సునీత సంతోషంగా శారద చెయ్యిపట్టుకుని ఊపింది. "శారదా థ్యాంక్ యూ....నీవే లేకపోతే, నీవే నాకీ ఆలోచన చెప్పకపోతే పిల్లలతో ఎక్కడికి వెళ్ళాలో తెలియక అవస్థ పడేదాన్ని" కన్నీటిపొర మధ్య కృతజ్ఞతగా అంది.
"సునీతా, మన ఆడవాళ్ళం. ఎమోషనల్ అయిపోయి మన హక్కుల సంగతి మరచిపోతుంటాం. విడాకులు మంజూరయ్యే వరకు నీవు అతని భార్యవి. నీ పిల్లల తండ్రి అతను. నీకు, నీ పిల్లలకి ఆ ఇంట్లో వుండే సర్వాధికారాలు వుంటాయి. మీ పోషణ అతని బాధ్యత. అర్ధమైందా! అనవసరంగా దిగులు పడకు. ధైర్యంగా వుండు అన్నీ చక్కబడతాయి" శారద ధైర్యం చెపుతూ సునీత భుజం తట్టింది.
రవీంద్ర ఉక్రోషంతో మాడిన మొహంతో సునీత వంక చురచురా చూశాడు. అతని లాయరు ప్రకాష్ మొహం మాడింది. చకచకా పేపర్లు సర్దుకుని బ్రీఫ్ కేసులో పెట్టుకుని బయటికి నడిచాడు.
అది చూసి శారద "వస్తా సునీతా, తర్వాత ప్రొసీడింగ్స్ గురించి తర్వాత ఆలోచిద్దాం" అంటూ గబగబా బయటకి నడిచింది.
కోర్టుమెట్లు దిగుతూంటే, సీనియర్ అడ్వకేట్ విశ్వేశ్వరరావుగారు "కంగ్రాట్స్ అమ్మా, బాగా వాదించావు. ఆడవాళ్ళ కేసులు డీల్ చేయడంలో నీ తర్వాతే ఎవరన్నా" అంటూ అభినందించారు.
ప్రకాష్ కారులో కూర్చుని హారర్ నొక్కాడు.
శారద అది చూసి "థ్యాంక్స్ సార్. మీ అందరి అభిమానం నాకు మరింత ప్రోత్సాహాన్నిస్తుంది" కృతజ్ఞతలు చెప్పి మెట్లు దిగుతూంటే ఎవరో క్లయింట్ ఎదురొచ్చింది.
"అమ్మా, మనకేసు వాయిదా మళ్ళీ ఎప్పుడమ్మా" అంది. అమాయకంగా.
ప్రకాష్ ఆసహనంగా మరోసారి హారర్ నొక్కాడు.
"ఈ నెల ఇరవై అనుకుంటాను. ఇలా మెట్లమీద నిలబెట్టి అడిగితే ఎలా, నాకన్నీ జ్ఞాపకం వుంటాయా! రేపుదయం రా, కాగితాలు చూసి చెప్తాను" మాట్లాడుతూనేవుంది.
ప్రకాష్ ఈలోగా విసురుగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు.
శారద తెల్లబోయింది. మరుక్షణం ఆమె మొహం ఎర్రబడిపోయింది.
వెనకనించి వస్తున్న విశ్వేశ్వరరావు - "అదేమిటి, ప్రకాష్ అలా వెళ్ళిపోయాడు నిన్ను వదిలి" అన్నాడు.
శారద నల్లబడ్డ మొహాన్ని తిప్పుకుని "ఆయనకి ఏదో పనుంది వెళ్ళాలని చెప్పారు లెండి"అంది.
"అయితే రా అమ్మా, నా కారులో డ్రాప్ చేస్తాను."
"వద్దండి. మీదో దారి, నాదో దారి. మళ్ళీ మీరనవసరంగా అంత దూరం దింపడానికి రావడం ఎందుకు, నేను ఆటోలో వెళ్ళిపోతాను" అంది అసహనంగా ఫీలవుతూ.
* * *
శారద ఏదిరా, నీతో రాలేదా" ఒంటరిగా ఇంటికొచ్చిన కొడుకుని చూసి అడిగింది సత్యవతి. "ఇంకా తన పని అవలేదా, కాసేపు వుండలేకపోయావా వచ్చేవరకు..." మళ్ళీ తనే అంది.
"ఆవిడగారికి లక్షపనులు, లక్షమంది స్నేహితులు. ముళ్ళకంచె మీద బట్టలా అడుగడుగునా ఎవరో పలకరించి మాట్లాడుతుంటారు. ఓ పట్టాన బయటపడదు. ఎంతకని వెయిట్ చెయ్యాలి? వస్తుందిలే ఆటోలో. నాకేం పనీపాటా లేదా ఆవిడగారొచ్చే వరకు కాసుకు కూర్చోడం తప్ప. కాఫీ ఇవ్వమ్మా తల బద్ధలవుతోంది.
"బాగానే వుంది. ఓ చోట పనిచేస్తున్నారు. ఇద్దరూ కల్సిరాకుండా తనని అలా ఒదిలేసి రావడం, తను మళ్లీ ఆటోలో రావద్దా... నీకు మరీ చికాకు ఎక్కువైంది ఈ మధ్య" అంటూ కాఫీ కలపడానికి లోపలకి వెళ్ళిందావిడ.
ఆటో దిగి లోపలకొచ్చిన శారద ప్రకాష్ వంక కోపంగా చూసింది. "ఏమిటది మంచీ మర్యాదా లేకుండా, వస్తూంటే చూసి కూడా అలా వెళ్ళిపోవడం. ఒక్క నిముషం ఆగలేరా?"
"నీకోసం ఎంతసేపు వెయిట్ చెయ్యాలి? ఏం తొందరగా రావాలని తెలీదా? ఎవరితో పడితే వాళ్ళతో, కనిపించిన అందరితో బాతాఖానీ కొడ్తూంటే నీకోసం చూస్తూ కూర్చోవాలా....." ప్రకాష్ కోపంగా ఎగిరాడు.
"ఎవరితో మాట్లాడాను! సీనియర్ లాయర్ విశ్వేశ్వరరావుగారు పలకరిస్తే మర్యాదగా జవాబివ్వద్దా....ఓ క్లయింట్ డౌట్ గురించి అడిగితే జవాబివ్వడం కూడా బాతాఖానీ అవుతుందా!" శారదా రెచ్చిపోయింది.
"ఏమైందర్రా బాబూ, మళ్ళీ ఏమిటి తగువు" లోపల్నించి సత్యవతి వస్తూ అంది.
"ఏం లేదత్తయ్యా....ఒక్క నిముషం ఆలస్యం అయినందుకు చూడండి ఎలా తగువు పడ్తున్నారో, అందరి ముందు అలా వదిలేసి వెళ్ళిపోయి ఇన్సల్ట్ చేయడంకాక, పైగా నామీద ఎగురుతున్నారు...." శారద అసహనంగా అంది.
ప్రకాష్ కి ఏమనాలో తెలియక గుర్రుగా చూస్తూ లోపాలకి వెళ్ళిపోయాడు.
"ఏమిటోనమ్మా వీడికోపం రోజురోజుకీ ఎక్కువైపోతోంది."
"ఏం లేదత్తయ్యా. కేసు జడ్జిమెంట్ నాకు అనుకూలంగా వచ్చింది. అదీ బాధ."
"బానేవుంది. ఇంట్లో గొడవలు చాలనట్టు. కోర్టులోనూ ఇద్దరూ దెబ్బలాట..."
"కోర్టులో గొడవలే కదా ఆయనగారికి తిక్కరేపేది! ఆ కోపం ఇంట్లో చూపిస్తూంటారు. కేసు నే గెలిస్తే చాలు ఆయన మొహం మాడిపోతుంది. పెద్ద అవమానం జరిగినట్టు ఫీలైపొతారు. స్పోర్టివ్ గా తీసుకోవడం ఆయనకి చేతకాదు. అది నా వృత్తి ధర్మం అనుకోరు....అన్నీ పర్సనల్ గా ఎందుకు తీసుకుంటారని ఎన్నిసార్లు చెప్పినా అర్ధం చేసుకోరు."
"పోనీ వాడు తీసుకున్న కేసు నీవెందుకమ్మా తీసుకోవడం? గొడవ వస్తుందని తెలుసుగదా!" అంది సత్యవతి.
"నేనేం చెయ్యనత్తయ్యా! ఆడవాళ్ళంతా విడాకులు, కట్నాల చావులు, అత్తింటి ఆరేళ్ళ కేసులు అందరూ నా దగ్గరకే వస్తారు. ఓసారి పేరొచ్చాక అంతేగదా! అందులో ఈ కేసు సునీతది. నా స్నేహితురాలు. నేనీకేసు తీసుకున్నానని తెలిసీ ఆయనెందుకు రవీంద్ర తరుపున కేసు తీసుకోవాలి? నన్నోడించాలని ఆయన కోరిక. ఏం జరిగినా అన్నింటికీ నన్నే బ్లేమ్ చేయడం అలవాటై పోయిందాయనకి. భార్యగదా ఏం అన్నా పడుతుందని ఆయన నమ్మకం" శారద ఉక్రోషంగా అంది.