ఆ మాటకు నీలవేణి ఉడుక్కుంది.
"నీవేం వేగక్కరలేదులేఁ. అంత గయ్యాళిగా కనిపిస్తున్నానా?"
"నీవు పైకి కనిపించినంత మంచిదానవు కాదు. ఉత్త అల్లరిపిల్లవు" అని ఆప్యాయంగా ఆమె నెత్తిమీద చిన్నగా మొట్టాడు శంకర్.
నీలవేణి నాలుక బయటపెట్టి వెక్కిరించి ఫక్కున నవ్వేసింది. శంకర్ కూడా శృతి కలిపాడు.
వాళ్ళను చూసి "అదృష్టవంతులు మనసారా నవ్వుకునే అదృష్టం అందరికీ వుంటుందా?" అనుకుని శ్రీకర్ నిట్టూర్చాడు.
మరి కొద్దిసేపు కబుర్లతో గడచిపోయింది. ఆ కొద్దిసేపట్లో శ్రీకర్ గమనించింది ఏమిటంటే "నీలవేణిని శంకర్ ప్రేమిస్తున్నాడు" అందుకే ఆమెతో అంత చనువుగా మసలుతున్నాడు. మరి నీలవేణి ఎవర్ని ప్రేమిస్తుందో తెలీడంలేదు. ఆమె హృదయపు కోవెలలో ఎవరి మూర్తి వున్నదో ఊహించడం కష్టంగా వున్నది.
ఒకవేళ నీలవేణి అతనిని ప్రేమిస్తుంటే తనతో అంత చనువుగా ఇష్టంగా వుండదు. ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది. కనుక తమమీద ప్రేమ ఉండొచ్చు ఆమెకి!"
ఆ ఆలోచన అతనికి బలాన్నిచ్చింది.
కానీ! అక్కడ తనకో ప్రత్యేకత వుంటుందని_నీలవేణి తనతో ఎక్కువగా మాట్లాడుతుందని ఏవేవో ఊహించుకుని వచ్చాడు శ్రీకర్. తీరా వచ్చాక అక్కడ శంకర్ ని చూసి నిరుత్సాహం వచ్చేసింది. అందుకు తోడు నీలవేణి కూడా! అక్కడ తనొక మనిషిని వున్నట్లుకూడా మరచిపోయి, అతనితో అంత చనువుగా ప్రవర్తించడం, శ్రీకర్ కి చాలా బాధాకరంగా ఉన్నది.
ఇక అక్కడ వుండలేక, వెళ్ళిపోదామనుకున్నాడు.
వెళ్ళేముందు తను తెచ్చిన కానుకను నీలవేణికి ఏకాంతంగా ఇవ్వాలని, ఏదో చెప్పాలని అనుకున్నాడు. కానీ అది సాధ్యపడేట్లులేదు. అక్కడ వాళ్ళంతా వుండగా తనేం చెప్పగలడు? అందుకే మరికాసేపు కూర్చున్నాడు. వాళ్ళు వెళ్ళిపోతారేమోనని_
మరో అరగంట కబుర్లతో, నవ్వులతో గడచిపోయింది.
శ్రీకర్ కి బోరుగా, అసహనంగా వున్నది.
"నేను వెళతాను నీలవేణి__" అంటూ లేచాడు శ్రీకర్.
శంకర్ "అరే! మీరెందుకో మూడీగా వున్నారు. మరో అరగంట కూర్చోండి" అన్నాడు.
"నాకు పనుంది వెళతాను" ముభావంగా అన్నాడు శ్రీకర్.
"వెళ్ళనీయండి. ఆయనకోసం పెళ్ళాం బిడ్డలు ఎదురుచూస్తుంటారు. ఈ మాత్రం దానికి రాకపోతే ఏంపోయింది" నిష్టూరంగా అన్నది నీలవేణి.
"వాట్! శ్రీకర్ గారికి పెళ్ళయిందా?" ఆశ్చర్యంగా అన్నాడు శంకర్.
నీలవేణి అలా అనడం అందుకు శంకర్ వింత పడటం శ్రీకర్ కి ఏదోగా వున్నది. ముళ్ళమీద నిలుచున్నట్లుగా ఉన్నది.
"సారీ నీలా! నాకు మనసేం బాగాలేదు. ఏమీ అనుకోకు" అని రెండడుగులు ముందుకు వేసి "ఓ సారి అలా బయటకు రాగలవా?" అని అడిగాడు నీలవేణిని.
ఆమె మౌనంగా లేచి అతన్ననుసరించింది. "ఇప్పుడే వస్తా-" అని స్నేహితులకు చెప్పి, శ్రీకర్ బయట వరండా చివరకు వెళ్ళి నిలుచున్నాడు. అతని చేతిలో ప్యాకెట్ వున్నది.
"ఏమిటి శ్రీకర్! ఎందుకిలా డల్ గా వున్నావు?"
"ఎందుకో మనసు బాగాలేదు నీలా."
"మనసు బాగాలేదా? దేనికి?"
"కొన్ని కారణాలు చెప్పుకోగలం_కొన్ని చెప్పలేనివి వుంటాయ్."
"నాతోకూడా చెప్పకూడని రహస్యాలున్నాయా నీకు?"
"అలా మాట్లాడుతున్న నీలవేణిని చూస్తూంటే తనకెంతో దగ్గరిదానివలె అనిపించింది శ్రీకర్ కి. ఆలాంటప్పుడు తన మనసులోని బాధను వెళ్ళగ్రక్కుకోవాలనిపించింది.
"ఇది నీకోసం ప్రత్యేకంగా తెచ్చాను_" నవ్వుతూ ప్యాకెట్ అందించాడు శ్రీకర్.
"అహఁ...అంత ప్రత్యేకత నాకా, లేక ఈ బహుమతిదా?" నవ్వింది నీలవేణి.
"నీ ప్రత్యేకత నీకెప్పుడూ ఉంటుంది..."
"సరే ఏమిటిది?" అని ప్యాకెట్ విప్పి చూసింది నీలవేణి.
అతడు మాట్లాడలేదు. ఆమెనే చూస్తూ వుండిపోయాడు.
"తాజ్ మహల్! ఎందుకు తెచ్చావ్!"
"చెప్పాగా నీకోసం ప్రత్యేకమని."
"బావుంది..."
అతను ఆగిపోయాడు. తను తెచ్చిన బహుమతి ఆమెకు నచ్చినందుకు అంతవరకూ అతను పడిన బాధ, అసహనం మర్చిపోయాడు.
"ఇది ఎప్పుడూ నీతోనే వుండాలి నీలా..." ఎందుకో అతని కంఠం మృదువుగా ,బరువుగా పలికింది. అతన్ని విచిత్రంగా చూసింది నీలవేణి.
"ఎందుకీపిచ్చి?" చిన్నగా మందహాసం చేసింది నీలవేణి.
"అవును పిచ్చే ఒక రకంగా..."
"నీ కోరిక మన్నిస్తాను. దీనిని కలకాలం నీ స్నేహ చిహ్నంగా, అపురూపంగా దాచుకుంటాను సరేనా? నవ్వుతూ అన్నది. ఎందుకో ఆ మాటలు అతని హృదయాన్ని తాకాయి.
అప్రయత్నంగా కళ్ళు చెమ్మగిల్లాయి. గుండె బరువెక్కింది అతనికి.
"వస్తాను నీలవేణి-" అని చరచరా రోడ్డుమీదకు కదిలిపోయాడు శ్రీకర్. అతను దూరంగా వెళ్ళేంతవరకూ అలాగే నిలుచుండి పోయింది నీలవేణి.
"పిచ్చి మనిషి! స్నేహంకోసం పరితపిస్తున్నాడు. ఇలాంటి మంచి స్నేహితుడ్ని తను మాత్రం ఎలా వదులుకోగలదు?"
ఆ రాత్రి శ్రీకర్ కి నిశ్చితంగా నిద్రపట్టింది.
31
విశ్వనాథం, అన్నపూర్ణ ఏకాంతంగా కూర్చున్నారు. అప్పటికి శ్రీకర్ తిరిగి వచ్చి చాలా నెలలు గడిచాయి. చిన్న వయసులోనే పెళ్ళి కావటం, అతి స్వల్పకాలంలోనే ఆ పెళ్ళి విచ్చిన్నం కావటంతో బాధాకరంగా వుంది వాళ్ళకి. ఎప్పుడూ ఏకాంతంగా, దిగులుగా వుండే కొడుకుని చూస్తే వాళ్ళకి యెంతో బాధగా వుంది. అయినా వాళ్ళు చేయగలిగింది ఏమీలేదు.
అంతా కాలమే సరిచేస్తుందేమోననే ఆశతో వున్నారిన్నాళ్ళుగా! అయితే వారంరోజుల క్రిందట జరిగిన ఓ సంఘటన తిరిగి వాళ్ళలో ఓ ఆశాజ్యోతిని వెలిగించింది. ఈవిధంగా అతను ఏమయినా తిరిగి మామూలు ప్రపంచంలో, మామూలు మనిషిగా మెలగగలడేమోననిపించింది.
అందుకే ఆ రాత్రి అంతా నిద్రపోయాక యిద్దరూ మాట్లాడుకోటానికి కూర్చున్నారు.