేరే ఎకౌంట్ లేదుగా? ఉంటే ప్రాబ్లమ్ -ఉండివుంటే మీరీపాటికే సుచిత్ర డెత్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేసి- మీరు సుచిత్ర ఫాదరేనని ఆఫిడవిట్ ఇచ్చి, ఆమె ఎకౌంట్ లో ఎమౌంట్ డ్రా చేసుంటారు. ఇప్పుడు నేను వెళ్ళి సుచిత్ర బ్రతికున్నట్లు అప్లికేషన్ ఇస్తే వాళ్ళకు అనుమానం వస్తుంది...." అంది మనోజ్ఞ ఆయన దగ్గరున్న సుచిత్ర సంతకం వున్న కాగితాన్ని తీసుకుంటూ.

    "లేదు....లేదు మేం వుండేది పల్లవి ఎన్ క్లేవ్ అయితే మా అమ్మాయికి ఇక్కడెందుకు ఎకౌంట్ వుంటుంది? దానికి కావూరి హిల్స్ ఆంధ్రాబ్యాంక్ లో ఎకౌంట్ వుండేది. దాన్ని అది చనిపోగానే క్లోజ్ చేశాను" అన్నాడాయన.

    'కావూరి హిల్స్ - ఆంధ్రాబ్యాంక్' అని అనుకుంది మనసులో మనోజ్ఞ.

    ఆయన్ని అక్కడే కూర్చోమని తను కౌంటర్ కేసి వెళ్ళింది. బ్యాంక్ కిటకిటలాడిపోతోంది కస్టమర్స్ తో.

    ఆ కౌంటర్ కి, ఈ కౌంటర్ కి తిరుగుతూ బ్యాంకు సిబ్బందితో ఏదో మాట్లాడుతున్నట్లు నటిస్తూ కొద్దిసేపు గడిపి తిరిగి వచ్చి-

    "చెరి ఇరవై రెండు వేలొచ్చిందండి....రండి" అంటూ ఆయన్ని బ్యాంక్ బయటకు తీసుకెళ్ళి- బండిల్స్ గా కట్టి పిన్ వేసి వున్న నాలుగు కట్టల్ని ఆయనకిచ్చేసి-

    "వస్తానండి బాబాయిగారూ! చాలా సహాయం చేశారు. థాంక్స్" అంది మనోజ్ఞ ఆయన ముఖంకేసే చూస్తూ.

    ఆ డబ్బును చూస్తూనే ఆయన కళ్ళు మెరిశాయి. "ఫర్వాలేదమ్మా- బిడ్డ పోయిన దుఃఖంలో వున్న మమ్మల్ని అదృష్టదేవతలా వచ్చి ఆదుకున్నావ్. నేనే థాంక్స్ చెప్పాలి...." అన్నాడాయన డబ్బుని ప్యాంట్ జేబులో పెట్టుకుంటూ.

    "సుచిత్ర ప్రతి బర్త్ డేకి నేనెక్కడున్నా గ్రీటింగ్స్ పంపేదాన్ని. అవునూ- ఈ నెలలోనే కదూ సుచిత్ర బర్త్ డే?" గాల్లోకి ఒక బాణం వదిలింది.

    "అవునమ్మా....జులై నెల ఇరవై రెండో తారీఖున ఏం లాభం....ఎదిగొచ్చిన బిడ్డని పోగొట్టుకున్నాం. అది ఉద్యోగం చేసి నెలకు నాలుగువేలు తెచ్చి నా చేతిలో పెట్టేది. అలాంటి బిడ్డపోయింది. వస్తానమ్మా...." అని ఆయన అటుగా వచ్చిన ఆటో ఎక్కాడు.

    "జులై 22న సుచిత్ర బర్త్ డే" మనసులో అనుకుంది మనోజ్ఞ.


                            *    *    *    *


    'కావూరి హిల్స్....ఆంధ్రాబ్యాంకు' అని మనసులోనే అనుకొని ఆటో ఎక్కింది మనోజ్ఞ.

    అరగంటలో ఆటో కావూరి హిల్స్ లో వున్న అంధ్రాబ్యాంక్ ముందాగింది. అప్పటికి బురఖాలోనే వుంది మనోజ్ఞ. అది తీసేసి తన ఐడెంటిఫికేషన్స్ బయటపెట్టుకోవటం తన పరిశోధనకి అంతరాయం కలిగిస్తుందనే అలా చేస్తోంది.

    బ్యాంక్ లోకి వెళ్ళి నలువైపులా పరిశీలనగా చూసి ఒక నడివయస్కురాలి దగ్గరకు వెళ్ళింది.

    "మా ఫ్రెండ్ సుచిత్ర ఆరునెలల క్రితం- అంటే డిసెంబర్ నెల పన్నెండవ తారీఖున చనిపోయింది. ఆమెకి మీ బ్యాంక్ లో ఎకౌంట్ వుంది. ఆ తరువాత ఆమె తండ్రి వచ్చి ఎకౌంట్ క్లోజ్ చేసి వెళ్ళారు. ఎకౌంట్ క్లోజ్ చేసినా ఆమె స్పెసిమన్ సిగ్నేచర్స్ వున్న ఆమె ఇంట్రడక్షన్ కార్డ్ మీ దగ్గరే వుంటుంది. దాన్ని మీరు ఎకౌంట్ క్లోజ్ చేసినా తిరిగివ్వరు గదా?"

    "ఎస్....అఫ్ కోర్స్...." అందావిడ ఆశ్చర్యంగా ఎందుకన్నట్లు.

    "అది నాక్కావాలి. మీ కష్టం వుంచుకోను...." అని వేనిటీ బ్యాగ్ లోంచి ఐదువేల రూపాయల కట్ట తీసి ఆమె కెదురుగా పెట్టింది.

    ఆమె ఆ డబ్బుకేసి, మనోజ్ఞ కేసి చూపులు మార్చి, మార్చి చూసి ఆపైన చిరునవ్వు నవ్వి-

    "సుచిత్ర అడ్రస్....?" అడిగింది.

    "పల్లవీ ఎన్ క్లేవ్ అని మాత్రమే తెలుసు. తండ్రి పేరు ముకుందరావు."

    "గంటాగి రండి" అని ఆ డబ్బును చటుక్కున తన వేనిటీ బ్యాగ్ లో వేసుకుందావిడ.

    సంతృప్తిగా తలపంకించి బ్యాంక్ నుంచి బయటకొచ్చింది మనోజ్ఞ.

    ఒక గంటసేపు అటూ ఇటూ తిరిగి బ్యాంక్ కి వెళ్ళింది.

    ఆ నడివయస్కురాలు వెంటనే సుచిత్ర ఎకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఇంట్రడక్షన్ ఫారమ్ మీద చేసిన మూడు స్పెసిమన్ సిగ్నేచర్స్ వున్న కార్డ్ ని మనోజ్ఞ కిచ్చింది.

    ఆ మరుక్షణమే మనోజ్ఞ బయటకొచ్చి ఆటో ఎక్కి "కింగ్ కోఠి" అంది.

    కింగ్ కోఠీలోనే రైటింగ్ ఎక్స్ పర్ట్ ఇల్లుంది.

    అరగంటకి ఆ ఇంటిముందాగింది ఆటో.

    ఎక్కడా ఒక్కక్షణమాగి రెస్ట్ తీసుకోవటంలేదామె. అనుక్షణం టెన్స్ తో, టెర్రీఫైయింగ్ ట్రూత్స్ వెంట అలుపూ, సొలుపూ లేకుండా పరిగెడుతోంది.

    మైసూర్ నుంచి వచ్చిన రోజుకి- ఆ రోజుకి ఆమెలో చాలా మార్పొచ్చింది. సరైన ఆహారం, సరిపడా విశ్రాంతి లేక ఆమె కళ్ళకింద గుంటలు ఏర్పడ్డాయి.

    బొద్దుగా వుండే చెక్కిళ్ళు పల్చబడి లోపలకు పోయాయి. సరిగ్గా తలైనా దువ్వుకునే టైమ్ లేనట్లు ముడిగా వేసుకుంటోంది తన పొడవాటి కురుల్ని. 

    The race against time is on....

    ఒక అమాయకుడ్ని కొందరు దుర్మార్గులు కలిసి రూత్ లెస్ కిల్లర్ గా ముద్రవేసి మృత్యువువైపు నెడితే నివ్వెరపోని ఈ సమాజపు చట్రం కళ్ళు తెరిచేలా చేసి- నివ్వెరపోయేలా చేయాలి-ఎస్....దట్ హేజ్ టు ది డన్....

    తలుపు తట్టగానే ఓ చిన్నపాప వచ్చి తలుపు తీసి "ఎవరు కావాలాంటీ?" అనడిగింది.

    "రైటింగ్ ఎక్స్ పర్ట్ డేనియల్ గారు కావాలి పాపా!" అంది మనోజ్ఞ లోపలకు చూస్తూ.

    అంతలో ఎవరూ అంటూ ఒక వృద్ధుడు వచ్చాడు.

    "నేనే డేనియల్ ఏం కావాలి మీకు?" అడిగాడాయన. తెల్లగా, పండిపోయి, వంగిపోయున్నాడు. వయస్సు సుమారు డెబ్బైపైనే వుండవచ్చు.

    తనొచ్చిన పని చెప్పింది మనోజ్ఞ.

    అయన ముఖం చిట్లించుకున్నాడు.

    వేనిటీ బ్యాగ్ లోంచి రెండువేల కట్ట తీసింది మనోజ్ఞ. ఆయన కళ్ళు ఒక్కక్షణం మెరిశాయి.

    ఆ డబ్బు తీసుకొని తన మనుమరాలికిచ్చి-

    "ఆ పేపర్స్ ఇలా ఇవ్వండి అన్నాడాయన మనోజ్ఞకు దారిస్తూ.

    తన దగ్గరున్న రెండు పేపర్స్ ని ఆయనకిచ్చింది మనోజ్ఞ.

    అదే హాల్లో ఓ మూలగా వున్న ఓ పాతకాలం టేబుల్ దగ్గరకు వెళ్ళి టేబుల్ లైట్ ఆన్ చేసి, అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడాయన.

    మనోజ్ఞ ఉత్కంఠగా చూస్తుండగా-

    ఆయన మేగ్నిఫైయింగ్ గ్లాస్ తీసుకొని ఆ రెండు కాగితాన్ని దగ్గర దగ్గరగా పెట్టి కళ్ళజోడు పెట్టుకొని పరిశీలనగా చూడసాగాడు.

    కొద్ది నిమిషాలు గడిచాయి.

    "రెండూ ఐడెంటికలేనమ్మా...." అన్నాడాయన కళ్ళజోడుని తీసి టేబుల్ లైట్ ని ఆఫ్ చేస్తూ.

    ఒక సంతోషపు అల ఆమెనో క్షణం కుదిపివేసింది.

    "బాగా చూశారా? సారీ....ఇలా అడుగుతున్నానని ఏమనుకోవద్దు. ఒక వ్యక్తి లైఫ్ అండ్ డెత్ మీరు చెప్పే దానిమీద ఆధారపడి వుంటుంది" అంది నెమ్మదిగా, మృదువుగా.

    "నాకీ ఫీల్డ్ లో నలభై ఎనిమిది సంవత్సరాల అనుభవం వుంది. నా అనుభవం- నా కళ్ళు నన్ను మోసం చేయవమ్మా...." అన్నాడాయన గంభీరంగా.

 Previous Page Next Page