ఈ సంగతి నీకు తెలిసింది రంగూన్ నుంచి మకాం మార్చావు కొందరు రౌడీలకు బాగా డబ్బు ముట్టచెప్పి నా శవంగాని నన్నుగాని తెమ్మని పురమాయించావు. నీ వేషములో నేను ఒక రౌడీగా తిరుగుతున్నందున ఈ విషయం అయితే తెలిసిందిగాని నీవెక్కడ వున్నావో తెలిసిందిగాదు.
ఓ ప్రక్క నీవు నియమించిన మనుషుల వల్ల ప్రాణభయం మరోప్రక్క నువ్వు చేసిన మోసం నన్ను నిలువునా దహించి వేస్తుంది.
అది సహజము గదా అనంతం ఏమంటావు? అన్నాడు సుందరమూర్తి వెటకారంగా.
అనంతపద్మనాభశాస్త్రి మౌనం వహించాడు. అసలు కధలోకి వస్తాను మారువేషంలో తిరుగుతున్న నేను కొంత డబ్బు సంపాదించాను. అవసరమయితే ఢీ కొనటానికి అంగబలం ఏర్పరచుకున్నాను.
రోజులు బాగానే గడిచి పోతున్నాయి, కానీ నీవు నన్ను మోసగించావు ఆ విషయం మాత్రం పుండు మీద పుల్లపెట్టి కెలికినట్లు ప్రతి నిమిషం కన్ను మూసినా తెరిచినా నా అంతరంగంలో ముల్లులా గుచ్చుకుంటూనే ఉంది.
నీ మీద పగతీర్చుకుంటేగాని నా బాధ చల్లారదు నా కసి తీరదు ఎలా? నీ వెన్నాడున్నావో తెలియదు మారువేషంతో తగిన జాగ్రత్త వహించి ఏ మారుమూలో తలదాచుకొని వుంటావని వూహించాను గాబట్టి నిన్ను బయటికి రప్పించటానికి రకరకాల ప్లాన్లు వేశాను.
చివరిగా ఈ ప్లాను ఫలించింది ఇప్పుడు నీ స్థావరం నాదయింది.
నీ అనుచరులు నా అనుచరులయ్యారు ఎదురు తిరిగినవాళ్ళు పరలోక ప్రయాణం కట్టారు. అక్కడికి వెళుదువుగాని నీవు సిద్ధంగా ఉండు. నేను ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను. ఇది ఎలా తారుమారు అయింది అన్నాడు శాస్త్రి ఆశ్చర్యంగా. కారణము నువ్వే నీ పోలికలున్న రాజారావుని నాకు తెలిసిన అన్ని ప్రదేశాలలోను తిప్పాను నీ ఆచూకీ తెలియలేదు. ఉంటే నీవు ఈ వూళ్ళో ఉండాలి లేకపోతే ఏ విదేశాలలోనయినా ఉండాలని తలచి రాజారావుతో ఈ వూరు చేరాను.
అచ్చం నీలాగు ఉన్న రాజారావుని చూడంగానే నీలో ఉన్న భయం నిన్ను బయటకి లాక్కొచ్చింది.
రాజారావును నేనే నియమించి ఉండవచ్చునని రాజారావు వెనక పహరా కాసావు. నీ కోపం చూస్తున్న నేను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నీ స్థావరం ఆక్రమించుకున్నాను. అయిందేదో అయింది దాన్ని గురించి ఇరువురమూ మర్చిపోదాం. ప్రస్తుతం చెయ్యాల్సింది శిక్ష అమలు జరుపటం. ఎంత చెడ్డ నీవు నా మిత్రుడివి. నీవు ఏ విధంగా కోరుకుంటే అలాగే చేస్తాను. ఈ పిష్టలుకి పని కల్పించి తేలికగా ఒక్క గుండుతో ప్రాణం తీయమంటావా లేక అన్నం నీళ్ళు లేకుండా నిన్ను ఒక గదిలో బంధించి ఎన్నాళ్ళు బ్రతికి ఉంటావో చూడ మంటావా నీ యిష్టం నీవు ఎలా చెపితే అలా మాట తప్పను. కోరుకో. ఎలాంటి చావు కావాలో అన్నాడు సుందరమూర్తి విలాసంగా నవ్వుతూ.
అనంతపద్మనాభ శాస్త్రి పై ప్రాణాలు పైనే పోయాయి.
భయంతో వణికిపోతూ నేను చేసింది తప్పేరా సుందరమూర్తి. యీ ఒక్కసారికి క్షమించు అన్నాను దీనంగా ముఖం పెట్టి.
క్షమించాను కాబట్టే తీరుబడిగా కధ చెప్పేను క్షమ అయిపోయింది. మిగిలింది శిక్ష. ఇది అమలు జరుపబడుతుంది గాని ఎట్టి పరిస్థితులలోను తొలగింపబడదు. కోరుకో ఎటువంటి చావు కావాలో. నీ యిష్టాను సారమే చేస్తాను. వంకాయ కూర వడ్డించ మంటారా, టమాటా పచ్చడి వేయమంటరా అని వినయంగా అడిగే యిల్లాలిగా అడిగాడు సుందరమూర్తి.
నా వాళ్ళంతా గది బయటవున్నారు. వాళ్ళంతా నా కోసం ప్రాణాలిచ్చేరకం. వాళ్ళు మారారన్న నీమాట ఎలాగా నమ్మమంటావ్, ఏదో విధంగా తప్పించుకోవాలని చూస్తున్నాడు అనంతపద్మనాభ శాస్త్రి సుందరమూర్తి ఫక్కున నవ్వి పిస్టోలుని సూటిగా అలాగే చేతిలో ఉంచుకొని మరో చేతితో తలుపుతీసి చిటికవేశాడు.
బిలబిల లాడుతూ పదిమంది లోపలికి వచ్చారు.
మీ బాస్ ని నేనా ఈ అవంతం గాడా చెప్పండి ఫ్రెండ్స్ అన్నాడు గంభీరంగా సుందరమూర్తి.
మీరు మా బాస్! మీరు మా మిత్రులు, గురువు సర్వం! సుందరమూర్తి వైపు చేతులు చాచి ఏక కంఠంతో అన్నారా పదిమంది.
గుడ్ ఊ! ఇహ చెప్పవోయ్ అనంతం ఏ శిక్ష నీకు విధించమంటావ్.
నన్ను చంపొద్దు! ప్లీజ్! నా వుప్పు తింటూ నాకే ద్రోహం తలపెట్టిన వీరిని నిలువునా నరికి పోగులు పెట్టనియ్యి. ఆవేశంతో ఊగిపోతూ పిచ్చిపట్టినట్లు అరిచాడు అనంతపద్మనాభ శాస్త్రి.
అహహహా__ద్రోహం చేసినందుకు శిక్ష నరికిపోగులు పెట్టటమా నువ్వు చేశావు ద్రోహం నమ్మిన మిత్రుడికి. ఆలశ్యం దేనికి అదే శిక్ష నీపై అమలు జరుపబోతున్నాను రెడీగా ఉండు స్టడీ ఒన్, టూ.
28
ఆగండి! అంతవరకూ బంధింపబడి వున్న రాజారావు పెద్దగా అరిచాడు.
త్రి అనటం ఆపి రాజారావు వైపు తిరిగాడు. ఆగటం దేనికి? ముందు నిన్ను చంపి ఆపై అనంతాన్ని చంపనా అన్నాడు. కాదు నన్ను వాడుకుని నావల్ల మీ మిత్రుని కనుక్కున్నావు? ఇంకా బంధించి ఉంచటం న్యాయం కాదు. ముందు నన్ను బంధ విముక్తుడిని చేయండి.
"చేస్తాలేవోయ్! నిన్ను వాడుకున్నాను అంటున్నావు. వూరికే పనిచేసి పెట్టావా ముందుగా పదివేలు ఇచ్చాను. పని అయిన తర్వాత ఇంకా ఇస్తాను అన్నాను. మన ఒప్పందం ఏభైవేలు గుర్తుంది. ముందు ఈ అనంతంగాడి చావు చూడు ఒన్, టూ."
"ఆగండి!" మళ్ళీ అన్నాడు రాజారావు.
"శకుని పక్షిలా ఏమిటా అడ్డం. ముందు నీ ప్రాణం తీయమంటావా సుందరమూర్తి పట్టరాని కోపంతో అడిగాడు. కీ,కా, చే, కో,చి,కి,క,చే,కి,కి,కీ." అన్నాడు రాజారావు ఏదో వింతగా. అంతే క్షణాల్లో పరిస్థితులు తారుమారయ్యాయి.