ఇదే యాగం...
పదమ్మ మహిళా
పదవమ్మా వనితా
ముందుకు ముందుకు దూసుకుపోదాం
అడుగులు ముందుకు వేస్తూ పోదాం
ఎంతో చదివీ ఎన్నెన్నో నేర్చీ
కట్నంకోసం కాల్చి చంపే
భర్త చేతిలో బలిపశువులుగా
ఎందుకు నిత్యం చస్తూ బతికే
పనికిరాని యీ పడవ ప్రయాణం
పదమ్మ మహిళా
పదవమ్మా వనితా
కొత్తలోకం దారులు వెతుకుతూ
ముందుకు ముందుకు దూసుకుపోదాం
పాతపాఠం మరిచిపోయి
గొంతుకోసే కథలు వదలి
అడుగుముందుకు వేస్తూ పోదాం
నీమంచిని ఎంచని వాళ్లని
నీతెలివిని మెచ్చని వాళ్లని
సూటిపోటి తూటాల్ వదిలి
నీ గుండెని గాయం చేసేవారిని
ఎంత కాలమని భరిస్తావ్
చస్తూ బతుకును సాగిస్తావ్
అమ్మగ ఆలిగ తల్లిగ చెల్లిగ
బాధ్యతలన్నీ నీవేనా
బాధల గాధలు నీకేనా
రక్షణ లేని పుచ్చు సమాజం
కక్షతో నిన్ను కాటేస్తుంటే
నిర్లిప్తత నీలో నిండానింపుకుని
ఖర్మను తలుచుకు కుమిలిపోతావ్
మరమనిషిగ మిగిలిపోతావ్
ధైర్యం చెయ్ సవాలు చెయ్
బయట ప్రపంచపు వెలుగును చూసి
ముందుకు నడిచే మార్గంవెయ్
పదమ్మా మహిళా
పదవమ్మా వనితా
ఇదే యాగం ఇదే నినాదం
శంఖారావం పూరించండి
శక్తులుమీరి నడిపించడండి
పదమ్మా మహిళా
పదవమ్మా వనితా
ముందుకు ముందుకు దూసుకుపోదాం
అడుగులు ముందుకు వేస్తూ పోదాం
* * *
ఇంగలంతో...
'జెన్నత్' నుంచి అల్లాదిగొచ్చినా
'వైకుంఠం' నుంచి విష్ణువు నడిచొచ్చినా
'పరలోకం' నుండి జీసెస్ తిరిగొచ్చినా
వారి పేరిట మనుషులు చేసే
కరాళనృత్యాలను చూసి కన్నీరు పెట్టక మానరు
మతాల పేరిట మారణహోమాల
మంటలు చూసి
గతుక్కుమంటూ విచారించకపోరు!
హితంకాని మతం కోసం
బతుకులేని భవితవ్యంకోసం
మనిషి! కట్టే సమాధులు చూసి
వికృత చేష్టల వినోదాలు చూసి
శోకించక మానరు !
మనిషీ ఎందుకు ఏరంత పారే
నీ ఆలోచనా తరంగాలను
అవని అంత విస్తృతం చేసుకుని
హాయిగా జీవించక
తెల్లని కాగితంలాంటి మనసుమీద
విషాన్ని చిలికించుకుంటావ్
విషాదాన్ని పులుముకుంటావ్?
నీకు నువ్వే గిరిగీసుకుని కుంచించుకుపోతూ చిన్న గూటిలో వుంటానంటావ్?
కాలం ఆగదు నీ కోసం
గాలం వేసి పట్టాలన్నా
అరచేత్తో బంధించి ఆపాలన్నా
కనపడకుండానే జారిపోయి పారిపోతుంది
కాలాన్ని కదలనివ్వకుండా కాపలా కాసినా
కరిగిపోతుంది
నీ మార్గం మార్చుకో మనిషీ
నీ మేధకు పదును పెట్టి మనిషిగా మారు
కాలాతీతుడవై కాలంతో చెయ్యి కలుపు
మబ్బుల కడలిలో మెరుపుల వెలుగును మూటగట్టుకో
మానవతను పెంచుకుని ఈ ప్రపంచాన్ని
స్వర్గంగా మార్చుకో
స్వర్గమంటే ఎక్కడో లేదు
సుఖ సంతోషాల నిలయమే స్వర్గం
నరకమంటే ఇరుకు బతుకుల
వెతల కథలే
దాన్ని ఇంగలంతో తుడిచిపారెయ్
* * *