Previous Page Next Page 
రౌడీరాజ్యం పేజి 2


    వృత్తాకారపు కత్తిలా ఆ స్టీలు కారియర్ రాజు మొహాన్ని కోసేసింది. వెచ్చటి నెత్తురు దుర్గారావు మొహం మీద చిందింది.

    మళ్ళీ కదిలింది దుర్గేష్ చెయ్యి.

    మళ్ళీ....మళ్ళీ....మళ్ళీ....

    కొడుతున్నకొద్దీ క్రోధం పెరుగుతోంది దుర్గేష్ కి. వివేకం వెనక్కిపోయింది.

    ఆరో దెబ్బకి కారియర్ మూత ఊడిపోయింది.

    మూతలేని గిన్నె అంచు మరింత పదునుగా ఉంది.

    గిన్నె రాజు మొహం తాకినప్పుడల్లా చర్మం లోతుగా తెగుతోంది.

    రాజు పిరికి పందకాడు!

    బలహీనుడు అసలే కాడు!

    కానీ అతను ఏమాత్రం సిద్ధంగా లేనప్పుడు తగిలింది మొదటి దెబ్బ!

    ఎన్నో రోజులు ఎదురుచూసి చూసి, చివరకు ప్రియురాలిని కలిసే అవకాశం వచ్చినప్పుడూ, ఆ ఎగ్జయిట్ మెంటులో ఉండగా తగిలింది తొలిదెబ్బ! ఆ షాక్ లోనుంచి తేరుకోకుండానే రెండో దెబ్బ! ఆ తర్వాత విరామం లేకుండా దెబ్బమీద దెబ్బ!

    అప్రయత్నంగానే వెనక్కి ఒక అడుగు వేశాడు రాజు. అతను తప్పించుకుపోతాడేమో అన్న ఆదుర్దాతో మరింత వేగంగా కదలడం మొదలెట్టింది దుర్గేష్ చెయ్యి. గోడ గడియారం పెండ్యులంలాగా అటూ ఇటూ వూగుతోంది అతని చేతిలోని మిల్కు కారియర్. వెర్రి ఆవేశంతో వణికిపోతున్నాడతను.

    "లం....కొ....నీ...."

    "చూడండి! నేను...." ఆనబోయాడు రాజు.

    "నీ....ఇంజనీరింగ్ చదివొచ్చింది ఆడోళ్ళని చెడగొట్టడానికిట్రా?" అన్నాడు దుర్గేష్.

    "మీరు తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు. నేను రాధని ప్రేమిస్తున్నాను. మేం ఇవాళే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం"

    సర్రున మండింది దుర్గేష్ కి.

    "ప్రేమించావురా....పెళ్ళిచేసుకున్నావురా....మళ్ళీ పడింది దెబ్బ. నీ...." వెనక్కి వెనక్కి పోతున్నాడు రాజు.

    అతని మీది మీదికెళుతున్నాడు దుర్గేష్. ఆవేశంలో లుంగీ ఊడిపోవడం కూడా తెలియడంలేదు అతనికి. ఎదుటివాడు చావడమే తన లక్ష్యమన్నట్టు ఆపకుండా కొడుతున్నాడు.

    దెబ్బ దెబ్బకీ రాజు గొంతులో నుంచి ఒక ఆర్తనాదం.

    అతని అర్తనాదానికి జవాబులా దుర్గేష్ దూర్తపు తిట్లు.

    అక్కడే ఒక ఎండు చెట్టు వేరు మొండి చెయ్యిలా భూమిలోనుంచి బయటికి పొడుచుకు వచ్చింది. అది రాజు కాలికి తగిలింది. బాలన్స్ తప్పింది రాజుకి. వెనక్కి విరుచుకు పడిపోయాడు.

    వెంటనే అతని ఛాతీమీద కాలు వేసి భూమికి గుచ్చేసినట్లు కదలకుండా తొక్కిపెట్టాడు దుర్గేష్.

    దృశ్యం బాగా కనబడడానికిగానూ చేతిలోని బ్యాటరీలైటు ఆన్ చేసి ఫోకస్ చేశాడు దుర్గేష్ అనుచరుడు ఫిలిప్స్.

    గాట్లతో, గాయాలతో రక్తసిక్తమై ఉంది రాజు మొహం. అతికష్టం మీద గొంతు పెకలించుకుని అన్నాడతను.

    "దేవుడి సాక్షిగా చెపుతున్నాను. నన్ను నమ్మండి ప్లీజ్....రాధంటే నాకు ప్రాణం....మేమిద్దరం మనస్పూర్తిగా ప్రేమించుకుని.... పెళ్ళి...."

    కాలితో అతనిని మరింత గట్టిగా తొక్కిపట్టుకున్నాడు దుర్గేష్.

    "రేయ్ ఫిలిఫ్స్! అది అందుకో!" అన్నాడు కర్కశంగా.

    ఫిలిఫ్స్ బ్యాటరీ లైటు పక్కనపెట్టి అక్కడే వున్న ఒక గ్రానైటు రాయిని ఎత్తాడు. ఒక అడుగు ఎత్తు, అడుగు పొడుగూ, అడుగు వెడల్పూ ఉంది ఆ గ్రానైట్. దాన్ని దుర్గేష్ కి అందించాడు ఫిలిప్స్.

    "సార్! నేను రాధని నా ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమించాను... సార్....తప్పుచేసి ఉంటే మిమ్మల్ని మన్నించి మా ఇద్దరినీ...."

    దుర్గేష్ రాతిని బాగా ఎత్తి, ఒక్క క్షణం ఆగి దాన్ని రాజు మొహంమీద పడేలా వదిలాడు.

    "సార్! సార్! నేనూ రాధా...."

    మాట పూర్తికాకుండానే చితికిపోయింది రాజు మొహం. అతని చావుకేక ఆ రాతికిందే అణిగిపోయింది. అతని ప్రాణం పోయింది.

    తక్షణమే ప్రాణం పోయినా, అతని కాళ్ళూ చేతులూ మాత్రం నిర్జీవమైన చలనంతో తపతప కొట్టుకున్నాయి_ తెగిన బల్లితోక విలవిల్లాడినట్లు.

    అలా కాసేపు....

    తర్వాత కాళ్ళూచేతులూ కొట్టుకోవడం క్రమక్రమంగా నెమ్మదించింది.

    ఆ తర్వాత నిశ్చలంగా అయిపోయింది రాజు శరీరం.

    కసితీరనట్టు ఆ శవాన్ని కాలితో ఇంకోసారి తన్నాడు దుర్గేష్.

    రొప్పుతూ రాధ వేపు తిరిగాడు.

    షాక్ తో, భయంతో స్పృహతప్పి పడి వుంది రాధ.

    కాలితో ఆమెని అదిలించాడు దుర్గారావు.

    ఒకసారి మూలిగింది రాధ. తర్వాత హఠాత్తుగా స్పృహ వచ్చినట్లు ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. చటుక్కున లేచి కూర్చుంది.

    "దొంగ ముండా....!" అన్నాడు దుర్గేష్ ఆగ్రహంతో వూగిపోతూ.

    భయభ్రాంతురాలై తండ్రివేపు చూసింది రాధ.

    తండ్రి కోపం ఎలాంటిదో రాధకి తెలుసు.

    ఆయన మంచిగా ఉంటే మురిపెంగా చూస్తాడు.

    కోపమొస్తే మాత్రం మనిషి కాడు.

    తను తప్పుచేసినప్పుడెప్పుడూ కూడా శిక్షించకుండా వదలలేదు తండ్రి.

    చిన్నప్పుడు అందరు పిల్లల్లాగే తనూ అల్లరి చేసేది. అల్లరి చేసినప్పుడల్లా అందుకు తగిన శిక్ష అనుభవించింది చివాట్లు.... చెంప దెబ్బలు. చీకటి గదిలో పెట్టి తాళం వెయ్యడం.... అందరూ ఏ సినిమాకో వెళ్తున్నప్పుడు శిక్షగా తనని తీసుకెళ్ళకుండా యింట్లోనే వదిలి వెళ్ళిపోవడం....రకరకాలు....

    ఈసారి చాలా పెద్ద తప్పే చేసింది తను.

    తప్పు కాదు. అపరాధమే!

    నాన్న దృష్టిలో!

    ఆయనకి ఆగర్భ శత్రువులాంటి మరిడేశ్వరరావు కొడుకుని తను యిష్టపడింది. గుట్టుచప్పుడు కాకుండా పెళ్ళి చేసుకుంది.

    అంటే....ఒక గ్యాంగు లీడరుగారి అమ్మాయి ఇంకో గ్యాంగు లీడరుగారి అబ్బాయిని ప్రేమించే పెళ్ళాడింది.

    ఎక్స్ ప్లోజివ్ సిచ్యుయేషన్!

    అవొచ్చు....

    కానీ పెళ్ళయిపోయాక ఇంకెవరేం చేస్తారు?

    అందులోనూ పేగు తెంపుకు పుట్టిన వాళ్ళని!

    నాలుగు తిట్టి, నాలుగు తన్ని తర్వాత రాజీపడిపోవచ్చు.

    అదే జరుగుతుంది.

    అదే జరుగబోతోంది.

    హఠాత్తుగా దుర్గేష్ ఎడం కాలు గాల్లోకి లేచింది. మరుక్షణం అది బలంగా రాధ మొహాన్ని తాకింది.

    ఊహించని ఆ దెబ్బకి గింగిరాలు తిరిగి వెల్లకిలా వెనక్కి పడింది రాధ.

    ఆమె నోట్లో మూడు పళ్ళు కదిలాయి. నోటినిండా ఉప్పటి రక్తం చేరింది.

    కోపమొస్తే తండ్రి వళ్ళుమరిచి కొడతాడని తెలుసు రాధకి. కానీ ఇంత పెద్ద దెబ్బకు సిద్ధంగా లేదు తను.

    ఉవ్వెత్తున దుఃఖం ముంచుకొచ్చింది రాధకి. కళ్ళెంబడి నీళ్ళూ, నోటెంబడి రక్తం ధారగా కారడం మొదలెట్టాయి.

    ఇదివరకు ఎంత కోపం వచ్చినా నాన్న తనని ఇంత దెబ్బ కొట్టలేదు. తాటాకు మంటలా తగ్గిపోయేది ఆయన కోపం. తిట్టినా, కొట్టినా కూడా ఆ తర్వాత బాధపడి అంత రెట్టింపు ముద్దు చేసేవాడు తనను.

    నాన్నకి తనంటే తగని ఇష్టం. రోజూ తనను ఎత్తుకుని తిప్పి, పిప్పరమెంట్లు కొనిచ్చేవాడు. ప్రతిరోజూ సైకిల్ మీద స్కూలుకి తీసుకెళ్లేవాడు. అప్పట్లో యిన్ని కార్లూ, ఇంత డబ్బూ వుండేవి కాదు తమకి. ఐనా ప్రతి పండక్కీ కొత్త బట్టలు కొనిచ్చేవాడు.

    అలాంటి నాన్న ఎంత దెబ్బ కొట్టాడూ....

    వెక్కిళ్ళతో వీపు ఎగిరెగిరి పడటం మొదలెట్టింది రాధకి.

    పోనీ.... దేవుడి దయవల్ల ఇంతటితోనయినా నాన్నకి కోపం తగ్గితే!

    మళ్ళీ కాలెత్తాడు దుర్గేష్.

    అది చూడగానే "అమ్మా" అని ఆర్తనాదం చేస్తూ మాతృగర్భస్త శిశువులా ముడుచుకుపోయింది రాధ. దెబ్బని తప్పించుకుంది.

    విసురుగా వంగి ఆమె జుట్టు పట్టుకు లేవదీశాడు దుర్గేష్. మెడ విరిగిపోయేలా ఆమె తలను వెనక్కి వంచి, మొకాల్తో రాధ వెన్నెముక మీద కొట్టాడు. నాజూకైన ఆమె వీపు కింద వున్న పొగడదండలాంటి వెన్నెముక మధ్యకి తెగింది.

    మళ్ళీ తగిలింది దెబ్బ.

    అప్పుడు హఠాత్తుగా అర్ధం అయ్యింది రాధకి!

    తన తండ్రి తనను చంపబోతున్నాడు.

    తన తండ్రే....

    తనకి చావు మూడింది. తన తండ్రి చేతుల్లోనే....

    అకస్మాత్తుగా ప్రాణ భయం పట్టుకుంది రాధకి.

    రాధ అపనమ్మకంగా చూస్తోంది తన తండ్రి వేపు.

    ఆగ్రహంతో వికృతంగా మారిపోయి ఉంది దుర్గేష్ మొహం. బాగా తాగి వుండటంవల్ల, కోపం మీద వుండటంవల్ల తన మీద తనకే కంట్రోల్ లేకుండా వూగిపోతున్నాడు అతను.

    హఠాత్తుగా కాలు లేపాడు దుర్గేష్. తన కాలు ఎక్కడ తగుల్తుందో తెలియకుండా ఆ ఆడకూతురి ఆయువుపట్టు మీద తగులుతుందేమోనన్న ఆలోచనన్నా లేకుండా తన్నాడు.

 Previous Page Next Page