Previous Page Next Page 
నిశీథి నియంత పేజి 31


    కానీ ప్రత్యర్ధులు అంత తెలివితక్కువవాళ్ళా? వేరే అమ్మాయిని వాళ్ళే రేప్ చేసి చంపి, చచ్చిపోయింది సుమిత్రని కోర్టులో ప్రూవ్ చేశారు.

    ఒకవేళ పొరపాటున సుచిత్ర బతికుంటే, బయటపడితే వాళ్ళు ఉరికంబం ఎక్కవలసి వస్తుంది.

    ఆ మాత్రం వాళ్ళకు తెలియకుండా వుంటుందా? ఆ విధంగా అయితే సుచిత్రని వాళ్ళే దాచేసి వుండాలి. లేదా ఆ తరువాత ఎందుకయినా మంచిదని సుచిత్రని కూడా చంపి వుండాలి..

    దొరికిన సాక్ష్యాల్ని బట్టి సుచిత్రని చంపలేదని అర్ధమవుతోంది. ఎందుకని వుంచారు? ఇంకా వాళ్ళకి సుచిత్రతో పనుందా? లేక సుచిత్ర మీద చంద్రనాథ్ మోజుపడుతున్నాడా? సుచిత్రని చంపకుండా వుండటానికి మొత్తానికి ప్రత్యర్ధులకు ఏదో కారణం వుండివుండాలి.

    ఎంత గొప్ప నేరస్థుడైనా ఏదో ఒక రోజు తప్పుచేయకుండా వుండడనేది మన కేసు విషయంలో కూడా రుజువు కాబోతోందేమో....

    ఇవన్నీ అలా వుంచితే అసలు రేప్ కి గురయి చనిపోయిన అమ్మాయి ఎవరు?

    అది తెలిస్తే నీ పరిశోధనకు రెక్కలొచ్చినట్టే....ఆ ప్రయత్నం చేయరాదూ ముందు" సాలోచనగా అన్నాడు హరికుమార్.

    "అవును నిజమే. అసలు ముందా అమ్మాయి ఎవరో తెలిస్తే కేసు బాగా కదిలిపోవచ్చు. ఆ అమ్మాయిమీద చంద్రనాథ్ కి కోరిక వుండివుండాలి. ఆ అమ్మాయి ఒప్పుకొని వుండకపోవచ్చు. దాంతో ఆ అమ్మాయిని చంద్రనాథ్ రేప్ చేసి, ముఖం చెక్కేసి వివేక్ మీదకి నెట్టేసివుండాలి. ఇటు ఆ అమ్మాయిమీదున్న కోరిక తీర్చుకోవచ్చు. అటు తనకు అడ్డొచ్చే వివేక్ బెడద వదిలించుకోవచ్చని ప్లాన్ చేసి వుండాలి."

    "వివేక్ మూలంగా చంద్రనాథ్ కొచ్చిన బెడదేమిటి?  

    ఆ అమ్మాయి ఎవరు? వివేక్ కి సుచిత్రకి మధ్యనున్న సంబంధం.... అసలు వివేక్ గండిపేటకి ఆ అమ్మాయితో ఎందుకెళ్ళాడు? అతను వెళ్ళాడా? సుచిత్ర ప్రోద్భలంతో వెళ్ళాడా? సుచిత్ర ఎందుకు ప్రోద్భలం చేసింది? సుచిత్రకు చంద్రనాథ్ కు మధ్యనున్న సంబంధం ఎలాంటిది? ఇవి తెలిస్తేనే కేసు ఒక్క కొలిక్కి వస్తుంది మనోజ్ఞా" ఆలోచిస్తూ అన్నాడు హరికుమార్.

    అతని సందేహాల్ని మనోజ్ఞ అప్పటికప్పుడే రికార్డ్ చేసింది.

    "అవును....అవి తేలాలి....వస్తానుమరి...." అంటూ లేచింది ఆమె.


                          *    *    *    *


    "చనిపోయిన అమ్మాయెవరో నీకేమన్నా తెలుసా? నీ మౌనంతో, వేదాంతంతో, నిర్లిప్తతతో నన్ను బాధపెట్టవద్దు. దయచేసి చెప్పు" అంది మనోజ్ఞ.

    ఐరన్ గ్రిల్ ఆవలవున్న వివేక్ నవ్వాడు.

    అతని నవ్వు చూసి షాక్ తిన్నది ఆమె.

    అతని మొహంలో నవ్వా? అంత సడన్ గా అతనిలో అంత మార్పు ఎలా వచ్చిందో ఆమెకు అర్ధంకాలేదు.

    నవ్వుతూ ఎంతో కాన్ఫిడెంట్ గా కనిపిసున్నాడు. ఉరిపడ్డ ఖైదీలా లేడు. ఉరి నన్నేం చేస్తుందన్న ధీమా అతని ముఖంలో కనిపిస్తోంది....ఏమిటీ మార్పు?

    "బహుశా నళిని అయివుండవచ్చు...." అన్నాడు వివేక్ ఎంతో తేలిగ్గా.

    "నళిని....ఆవిడెవరు?"

    "నళిని....అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీ! పాపం....ఆవిడదేం తప్పులేదు. అయినా అన్యాయంగా బలయిపోయింది. ఆమె అద్భుతమైన అందమే ఆమెను బలితీసుకుందేమో...." నిట్టూరుస్తూ అన్నాడతను.

    "అసలు నిన్ను మోసం చేసిందెవరు? ఎస్.ఐ. దీక్షితేనా....? సుచిత్రేనా?" కావాలనే అలా అడిగిందామె.

    "కాదు! ఎస్.ఐ.దీక్షిత్ చాలా మంచివాడు. సుచిత్ర పిచ్చిపిల్ల.... అసలు కారణం దొంగసాక్ష్యం చెప్పిన కేశవమూర్తి. వాడి కళ్ళు పీకెయ్యాలి. కేసుని తప్పుదారి పట్టించినవాడు సి.ఐ. పద్మనాభన్! వాడ్ని నరికి పడెయ్యాలి. 'తప్పు ఒప్పుకో నిన్ను కాపాడతా'నని నన్ను నమ్మించి....నాతో తప్పు ఒప్పించినవాడు ఆదిరెడ్డి! వాడ్ని కాల్చిపడెయ్యాలి. వీటన్నిటికీ ప్రధానకారణం ఆ చంద్రనాథ్ గాడు. వాడ్ని తరిమి తరిమికొట్టి చంపాలి" కసిగా, కోపంగా అన్నాడు వివేక్.

    ఆ మాటలు వింటూనే విస్తుపోయింది ఆమె.

    గంగిగోవులా కనిపించే వివేక్ నోటివెంట పగా, ప్రతీకారాలకి సంబంధించిన పదాలా?!!

    ఏదైతేనేం కొన్ని వివరాలు బయటకొచ్చాయి. అదే చాలనుకుంది.

    "పిచ్చి మనోజ్ఞ....! నీ ప్రయత్నం వృధాప్రయాసే. వాళ్ళు దుర్మార్గులు. నరరూప రాక్షసులు. వారినుంచి నువ్వు నాకు న్యాయం చేయలేవు. లేకపోగా నీ గురించి వారికి తెలిస్తే నిన్నూ బ్రతకనివ్వరు. ఎలా జరిగిందో ఏమయిందో అదంతా ఓ మిస్టరీ. అనవసరమైన రొంపిలోకి దిగకు. నా రాత ఎలా వుంటే అలా జరుగుతుంది. గుడ్ బై...." అంటూ వడివడిగా లోపలకెళ్ళిపోయాడు. అతను జైలర్ ఎలో చేసిన టైంకంటే ముందే.

    వివేక్ చర్యకి మ్రాన్పడిపోయిందామె. అతని డిప్రెషన్ లో వుండి డెస్పరేట్ కండిషన్ లో అలా మాట్లాడి వుంటాడులే అని అనుకుందేగానీ, జైలు నుంచి తప్పించుకుని పగతీర్చుకోబోతున్నట్లు ఏమాత్రం వూహించలేకపోయిందామె.

    'ఆ....ఒంటరి ఆడది ఏం చేస్తుందిలే! ఏదో తనను ప్రేమించిన నేరానికి తాపత్రయపడుతోంది మనోజ్ఞ' అని వివేక్ భావించాడే తప్ప....తన కేసుకోని చిక్కుముడుల్ని సమర్దవంతంగా విప్పుకుంటూ తనను నిర్దోషని నిరూపించే దిశలో వేగంగా ప్రయాణిస్తోందని అతను వూహించలేకపోయాడు.

    అక్కడే ఇద్దరి దారులూ వేరయ్యాయి.

    తను సాధించిన విజయాల్ని, కనుగొన్న రహస్యాల్ని బయటపెడితే వివేక్ ఎక్కడ నోరుజారతాడో, తన పరిశోధనకు ఎక్కడ ఆటంకమేర్పడుతుందోననే భయంతోటే ఆమె ఏమీ చెప్పలేదు.

    జైలు నుంచి తప్పించుకొని తన పగా, ప్రతీకారాల్ని తీర్చుకోబోతున్నట్లు చెబితే ఆమె ఎక్కడ అడ్డుతగులుతుందోనని వివేక్ తన ట్రైనింగ్ విషయాన్ని ఆమెకు చెప్పలేదు.

    ఇద్దరూ ఒక్కసారి మనసువిప్పి మాట్లాడుకొని వుంటే కథ మరోమలుపు తిరిగి వుండేదేమో!
   
    మొత్తానికి ఇద్దరి దారులూ వేరైపోయాయి.


                            *    *    *    *


    "కొత్తగా ఈ నళిని ఎవరు?" అడిగాడు హరికుమార్.

    "అదే తెలీలేదు. మొత్తానికి ఈ కేసులో ఇద్దరు యువతులు ఇన్ వాల్వయి వున్నారు" అంది మనోజ్ఞ ఏదో ఆలోచిస్తూ.

    "నళిని గొప్ప అందగత్తె అని వివేకే చెప్పాడుగదా? అంత అందగత్తె అయినప్పుడు చాలామందికి ఆమెవరయిందీ తెలిసే వుంటుంది.... ఎంక్వైరీ చేస్తే తెలిసిపోవచ్చేమో...."

    "ఎస్! ఆదిరెడ్డి విషయంలో మనం ఊహించింది నిజమే. అతనే వివేక్ చేత తప్పు తనమీద వేసుకునేలా చేశాడు. అది క్లియరైపోయింది. ఇక ఈ నళిని ఎవరనేదే తేలాలి. ఆవిడ అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీ అని చెప్పాడు వివేక్. ఏ కంపెనీలో అనేది చెప్పలేదు."

    "నువ్వు గట్టిగా అడగవలసింది".

    "అసలు నోరుతెలిస్తేనా! ఈరోజే ఏదో ఆవేశంతో కొన్ని వివరాలు కక్కేశాడు. అతను సహకరిస్తే ఇక లేనిదేముంది....?" నిట్టూరుస్తూ అంది ఆమె.

    "ఏది ఎలా ఉన్నా నువ్వు వెంటనే లాయర్ ని కలవటం మంచిది" అన్నాడు హరికుమార్.

    "నాకూ అలాగే అనిపిస్తోంది"

    "కలిసి జరిగిందీ, నువ్వు శోధించిందీ మొత్తం ఆయన ముందుంచితే ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది ఆయనే చూసుకుంటారు. ఇంతకీ భూషణరావుగార్ని కలిశావా?"

    "కలవటం, మాట్లాడటం అన్నీ అయిపోయాయి. నేను మైసూరు నుంచి రాగానే మొదట చేసిన పనదే....! ఆయన మీరన్నట్లు చాలా మంచి లాయరే! కేసులో సూదిమొన దూర్చగల సందేర్పడినా, కేసుని విప్పడం మొదలవుతుందని చెప్పబట్టే సుచిత్ర గురించి శోధించింది."

    "లేటెస్ట్ డెవలప్ మెంట్స్ చెప్పావా?"

    "లేదింకా....! కాకి కబుర్లు పట్టుకెళితే ఊరుకోరాయన. అందుకే ఆగాను. ఈ రోజే కలుస్తాను" అందామె అన్యమనస్కంగా.

    "నళిని విషయం నాకు వదిలేయ్. నాకు తెల్సిన కంపెనీ సెక్రటరీ ఒకాయన వున్నారు. ఎ.సి.ఎస్. పాసయిన ఎవరయినా ఆయనకు తెలవకపోదు. ఆయన ద్వారా నళిని ఎవరయిందీ, ఎక్కడ పనిచేసిందీ, ఆరునెలల నుంచి అదృశ్యమైతే ఎవరెలా రియాక్టయిందీ, ఆమె తల్లి దండ్రులు కేసేమయినా పెట్టారా? పెడితే ఏ స్టేషన్ లో....? దాని ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది? నాకు తెల్సిన పోలీస్ డిపార్ట్ మెంట్ అఫీషియల్స్ ద్వారా ప్రయత్నిస్తాను.

    ఈలోపు నువ్వు భూషణరావుగార్ని కలిసి కేసుని రీ ఓపెన్ చేయించటానికి వీలవుతుందా? ఫర్ దర్ గా ఎలా ప్రొసీడ్ అవ్వాల్సింది? ప్రాధన సాక్ష్యంగా ఏది కావాలనే వివరాలు అడుగు...." అంటూ లేచాడు హరికుమార్.

    మనోజ్ఞ కూడా లాయర్ ని కలిసేందుకు లేచింది.


                            *    *    *    *


    అదేరోజు సరీగ్గా రాత్రి ఏడుగంటలకు పేరుమోసిన క్రిమినల్ భూషణరావు ఇంటి ముందాగిందో ఆటో. అందులోంచి దిగింది మనోజ్ఞ. చేతిలో కొన్ని ఫైల్స్ తో లోపలకు వెళ్ళింది. అప్పటికే లాయరు కోసం చాలామంది వెయిటింగ్ లో వున్నారు.

    వాళ్ళను పట్టించుకునే స్థితిలోగానీ, వెయిటింగ్ కల్చర్ ని గౌరవించే స్థితిలోగానీ ఆమె లేదు. నేరుగా లాయరు రూమ్ లో కెళ్ళిపోయింది. వెయిటింగ్ లో వున్నవాళ్ళు విస్తుపోయి కోపంగా చూస్తుండగానే-

    "ఇండియన్ పీనల్ కోడ్ ఏక్ట్ నెంబర్ 45 ఆఫ్ 1860 (అక్టోబర్ 6, 1860) సెక్షన్ 53 ప్రకారం శిక్షలు ఆరు రకాలు. మొదటిది - డెత్.... రెండవది - ఇంప్రిజన్ మెంట్ ఫర్ లైఫ్! మూడవది - ఏక్ట్ 17, 1949 సెక్షన్ 2 (6-4-1949) ప్రకారం ఒమిట్ చేయటం జరిగింది. నాలుగవది - ఇంప్రిజన్ మెంట్! దీనిలో తిరిగి రెండు రకాలున్నాయి. కఠిన కారాగారశిక్ష..... దిసీజ్ విత్ హార్ట్ లేబర్! విపరీతంగా పనిచేయిస్తారు. రెండవది తేలిక జైలుశిక్ష. 

 Previous Page Next Page