Read more!
 Previous Page Next Page 
అడుగడుగునా... పేజి 2


    "మీరు చెప్పనిస్తే కదా? ప్రజాచైతన్య నాట్యమండలిలో సున్న పిడత మొహం వాడొకడున్నాడు. వాడికి డబ్బు గబ్బు అన్నీ దండిగా వున్నాయ్. నన్ను ప్రేమించాడుట. పెళ్ళి చేసుకుంటానని అడిగాడు. వాడికి ఊరికో పెళ్ళాం వుంది. తెలిసి అలాంటి పిడతని ఎలా పెళ్ళాడుతను. చెప్పండి? ఓ శుభముహూర్తాన చెప్పేశాను. ఈ జన్మలో నిన్ను పెళ్లాడను అని. అంతే వాడు మైరావణుడి అవతారం ఎత్తాడు. నా కాళ్ళూ చేతులూ విరగొట్టి బలవంతాన నన్ను ఎత్తుకు రమ్మని నలుగురు రౌడీలను నియమించాడు. నేను పారిపోయి దాక్కున్నాను. మా నాటక సమాజం వాళ్ళు కూడా ఆ పిడతగాడి వైపే తిరిగారు.

    "వుండండి వుండండి ఇలాంటి సంఘటనే ఈ మధ్య ఏదో నవలలో చదివాను. ఆ నవల పేరు....పేరు!" ఆలోచనలో పడిపోయాడు చంద్ర.

    "అయ్యా అది నవలలో ఓ సంఘటన కావచ్చు. కాని యిది వాస్తవ జీవితంలో జరుగుతున్న కథలో ప్రధమభాగం" అంది అవంతి.

    "అవునౌను" తల తాటించాడు చంద్ర.

    "కనుక ఆపదలో వున్న అబలను మీముందు నిలిచి చేతులు జోడించి ప్రార్ధిస్తున్నాను. నన్ను రక్షించండి"

    "రక్షించటం అంటే....?"

    "ఈ ప్రశాంతి పార్కులో అల్లరి చేస్తే చాలా కఠిన శిక్ష పడుతుందన్న సత్యం తెలిసిన ఆ రౌడీలు పార్కు బైట నా కోసం చూస్తున్నారు. నన్ను తరుముకుంటూ వచ్చిన వాళ్ళు బైట ఆగిపోయారు. నేను లోపలికి వచ్చేశాను. మీరూ నేను కలిసి బైటికి వెళదాం. ఆ తర్వాత రిక్షాలో కొంతదూరం పోదాం. ఆ తరువాత నేను వంటరిగా ఫ్రెండ్ యింటికి వెళతాను. నన్ను రక్షించి నాకు సాయం చేయరా?"

    "అమ్మో రౌడీలతో తలబడటమా. నాకు కరాటే కుంపూలు రావు. ఎవరిమీదా చేయివేసి ఎరుగను"

    "ఛీ....ఛీ....ఇంత పిరికిగా మాట్లాడుతారనుకోలేదు. మీలో శౌర్యం లేదు. ధైర్యం లేదు. సాహసమే నా వూపిరి అన్న చంద్రశేఖర ఆజాద్ పేరు నిలువునా ఖూనీ చేస్తున్నారు.

    "అలా అనకండి అవంతి గారూ! ధైర్యం వుంది కాదా అని రౌడీలతో తలపడ్డాననుకోండి, నా పని ఫినిష్ కలం పట్టిన చేయినాది. కసరత్తు చేతిన చేతులు వాళ్లవి...."

    "వాళ్ళతో ఢీ కొనక్కరలేదు"

    "మరి?"

    "ఉపాయం నే చెపుతాగా?"

    "ఎలా?"

    "ఇప్పటికిప్పుడే చీర కట్టుకుని అచ్చమైన ఆడపిల్లలా మారిపోతాను. మీరూ నేను భుజం భుజం రాసుకుంటూ చెట్టా పట్టాలేసుకుని జోక్స్ చెప్పుకుంటూ నవ్వుతూ పార్క్ బైటకి వాళ్ళముందునుంచే వెళ్ళిపోదాం."

    "వింటానికి బాగుంది. చీరకట్టుకుని ఇప్పటికిప్పుడు ఆహా మాట మాత్రం వినసొంపుగా వుంది. ఇప్పటికిప్పుడు చీర ఎలా వస్తూందిట? పోనీ ఏ చెట్టు తాటో వలిచి నార చీర తియ్యాలన్నా ఇది పార్కు అన్నీ క్రోటన్స్ మాత్రమే వున్నాయి.

    చంద్ర మాటలు పూర్తి చేయకముందే అవంతి ప్యాంట్ లో టక్ చేసిన షర్ట్ ని పైకి తీసింది. ప్యాంటులో దోపిన చీరని పైకి తోసింది. "అవసరం వస్తే మార్చొచ్చని ముందు జాగ్రత్తగా ఈ పల్చని చీరని పొట్టమీద పర్చుకొని ప్యాంటు ధరించాను. నాటకాలాడే దాన్ని కదా! డ్రస్ మార్చుకోవటం ఎంతోసేపు పట్టదు" అంది చీరని చూపుతూ.

    చంద్ర అనుమానంగా చూశాడు.

    "ప్లీజ్ అలా చూడకండి. నేను మోసగత్తెను కాను. ఆపదలో వున్న అబలని. మీ స్నేహితుడికి నాటకాలంటే యిష్టం అన్నారు. ఇదే మీ స్నేహితుడైతే ఒక నాటక సమాజంలో పిల్ల ఆపదలో వుంటే చూస్తూ వూరుకుంటాడా? రక్షించటానికి ముందుకు దూకేవాడు, నన్నుమీరు రక్షించారని చెప్పారనుకోండి. ఏమంటాడు? ఒక అబలని ఒక అతివని అందునా నాటకాల అమ్మాయిని రక్షించావా అని చెప్పి మిమ్మల్ని మీ సాహసాన్ని పదే పదే పొగుడుతాడు. అటు మీ స్నేహితుడి నుంచి అభినందన పరంపరలు ఇటు చంద్రశేఖర ఆజాద్ అన్న మీ పేరుకి సార్ధకత ఏకకాలంలో మీకు దక్కుతాయి" అంది అవంతి.  

    చంద్ర ఒడలు రవంత ఉప్పొంగాయి. ఛాతీ వీరత్వంతో ఎగిరెగిరి పడ్డట్లయింది. "ఉపాయంగా అయితే బైట పడటానికి మమ్మల్ని రక్షించటానికి నాకభ్యంతరం లేదు. పోట్లాటలు దొమ్ములాటలు నా కిష్టం లేదు. నా దసలే కవి హృదయం" అన్నాడు.

    "నాకు తెలుసు కవికుమారా" అంది అవంతి.

    ఎవరైనా తనని కవికుమారా అంటే చంద్రంకి చాలా యిష్టం. అతని వీక్ నెస్ అవంతి అవలీలగా కనిపెట్టింది. చంద్రంలాంటి వాళ్ళని బుట్టలో వేసుకోడం అవంతికి అయిదు నిమిషాలు చాలు.

    "ఆడవేషం వేస్తే మిమ్మల్ని వాళ్ళు గుర్తుపట్టరా?" చంద్రంకి పెద్ద అనుమానమే వచ్చింది.

    "నా సంగతి నీకు తెలియదు" అంది అవంతి.

    చంద్రం మాట్లాడలేదు.

    "నేను ఆ చెట్టుచాటుకి వెళ్ళి వేషం మార్చుకు వస్తాను."

    "అలా ఎందుకు?"

    "లేకపోతే మీ ఎదుటే ప్యాంటు విప్పి...."

    "ఎబ్బెబ్బెబ్బె అసలు నా వుద్దేశ్యం....!" చంద్రం కంగారుగా ఏదో చెప్పబోయాడు.

    "మనం అనవసరం మాటలతో కాలయాపన చేస్తున్నాము. మా వాళ్ళకి అనుమానం రావటం మంచిదికాదు. నే అలా చెట్టుచాటుకి వెళ్ళి పరిపూర్ణ స్త్రీగా మారి వస్తాను. అందాకా మీరు నాకోసం వేచి వుండండి. ఆడదాన్ని అబలని నన్ను మోసం చేయరుగా?" జాలిగా అడిగింది అవంతి.

    "ఛా....ఛా....నేనా!" చంద్రం బాధపడిపోతూ అన్నాడు.

 Previous Page Next Page