Previous Page Next Page 
చెదిరిపోతున్న దృశ్యం పేజి 2

    తెలుగును చూస్తున్నాను...
    నేను పుట్టిన నాటినుండి
    తెలుగు నా శ్వాస
    తెలుగే నాధ్యాస అమ్మ ఒడిలో ఆటలాడుతూన్నప్పుడు
    మమతే నాభాష
    చందమామ వెలుగులో పాటలు పాడుతూ
    తెలుగును గుండెనిండా నింపుకుని
    నాజాతి వెలిగించిన తెలుగు దీపాల
    తోరణాలని చూసి పులకరిస్తూ
    తెలుగుతోటలో విహరిస్తూన్నాను
    నా తాతల పొందుపరచుకున్న    
    వారసత్వాన్ని సంతరించుకుని
    పారవశ్యంతో తేలిపోతున్నాను.
    తెలుగుభాషకు ముంగురులు
    సవరించిన నన్నయనుంచి
    తెలుగును సీమాంతరయానం
    చేయించిన 'బ్రౌను' దాకా
    తెలుగుబావుటా ఎందరో ఎగురవేశారు
    తెలుగుతీపిని తేనెగిన్నెల్లో భద్రపరచారు.
    తెలుగుమొగ్గలు విచ్చుకుంటూ
    పరిమళించే సారస్వత పుష్పాలై
    ప్రపంచమంతా విస్తరిస్తూ
    తెలుగు ఖ్యాతిని పెంచుతున్నాయి.
    తెలుగు ప్రతిష్ఠ ప్రపంచమంతా
    గాలిలా వ్యాపించింది
    ఆ వెలుగుల జలతారుల నడుమ
    మెరిసిపోయే తెలుగు తేజాన్ని 
    చూసి మురిసిపోయాను
    ముత్యాల ఊయలలో ఊగిపోయాను.
    కాలరీతులు మారిపోతున్నాయి
    తెలుగు నాటే తెలుగు వైభవానికి
    తెగులు పడుతూన్నది
    తెలుగు వారెవ్వరూ తెలుగులో మాట్లాడకపోవడం
    అదో వికృతదృశ్యం
    తెలుగు మాటను తెలుగుపాటను
    ఆటక పై కెక్కించి   
    తెలుగు జుట్టునీ తెలుగుకట్టునీ
    తెలుగు బొట్టునీ కావ్యాల్లోనే మగ్గబెట్టేసే
    అస్తవ్యస్త సన్నివేశాన్ని చూసి
    ఆవేదనపడుతున్నాను
    ఆందోళన పడుతున్నాను
    పండుగనాడు మాత్రమే ఫాన్సీ డ్రెస్సులా
    పంచెకట్టులూ పట్టుచీరలూ కట్టి
    తెలుగు తిండి గొడ్డుకారమంటూ
    ఆవకాయను చూడగానే అల్లల్లాడిపోయే
    తెలుగుడాబులని చూసి నవ్వుకుంటున్నాను.
    సూపులెన్నితాగినా కేకులెన్ని కొరికినా
    పచ్చిపులుసునీ పరమాణ్ణాన్నీ చూసి
    లొట్టలేసేవారిని తలుచుకుని
    తెలుగులో ఎంత రుచి వుందో తెలుసుకుని
    తెగమురిసిపోతున్నాను
    ఏ దేశమేగినా ఎక్కడున్నా
    ఏవిద్య నేర్పినా ఏపదవికెక్కినా
    తెలుగురుచి తెలుగులకే తెలుసు   
    తెలుగుతనం ఎక్కడున్నా తెలుస్తుంది
    తెలుగుకట్టు తెలుగుబొట్టు
    తెలుగురుచీ అభిరుచి
    చుక్కల్లో రోహిణిలాగా
    నా తెలుగు తళుక్కున మెరుస్తుంది ఎక్కడున్నా
    తరగని కీర్తితో వెల్లివిరుస్తుందని
    నిరీక్షిస్తున్నాను అందుకే ఇంకా నాతెలుగు
    నిత్యచైతన్య స్రవంతిగా
    అగ్రస్థానాన్నందుకుంటుందని
    నిఖిలజగత్తును చుట్టి వస్తుందని
    నా తెలుగును చూస్తున్నాను
    కమలనయననై  చంద్రవదననై.
                    * * *

  కొత్త 'నొటేషన్' రాసుకో!
    ఓటు కోసం సీటు కోసం నోటు కోసం
    ఎటు చూసినా కులాల పేరిట కుమ్ములాటలు
    మతాల పేరిట పోట్లాటలు
    మనిషికీ మనిషికీ మధ్య ప్రేమేలేదు అభిమానం లేదు
    బంధుత్వం లేదు స్నేహంలేదు
    కత్తులూ తుపాకులు స్వైరవిహారం చేయగా
    తెగిపడ్డ కుత్తుకల రక్త తర్పణాలు
    బాంబుల బడబాగ్ని రేపే మంటలు
    కులమతాల ఉన్మాదం
    కుటిలతత్వానికి నిదర్శనం !
    మనుషులను పొట్టన బెట్టుకుంటూ
    మానవతను నరుక్కుంటూ
    దేవుని పేరిట ఊరేగింపులూ ఉత్సవాలూ
    దైవత్వానికి తార్కాణం కాదు
    పశుత్వానికి ప్రతీకలివి
    పులివేషం కనబడకుండా దాచేందుకు
    కప్పుకున్న మేకచర్మం గొంగళి
    అభినయించేది భక్తికాడు
    కసినీ కక్షనీ కలిపి ముద్దచేసిన విషాన్ని
    దాచుకున్న వక్షస్థలం
    పైశాచిక క్రీడా వినోదానికి కేటాయించిన రంగస్థలం 
    మానవత్వమే చచ్చిపోయాక మతాలు మిగిలేదెవరికోసం ?
    కులాల ఘోషలు ఎందుకోసం ?
    ఈ గాండ్రింపులు ఓండ్రింపులు ఇంకా ఎందుకు ?
    ఈ రంగస్థలానికి తెరపడిపోవాలి
    అనాగరిక శస్త్రవిన్యాసం గావించాలి
    కొత్తస్క్రిప్టును రాసుకుని కొత్త రాగాలను పలికిస్తూ
    గాత్రకచ్చేరీ చెయ్యాలి
    కొత్త నొటేషన్ రాగాలు రాసుకుని
    ఎండిపోయిన మోడునుంచి కొత్త చివుళ్లు వూయించాలి
    పండిపోతూన్న బతుకులకు ఆశలు కలిగించాలి!
    కులమతాలు గుండెను గుచ్చే ముళ్లు
    తీసిపారెయ్ గుడెతూట్లు పడకుండా
    ఆప్యాయత హరివిల్లుని
    జీవనాకాశంలో పూయించు
    బ్రతుకునిండా సప్త వర్ణాలను పండించు
                   * * *

 Previous Page Next Page