Previous Page Next Page 
అమ్మో! అమ్మాయిలు పేజి 29

    " తలనొప్పి తగ్గిందాండి" వ్యాకర్ణ అడిగాడు.

    " మిరు ధర్మరాజుగారి కాలు విరగొట్టినప్పుడే నా తలనొప్పి తగ్గిపోయింది" అంది జయచిత్ర.

    కాసేపు ముగ్గురూ కబుర్లు చెప్పుకున్నారు.

    తర్వాత జయచిత్ర వద్ద శలవు తీసుకుని వచ్చేశారు అబ్బులు, వ్యాకర్ణను.

    ఆ రాత్రి జయచిత్ర కలలోకి వ్యాకర్ణ. వ్యాకర్ణ కళలోకి జయచిత్రా వచ్చారు.

    అబ్బులు కలలోకి ధర్మరాజు " నాధా" అనుకుంటూ వృద్ధ సుకన్య వచ్చారు.

    ఆ రాత్రి అలా జరిగిపోయి తెల్లారింది.

    " రాత్రి బాగా నిద్రపట్టిందా? అని అడిగాడు వ్యాకర్ణ.

    " ఎలా పడుతుంది! మా నాన్నమ్మ వూరికెళ్ళిందాయె" అని పైకని_

    " మిరు రాతంత్రా నా పక్కనే వుండి అదేం ప్రశ్న!" అని లోపలనుకుంది జయచిత్ర.

    తర్వాత..." మికు రాత్రి బాగా నిద్రపట్టి దాండి?" అని వ్యాకర్ణని అడిగింది.

    వ్యాకర్ణ రాత్రి కలలోంచి యింకా తేరుకోలేదు.

    " ఎలా పడుతుందండీ? మరీ విచిత్రంగా మాట్లాడుతున్నారు. రాత్రంతా నా పక్కనుండి నన్నల్లరి చేశారు. ఏడ్పిం చారు" అని జయచిత్ర ముఖకవళికలు మారటం చూసి తన పొరపాటు గ్రహించి-

    " సారీ! జోక్ చేశాను ఏమనుకోకండి" అని చెప్పి అక్కడుంటే ఏం జరుగుతుందో ఏం ఎదుర్కొవాల్సి వస్తుందో అని పరుగున తన గదిలోకి వచ్చాడు.

    చెవిటి ధర్మారాజుగారు తన చెపింది వినిపించుకోక సుందర్రావుతో చేతులు కలిపి సుకన్యనిచ్చి బలవంతాన తనకి పెళ్ళిచేయటం...

    ఆ కలయొక్క షాక్ లోంచి తేరుకొని అబ్బులు నడిచాపమీద కూర్చుని భూతద్దాలు టవల్ తో తుడుస్తూ దీర్ఘంగా అలోచిస్తుండగా_

    సుడిగాలిలా వ్యాకర్ణ గదిలోకి దూసుకు వచ్చాడు. వచ్చి... " కొంప మునిగిందిరా అబ్బూ!" అన్నాడు.

    " ఎవరి కొంప?" సీరియస్ గా అడిగాడు అబ్బులు భూతద్దాలు తగిలించుకిని అద్దాల్లోంచి వ్యాకర్ణ ని ఎగాదిగా చూసి.

    " నా కొంప" అన్నాడు వ్యాకర్ణ.

    " విచారించకు కర్ణా! నీవూ నేనూ వున్నది ఒకే కొంపలో నీ కొంప మునిగినా నా కొంపయూ మునిగినట్లే.

    అయినా మనది అద్దె కొంప. ఫర్వాలేదు" అన్నాడు అబ్బులు, అదేమ సీరియస్ విషయం కాదన్నట్లు డోంట్ కేర్ అన్నట్లు ఫోజుపెట్టి.

    " ఆపదలో వున్న వాడితో తాపిగా మాట్లాడటం తగడురా అబ్బునాదం!"

    " నీ కొచ్చిన ఆపదేంటి?"

    " కల... ఆ కలలో పెళ్ళి... ఆ పెళ్ళి తర్వాత హానీ మూన్... ఆ తర్వాత ఆ విషయం నోరు జారటం...

    ఆ తర్వాత యిలా పరుగెత్తుకు రావటం... ఆపై ఈ గండం ఎలా గడుస్తుందా అని... అని.."

    ఈ విషయం విన్న అబ్బులు చాపమిద యింతేత్తున ఎగిరిపడ్డాడు. "ఒరేయ్ కర్ణా! నీకూ వచ్చిందిరా కల?" అన్నాడు.

    " నీకూ వచ్చిందేమిటి కల?" ఎదురు ప్రశ్న వేశాడు వ్యాకర్ణ.

    " వచ్చింది. పెళ్ళి ప్రేమ అబ్బబ్బబ్బా..."" ఇహ చెప్పలేనట్లు కళ్ళు మూసుకున్నాడు అబ్బులు.

    " ఛట్ ! నా కొచ్చిన కల నీకు రావటానికి వీలులేదు. యిద్దరితో ఎలా పెళ్ళి జరిగింది? ఎలా ప్రేమ కుదిరింది? ఎలా...? ఎలా అంట?"

    " నన్ను కాదు ఆ విషయం అడగాల్సింది, ఆ జిడ్డుని.మామగాడిని, సుకన్యమ్మని." కసిగా అన్నాడు అబ్బులు.

    " వాళ్ళ నెందుకు?" అర్ధంగాని వ్యాకర్ణ అయోమయంగా అడిగాడు.

   

 

 Previous Page Next Page