ఈ ప్రశ్నలు వాళ్ళందరి ముఖం మీద ప్రతిబింబిస్తున్నాయి కాని పైకి మాట్లాడుకోవటం లేదు. ఎవరికి వారే గుంభనంగా కూర్చున్నారు.
అయిదు నిముషాలు గడిచాయి.
- 14 -
నలుగురు స్టేజీ మీదకి వచ్చారు.
ఒక్కసారిగా అందరి చూపులు వాళ్ళ మీదకి ప్రసరించాయి.
ముగ్గురు రౌడీ కుర్రాళ్ళు ఒక కాలేజీ అమ్మాయి. రౌడీ కుర్రాళ్ళ వేషం వేసింది కూడా అమ్మాయిలే. ఏదో పైపైన వేషం వేసుకున్నారు అంతే. అమ్మాయిలే రౌడీ వేషం వేసుకున్నారని తెలిసిపోతున్నది.
నలుగురు అలా స్టేజీ మీదకి రావటం వెంటనే మైకులోంచి నట్లు వినిపించాయి.
"సోదరీ మణులారా! ఇటు చూడండి, ఇది వినండి. ఇది జాగ్రత్తగా గమనించండి. ఈ అమ్మాయి పూర్తి పేరు అంజలి సర్కార్! కాలేజ్ లో చదువుతున్నది. ఓరోజు వంటరిగా ఓ వీధిలోంచి వస్తున్నది. ముగ్గురు రౌడీలు వెంటపడ్డారు. వాళ్ళు పచ్చి నెత్తురు తాగే కసాయి వాళ్ళు. వాళ్ళ జోలికి పెద్ద పెద్ద మగవాళ్ళే వెళ్లరు. ఇహ ఆడవాళ్ళ సంగతికి వస్తే వీళ్ళని చూస్తూనే ఆమడ దూరానికి పారిపోతారు.
ఇప్పుడా అమ్మాయి వెంట ఈ ముగ్గురు రౌడీలు పడబోతున్నారు. ఇక ఈ పూబాల గతి ఏమిటి? ఈ సుకుమారిని ఎవరు రక్షిస్తారు? ఆ భగవంతుడే రక్షించాలి. చూద్దాం ఏం జరుగుతుందో."
ఈ మాటలు ఎవరు మాట్లాడారో తెలియదు. చాటుగా మైకు వున్నట్లుంది. గట్టిగా మాటలు వినిపించాయి. ఆ చెప్పే తీరు కూడా సుందరంగా వుంది. కథ మనసుకి హత్తుకునేలా కళ్ళముందు జరుగుతున్నట్టే వుంది.
చూద్దాం ఏం జరుగుతుందో అన్న తర్వాత క్షణకాలం ఆగి "యాక్షన్" అన్న అరుపు వినబడింది. రౌడీలు గబగబ స్టేజీ దిగి పక్కన నుంచున్నారు.
స్టేజీ మీద మిగిలిన కాలేజీ అమ్మాయి అంజలి సర్కార్ గబగబ స్టేజీ చివరికి వెళ్ళింది.
యాక్షన్ మొదలైంది.
ఏ సెట్టింగు లేని ఈ తమాషా నాటకాన్ని కుతూహలంగా కళ్ళార్పకుండా చూడటానికి అందరి దృష్టి స్టేజీ మీదనే వుంది.
కాలేజీ అమ్మాయి చేతిలో బుక్స్ వున్నాయి. పమిట సర్దుకుని పుస్తకాలు సరిచేసుకుని మామూలుగా వీధిలో నడుస్తున్నట్లుగా ఆ మూలనుంచి బైలుదేరి స్టేజీ మధ్యకి వచ్చింది.
గబుక్కున ముగ్గురు రౌడీలు స్టేజీ ఎక్కారు. ఒకరు ఈల వేశాడు. మరొకడు అడ్డుగా నిలిచాడు. వేరొకడు "ఏయ్ పిల్లా! ఆగు." అన్నాడు.
భయంతో ఆ పిల్ల నిలిచిపోయింది.
ఆ పిల్లని ఆటలు పట్టించటం చీర లాగటం లాంటివి చేశారు.
"నా జోలికి రాకండి." మర్యాదగా చెప్పింది అమ్మాయి.
"చూడు పిల్లా! నిన్ను రక్షించే నాధుడు దరిదాపుల్లో లేడు. దేముడేమో బిజీగా వున్నాడు. పైనుంచి దిగివచ్చే ప్రశక్తి లేదు. అబలవి, ఆడపిల్లవి నిన్ను నీవు రక్షించుకోలేవు. మా మాట విని మంచిగా లొంగిపో." అంటూ ఒకడు అమ్మాయి చేతిలో పుస్తకాలు ఎగరగొట్టాడు. మరొకడు చీరలాగాడు. వేరొకడు జబ్బ పట్టుకున్నాడు.
"అరేయ్!" ఆ అమ్మాయి సింహ నాదంలా పెద్దగా అరిచింది.
"దరిదాపుల్లో నాధుడు లేకపోవచ్చు. దేముడు దిగిరాక పోవచ్చు. నేను ఆడపిల్లని. అబలని మాత్రం కాదు. కాచుకో ఈ ఆదిశక్తి అద్భుత పరాక్రమాన్ని." అంటూనే ఆ అమ్మాయి చేతులు తమాషాగా చాచింది.