పద్మిని లేచి లోపలికి వెళుతుండగా లచ్చి అనటం వినిపించింది. "పెద్ద చిన్న అని ఏముంటుంది లేమ్మా! ఏదైనా గుణాన్నిబట్టే నేను పదిళ్ళల్లో పనిచేస్తున్నాను కందా! మీలాంటి మంచి అమ్మగారు ఏ యింట్లోనులేదు. నాకష్టం వాళ్ళకి అక్కరలేదు. ఒకటే నసుగుడు గొణుగుడు. పక్కీదిలో వుండే మా లచ్చమ్మచేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయమని చంపుకుతింటాది. వక్కమెతుకు విదిలించదు. రవంత పచ్చడి పెట్టమంటే పాణం గిలగిలలాడిపోతాది. కూరలుధరలు మండిపోతున్నాయని కూరే చేసుకోటం లేదని చెపుతుంది. గిన్నెలు మాత్రం బోలెడు వేస్తుంది..."
లచ్చి అలా మాట్లాడుతూనేవుంది. పార్వతమ్మ వూ ఆ...అనకుండా కాసేపు విని లేచి ఇంట్లోకి వచ్చేసింది.
లచ్చి పనిముగించుకొని వెళుతూ నెలజీతంలో కట్ చేసుకొండని చెప్పి అయిదు రూపాయలు తీసుకుని వెళ్ళింది.
లచ్చి వెళ్ళింతరువాత__
"ఆంటీ! నేను తొందరపడి అనవసరంగా మాట్లాడానా?" అడిగింది ఆమె.
"మాట్లాడావు" పార్వతమ్మ అంది.
పద్మిని ప్రాణం బిక్కచచ్చిపోయింది. ఆమాట వినంగానే.
"కానీ నీవు మాట్లాడిన ప్రతిమాటా అక్షరనిజం. నేను పెద్దదాన్ని అయిపోయాను. పనిమనిషి అవసరం! తన అవసరం నాకుందని దానికి తెలుసు. అలాగే ప్రతి యింట్లోను భర్త ఆఫీసు టైముకి వంటచేయాలి ఒ ఇల్లాలు!
వంటచేసి పిల్లలకి పెట్టి తను తిని ఆఫీసుకి పరుగెత్తాలి మరో ఉగ్యోగిని! వీళ్ళందరికి పనిమనిషి రాకపోతే చేయి విరిగినట్లు వుంటుంది. ఈ లూజు తెలిసి వాళ్ళ అవసరాలు గడుపుకుంటారు. ఈ పనిమనిషి కాకపోతే మరో పనిమనిషి అనుకోటానికి లేదు. వాళ్ళకి సంఘాలు అందరూ కలిసి సమ్మెలాంటిది చేయటం యెందుకొచ్చిన గోల అని యెవరికివారు నోరుమూసుకోవటం జరుగుతున్నది. అనుభవంమీద చెపుతున్నాను పద్మిని! కొందరికి దూరంగా వుండటం, కొందరి నోట్లో నోరు పెట్టకుండా వుండటం మంచిది."
పార్వతమ్మ అలా చెపుతుంటే పద్మిని ప్రియదర్శినికి పోయిన ప్రాణం లేచివచ్చినట్లు అయింది.
"మనలోమాట! పని మనుషుల విషయమే చూద్దాం. ఈ నిమిషాన వాళ్ళు పంచభక్ష్య పరవాణ్ణాల్లు చేసుకుతినాలన్నా కోరికవున్నా తినలేరు. వాళ్ళ దగ్గర వేలుకాదు కదా వందలుకూడా వుండవు. నోరు పెట్టుకుని బతుకుతుంటారు అంతే. ఎవరో ఒక్కళ్ళు మాత్రం చీట్లు కట్టుకుని ఎన్నో విధాల కష్టపడి కాస్త కూడబెట్టుకుని బతుకుతుంటారు. పనిమనిషి కాస్త పచ్చడి లేక కాసిని కాఫీ నీళ్ళు అడిగిందే అనుకో యిస్తే ఏం పోయింది? ఇన్నాళ్ళు వీళ్ళ దగ్గర ఎక్కడలేని పొదుపు చూపిస్తుంటారు. కాస్త పెద్దవాళ్ళుగాని ఫ్రెండ్సుగాని వస్తే వాళ్ళు వద్దంటున్నా బలవంతానా కాఫీ యిస్తారు. టిఫెన్లు పెడతారు ఎందుకని?" పార్వతమ్మ అడిగింది.
"అవును యెందుకని?" పద్మిని యెదురు ప్రశ్నించింది.
"ఆలోచించు" చిరునవ్వుతో చెప్పి అవతలికి వెళ్ళిపోయింది పార్వతమ్మ.
పద్మిని ప్రియదర్శిని ఆలోచనలో పడింది.
16
ఓ రోజు...
శంకర్రావు యింటికి రెండిళ్ళవతల వున్న వెంకటరత్నం ఒకతన్ని వెంట బెట్టుకొని శంకర్రావు యింటికి వచ్చాడు.
"మా దూరపు బంధువు పేరు నాగేంద్ర. గాలిమార్పు కోసం నాలుగు రోజులు వుందామని వచ్చాడు" అంటు పరిచయం చేశాడు.
నాగేంద్ర వుండేది కలకత్తాలో అని, చిన్న బిజినెస్ అని వెంకటరత్నం చెప్పాడు.
"నేను పగలంతా ఆఫీసుకి వెళతాను! మధ్య మధ్య టూర్లు మీరెలాగూ ఖాళీగా వున్నారు. తోచినప్పుడు వచ్చి మాట్లాడుతుంటాడని మీకు నాగేంద్రకి కూడా కాలక్షేపంగా వుంటుందని పరిచయం చేస్తున్నాను."
అని వెంకటరత్నం అంటుంటే "దానికేం భాగ్యం తోచనప్పుడు వస్తుండు" అన్నాడు శంకర్రావు.
నాగేంద్రకి ముప్పై అయిదు నలభై మధ్యలో వయసు వుంటుంది. తల పెద్దది, శరీరం సన్నన. చూడంగానే ఆ విషయం కొట్టిచ్చినట్లు కనపడుతుంటుంది. ఎందుకనో యింకా పెళ్ళి చేసుకోలేదట ఆ పెద్దమనిషి. చైన్ స్మోకర్, నల్లటి బండ పెదవులు, తెల్లటి గ్లాస్కోలాచ్చీ పైజమా మెడలో సన్నటి బంగారు చైను, వేళ్ళకి వుంగరాలు. చూడంగానే ఎందుకనో గౌరవం కలగదు. యెదుటివాళ్ళు ఎక్కువ మాట్లాడేటట్లు చేసి తను వింటూ సిగరెట్ కి పనికల్పిస్తూ తూచి_తూచి మాట్లాడుతుంటాడు. ఎక్కువ ఆటోలతోనే గడుపుతాడు.
మొదటి చూపులోనే నాగేంద్ర నచ్చలేదు. పద్మినిప్రియదర్శినికి.
అలా అని అతని రాకని పద్మిని నిరోధించలేదుకదా!
ఒక్కొక్కళ్ళని చూస్తే అనురాగం, స్నేహం పుట్టుకువస్తాయి. అదే ఒక్కొక్కరిని చూస్తే ఎలర్జీ పట్టుకుంటుంది. చచ్చినా సదభిప్రాయం కలగదు. వీడు సాక్షాత్తూ దైవాంత సంభూతుడు అని చెప్పినాసరే దెయ్యవాంతకుడిగా కనిపిస్తాడు. వాళ్ళే చేయకపోయినా సరే ఆ ముఖాల తీరు అలాంటిది.
నాగేంద్ర వస్తేచాలు ఎలర్జీ వస్తున్నది పద్మినికి.
పాపం నాగేంద్రం యింట్లోకి కూడా రాడు.వరండాలో కూర్చుని శంకర్రావుతో కబుర్లు చెప్పి కాఫీ తాగి వెళుతుంటాడు. పార్వతమ్మతో కూడా మాటలేమి లేవు.
పద్మిని ప్రియదర్శిని ఎదురైతే కాజ్ వల్ గా చూడటం తప్పించి ఏమీ మాట్లాడడు. ముఖం తిప్పేసుకుంటాడు. ఒక అందమైన ఆడపిల్లని చూశానే అన్న భావం ఆ కళ్ళల్లో వుండదు, చూపుల్లో మెరుపు వుండదు.
అయినా...
నాగేంద్రంమీద మంచి అభిప్రాయంమటుకు కలగలేదు పద్మిని ప్రియదర్శినికి.
ఆరోజు నాగేంద్ర వచ్చాడు. సాయంత్రం నాలుగు అయింది టైము.
శంకర్రావు నాగేంద్రం వరండాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.
పార్వతమ్మ యిద్దరికీ కాఫీ కలిపి తీసుకెళ్ళి యిచ్చి వచ్చింది.
"నేను వక్కసారి వెనకింటికెళ్ళివస్తాను" పద్మినితో చెప్పి పార్వతమ్మ వెళ్ళిపోయింది.
వంటరిగా ఇంట్లో వున్న పద్మిని జాగ్రత్తగా వాళ్ళ మాటలు వింటూ కూర్చుంది.
వక మనిషి మాట్లాడే విధానాన్నిబట్టి ప్రవర్తననిబట్టి వాళ్ళ మనసుని వాళ్ళ గుణాన్ని అంచనా వేయవచ్చు.
ప్రస్తుతం పద్మిని అదే పనిమీద వాళ్ళమాటలు వింటూ లోపల కూర్చుంది.
శంకర్రావు, నాగేంద్రం మధ్య సంభాషణ ఈవిధంగ జరుగుతున్నది. ఈ లోపల చౌకరకం సిగరెట్ పొగ తాలూకా వాసన మాత్రం లోపలికి చొచ్చుకుని వస్తున్నది.