Previous Page Next Page 
దేవదాసు పేజి 3

    "ఎక్కడికీ? నాతోపాటు వస్తావా? ఆహా! అది సాధ్యమయ్యే పనేనా?"
    పార్వతి తల వూపి "వస్తాను" అన్నది.
    "కాదు, వీలుకాదు కాని ముందు మంచినీళ్ళు తీసికొని రా!"
    "నేను తీసికొని రాను, నీవు పారిపోతావు."
    "పోను, పారిపోను!"
    కాని పార్వతి ఆ మాటను విశ్వసించలేక పోయింది. అంచేత అక్కడే కూర్చొని వుంది. దేవదాసు మళ్ళీ ఆజ్ఞాపించాడు__"వెళ్ళు, నేను చెపుతున్నాను."
    "నేను వెళ్ళలేను."
    క్రోధంతో దేవదాసు, పార్వతి జుట్టులాగి బెదిరించాడు__"వెళ్ళు, నేను చెపుతున్నాను."
    పార్వతి మౌనంగా వుంది. క్రోధంతో దేవదాసు ఆమె వీపు మీద ఓ గుద్దువేసి "వెళ్ళవా?" అన్నాడు.
    పార్వతి ఏడుస్తూ "నేను వెళ్ళలేను" అన్నది.
    దేవదాసు ఓ వైపుగా వెళ్ళిపోయాడు. పార్వతి కూడా ఏడుస్తూ తిన్నగా దేవదాసు తండ్రి ఎదటికి వచ్చి నిలబడింది. ముఖోపాధ్యాయ గారు, పార్వతిని చాలా ప్రేమతో చూస్తూ వుంటాడు. "పత్తో, ఏడుస్తున్నా వెందుకు?" అన్నాడు.
    "దేవదాసు కొట్టాడు."
    "అతడెక్కడున్నాడు?"
    "ఈ వెదుళ్ళ తోపులో కూర్చొని పొగ త్రాగుతూ వున్నాడు."
    పండితులవారు వచ్చి పోవడంతో అసలే కోపంతో వున్నాడు. ఇప్పుడు ఈ వార్త విని మరింత మండిపడ్డాడు. "దేవా పొగకూడా త్రాగుతున్నాడా?" అన్నాడు.
    "అవును త్రాగుతాడు. చాలా రోజులనుంచి త్రాగుతూ వున్నాడు వెదుళ్ళతోపు మధ్యలో హుక్కా దాచిపెట్టి వుంచాడు."
    "ఇన్ని రోజులనుంచి నాతో ఎందుకు చెప్పలేదు?"
    "దేవదాదా కొడతానన్నాడు."
    వాస్తవంగా ఈ మాట నిజంకాదు. చెపితే దేవదాసు దెబ్బలు తింటాడు. అంచేత ఆ మాట ఇదివరకు చెప్పలేదు. ఈ రోజు అదే మాట కేవలం క్రోధంతో చెప్పింది. ఇప్పుడు ఆమె వయస్సు కేవలం యెనిమిది సంవత్సరాలు. ఇప్పుడు క్రోధం ఎక్కువగానే వుంది. అయితే ఆమె పరిశీలనా శక్తి మాత్రం అల్పమైనదేమీ కాదు. ఇంటికి వెళ్ళి ఆమె ప్రక్కమీద పడుకొని చాలా సేపటివరకు ఏడ్చి ఏడ్చి ఆ తరువాత నిద్రపోయింది. ఆ రాత్రి ఆమె తిండికూడా తినలేదు.
                                  2
    మరుసటిరోజు దేవదాసు బాగా దెబ్బలు తిన్నాడు. అతణ్ని ఆ రోజంతా ఇంట్లో బంధించి వుంచారు. తల్లి అదేపనిగా రోదిస్తూ వుంటే అప్పుడు విడిచిపెట్టారు. రెండో రోజు ఉదయం పరుగెత్తుకుంటూ పోయి పార్వతి వాళ్ళ ఇంటి కిటికి క్రింద నిలబడి "పత్తో__పత్తో" అంటూ ఆమెను పిలిచాడు.
    పార్వతి కిటికీ తెరిచి "దేవదాదా" అన్నది.
    ఇద్దరూ ఒకచోటకు చేరిన తరువాత "నేను పొగ త్రాగుతాననే సంగతి ఎందుకు చెప్పావు?" అన్నాడు దేవదాసు.
    "నీవు ఎందుకు కొట్టావు?"
    "నీవు మంచినీళ్ళు తీసికొని రావడానికి ఎందుకు వెళ్ళలేదు?"
    పార్వతి మౌనం వహించింది. "నీవు వట్టి మూర్ఖురాలివి. ఇక ముందెప్పుడూ చెప్పవద్దు" అన్నాడు దేవదాసు.
    పార్వతి తల ఊపుతూ "చెప్పను" అన్నది.
    "అయితే పద, వెదుళ్ళ తోపులోనుంచి వెదురు కర్రలు కోసి తీసికొని వద్దాం. ఈ రోజు ఆనకట్ట దగ్గర చేపలు పట్టాలి."
    వెదుళ్ళతోపు దగ్గరే ఒక సీతాఫలం చెట్టు వుంది. దేవదాసు దానిమీదికి ఎక్కాడు. చాలా కష్టంమీద ఒక వాసాన్ని వంచి, పార్వతికి పట్టుకోమని ఇచ్చి_ "చూడు దీన్ని వదిలిపెట్ట వద్దు, వదిలిపెడితే నేను పడిపోతాను" అని చెప్పాడు.
    పార్వతి దానిని భద్రంగానే పట్టుకొని వుంది. దేవదాసు దాన్ని పట్టుకొని సీతాఫలం చెట్టు కొమ్మమీద కాలు వుంచి వెదురు వాసాన్ని నరుకుతూ వున్నాడు. పార్వతి క్రిందినుంచి "దేవదాదా! పాఠశాలకు రావా?" అన్నది.
    "రాను."
    "పెదనాన్న నిన్ను పంపిస్తే గదా?'
    "నేను అక్కడ చదవనని నాన్నగారే స్వయంగా చెప్పారు. పండి తులవారే స్వయంగా ఇంటివద్దకు వస్తారు."
    పార్వతి కొంచెం విచారపడింది. "రేపటి నుంచి వేసవి కారణంగా స్కూలు ఉదయం పూట జరుగుతున్నది. ఇక నేను వెళతాను" అన్నది.
    దేవదాసు పైనుంచి కళ్ళెర్రజేస్తూ "వీలులేదు, అలా వెళ్ళడానికి వీలులేదు" అన్నాడు.  
    ఈ సమయంలో పార్వతి కొంచెం పరధ్యానంగా వుంది. సీతాఫలం చెట్టుకొమ్మ పైకి లేచిపోయింది. వెంటనే దేవదాసు ఆ కొమ్మ మీదినుంచి క్రింద పడిపోయాడు. ఆ కొమ్మ అంత ఎత్తుగాలేదు. అంచేత పెద్ద దెబ్బ తగలలేదు. కాని శరీరం అనేక చోట్ల చీరుకుపోయింది. కోపం వచ్చి దేవదాసు ఎండిపోయిన బెత్తం ఒకటి తీసికొని పార్వతి వీపుమీద, చెంపలమీద, భుజాల మీద ఎక్కడబడితే అక్కడ బాదిపారేశాడు. పో, అవతలికి పో దూరంగా!" అన్నాడు.
    ముందు పార్వతి స్వయంగానే సిగ్గుపడింది. కాని వరసగా బెత్తంతో దెబ్బమీద దెబ్బ పడుతూ వున్న కారణంగా క్రోధంతోనూ, అభిమానంతోనూ రెండు కళ్ళూ అగ్ని కణాల్లాగా ఎర్రబడ్డాయి. ఆమె రోదిస్తూ "నేను ఇప్పుడే పెదనాన్న దగ్గరకు పోతాను" అన్నది.
    దేవదాసు కోపంతో మరోసారి బాదాడు. వెళ్ళు, ఇప్పుడే వెళ్ళి చెప్పు, నాకేమీ లెక్కలేదు" అన్నాడు.
    పార్వతి వెళ్ళిపోయింది. ఆమె దూరంగా వెళ్ళిపోగానే దేవదాసు బిగ్గరగా "పత్తో" అని పిలిచాడు. పార్వతి వినిపించుకోలేదు. మరింత వేగంగా నడుస్తూ వుంది. "ఓ పత్తో, కొంచెం మాట విని పో" అని దేవదాసు మళ్ళీ పిలిచాడు.
    పార్వతి జవాబివ్వలేదు. దేవదాసు విసుగుతో "వెళ్ళి చావనివ్వు" అని బిగ్గరగా తనలో తాను అనుకున్నాడు.
    పార్వతి వెళ్ళిపోయింది. దేవదాసు ఏదో విధంగా ఒకటి రెండు వెదురు కర్రలు కోసుకున్నాడు. అతడి మనస్సు బాగాలేదు. ఏడుస్తూ పార్వతి ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె చెంపలమీద బెత్తం దెబ్బలు వాతలు గట్టాయి. బాగా పొంగి పైకి కనిపిస్తున్నాయి. ఆ వాతలు ముందుగా పార్వతి నాయనమ్మ కంట బడ్డాయి. ఆమె అదేపనిగా "బాబోయ్! బాబోయ్! ఇట్లా కొట్టారెవరే పత్తో?" అని కేకలు పెడుతూ అరిచింది.
    కళ్ళు మూసుకుంటూ "పండితులవారు" అన్నది పార్వతి.
    నాయనమ్మ ఆమెను దగ్గరకు తీసికొని అపరిమితమైన కోపంతో "పద, ఒకసారి నారాయణ వద్దకు వెళదాం. అతడు ఎలాంటి పండితుడో చూద్దాం! అమ్మో! అమ్మో! పిల్లదాన్ని అమాంతంగా చంపేశాడు!" అన్నది.
    పార్వతి నాయనమ్మను కౌగిలించుకుని "పద" అన్నది.
    ముఖోపాధ్యాయగారి దగ్గరకు వెళ్ళి పార్వతి నాయనమ్మ ఎప్పుడో చనిపోయిన పండితులవారి తాత, ముత్తాతలనూ, వారి పూర్వీకులనూ అనేక రకాలుగా తిట్టి, దూషించి, వారి పదునాలుగు తరాల వారినీ నరకంలో పడేసి, చివరకు గోవింద పండితుణ్ని కూడా నానారకాలుగా నిందిస్తూ, తిట్టిపోస్తూ_ "చూడు నారాయణా అతగాడి సాహసం! శూద్రుడయి వుండి బ్రాహ్మణ కన్య ఒంటిమీద చేయి చేసుకుంటాడా? ఎలా కొట్టాడో ఒకసారి చూడు!" అని ఆ వృద్ధురాలు పార్వతి చెంపలమీద పడిన వాతలను అమితమైన వేదనతో చూపిస్తూ అంది.
    "పత్తో, ఎవరు కొట్టారు?" అని అప్పుడు నారాయణబాబు పార్వతిని అడిగాడు.
    పార్వతి మౌనంగా వుంది. అప్పుడు పార్వతి నాయనమ్మ మరోసారి అరిచి "ఇంకెవరు, కొడతారు మూర్ఖుడైన ఆ పండితుడు తప్ప?" అన్నది.
    "ఎందుకు కొట్టాడు?"
    పార్వతి ఈ సారి కూడా ఏమీ చెప్పలేదు. "ఏదో తప్పు చేస్తేనే కొట్టి వుంటాడు. అయినా ఈ విధంగా కొట్టడం అనుచితం అని భావించి ముఖోపాధ్యాయ మహాశయుడు పైకి కూడా అదే అన్నాడు. పార్వతి తన వీపు చూపుతూ "ఇక్కడ కూడా కొట్టాడు" అన్నది.
    వీపు మీద బెత్తం వాతలు ఇంకా, స్పష్టంగా పొంగి వున్నాయి. అప్పుడు వాళ్ళిద్దరూ మరింత మండి పడ్డారు. పండితులవారిని పిలిపించి కారణం తెలుసుకుందాం" అని ముఖోపాధ్యాయ తన అభిప్రాయం వెల్లడించాడు. అటువంటి పండితుల వారివద్దకు బాల బాలికలను పంపించడం ఉచితమైన పని కాదని నిశ్చయించారు.
    ఈ నిశ్చయం విని పార్వతి సంతోషంగా నాయనమ్మ చంకనెక్కి ఇంటికి తిరిగి వచ్చింది. వచ్చిన తరువాత పార్వతి తల్లి ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి వచ్చింది. ఆమె కూర్చొని "ఎందుకు కొట్టాడు?" అని అడిగింది.
    "ఊరకనే కొట్టాడు" అన్నది పార్వతి.
    తల్లి పార్వతి చెవులు గట్టిగా మెలేస్తూ "ఊరకనే ఎవరైనా కొట్టగలరా?" అన్నది.
    అదే సమయంలో వరండాలోగుండా అత్తగారు వెళుతూ వున్నారు. ఆమె ఇంటి గడప దగ్గరకు వచ్చి "కోడలా, తల్లివయ్యుండి కూడా నీవు ఊరకనే కొట్టగలవు. అటువంటప్పుడు ఆ దౌర్భాగ్యుడు కొట్టలేడా?"
    ఊరకనే ఎన్నడూ కొట్టలేదు. నీ మనుమరాలు చాలా మంచి అమ్మాయి గదూ! ఏమీ చేయలేదు, ఆయనే కొట్టాడు!" అన్నది కోడలు.  

 Previous Page Next Page