Previous Page Next Page 
మౌనం పేజి 3

    వాటితో  దీటుగా  ఇది కూడా స్టాండర్డ్  కంపెనీ  అని కొనేవాడికి  తెలియాలి.

    ఈ వస్తువు  మీద మోజు  పడి కొనేలా  చేయాలి. కొనుగోలుదారుడిని  ఈ వస్తువు బాగా  ఆకర్షించాలి అంటే....ఎడ్వర్ టైజ్ మెంట్స్  ఎలా  వుండాలి? ఏం చేయాలి? అనే ఆలోచనలతో  ఆమె మెదడు  వేడెక్కుతోంది.

    నిమిషాలు  గంటలుగా  మారుతున్నాయి.

    "ఏమండీ! ఈ రోజు  ఇంటికి  వెళ్ళరా?" అన్న పిలుపుకి  విని  తల తిప్పి  చూసిన  ఆమెకు  ఎదురుగా  మీడియా మేనేజర్  కనిపించాడు.

    టైము ఏడు  అయ్యింది. అందరూ  వెళ్ళిపోతున్నారు  ఇళ్ళకు. మీరు వెళ్ళరా!" మళ్ళీ  అన్నాడు.

    "అరె  అప్పుడే  ఏడయిందా?" అప్రయత్నంగా  వాచ్  చూసుకుంటూ  అందామె.

    "ఏడు దాటింది కూడా! నేను  వెళుతున్నాను. ప్యూన్ లిద్దరూ  వున్నారు. మీరు ఇంకా కొంతసేపు  వుంటానంటే  వాళ్ళలో  ఒకరిని  మీకు తోడుగా  వుండమని  చెబుతాను."

    "నో నో! ఆ అవసరం లేదు. నేను కూడా బయలుదేరుతాను" చైర్ లోంచి  లేచి టేబుల్  మీద వున్న  బుక్స్  ఒక ప్రక్కకు  సర్ది  వ్యానిటీబ్యాగ్  తీసుకుని  బయటికి  కదిలిందామె.

    "ఓ.కె! సీయూ  టుమారో"చెప్పి  వెళ్ళిపోయాడు మీడియా  మేనేజర్.

    లైట్స్  అన్నీ ఆఫ్  చేసుకుంటూ  వస్తున్నారు ప్యూన్స్.

    బయటికి  నడిచి  తన కారుని  సమీపించింది ఆమె.

    డోర్ తెరిచి  వెనక  సీట్లోకి  వ్యానిటీబ్యాగ్  విసిరేసి  డ్రైవింగ్  సీట్లో  కూర్చుని  డోరు క్లోజ్ చేసి  కారు స్టార్ట్ చేసి, ఏ.సి. ఆన్ చేసి ముందుకు దూకించింది  ఆమె.

    రోడ్డుపై  మెత్తగా  జారిపోసాగింది  కారు.

    ఆమెకు  ఇంటికి  వెళ్ళాలంటే  మనస్కరించదు.

    ఆఫీసులో  వున్నంతసేపూ  గంటలు  క్షణాల్లా  గడుస్తాయి  ఆమెకు.

    కానీ....ఇంటికి  వెళితే  నిమిషాలు  కూడా గంటల్లా  అనిపిస్తాయి.

    ఆమెది  ఒంటరి  జీవితం.

    ఆమెతో  మాట్లాడటానికి  ఎవరూ లేరు.

    ఆమె నివసించే  డబుల్  బెడ్ రూమ్ ప్లాట్  కూడా చాలా పెద్దదిగా  ఎక్కువగా  అనిపిస్తుంది.

    ఆ ఒంటరి  జీవితం  ఆమెకు  ఒక్కోసారి  విసుగనిపిస్తుంది. దుర్భరమనిపిస్తుంది.

    ఆమెకు డబ్బుకు లోటు లేదు. లగ్జరీస్ కి కొదవ లేదు.

    కానీ....అవేవీ  ఆమెను  సంతోషంగా వుంచలేకపోతున్నాయి. ఒంటరి తనమే  ఆమెకు  ఓ నరకంలా  అనిపిస్తోంది.

    ఆలోచనలతో  కారు డ్రైవ్ చేస్తున్న  ఆమె, ఎదురుగా  రెడ్ సిగ్నల్ లైటు  వెలగడంతో  సడన్  బ్రేక్ తో  ఆపింది.

    అదే సమయంలో  ఆమె ప్రక్కగా  ఆగిందో  అంబాసిడర్  కారు.

    అప్రయత్నంగా  తలతిప్పి  ఆ కారువైపు  చూసిన  ఆమె ఉలిక్కిపడింది.

    తన కళ్ళను  తానే నమ్మలేనట్లుగా, మరోసారి  కళ్ళు నులుముకుని  కారులో  అటువైపు  సీట్లో  కూర్చున్న కుర్రాడివైపు  చూసింది.

    'ఆ కుర్రాడు పవన్ కాదు కదా!' అనుకుంది.

    అదే రంగు....అదే  కనుముక్కు  తీరు. అదే జుట్టు....అదే వయస్సు....అవును....ఆ కుర్రాడు  పవనే....నిస్సందేహంగా.

    సరిగ్గా  అదే సమయంలో  తలతిప్పి  చూశాడు  ఆ అబ్బాయీ కూడా!

    తను చూడగానే గుర్తుపడతాడు  అనుకుంది.

    కానీ అతని కళ్ళలో ఏ భావమూ లేదు.

    గ్రీన్ సిగ్నల్  వెలగటంతో  ఆ కారు  దూసుకుపోయింది.

    తన కారునీ  ముందుకు  కదిలించింది  అర్చన.

    పవన్ ఎలా  అవుతాడు  ఆ కుర్రాడు? అయ్యే అవకాశం లేదు.

    అర్చన  కొడుకే  పవన్.

    ఎనిమిది సంవత్సరాల వయస్సు  వుంటుందా  కుర్రాడికి.
 
    కానీ ఆ కుర్రాడు  ఇప్పుడు లేడు.

    చనిపోయాడు.

    బస్సు ప్రమాదంలో చనిపోయాడు.

    పవన్ తో పాటు  మరో నలభై  రెండుమంది పిల్లలు కూడా  చనిపోయారు. మిగతా  స్టూడెంట్స్ తోపాటు  శ్రీశైలం  టూర్ కి వెళ్ళి  తిరిగి వస్తుండగా  దారిలో  బస్సు  లోయలోకి  దొర్లి  చనిపోయారు.

    కేవలం  ఇద్దరు మాత్రమే  బ్రతికారు.

    ఈ సంఘటన  జరిగి  కూడా  సంవత్సరం  అవుతోంది.

    అలంటప్పుడు  ఆ కనిపించిన  పిల్లవాడు పవన్  అయ్యే అవకాశం  వుందా....!

    లేదు!

    మరి ఆ కుర్రాడు  ఎవరు?

    ఏమో....! అనుకుంది  ఆమె.


                       *    *    *    *


    సమయం  సాయంకాలం  ఐదుగంటలు  కావొస్తోంది.

    పోలీస్ ఎకాడమీ    స్విమ్మింగ్ పూల్....

    అందులోని నీరు  స్వచ్చంగా  మెరుస్తోంది.

    నిశ్చలమైన  ఆ నీటిని  అప్పుడప్పుడు  వీచే గాలి, అలలుగా  కదిలిస్తోంది.

    ఇంటర్నేషనల్  స్టాండర్డ్స్ లో  నిర్మించిన  పూల్  అది.

    ఇరవై  అడుగుల  ఎత్తున్న  స్వింగ్ బోర్డ్ మీదకు  ఎక్కాడు  అతను.

    స్విమ్  సూట్  ధరించి  వున్న  అతని శరీరం  కండలు  తిరిగి  బలిష్టంగా  కనిపిస్తోంది.

    పెర్ ఫెక్ట్  అథ్లెట్స్ కి  వుండే  శరీర సౌష్టవం  అతనిది.

    ఐదడుగుల  పదంగుళాల  ఎత్తు....తెల్లని  శరీరవర్ణం.

    మగవారికే  అసూయ  కలిగించే  శరీర సౌష్టవం  అతనిది.

    కోలముఖం ,కొనదేరిన  ముక్కు, చిన్నదిగా  వున్న పోలీస్ హెయిర్ కట్.

    ఒక్కసారి  ఒళ్ళు  విరుచుకున్నాడతను.

    ఆ సమయంలో  అతని శరీర  కండరాలు  లయబద్ధంగా  కదిలాయి.

    సాయంకాలపు  నారింజవర్ణపు  నీ రెండలో  స్వేదం  తేలిన  అతని శరీరము మెరుస్తోంది.

    రెండు చేతులూ  నిట్టనిలువుగా  పైకి చాపాడతను.

    శరీరాన్ని  ముందుకు  వంచి  డ్రైవ్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఒక్కసారి  వూపిరి బలంగా  తీసుకున్నాడు.

    అలా వూపిరి  పీల్చినప్పుడు  అతని ఛాతీ  కండరాలు  పొంగాయి.

    ఒక్కసారిగా  గాల్లోకి ఎగిరి స్వింగ్  బోర్డుని  బలంగా  తన్నాడు.

    అరవై  అయిదు  కిలోల  అతని  బరువుకి బోర్డు  వూగిసలాడింది.

    తలను  క్రింది  వైపుకి  వుంచి  తిన్నగా  నీటిలోకి  దూసుకుపోయాడు అతను.

    అతని శరీరం  నీటి  ఉపరితలాన్ని  తాకగానే  నీరు  రెండడుగుల  ఎత్తున  పైకి లేచింది.

    క్షణం  తరువాత  తిరిగి  నీటి  మీద  తేలాడు.

    బట్టర్  పై స్ట్రోక్ లో  కొంతసేపు, ఫ్రీస్టయిల్ లో  కొంతసేపు  ఈదసాగాడు.

    అక్కడున్న  చెయిర్ లో కూర్చుని  స్విమ్ చేస్తున్న  అతని శరీర కదలికలు  గమనించసాగాడు  ఎస్ పి కిరణ్.

    పది నిమిషాలపాటు  అలా  స్విమ్  చేసి స్విమింగ్  పూల్ లోంచి  బయటకి  వచ్చి స్విమ్మింగ్ పూల్ అంచుమీద  అలసటగా  కూర్చున్నాడతను.

    "ఏం కౌశిక్! స్విమ్మింగ్ పూర్తయినట్లేనా?" ప్రక్కనున్న  స్టూల్ మీద త్రిబుల్ ఫైవ్ సిగరెట్ ప్యాక్  అందుకుంటూ  అన్నాడు కిరణ్.

    "యా....అయామ్  టయర్డ్"

    అతని మాటల్లో  కూడా అలసట  కనిపిస్తోంది.

    "కమ్....రిలాక్స్" తన ప్రక్కనున్న  చైర్ చూపించాడు  కిరణ్.

    "జస్ట్ ఫైవ్ మినిట్స్" అని  లేచి లోపలికి  వెళ్ళి  ఫ్రెష్ వాటర్ షవర్ క్రింద  నిమిషాలు నిలబడి, శరీరాన్ని టవర్ తో  తుడుచుకుని  డ్రస్ చేంజ్ చేసుకుని  బయటికి  వచ్చాడు కౌశిక్.

    "కమ్....హేవ్ ఎ సిగరెట్" అంటూ  అక్కడున్న  ప్యాక్ ను కౌశిక్  చేతికి  అందించాడతను.

    "థాంక్యూ" అంటూ  సిగరెట్ అందుకుని  వెలిగించాడు.

    అతనికి  సుమారు  ముప్పై ఏళ్ళున్నాయి. అతను తన ఇరవై మూడో ఏట ఐ పి యస్ కి సెలక్ట్ అయ్యాడు. ఎస్ పి గా ప్రమోట్  అయి రెండేళ్ళు అవుతోంది.

    అతనికంటే  రెండేళ్ళు  సీనియర్ కిరణ్.

    ఇద్దరూ  ఇంటెలిజెన్స్  డిపార్ట్ మెంటులో  వున్నారు.

    పోలీస్ ఎకాడమీలో  అప్పటికి  మూడు రోజులుగా  జరుగుతున్న సెమినార్ కి  అటెండ్  అవడానికి  వచ్చారు వాళ్ళిద్దరూ.

    ఆ రోజుతో  సెమినార్  పూర్తయిపోయింది. ఆ రాత్రి  ఎనిమిది గంటలకి  డిన్నర్ వుంది. అంతవరకు  టైమ్ పాస్ చేయాలి.

    కౌశిక్ కి స్విమ్మింగ్  అంటే చాలా ఇష్టం.

    స్విమ్ చేయటం  ద్వారా  శరీరం  ఉత్తేజితం  అవుతుందతనికి.

    ఆ విషయంలో కిరణ్  పరమ బద్ధకస్తుడు. ఫిట్ నెస్  ఎక్సర్ సైజెస్ అన్నా, స్విమ్మింగ్ అన్నా చాలా దూరంగా వుంటాడు.

    స్విమ్మింగ్ పూల్ ప్రక్కనున్న  హాల్లో  కొందరు  ప్రొబేషనర్స్  బిలియర్డ్స్  ఆడుతున్నారు.

    టీపాయ్  తెచ్చి  స్టూల్ మీద వుంచి  రెండు  కప్స్ లో సర్వ్ చేసి వెళ్ళిపోయాడు  అక్కడి అటెండెంట్.

    కప్స్ అందుకుని  సిప్ చేయసాగారు  ఇద్దరూ.

    "టీ తయారుచేయడంలో  నా భార్య ఎక్స్ పర్ట్....ఏమయినా  ఇంట్లో తయారుచేసే వంటకాల రుచి బయట పదార్ధాలకి  రాదు" చెప్పాడు  కిరణ్. అతడు తిండి ప్రియుడు. రకరకాల వంటకాలు  వదలకుండా  తింటాడు.

    నిజానికి కిరణ్ భార్య  వంటకాలు  అద్భుతంగా  తయారుచేస్తుంది. అందులో  అతిశయోక్తి లేదు. నాలుగైదుసార్లు  కిరణ్  ఇంట్లో  భోజనం చేశాడు కౌశిక్.

 Previous Page Next Page