"ఛా.....ఛా.....నేనేమాలోచిస్తున్నాను. వారన్నట్లు లోకులుకాకులు. వారిననరు. నన్నంటారు. నన్నన్నా ఫరవాలేదు. పుట్టింట్లో వుండటమే జరిగితే నన్ను కాదు అనేది అమ్మను__దేవత లాంటి అమ్మ నాగురించి మాట పడటమా?
ఆ తల్లికూతురు కాదూ? ఎక్కడికి పోతాయి బుద్దులు, అని అమ్మనే అంటారు. కష్టమో, సుఖమో, నా పాట్లు నేపడతాను. నీకు మాటరానీయనమ్మా!
కణతల నొక్కుకుంటూ బాధగా అనుకుంది శకుంతల.
ప్రజ్వరిల్లే అగ్నిపర్వతాన్ని మనసులో సమాధిచేసి హిమంకప్పబడిన మేరుపర్వతంలా, జీవితాన్ని లాక్కొచ్చి కాలప్రవాహాన్ని అవలీలగా యీదిన స్త్రీ తనతల్లి.
తల్లి గుర్తుకు వచ్చింది శకుంతలకు.
2
భోజనంకాంగానే మధ్యాహ్నం పూట ఓ కునుకుతీయటం పార్వతికి అలవాటు. మామూలు ప్రకారం నిద్రపోతున్న పార్వతి ఉలిక్కిపడిలేచింది. అకస్మాత్తుగా మెలుకువరావటానికి కారణమేమిటా అని కళ్ళు మూసుకుని ఆలోచిస్తుంటే, పక్కగదిలోంచి సవతితల్లి వర్ధనమ్మ కాశీయాత్ర చేసి వస్తూ వర్ధనమ్మని చూసిపోదామని ఇక్కడదిగిన ఆమె పినతల్లి శారదాంబ మాటలు పెద్దగా వినిపించాయి.
శారదాంబ మాట్లాడుతుంటే వేరే మైకు అక్కరలేదు. ఆమెది కంచుకంఠం.
తనకెందుకు మెలుకువవచ్చిందో పార్వతికి అర్ధమయిపోయింది. గాఢనిద్రలో వున్నప్పుడు నిద్ర మెలుకువవస్తే తలనొప్పి వస్తుంది. సన్నసన్నగా తలపోటు ప్రారంభం కావటంతో కణతలు నొక్కుకుంటూ వుండిపోయింది.
వినాలని వుద్దేశ్యం లేకపోయినా వాళ్ళ మాటలు పక్కగదిలోంచి వినపడుతున్నాయి. మాటల మధ్యలో తన పేరు విని జాగ్రత్తగా చెవి వొగ్గింది పార్వతి.
"ఇహ యింతేనా? అతగాడు తీసుకెళ్ళటంలేదన్న మాట!" శారదాంబ కుతూహలంగా అడిగింది.
"అన్నమాటే!" వర్దనమ్మ వ్యంగ్యంగా అంది.
"దైవం చిన్నచూపు చూడటంతో నీ రాత ఇలా అయింది. చిన్నచిన్న పిల్లలు. నీపాట్లు నువ్వు పడుతుంటే ముగ్గురు పిల్లలతో తనిక్కడ వుండటం ఏమిటి? అసలతను పార్వతికి ఎందుకు తీసుకెళ్ళడు?"
"ఇవాళ్ళొచ్చి రేపు వెళ్ళేదానికి తనకెందుకు నా సంగతి పరులగురించి తెలుసుకోవాలనే తపన అన్నిటికన్నా పెద్ద జబ్బు!" వింటున్న పార్వతి అనుకుంది కసిగ.
వర్ధనమ్మ తగ్గు స్వరంతో చెపుతున్నా పార్వతికి వినపడుతూనే వుంది.
"పార్వతి ఒక్కగానొక్క కూతురు గదా అని ఆవిడగారాబానికి అంతులేకుండా పెంచింది. ఒక్కడే అబ్బాయి ఆస్తి వుంది అని పెద్ద కట్నంతో మధుసూధనంకి యిచ్చి పెళ్ళి చేశారు. ఇంకా అప్పుడు పార్వతి వయసు తొమ్మిదేళ్ళు. మరో నాలుగేళ్ళకి పెద్దమనిషి కావటం, అచ్చటా ముచ్చటా చూడకుండానే ఆవిడ మరణించటం ఆతరువాత ఆయన నన్ను పెళ్ళాడటం వెంటవెంటనే జరిగిపోయాయి. ఇదంతా తెలిసిందేకదా నీకు పిన్నీ!" అంది వర్ధనమ్మ.
"ఆ__ఆ__తెలియకేమి, ఆ తరువాత నీకు శంకరం పుట్టినప్పుడు, మూడో కాన్పు, శ్రీనాథుడి పుటకలకి వచ్చానుగా! పార్వతి అత్తగారు చనిపోవటం ,పసిపిల్లతల్లిని మధుసూధనం పార్వతిని తనింటికి తీసికెళ్ళలేదని చెప్పావు" గుర్తు చేసుకుంటూ అంది శారదాంబ.
"పసిపిల్ల తల్లినీ కాదు, అత్తగారు చచ్చిందనీ కాదు. ఆయనవింటే ఏమన్నా అనుకుంటారని నిజం చెప్పలేదు. మధుసూధనం తండ్రి పసితనంలోనే చనిపోవటంతో ఆవిడ ఆడింది ఆటగా పాడింది పాటగా అతగాడిని పెంచింది .సగం చదువుతోనే ఆపేసి నాటకాల వాళ్ళతోచేరి నాటకాలాడుతూ ఊరూరు తిరగటం, ఎప్పుడో యింటికి రావటం, అటుతల్లికీ పట్టలేదు, యిటు యీయనకీ పట్టలేదు. పార్వతి అత్తగారింటికి వెళ్ళిందీలేదు. పార్వతిని అత్తగారింటికి పంపించరా అని ఓసారి ఆయనతో అంటే, "ఏం? నీకేమన్నా కష్టంగా వుందా? పార్వతి ఇక్కడే వుంటే? అది రాజాలా ఇక్కడే వుంటుంది. అతనే వచ్చిపోతుంటాడు" అన్నారు. అలా వచ్చిపోతుంటేనే ఇద్దరిపిల్లల తల్లి అయింది. మాయదారి జ్వరం వచ్చి ఆయన కన్ను మూసారు. మొగదక్షతలేని కొంపని మధుసూధనం మమ్మల్ని ఆదుకున్నదీలేదు. పార్వతిని కాపురానికి తీసుకెళ్ళిందీలేదు."
అత్తింటిగుమ్మం తొక్కకుండా ముగ్గురు పిల్లలతల్లి అయింది. పిల్లలు కూడ పెరిగి పెద్దవాళ్లవుతున్నారు. తనింటికి తీసుకెళ్ళేది లేదా?" శారదాంబ అడిగింది.
"తనూ" తనకో ఇల్లు. నాటకాలాడుతూ వూళ్ళు తిరగటంతో ఆస్తి హారతికర్పూరంలా హరించుకుపోయింది. పెళ్ళాన్ని తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకుంటాడు? మధ్య మధ్య వస్తుంటాడు. రెండురోజులుండి వెళుతుంటాడు. పార్వతి ఒక్కతి కూడా కాదాయె. ముగ్గురు పిల్లలు. నా పిల్లలు ముగ్గురు. ఇదంతా నాఖర్మ. దానికేం దానికి బాగానే జరుగుతున్నది." ముక్కు జిర్రున చీదింది వర్ధనమ్మ.
వింటున్న పార్వతి కోపంగా లేవబోయి నిస్సత్తువుగా మళ్లీ పడుకుంది.
"పూర్తిగా మొగాడిని అనవలసిన పనిలేదు. ఆడదానిలో వుంది. మీతో తీసుకెళ్ళండని పట్టుపట్టి కూర్చోకూడదూ పార్వతి. జరిగిందేచాలని అనుకుంటే ఎట్లా?"
"చీకూచింతా ఏంలేదు. చిన్నప్పటినుంచీ అలాగే జరిగింది. అదృష్టజాతకురాలు. మొగుడొచ్చిన రెండు రోజులూ పట్టపగ్గాలుండవ్." అంది వర్ధనమ్మ.
"ఈతఫా వచ్చినప్పుడు పార్వతిని తీసుకెళ్లమని గట్టిగా చెప్పెయ్యి. నలుగురు మనుషులను ఎంతకాలం భరిస్తావు? నీ పిల్లలకు చివరికి చిప్పయిచ్చేటట్లున్నావు చూడబోతే" సన్నగా చీవాట్లు పెడుతున్నది శారదాంబ.
అంతవరకూ విన్న పార్వతి దిండులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది తన అసమర్ధతకు చింతిస్తూ.
వేడివేడి కన్నీరు చీర చెంగును పూర్తిగా తడిపిన తరువాత మనసు తేలికపడింది. జోరీగల్లా ఆలోచనలు ముసురుతుంటే మరింత గట్టిగా కణతలు నొక్కుకుంటూ పడుకుంది పార్వతి.