Previous Page Next Page 
హైజాక్ పేజి 2

తను అనుకున్నదానిలో ఆవగింజంత అయినా లేచి ఆ డబ్బుని చూసి, అతని మొహంలోని కండరాలు బిగుసుకున్నాయి. "అంతా ఇంతేనా?" అన్నాడు అపనమ్మకంగా.
భయంతో గుటకవేసి, "అవును!" అన్నట్లు తల పంకించింది సుజాత.
అతను నిశ్శబ్దంగానే పెరిమలు కదిలిస్తూ ఏదో అని, నోట్లు లాక్కుని జెర్కిన్ జేబులో కుక్కేసి, పెద్ద పెద్ద అంగలతో బయటికి వెళ్ళిపోయాడు.
అప్పటిదాకా అతనికి రాక్షకుడిలాగా పక్కనే నిలబడి, అందరినీ డేగలా గమనిస్తున్న మరో పావుపాటి మనిషి కూడా త్వరత్వరగా అతన్ని అనుసరించాడు.
సరిగ్గా బ్యాంకు ముందరే నల్ల అంబాసిడర్ కారు ఒకటి ఆగి ఉంది. దాని తలుపులు తెరిచిపెట్టి ఉన్నాయి. ఇంజన్ స్టార్టుచేసి ఉంది. నలుపే అయినా చాలా కళగా కనబడుతున్న ఒకతను డ్రైవర్ సీట్లో అసహనంగా కూర్చుని ఉన్నాడు. వాళ్ళిద్దరూ దాన్లో ఎక్కారు. వాళ్ళు తలుపులు మూసీ మూయకముందే, కారుని ముందుకి వురికించాడు డ్రైవరు.
అప్పుడు మోగింది క్యాషియర్ దగ్గర ఉండే అలారం బెల్లు.
బెల్లు వినబడగానే, స్టాఫ్ అందరూ లేచి నిలబడ్డారు. కొందరు బ్యాంకు తలుపులన్నీ టకటక మూసివేశారు - ఎవరూ తప్పించుకుని బయటికి పోవడానికి వీలులేకుండా. కొందరు సుజాత దగ్గర కెళ్ళారు.
స్వేదంతో తడిసిపోయింది సుజాత జాకెట్టు. గజగజవణుకుతోంది తను. ఆమె సగం సగం వాక్యాలతో వాళ్ళకి జరిగిందేమిటో చెప్పి, వాళ్ళు దాన్ని అర్థం చేసుకుని, పోలీసు రిపోర్టు ఇచ్చేసరికి పదిహేను నిమిషాలు పట్టింది.
డబ్బు దోచుకున్న శతృఘ్నా అతని ఫ్రెండ్సు ఇక్బాల్, విక్టర్, వివేకానంద్, ముగ్గురూ తాము దొంగిలించిన అంబాసిడర్ కారుని పెరేడ్ గ్రౌండ్స్ దగ్గర వదిలేసి, బస్సు ఎక్కారు.
ఆరు స్టేజీల తర్వాత, బాగా జనసమ్మర్ధం ఉన్నచోట బస్సుదిగి, ఒక ఫర్లాంగు వెనక్కి నడిచి, రిక్షాలు మాట్లాడుకొని, రూము చోరుకున్నారు.
అప్పటినుంచి సాయంత్రందాకా వాళ్ళు రూములోనుంచి కదలలేదు. గాలికి తలుపు చప్పుడయినప్పుడల్లా, పోలీసులే వచ్చేసి తలుపు తడుతున్నారని భ్రమ కలిగి ముచ్చెమటలు పోసేవి.
సాయంత్రం ఆరున్నరదాటి మసక చీకట్లు ఆవరించుకున్న తర్వాత, వాళ్ళకి మెల్లిమెల్లిగా నమ్మకం ఏర్పడింది - తాము బ్యాంకు దోపిడీ చేసి విజయవంతంగా తప్పించుకు రాగలిగామని.
"లెటజ్ సెలెబ్రేట్!" అన్నాడు శతృఘ్న ఉద్వేగంతో.
ముగ్గురూ కలిసి ఒక చైనీస్ రెస్టారెంట్ కి వెళ్ళి కూర్చున్నారు.

                                *    *    *    *

"దీన్తల్లి సిగదరగ! ఇంతా కష్టపడితే దొరికింది ఎనిమిదివేలేనా!" అన్నాడు ఇక్బాల్ మంటగా. అతనిది కోస్తా ప్రాంతం. చాలామంది తెలుగువాళ్ళకంటే కూడా స్వచ్చమయిన తెలుగు మాట్లాడగలడు. పొట్టిగా, లావుగా ఉంటాడు.
తన కసి అంతా సిగరెట్ మీద చూపిస్తున్నట్లుగా గాఢంగా దమ్ముపీల్చాడు శతృఘ్న. పొగని నెమ్మదిగా వదులుతూ అన్నాడు. "నా కంటే ముందు నిలుచున్నా తలపాగాగాడు ఒక లక్షదాకా డ్రా చేసినట్లు ఉన్నాడు. దానితో ఆ అమ్మాయి దగ్గర క్యాష్ అయిపోయి ఉంటుంది. అదే టైంలో మనం వెళ్ళాం. మిగిలిపోయిన అడుగూ బొడుగూ నోట్లు మాత్రం మనకి దొరికాయి."
"హార్డులక్!" అన్నాడు విక్టర్ వివేకానంద్. "దీనికోసం ఏదో దేశం మీదికి దండయాత్రకి వెళుతున్నట్లు ఎన్నిరోజులు ప్లాన్ చేశాం! డేరింగ్ గా ఒక కారుకూడా దొంగిలించుకొచ్చాం! అంతా బ్లడీ వేస్ట్!"
"మళ్ళీ ఇంకో బ్యాంకులో జొరబడదాం! ఈసారి దొరక్కపోవు అయిదు లక్షలో, పది లక్షలో!" అన్నాడు ఇక్బాల్.
తీక్షణంగా ఇక్బాల్ వైపు చూశాడు శతృఘ్న. సూదుల్లా గుచ్చుకుంటాయి అతని చూపులు. ఏ అడ్వెంచర్ అయినా ఒకే పద్ధతిలో రెండుసార్లు చేస్తే థ్రిల్ ఉండదు పైగా, పట్టుబడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని బ్యాంకులకి ఇంక గుడ్ బై! ఇంకో ప్లాను ఏదన్నా ఆలోచిద్దాం. అప్పటిదాకా - వెల్ - దంచినమ్మకి బొక్కిందే కూలి అన్నారు. అలాగే దోచినందుకు దక్కిందే చాలు అని సంతోషపడదాం. లెటజ్ ఈట్, డ్రింక్ అండ్ బీ మెర్రీ!" అంటూ మెనూ కార్డు అందుకున్నాడు.
ఐటమ్ తర్వాత ఐటమ్ తింటూ మధ్య మధ్యలో లిక్కర్.
క్వార్టరు సీసా విస్కీ నీళ్ళు కూడా కలపకుండా నీళ్ళలా తాగేసి, నీటుగా నడిచి రూంకి వెళ్ళిపోగలడు శతృఘ్న. ఇక్బాల్ కి తన లిమిట్ ఎంతో తెలుసు, మోతాదులోనే తాగుతాడు అతనెప్పుడూ.
లిమిట్ తప్పి తప్పతాగేది, తాగుతూ ఆగకుండా వాగి అల్లరి చేసేది వివేకానందే. మూడో పెగ్గుకి రాగానే పక్క టేబుల్ దగ్గర కూర్చున్న ముక్కూమొహం తెలియని అపరిచితుడెవరితోనో డైలాగులు మొదలెడతాడు. అవి ముందు సరసంగా ఆ తర్వాత విరసంగా మారడం ఆనవాయితీ.
ఇవాళా అంతే!
"ముందు మందుపోసి అందులో సోడా పొయ్యాలిగాని, ముందు సోడాపోసి అందులో మందు కలుపుతావేమిట్రా వెధవా!" అన్నాడు వివేకానంద్ అర్థనిమీలిత నేత్రాలతో పక్క టేబుల్ వాడిని చూస్తూ. అంతటితో ఊరుకోక 'ఈ అపరాధాన్ని సహించకూడదు' అన్న ధృడ నిశ్చయంతో లేచి వాడి కాలర్ ని ఉరితాడులా బిగించి పట్టుకున్నాడు.
గందరగోళం మొదలయింది.
"వదులు వదుల్రా" అంటూ శతృఘ్న, ఇక్బాల్ లేచి వివేకానంద్ చెరో చెయ్యీ పట్టుకుని బయటికి ఈడ్చుకొచ్చారు. కసాయివాడి దగ్గరకు వెళ్ళబోతున్నానని గ్రహించిన మేకలా అతను గింజుకుంటూ, కాళ్ళు బిర్రుగా చేసి, నడవకుండా జారుతూ వచ్చాడు. అతికష్టంమీద ఆటోలో కుదేశారు అతన్ని.

 Previous Page Next Page