వాంగ్ యీచూ ముఖం వికసించింది.
"అలా ఛయిర్ లో కూర్చోండి. మీకు కావలసినవి తెప్పించుకుని తినండి. గది ఖాళీ చేయించమని చెప్పి వస్తాను. అన్నట్లు మీ పేరు?"
"పనికర్," పేరు చెప్పి సూట్ కేస్ అందుకుని ఛయిర్ దగ్గరకు నడిచాను.
వాంగ్ యీచూ కౌంటర్ వద్ద వేరే మనిషిని వుంచి, మేడపైకి వెళ్ళాడు.
"హోటల్లో స్థానం సంపాదించాను. ఫరవాలేదు" అనుకున్నాను. బేరర్ ని పిలిచి స్వీటు హాటు తెమ్మని పురమాయించాను.
టిఫెన్ తినటం పూర్తయింది. వేడి టీ చప్పరిస్తున్నాను. వాంగ్ యీచూ వచ్చాడు. "గది ఖాళీ అయ్యింది. రండి పైకి వెళదాం," అన్నాడు.
చూ ముందు, వెనుక నేను మెట్లెక్కి, నాకోసం ఏర్పాటు చేసిన రూములో ప్రవేశించాము.
రూమ్ చిన్నదయినా బాగుంది. ఆ రూమ్ అంతకు క్రితం సామానుతో నిండిలేదని రూమ్ చూస్తూనే గ్రహించాను. చిన్న మంచము, ఓ ఛయిర్, స్టూలుమీద మంచినీళ్ళ కూజా, డ్రస్సింగ్ టేబుల్, వంకెన వేలాడుతున్న టర్కీ టవల్, రూమ్ కి అందమైన కర్ టెన్ వేలాడుతున్న చిన్న కిటికీ, అన్ని విధాలా నాకు అనువుగా వుందా రూమ్.
"నా కోసం శ్రమపడి నీట్ గా రూమ్ ఇచ్చారు. థాంక్స్" అన్నాను కోటు విప్పుకుంటూ.
"దానికేముంది. మీరు డబ్బు పెట్టారు. ఈ మాత్రమయినా శ్రమపడి రూమ్ సర్ది ఇవ్వకపోతే మా మాట పోదా?"
స్త్రీ కంఠం విని గుమ్మంవైపు చూచాను.
"నా వైఫ్ చుంగ్ చాంగ్. శ్రమంతా ఆమెది ఆమెది," అన్నాడు చూ.
చూ భార్య చుంగ్ చాంగ్ ముప్పై ఏళ్లు వుంటాయి. ఆమెని అందకత్తెలతో పోల్చవచ్చు. చూ మాత్రం చూడటానికి వృద్దాప్యం మీద పడిన వాడిలా కాస్త వంగి, కళ్ళ కింద ముడతలు పడి వికారంగా వుంటాడు. చాంగ్ ధృడంగా అందంగా ఆకర్షణీయంగా వుంది. చాంగ్, చూకి తగ్గ భార్య కాదనిపించింది.
"ఈ రాత్రికి నాకేం అవసరం లేదు. దండిగా టిఫెన్ తిన్నాను. అలసిపోయానేమో నిద్ర ముంచుకు వస్తుంది. పడుకుంటాను. తెల్లవారిందాకా లేపకండి. నేనే లేచి గదిలోంచి బైటకు వస్తాను. అన్నట్లు...మీకు మళ్ళీ శ్రమ కలిగిస్తున్నాను. నా సైజు కొలతలు చెపుతాను. రేపు ఉదయం పది లోపల నే చెప్పినటువంటి డ్రస్ లు ఖరీదైనవి రెడీమేడ్ షాపులో తెప్పించి ఇవ్వండి. డబ్బు గురించి ఆలోచించవద్దు ఎంతయినా సరే ఇస్తాను. అన్నట్లు ఇంకో విషయం. సాధారణంగా నా గదివిడిచి బైటికి రాను. ఎప్పుడయినా ఓసారి నా ఇష్టం వచ్చినప్పుడు అలా బైటికి వెళ్ళొస్తాను. మీల్స్ కి, టిఫెన్ కి మాత్రం కిందకొచ్చి వెళుతుంటాను. ఓకే. నాకు కావలసింది రూమ్. మీకు కావలసింది మనీ. ఆపై చెప్పవలసింది ఏమీ లేదు. గుడ్ నైట్." అన్నాను. నోటివద్ద చిటిక వేసుకుంటు ఆవులించి.
చూ, చూ భార్య చాంగ్ ముఖముఖాలు చూసుకున్నారు.
"గుడ్ నైట్," గొణుగుతూ అని చూ, చాంగ్ బైటకు వెళ్ళిపోయారు.
తలుపులువేసి గడియలు బిగించాను. నేతెచ్చిన సూట్ కేసు తలగడపక్కనే ఉంచాను. లాగుజేబులో ఉన్న పిష్టల్ బైటకు తీశాను. తలగడకింద దాచాను. మంచమెక్కి తలగడ మీద ఓ చెయ్యి ముడిచి చేతిమీద పడుకున్నాను.
చాంగ్, చూలు డబ్బు మనుషులు, ఇహపై నాచేతిలో మనుషులు. అయినా నా జాగ్రత్తలో నేను ఉండాలి. మేకప్ బాక్స్ నా సూట్ కేసులో వుంది. దుస్తులు చూ చేత తెప్పించుకుంటాను. ఇంకేం కావాలి? చాంగ్ ఆవులిస్తే పేవులు లెక్క పెట్టేటట్లుంది. జాగ్రత్తగా ఉండాలి. నేవున్న పరిస్థితి అలాంటిది.
ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాను.
2
ఉదయం చాంగ్ యీచూకి పదిహేను వందలిచ్చాను. రకరకాల డ్రస్ లు కాక అవసరమయినవి కొన్ని లిష్ట్ రాసిచ్చి తెప్పించమన్నాను. ముఖ్యంగా నా రూమ్ కి వేసుకోటానికి గోద్రేజ్ తాళం కప్ప కూడా ఆ లిస్టులో ఉంది.
మార్నింగ్ టిఫిన్ కి కిందకు వెళ్ళలేదు. మంచంమీద నుంచి లేవకుండానే, "టీ" ఒకటి పంపమని చెప్పాను చూకి.
చుంగ్ చాంగ్ కంగారుగా నాగదికి వచ్చింది.
"టిఫిన్ అక్కరలేదా? పోనీ ఇక్కడకు పంపమంటారా? ఆరోగ్యం సరీగాలేదా?" అని అడిగింది.
"ఈ పనికర్ ఉక్కుమనిషి. నా ఆరోగ్యానికొచ్చిన చింత ఏమీలేదు. దయచేసి నేపిలవందే తలుపులు తోసుకుని అలా నా రూమ్ లోకి రాకండి" నిర్లక్ష్యంగా అన్నాను.
చాంగ్ ముఖం ముడుచుకుని అవతలికి వెళ్ళిపోయింది. నాలో నేను నవ్వుకున్నాను.
ఓ గంట తరువాత చూ నాకు కావలసినవి తీసుకుని గది తలుపులు తోసి లోపలికి వచ్చాడు.
"మీరు లోపలికి వచ్చేముందు "రావచ్చా?" అని ముందుగా నన్నడిగి రండి మిష్టర్ వాంగ్ యీచూ!" అంటూ వార్నింగు ఇచ్చాను.
నేనున్న పరిస్థితిలో నాగురించి తెలుసుకోవాలని భార్యాభర్తలు ఇరువురు ప్రయత్నిస్తారు, నా గురించి ఒక్క ముక్క తెలుసుకున్నా అదెంత ప్రమాదకరం? నా ప్రాణానికే ముప్పు!
"ఇహపై అడిగి లోపలకి వస్తాను" అన్నాడు చూ. తెచ్చినవన్నీ నాముందు పెట్టి.
అన్నీ పరిశీలించి తృప్తిగా తల ఆడించాను.
"పాతిక రూపాయలు మిగిలాయి" డబ్బు నా ముందు వుంచుతూ అన్నాడు చూ.
"మిగిలినవి తీసుకోవటం నాకు అలవాటు లేదు. ఇంకా డబ్బుపడితే ఇచ్చేవాడిని, సరే ఇహ మీరు వెళ్ళవచ్చు. మీల్స్ కి కిందకొస్తాను."
పాతిక రూపాయలు జేబులో కుక్కుకుని సంతోషంగా బయటకు వెళ్ళిపోయాడు చూ.
తలుపులు వేసి గడియ బిగించాను.
3
హోటల్ కివచ్చి నాలుగు రోజులయిపోయింది.
టిఫిన్ కి,మీల్స్ కి కిందకొచ్చి వెళుతున్నాను. మిగిలిన సమయమంతా గది విడిచి బయటకు రావడం లేదు. ఆరోజు వార్నింగ్ ఇచ్చిన దగ్గరనుంచి అనవసర విషయాలు నన్నడగటం లేదు. అనుమతి లేనిది నా గదిలోకి దూరటంలేదు. ఏ రోజు రూమ్ రెంట్ ఆరోజు ఇచ్చేస్తున్నాను. చూకి ఓ పక్క డబ్బు ముడుతున్నందుకు సంతోషం మరో పక్క నన్ను చూస్తుంటే అయోమయంగాను ఉంది.