Previous Page Next Page 
గాడ్స్ గిఫ్ట్ పేజి 29

    కఫూర్ కాలధర్మం చెందాడు.
   
    ఎవరయినా కాలధర్మం చెందటం వేరు. అకాలధర్మం చెందడం వేరు కఫూర్ ది సహజమరణం కాదు.
   
    కఫూర్ ది అసలే బక్కప్రాణం దానికి తోడు మానసిక వేదన నలుగురు ఆడవాళ్ళు మీదపడి రేప్ చేయడమేకాక కడుపులో ఒకేసారి నలుగురు మగపిల్లల్ని మోయాల్సి వచ్చింది. వట్టిమనిషీ కూడా కాదు. ఆ సమయంలో పచ్చిమంచినీరు కూడా ముట్టకుండా నిరవధిక నిరాహారదీక్ష...మవున వ్రతం సాగించేసరికి ప్రాణాలు కడకట్టుకు పోయాయ్.
   
    నీరసం భరించలేక మధ్యలో దీక్ష విరమించుదామనుకున్నాడు. కాని తన చుట్టూతా అంతమంది యువకులు చేరి తన తరపున నిలిచి అటు ఆ ఆడపిల్లలతోను ఇటు ఈ ప్రభుత్వంతోను పోరాడుతూంటే నోరు మెదపలేకపోయాడు. చివరికి నోరు మెదపకుండానే నీరసంతో కళ్ళు మూసేశాడు.
   
    మంత్రిగారు మటుకు ఏం చేస్తారు? రాయబారిగా మారి ఆ నల్గురు ఆడపిల్లల దగ్గరకెళ్ళి "ఇది మీకు తగునా? ఇది మీకు న్యాయమా?" అంటూ నిలదీసి అడిగాడు.
   
    అంబుజవదనకి ఐదో యేటనే వాళ్ళ బావతో పెళ్ళయిందట. ఆమె బావ చదువుకోనందున పల్లెటూరిలో వుండి వ్యవసాయం చేసుకుంటూంటే అది చూసి అంబుజవదన ఘోర శపధం చేసిందట.
   
    "జీవితంలో తన బావతో కాపురం చెయ్యనని...తన బావకి విడాకులిచ్చి పెళ్ళి చేసుకోననీను..." తన శపధం సంగతి బయటపెట్టి కఫూర్ ని ఈ జన్మలో పెళ్ళాడనని కుండ బద్దలు కొట్టినట్టు ముఖ్యమంత్రి గారి ముఖానే చెప్పేసింది అంబుజవదన.
   
    మిగతా ముగ్గురిలో ఒకామె ఎవడో గన్నయ్యగాడిని ప్రేమించిదిట. వాళ్ళది గాఢమైన ప్రేమట. అతన్నితప్ప మరొకడ్ని పెళ్ళాడదట. కఫూర్ చావు కఫూర్ ని చావనిమ్మని చావు కబురు చల్లగ ముఖ్యమంత్రి గారికి చల్లగ చెప్పింది.
   
    మరొకామె పేరు భీష్మిణి. ఆ భీష్మిణి అప్పటికే ఘోరంగ భీష్మిణి ప్రతిజ్ఞ చేసింది. తన బింధిలో ప్రాణం ఉండగా మగవాడిని పెళ్ళాడనంటూ...
   
    "పెళ్ళాడనని ప్రతిజ్ఞ చేసినదానిని కఫూర్ శీలాన్నెందుకు దోచుకున్నావ్?" ముఖ్యమంత్రిగారు కోపంగ అడిగాడు.
   
    "పెళ్ళి వేరు. రేప్ చేయడం వేరు. నేను పెళ్ళి చేసుకోనని ప్రతిజ్ఞ పట్టానుగాని నన్ను రెచ్చగొట్టినవాళ్ళ శీలం చెరచనని ఎక్కడా ఎప్పుడూ ప్రతిజ్ఞ చేయలేదే?" అంటూ ఎదురు ప్రశ్నించింది భీష్మిణి.
   
    ఆ నలుగురిలో నాలుగో అమ్మాయి నేనసలు ఆ కఫూర్ గాడిని రేప్ చేయలేదు పొమ్మంది. వాడి కడుపులో పెరిగే బిడ్డలకి నేను తల్లిని కాను పొమ్మంది. మాటిమాటికి ఆ పిల్ల పొమ్మంటుంటే ముఖ్యమంత్రిగారికి ఇంకెక్కడికి పోవాలో తెలీలేదు.
   
    ఏ.సి. రూమ్ లో కూర్చొని వేడెక్కిన బుర్రని చల్లబర్చుకుంటు 'ఈ సమస్యకి పరిష్కారమెలా?' అని ఆలోచిస్తూ రెండ్రోజులు గడిపారో లేదో కఫూర్ చావు వార్త చల్లగా వచ్చి ఆయన్ను చేరింది.
   
    ఇది సమస్యకి పరిష్కారం కాదు. అగ్ని రగలటానికి అంకురార్పణ.
   
    కఫూర్ అకాల మరణంతో దేశం తల్లడిల్లిపోయింది. బంద్ లు నిర్వహించారు. కార్లని తలబెట్టారు. రైలుపట్టాలని తొలగించారు. కిటికీ అద్దాలు, తలుపులు, సైకిళ్ళు, స్కూటర్లు లాంటి చిన్న చిన్న వాహనాలు ఇలాంటివి చాలా అగ్నికి ఆహుతి అయ్యాయ్. అన్ని కోట్లకి తాళం కప్పలు తగిలించబడ్డాయ్. ఆంద్రప్రదేశ్ లో కొంత భాగం సర్వనాశనమయ్యిం తర్వాత బంద్ గోల అణిగిపోయింది. యువకుల్లో ఉత్సాహం తగ్గిపోయింది షాపులు, ఆఫీసులు, కాలేజీలు అన్నీ తెరిచారు అన్నీ యధావిధిగా పనిచేయటం మొదలెట్టాయ్.
   
    కొత్త కధల కోసం వెతుకుతున్న ఒక రచయితకి కొత్త కధకి ప్లాటు దొరికి "పెళ్ళాడాలని ఏముంది!" అంటూ ఓ పత్రిక్కి కఫూర్ కధనే కాస్త అటూ ఇటూ మార్చి కధానిక రాసి పంపించాడు.
   
    ఆ కధ చదివిన ఓ టి.వి నిర్మాతకి కొత్త ఐడియా వచ్చి ఈ కధనే కొంటే రచయితకి ఎక్కడ పారితోషికం ఇవ్వాలో అని తనే ఆ కధని కాస్త అటూ ఇటూగా మార్చి "నాలుగో తల్లి" అనే పేరు పెట్టి టి.వి ఫిల్మ్ తీయడం మొదలుపెట్టాడు.
   
    టి.వి. ఫిల్మ్ సంగతి ఆ నోటా ఆ నోటాపడి చివరికి మద్రాసులో ఉన్నా ఓ దర్శకుడికి చేరింది. ఆయన అప్పటికే ఎన్నో రత్నాల్లాంటి సినిమాలు తీసినవాడు. ఒకే కధని పట్టుకొని మార్చి ఏ మార్చి పలురకాల సినిమాలు తీయగల ప్రతిభా పాటవం కలిగినవాడు.
   
    టి.వి. సీరియల్ కన్నా ముందు ఇదేకధని అటూ ఇటూగా మర్చి తనో కధని సృష్టించి అతి గోప్యంగా ఈ కధను ఉంచి సినిమా తీసి దానికి "మగవాడా మండిపో" అంటూ విప్లవ టైటిల్ తగిలించి గప్ చిప్ గా విడుదల చేసి ఊరుకున్నాడు.
   
    ఆ సినిమా చూసి ఈ కధ నాదేనంటూ రచయిత నెత్తీ నోరూ బాదుకున్నాడు. ఇది నా టి.వి. ఫిల్మ్ అంటూ లబ్బున గోలపెట్టాడు టి.వి. ఫిల్మ్ నిర్మాత, రచయిత కన్నా టి.వి నిర్మాత కన్నా సినీదర్శకుడు గొప్పవాడు కావటంతో ఆయన తీసిన ఈ రత్నంలాంటి సినిమా "మగవాడా మండిపో" విప్లవమాటలతో పాటలతో సాగి జుబ్లీ లు సిల్వర్ జూబ్లీలు చేసుకుంది.
   
    "మగవాడా మండిపో" సినిమా చూసిన మగవాళ్ళంతా ఖర్చీఫ్ లతో కళ్ళు తుడుచుకున్నారు.
   
    "ఇది మా అబ్బాయి కధ" అంటూ కోర్టు కెక్కారు కఫూర్ తల్లీ తండ్రి.
   
    పోయిన కఫూర్ ఎలానూ తిరిగిరాడు. మీ అబ్బాయి చరిత్రని చలన చిత్రంగ మహా చరిత్రగ మిగిలిపోనీండి. కోర్టులచుట్టూ ఏళ్ళ తరబడి మీరు నేను తిరిగితే మీకేం ఒరిగేను. ఈ తఫా ఇదే కధని కాస్త మార్పులు చేర్పులూ చేసి ఇది మీ అబబాయి కధంటూ ప్రకటించి అతని ఫోటో తెరమీద చూపిస్తూ అంకితమిస్తానని చెప్పి" వాళ్ళ చేతిలో అరలక్ష పడేసి కఫూర్ తల్లి తండ్రి నోరు మూసుకునేలా మరోసారి కోర్టు తాలూకా మెట్లు ఎక్కకుండా కాగితం రాయించుకొని మరీ వదిలాడు దర్శక శిఖామణి.
   
    ఎవరెంత కొట్టుకు చచ్చినా ఎవరెన్ని విప్లవాలు రేపినా కఫూర్ కి న్యాయం జరిగిందంటూ ఏమీలేదు.
   
    కఫూర్ ని రేప్ చేసిన నలుగురు ఆడపిల్లలు నాల్రోజులు ఇంటి పట్టున ఉండి ఆ తర్వాత హాయిగా బైట తిరగసాగారు.
   
    కొత్తగ వింత పాతొక రోత.
   
    కొద్దిరోజుల్లోనే కఫూర్ కధ కాలగర్భంలో కలిసిపోయింది.
   
    మగవాళ్ళవల్ల మోసపోయిన మగువ గతి ఎంతో ఆడవాళ్ళవల్ల పోయిన మగవాడి గతీ అంతే. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరుకి ఆ ఊరూ అంతే దూరం.
   
    కఫూర్ కధ అంతటితో ముగిసిపోయింది.
   
                                               *    *    *    *

 Previous Page Next Page