Previous Page Next Page 
జనవరి 5 పేజి 2

   

    అందానికి అందం అని కొందరు - సెక్సీ ఫిగర్ అని యింకొందరు, రొమాంటిక్ వల్కనో అని మరికొందరు అంటే -
   
    ప్రబంధ నాయకి, ప్రణయ దీపిక, నండూరి ఎంకి, బాపు బొమ్మ, భరద్వాజ కన్య అని మరెందరో అంటుంటారు.
   
    ఆ అనడం ఒక్కోసారి ఆమెకు కూడా వినిపించి అవునేమో కదా అని తనకు తాను చెప్పుకుంటుంది.
   
    ఆమె ఆఫీసులో అడుగు పెట్టేసరికి సమయం సరిగ్గా 10-10 అయ్యింది.
   
    టైమ్ పంచింగ్ మిషన్ కూడా ఆమె ఆలస్యాన్ని తమలోనే దిగ మింగుకొని ఆఫీసు టైమ్ నే పంచ్ చేస్తుంది.
   
    ఆమె టేబుల్ పైన వుండే ఇన్ అండ్ ఔట్ ట్రేలెప్పుడూ బోసిగా వుంటాయి.
   
    ఆమె అందరి కేసి చూసి స్నేహపూర్వకంగా విష్ చేసి, వెళ్ళి తన సీట్లో కూర్చొని షాహి ఇలాచి ఎక్స్ పోర్ట్ క్వాలిటీ పాకెట్ ను సొరుగులో నుంచి బయటకు తీసి అందులోనుంచి ఒక యాలుక తీసి సుతారంగా పళ్ళ మధ్య వుంచి కొరికింది. అప్పుడు అందులో నుంచి వచ్చిన ప్లేవర్ ని ఆస్వాదిస్తూ కొద్ది క్షణాలు కళ్ళు మూసుకుంది.
   
    ఆ సమయం కోసమే ఎదురు చూసే కొన్ని జతల కళ్ళు ఆమెకేసి తిరిగి విశాలమయ్యాయి.
   
    "మేడమ్! యు ఎమ్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు" అటెండర్ మాటలు వినిపించి కళ్ళు తెరిచింది.
   
    కమ్మని కలని భగ్నం చేసినందుకు అటెండర్ కేసి అసహనంగా చూస్తూ లేచింది.
   
    ఆ ఆఫీసులో కొన్ని వందల మంది పనిచేస్తున్నా ఆమె మూమెంట్స్ మాత్రమే ప్రతి ఒక్కరి మస్తిష్కాల్లో రికార్డ్ అయిపోతూంటాయి.
   
    ఆమె ఆ ఆఫీసులో చేరి నెలరోజులే అయ్యింది. అయినా ఎవరికీ వారి ఆమెతో జన్మజన్మల బంధం వున్నట్లు, మరేదో అనుబంధం వున్నట్లు కలలుకంటూ వుంటారు.
   
    ఆమె నెమ్మదిగా స్ప్రింగ్ డోర్ ని నెట్టి "మే ఐ కమిన్ సర్...." అంటూ యూనిట్ మేనేజర్ గదిలోకి ఎంటర్ అయ్యింది.
   
    మేఖలను చూస్తూనే యూనిట్ మేనేజర్ మొహం ఆనందంతో వెలిగిపోయింది.
   
    "రండి.....రండి...." అన్నాడు సీట్లో నుంచి లేస్తూ.
   
    ఆమె చేసే ఉద్యోగ స్థాయికి యూనిట్ మేనేజర్ సీట్లో నుంచి లేచి మరీ ఆహ్వానించ నక్కర్లేదని అతనికి తెలుసు. అయినా ఏదో ఉద్వేగం అతన్నలా లేపి నించోపెట్టింది.
   
    "చెప్పండి సార్.....ఎనీ మేటర్" ఆమె గౌరవంగా అడుగుతూ ఆయనకు ఎదురుగా వున్న సీట్లో కూర్చుంది.
   
    "మీరు ఆఫీస్ లో చేరిన దగ్గర నుంచి సిబ్బంది సెలవులు పెట్టడం తగ్గిపోయింది" నవ్వుతూ అన్నాడు.
   
    ఆమె భుజాల్ని తమాషాగా కదిలిస్తూ చిరుదరహాసాన్ని మాత్రమే సమాధానంగా అందించింది.
   
    "లీవ్స్ వృధా అయిపోతున్నా స్టాఫ్ లెక్క చెయ్యడం లేదు. నన్ను అడిగితే సెంట్రల్ సెక్రటేరియట్ లో, అన్ని రాష్ట్రాల సచివాలయాల్లో మీ లాంటి యువతులుంటే రెడ్ టేపిజం ఎగిరిపోతుంది."
   
    ఆమె మౌనంగానే వుండిపోయింది.
   
    "నేను పెళ్ళి చేసుకుని తొందర పడ్డానేమోననిపిస్తోంది. నా వయసు 35"
   
    అయినా ఆమె మౌనంగానే వుంది.
   
    "నెక్స్ట్ మంత్ లో సెక్షన్ ఆఫీసర్ గా మీకు ప్రమోషన్ ఇవ్వాలనుకుంటున్నాను మీరు ఎం. ఎస్సీ కదా? అందునా డిస్టింక్షన్ లో పాసయ్యారు. అసలు పవర్స్ పూర్తిగా నా చేతిలో వుంటే ప్రమోషన్ యిచ్చే వాడిని."
   
    "......"
   
    "రేపటి నుంచి కంపెనీ వెహికల్ ప్రొవైడ్ చేద్దామనుకుంటున్నాను. మీకు యిబ్బంది లేదనుకుంటే నేనే మిమ్మల్ని ఆఫీస్ కెళ్ళేటప్పుడు పికప్ చేసుకుంటాను."
   
    అప్పటికి మేఖల ఆ గదిలోకి వచ్చి అరగంట అయ్యింది.
   
    ఆమెకు విసుగ్గా వుంది.
   
    అలాగే మరో పావుగంట మాట్లాడాడు యూనిట్ మేనేజర్.
   
    ఆమె లేచి నుంచుంది.
   
    "చూడండి.....ఇంత డొంక తిరుగుడు ఎందుకు? ఐ లైక్ యూ అని ఒక్క మాట అని వుంటే నేను ఇంప్రెస్ అయ్యేదాన్ని  మీతో సెక్స్ అనుభవం కావాలని సూటిగా అడిగి వుంటే మీ ధైర్యాన్ని మెచ్చుకునే దాన్ని. నేను అందంగా వుంటాను- సెక్సీగా వుంటాను- మిమ్మల్ని పిచ్చెక్కిస్తూ వుంటాను. అవునా? ఆ ఫీలింగ్స్ ని నాతో సూటిగా అనివుంటే సంతోషంగా స్వీకరించి వుండేదాన్ని. ఎందుకీ ఆత్మవంచన? ఎందుకింత ప్రయాస? సూటిగా చెప్పలేక ఎందుకింత యాతన పడిపోతారు? ఇలాగే చాలామంది మగవాళ్ళు తాము యిష్టపడిన యువతుల్ని చేజార్చుకున్నారు"
   
    ఆమె వాగ్ధాటికి అతను బిత్తరపోయాడు.
   
    ఆపైన సిగ్గుపడ్డాడు.
   
    "నచ్చినా, నచ్చకపోయినా ఓ అమ్మాయితో అనుభవాన్ని కోరుకోవడమనేది మగాడికి కాంక్ష. నచ్చిన అమ్మాయిని కోరుకోవడం మరీ యిష్టంగా వుంటుంది. అది ప్రకృతి సహజం. బయోలాజికల్ నీడ్ ఇద్దరికీ వుంటుంది. అది నేరమేమీ కాదు. మరి ఎందుకింత డొంక తిరుగుడు? నేను అందంగా వుంటాను. నాకు తెలుసు.మీరు చాలా అందంగా వున్నారు. మీతో శారీరక అనుభవానికి నేను ఉవ్విళ్ళూరుతున్నాను అని సూటిగా చెప్పలేకపోయారెందుకు? పరాయి స్త్రీతో శారీరక సంబంధం తప్పే అనుకుంటే ఆ తప్పు చేయకూడదు. తప్పు అని తెలిసి కూడా ఆ తప్పునే చెయ్యాలని అనుకుంటే గిల్టీగా ఫీలవకూడదు. ధైర్యం చెయ్యాలి. మీరు సూటిగా అడిగి వుంటే మీరు కోరుకున్న నా శరీరాన్ని నిరభ్యంతరంగా ఓ పది నిమిషాలు మీ సొంతం చేసేదాన్ని. నాకు మీ మగజాతి మీద జాలి, తప్పు అయినా, ఒప్పు అయినా ఏదీ ధైర్యంగా చెయ్యలేరు. అందాన్ని చూసి ఆనందించలేరు. కేవలం ఆకర్షితులౌతారు. ప్రేమించడం చేతకాక కామిస్తారు. ఆరాధించడం చేతకాక అధికారం ప్రదర్శిస్తారు. ఐ పిటీ యూ......మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది. మరోసారి ఇలాగే చేసి మరో అందమయిన అమ్మాయిని పోగొట్టుకోకండి. బై....."
   
    ఆమె ఆ మాటల్ని అన్నప్పుడు కోపాన్ని ప్రదర్శించలేదు. ఆగ్రహావేశాల్ని వ్యక్తం చెయ్యలేదు.
   
    కేవలం ఎమోషనల్ గానే ఆ మాటలన్నీ అంది.
   
    విసురుగా కాకుండా మామూలుగానే ఆ గదిలో నుంచి వెళ్ళిపోయింది.

    తన డొంకతిరుగుడు తనానికి తను అంత నష్టపోవల్సి వస్తుందని అతనూహించలేదు. అందుకే పూర్తిగా అప్ సెట్ అయ్యాడు.
   
    ఆమె వెళ్ళిన అయిదు నిమిషాలకు ఆమె పంపిన రిజిగ్నేషన్ లెటర్ వచ్చింది.
   
    అది చదివి అతను హడావుడిగా హాల్లోకి వెళ్ళేసరికి ఆమె సీటు ఖాళీగా కనిపించింది.
   
    ఆ హాల్లోని స్టాఫ్ అంతా అతనికేసి అసంతృప్తిగా, కోపంగా చూశారు.
   
                 *    *    *    *    *
   
    పదకొండు గంటలకే ఇంటికి వచ్చిన కూతుర్ని అనుమానంగా చూసింది లక్ష్మి.
   
    తనతో ఏం మాట్లాడకుండా, కనీసం మాటమాత్రమైనా చెప్పకుండా మేఖల తన గదిలోకి వెళ్ళిపోవడం మరింత అనుమానాన్ని కలిగించింది. ప్రధాన ద్వారం నుంచి విసురుగా కూతురి గది వద్దకు వెళ్ళి చూసింది. అప్పటికే డైరీ ముందేసుకుని ఏదో రాస్తూ కన్పించింది. "ఏమిటి.....ఏమైంది అప్పుడే ఇంటికి వచ్చేశావేం!"
   
    ఆదిలక్ష్మి సీరియస్ గా ప్రశ్నించింది.
   
    మేఖల విన్నది కాని తలెత్తలేదు.
   
    "నిన్నే అడిగేది. వినపడలేదా? సమాధానం యివ్వడం ఇష్టంలేదా?" అంది.
   
    మేఖల షార్ప్ గా....తల పైకెత్తి తల్లి కేసి చూసింది!
   
    "నువ్వు అందయిన కూతుర్ని కన్నావ్. ఉద్యోగం చేయటానికి ఆ కూతురు బయటికి వెళ్ళింది. డ్యూటీ అవర్స్ లోనే అర్దాంతరంగా ఇంటి కొచ్చింది. అప్పుడు బుద్దున్న ఏ తల్లయినా ఏమయింది అని అడక్కూడదు. ఇప్పటికయినా అర్ధమైందా?" సీరియస్ అంది మేఖల.
   
    ఒక్కోసారి కూతురి కళ్ళలోకి చూస్తూ మాట్లాడటం ఆదిలక్ష్మికి జంకుగా వుంటుంది.
   
    "అర్ధం కాలేదు. పోనీ అర్ధమయ్యేలా చెప్పకూడదూ?"

 Previous Page Next Page