Read more!
 Previous Page Next Page 
వ్యక్తిత్వం లేని మనిషి పేజి 3


    శ్రీదేవి తండ్రి సకలశాస్త్రాలూ చదవకపోయినా తనకు సర్వం తెలుసునన్న అమర్షభావం గల అహంభావి. పేరు అగ్నిహోత్రావధాన్లు కాకపోయినా అంతకుమించిన వేడితో ఎప్పుడూ మరుగుతూ వుండేవాడు. ఆ వేడికి యింట్లోని యిల్లాలూ, కూతుళ్ళూ శలభాల్లా కాలిపోతూ, ప్రాణాలు మాత్రం ఎలాగో కాపాడుకుంటూ వుండేవారు.
    ఓసారి ఆ మహానుభావుడికి కాశీయాత్ర చేయాలని సంకల్పం కలిగింది. అప్పటికి వయస్సుకూడా యాభయి దాటిపోతోంది. దేముడు చల్లగా చూడకపోతే బ్రతికినన్నాళ్ళింక బ్రతకబోడు. అయితే వారణాసి పోవాలంటే మాటలా! ఎంత కథా, కమామిషూ! కుటుంబమంతటినీ తరలించుకుని పోవటానికి ఆర్ధికస్తోమతు ఎలాగూలేదు. అందుకని ఆలోచించి ఒక పథకం వేసుకున్నాడు. ఆ పథకమేమిటయ్యా అంటే, యాత్ర అనేది సతీసమేతంగా చెయ్యాలి. కాబట్టి ఆవిడనుమాత్రం వెంటదీసుకుపోవటం, కూతుళ్ళని యిక్కడనే దిగవిడిచిపోవటం. ఇక్కడనే అంటే యింటిదగ్గర మాత్రం కాదు. దూర్వాస మహామునిలాంటి ఆయన వేలువిడిచిన మేమమామ, శతవృద్ధు ఒకాయన వున్నాడు. చెప్పుకోదగ్గ విశేషమేమిటంటే, ఆయనింట్లో వయసులో వున్న మొగజాతి ఏమీ కనిపించదు. అందుకని ఆయన్ని సమీపించి, ఈ విషయం ప్రస్తావించి, తాను తిరిగి వచ్చేటంతవరకూ కూతుళ్ళకయ్యే ఖర్చుకు గానూ కొంతధర నిర్ణయించి (ఆ యిద్దరూ అంత నిక్కచ్చి మనుష్యులు) వాళ్ళనా యింట్లో వదలి తాను భార్యను తీసుకుని ప్రయాణమయ్యాడు.  
    పరిస్థితులు చదరంగం లాంటివి. ఆ అనుమానస్థుడి మనస్తత్వానికి తగినట్లే మరునాటినుంచీ ఏలేశ్వరం అనే పల్లెటూర్లో విష వాతావరణం ఏర్పడి కూర్చుంది. ఆ విష వాతావరణానికి ప్రతినిధి దీక్షితులు అనే యవ్వనపు ప్రాంగణంలోకి అంతకుమునుపే అడుగుపెట్టి అనుభవం గడించిన యువకుడు. అనుభవం నేర్పిన పాఠాలతో తనపేరు దీక్షిత్ అని సరిదిద్దుకున్నాడు అందంగా. తను చాలా అందగాడ్ననీ, ఉత్తర దేశీయునిలా గోచరిస్తున్నాననీ ప్రబల నమ్మకం వుండేది అతనికి. తనకి మనుమడి వరుస అయిన ఆ కుర్రవాడి హఠాత్ ఆగమనం ఆ శతవృద్ధుడిలో కలవరం రేపినా, అయినవాడూ, కలిగినవాడూ కావటంవల్ల బయటకేమీ అనలేక ఓకంట కనిపెడుతూ (ఉన్నదే ఒక కన్ను) వూరుకున్నాడు.
    అయితే శతవృద్ధు మసకకంటికి చూపు ఏపాటి ఆనుతుంది? పరపురుషుడి గాలి అంతదగ్గర్లో ఎప్పుడూ సోకలేదేమో, వేటగాడ్ని చూసిన పావురంలా గువగువ వొణికింది శ్రీదేవి. ఆమెచెల్లెలు భానుమతి మాత్రం నిర్లక్ష్య స్వభావురాలు. మీదిమీదికి వద్దామని ఎంతో ప్రయత్నిస్తూ అతను వేసుకుంటూన్న పన్నాగమంతా తన తూస్కార కిరణాలతో పటాపంచలు చేసి వేసింది. పురుగుని విదిలించినట్లు విదిలించింది. తన కంటిని అతనివైపు సారించిన పాపానపోలేదు. ఆమె చెక్కుచెదరలేదు. అసలు దీక్షితులు రెండు వలలు యిరువైపులా విసిరాడు. ఒకదాంట్లో అయినా చేప పడకపోతుందానని అతని విశ్వాసం. అది అంధవిశ్వాసం కాదు. ఆత్మవిశ్వాసమే. ఆ వల ఒక వలయమై, విషవలయమై శ్రీదేవిని ఆక్రమించసాగింది. ఆమెకి అమాయకత్వం, కొత్త. మనసులో మధురమైన అన్వేషణ. నిండైన వయసులో సహజమైన అనురాగం ఇనుపతెరలను చీల్చుకుని, చించుకుని యివతలకు వచ్చినప్పుడు కలిగిన ఉద్వేగం మనోహరభరితమైన అనుభూతి. జీవితాన్ని అందుకోవాలన్న తృష్ణ. కంటికి కనిపించే ఆపురూపమైన అందం రేకెత్తించిన భావచాంచల్యం. సమ్మోహనరూపం విరజిమ్మే ప్రేమ. ప్రేమించాలన్న ఆకాంక్ష. ఆమె భయపడింది. ఆమె తనూలత కంపించింది. ఆమె ఆలోచించలేకపోయింది. ఆమె తప్పించుకోలేకపోయింది. అంతటి యితిహాస సుందరిని తాకటానికి వెనుకాడజేసే ఆ సౌందర్య రేఖాసంయుక్త సమూహం... ఆమె ఒక దుష్టక్షణాన లొంగిపోయింది. విషతరంగ ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఆమె మోసపోయింది. ఆహుతి అయింది.  
    ఇంకా తృష్ణ చల్లారకపోయినా క్రమంగా ప్రమాదం ముంచుకురావటం చూసి, యిహ సందర్భం కాదనుకుని, మంచి ముహూర్తం చూసుకుని అక్కడ్నుంచి ఉడాయించాడు దీక్షితులు. వార్త శ్రీదేవికి చేరేలోపునే బుద్ధిగా తండ్రి అంతకుముందే చూసివున్న సంబంధాన్ని చేసుకుని కాపురం వెలిగిస్తున్నాడు.
    పాతకథే. కాని ఆమెకి క్రొత్తకదా! రోజూ వందల వేలమంది తపతప చనిపోతున్నా, ఎప్పటికప్పుడు ఎవరిమట్టుకు వారికి చావు భయంకరమే కదా! అలాగే ప్రపంచానికి పాతకథ అయిన ఈ మోసగించబడటం, ఊబిలో దిగిన మనిషికి క్రొత్తగా అవతరించిన భయంకరమే. ఆమె నిశ్చేష్టురాలైంది. వంచితురాలనని గ్రహించింది. ఆహుతి అయినానని తెలుసుకుంది. గుండెలు పగిలేటట్లు రోదించసాగింది. తాను వొట్టి మనిషికూడా కాదు.
    ఏం చెయ్యాలో తెలీక చీకటిదారాన్ని పట్టుకుని నానాటికీ అధికమౌతూన్న తన బరువుతో హృదయవిదారకంగా వేళ్ళాడుతోంది.
    గోరుచుట్టుపై రోకటిపోటన్నట్లు యాత్రలోనే జబ్బుచేసి కాశీవిశ్వేశ్వరుని సన్నిధినే తల్లి తన దేహయాత్ర చాలించిందని వార్త తెలిసింది. నిజానికి పిడుగుపాటులాంటి వార్త. అక్కా చెల్లెళ్ళయిన ఆ అబలలిద్దరూ స్థాణువులై స్తంభించిపోయి, తల్లిని కడసారి చూడటానికైనా నోచుకోలేక తండ్రి రాకకు ఎదురుచూస్తూ ఏలేశ్వరంలోనే వుండిపోయారు.
    కర్మ తతంగమంతా అక్కడనే ముగించుకుని, పవిత్ర గంగానదిలో భార్య అస్థినిమజ్జనం చేసి, తండ్రి ఇంటికి తిరిగి వచ్చేసరికి కొన్నాళ్లు పట్టింది. రాగానే పరిస్థితులు నాగుబాముల్లా కనిపించాయి. కొయ్యబారిపోయి తర్వాత తెప్పరిల్లి, కాటికి కాలుజాచివున్న వేలువిడిచిన మేనమామమీద తోకత్రొక్కిన త్రాచులా వొంటికాలుమీద లేచి ఆయన్ని యించుమించు కాటికి పంపించినంత పనిచేశాడు. కూతుళ్ళని బరబర తమ యింటికి లాక్కుపోయాడు. శ్రీదేవిని కసితీరా చేతులు నొప్పి పుట్టేదాకా, శక్తి ఉడిగేదాకా కొట్టాడు. అడ్డం వచ్చిన చిన్నకూతుర్ని కూడా బాదాడు. శ్రీదేవిని గదిలోపెట్టి బంధించాడు. అన్నం, నీళ్ళూ పెట్టకుండా మాడ్చాడు. ఇవన్నీ చూస్తూ ఆమెని ఇంకా ఏంచెయ్యాలా అని ఆలోచించాడు. ఆలోచించి ఆమెపట్ల కుటుంబం అప్రతిష్ట పాలుకావటానికి వీల్లేదని నిర్ణయించి ఒకరోజు కిరాతకంగా ఇంట్లోంచి బయటకు వెళ్లగొట్టాడు.
    శ్రీదేవి హతబుద్ధి అయింది. సర్వత్రా అంధకారం. తోడులేదు. చివరకు ఆత్మహత్య చేసుకోవటానికి నిశ్చయించుకుని బయల్దేరింది.
    మహామహులు ఉద్భవించి, దేశంలో సాంఘిక విప్లవానికి కృషిచేసే రోజులవి. ఆ కృషి ఫలితంగా అక్కడక్కడా ఉత్సాహవంతులూ, త్యాగమూర్తులూ ఉదయించసాగారు.
    అలాంటి వుత్సాహవంతుడే భానుమూర్తి. ఆ కుటుంబంలో అతనొక్కడే మణిలాంటివాడవటం అతని తప్పుకాదు. రఘుపతి వెంకటరత్నం నాయుడి గారి బోధనలతో అతనిలోని యువకరక్తం సాంఘిక విప్లవకాంక్షతో అర్రులు జాచి ప్రవహిస్తోంది. శ్రీదేవిని రక్షించి తనయింటికి తీసుకువచ్చాడు. అబద్ధం లేకుండా ఆమె తన గాథ తెలియచేసింది. అతడామెను అసహ్యించుకోలేదు. తను వివాహమాడుతానన్నాడు. ఆమె తెల్లబోయింది. తనకోసం అతని జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ప్రాధేయపడింది. అతను మనస్సు మార్చుకోలేదు. ఆమె అంగీకరించక తప్పలేదు. 
    ఆమెను పెళ్ళిచేసుకున్నందువల్ల అతను యింట్లోనివారితో జగడమాడి యిల్లు విడనాడాల్సి వచ్చింది. తన ఆస్థికి తిలోదకాలిచ్చుకుని ఓ చిన్న ఉద్యోగం సంపాదించి వేరేయింట్లో కాపరం పెట్టాడు.
    దీక్షితులు బిడ్డ జగతి కొన్నాళ్ళకు జన్మించింది. భానుమూర్తి ఆచరణలో కూడా ఆదర్శవాదిగానే నిరూపించుకున్నాడు. ఆమెను పరాయిపిల్లగా భావించి ఏనాడు ప్రవర్తించలేదు.
    శ్రీదేవి మాత్రం ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగా, జీవితసుఖాలపట్ల విముఖంగా వుండేది. ఆమె నేత్రాలలో మునుపటి అన్వేషణ లేదు. సౌందర్యం నశించలేదు గాని, అందులోని కాంతిరేఖలు మాయమైపోయాయి.
    జగతి జన్మించాక ఏడాది నిండి ఒకటి రెండు నెలలయినా గడవకముందే మృత్యుంజయరావు ఉదయించాడు.
    అయినాకూడా భానుమూర్తి ప్రేమలో మార్పురాలేదు. అతను యిద్దరి పిల్లల్నీ సమానమైన ప్రేమానురాగాలతోనే చూసేవాడు. అయితే ఒక్కొక్కప్పుడు శ్రీదేవే తన కూతుర్ని అసహ్యించుకుంటూ వుండేది.
    అక్కాతమ్ముళ్లిద్దరికీ ప్రతి అంగంలోనూ బోలెడు వ్యత్యాసముండేది. జగతి తెల్లగా వుండేది. అతడు నల్లగా వుండేవాడు. ఆమె అందంగా వుండేది. మృత్యుంజయరావులో అందమన్నది ఏ కోశానాలేదు. పైగా అతని శరీరంలో ఏ అవయవమూకూడా ఉండవలసినంత నిర్దుష్టంగా లేదు. కళ్ళు చిన్నవి అవటమేగాక తేజస్సూ జీవకళా నశించి వుండేది. ముక్కుకు ఓ తీరులేదు. కాస్త వొంకరగాకూడా వున్నా వుండవచ్చు. ఆమెగొంతు తియ్యగా వుంటే, అతని గొంతు కరుగ్గా వుండేది. ఆమె ఆరోగ్యంగా, పొంకంగా వుంటే, అతను ఎండిపోయి వుండేవాడు. ఆమె పెంకి. అతనిది స్తబ్ధప్రకృతి. ఆమెకు భయమన్నది ఏ కోశానాలేదు. అతనికి అడుగడుక్కీ భయమే.
    ఒకరకంగా చూస్తే అతనికున్న యీ లక్షణాలన్నీ పెద్ద లోపాలేం కావు. కాని కాస్త జ్ఞానం వచ్చినప్పట్నుంచీ అతను తనలోని ప్రతి అంగాన్నీ భూతద్దంలోంచి పలకరించడం అలవాటు చేసుకున్నాడు. అందువల్ల ప్రతి అల్ప విషయమూ పెద్దదిగా, మరింత పెద్దదిగా అతన్ని వెక్కిరిస్తున్నట్లుగా గోచరిస్తూ వుండేది. అద్దంముందు గంటలకొద్దీ నిలబడి తనలోని అవలక్షణాలను అవలోకిస్తూ వుండేవాడు.  

 Previous Page Next Page