Previous Page Next Page 
సరస్వతీ మహల్ పేజి 28

                                          కలి "ఆలి" గోల
   
    వినండయ్యా! జనులారా వినండి! దేశాంతర దేక్షాంతర కాలాంతరాల్లో ఆత్మకర్మ ఫలాన్ని అనుభవిస్తుందనే మాట అబద్ధం! వేదం ప్రమాణం కాదయ్యా! వేదాన్ని ఖండించి బోధి సత్వుదు ఈ ప్రపంచం అస్థిరమని చెప్పాడు! బుద్ధిలేని వాళ్ళు, పౌరుషం లేనివాళ్ళు ఆచరించేది వేద ధర్మం. వాళ్ళే అగ్నిహోత్రాన్ని త్రిదండాన్ని స్వీకరిస్తారు!

    నామాట వరలమూట! వినండి! స్వేచ్చే ధర్మం! మన్మధుడే దైవం! చావు ఒక్కటే చివరి గమ్యం. చచ్చాక తిరిగి రావడం అనేది అబద్ధం చచ్చి, బూడిదై తిరిగొస్తామనేది భ్రాంతి.

    వినండయ్యా! వినండి! ఇంద్రుడికంటే పెద్ద దేవుడున్నాడా! అతడు వంద యజ్ఞాలు చేశాడు.
 అతడు అహల్య కోసం పడిన పాట్లు పొందిన చేట్లు తెలియవా మీకు! అతడలా కష్టపడినా అహల్య కోసం వెంపర్లాడటం ఇతరల్ని ఇచ్ఛానుసారం జారత్వం చెయ్యమని అనుజ్ఞ ఇవ్వడం కాదా? ఆలోచించండి!

    ఈ విధంగా కవి భటులు విపరీతవాదం చేస్తూ వస్తున్నారు! వినే వాళ్ళంతా విభ్రాంతిపాలైనిలబడి పోయారు. అది చూసి ఇంకా రెచ్చిపోయి---

    "చెక్కిన రాతి బొమ్మల మీద పూలేసి పూజచేసి  ఫలం వస్తుందని ఆశపడ్తున్నారు. దాన్నెలా నమ్మడం! ఓ భక్తులారా! ఆలోచించండి! చెట్టు మీంచి ఎప్పుడైతే పూవుకోస్తామో అప్పుడే దానికి ఫలించే అవకాశం పోతుంది కదా! ఇక పూల పూజ వల్ల ఎలా ఫలాలొస్తాయి!

    అయ్యా! మనశాస్త్రాలు చెప్పేది వేరు. వేదాలు వల్లించేది ఇంకొక తీరు. ఉపనిషత్తుల మార్గం వేరు. బురదలోని స్తంభం లాంటిది. తర్కం--- మీ పారాయణ మంత్రార్ధులు వేరు. సాంఖ్యయోగ సిద్ధాంతం వేరు. వీటితో ఎందుకు చస్తారు. కష్టం లేని సుఖం దక్కే మార్గం ఎన్నుకోండి"

    అని బోధించారు-ఆ మీదట ఆగకుండా పెచ్చుమీరి ఢంకా బజాయించి తమ "సిద్ధాంతము" చెప్పసాగారు.

    "వినండి! బాగా వినండి! ఈ దేహం ఆఖరికి మంటల్లోపడి బూడిదై పోయేదే కాదా! ఇంకా పాపం ఎలా మిగిలి ఉంటుంది! ఈ శరీరంతో చేసిన పాపాలు ఈ శరీరంతోనే పోతాయి నమ్మండి! కాబట్టి పరమ సుఖానిచ్చే పర స్త్రీ సంగమాన్ని స్వీకరించండి! ఓపికున్నంత వరకు చేతనయినన్ని పాపాలు చెయ్యండి!"

    ఇవన్నీ ఎందుకోసం అంటారా?

    మీరు బాగా ఉన్న దేవతలేం చేశారు. కర్ణుడిచర్మం వొలిచి - కవచాన్ని తీసుకున్నారా లేదా? దధీచీ ఎముక లేరుకున్నారా లేదా? బలిని పాతాళానికి తోక్కేశారా లేదా? జీమూతా వాహనుడి ప్రాణాలు తీశారు లేదా? శిబి కధేమిటి? సముద్రాన్ని ఎలా చిలికారు? చంద్రుడ్నెలా తినేశారు? కల్పవృక్షం మాటేమిటి? దేవతలు ఎంతకయినా తగిన వాళ్ళు! వాళ్ళ నీతుల కతలు మనకొద్దు---"

    ఇలా విజృంభించి కలిభటులు దూరాభారాన్ని సమర్ధిస్తూ సదాచారాన్ని ఖండిస్తూ, వేదాన్ని నిందిస్తూ స్వేచ్ఛని అభినందిస్తూ వస్తూ ఉన్నారు. అది చూసిన దేవతలకు ఒళ్లు మండిపోయింది.

    వాళ్ళు నలుగురు - ఇంద్రుడు - యముడు - వరుణుడు - అగ్ని - వాళ్ళు నలుగురూ దమయంతీ స్వయంవరానికి వెళ్ళి - నలుడుని దూతగా పంపించి-చివరికి దమయంతి నలుడినే వరిస్తే అశీర్వదించి తిరిగొస్తూ ఉంటే వాళ్ళకు ఎదురయ్యారు. కలిబంట్లు-వాళ్ళని చూడనే చూసిన నలుగురు దేవతలూ చివాట్లు పెడితే "అయ్యలారా! మారాజు కలి? మేం అతని కైవారాలు ఇలా చెప్పాలి లేకపోతే మాపై ఆగ్రహిస్తారు. మేం పరాధీనులం. చెయ్యమన్నట్టు చేసే బంట్లం మమ్మల్ని మన్నించండి!" అని చేతులు జోడించారు.

    అప్పుడు కాకి కేతనంతో కాలాసనంతేరులో నల్లని శరీరంతో నిగనిగలాడ్తూ వచ్చాడు కలిపురుషుడు. వాళ్ళని చూసి పలకరించి, నమస్కరించి తాను దమయంతీ స్వయంవరానికి వెళ్తున్నానని అశీర్వదించి పంపండని కోరాడు కలి!

    అదివిని "అదేంటయ్యా!! నిన్ను బ్రహ్మ బ్రహ్మచారిగా చేశాడుకదా! పెళ్ళంటావేటి? అయినా దమయంతికి నలుడితో పెళ్లైయిపోయింది కదా! మేం ఇప్పుడక్కడినుంచే వస్తున్నాం! ఆ దమయంతి నాగులను పరిత్యజించింది. వేల్పుల అధిక్షేపించింది. రాజులను తిరస్కరించింది. నలుడుని వరించింది.

    ఏం చేస్తాం! ఈశ్వరాజ్ఞ బలీయసి మాతోపాటే తిరిగి పోదాం రా! అన్నారు నలుగురూ!

    అది విన్న కలి భగ్గుమన్నాడు.

    "బ్రహ్మకేం? మీకేం మీకంతా భార్యలు ఉన్నారు. మీరు సుఖపడ్తున్నారు? నైష్ఠిక బ్రహ్మచర్యంలో నేను చెడితే చెడతాను మీకేమిటి? మీ సుఖాలకు ఏంలోటు లేదుకదా!

    ఆమె మిమ్మల్నందర్నీ కాదని - ఒక మానవుడ్ని వరిస్తూవుంటే ఎలా ఊరుకున్నారు? ఇదంతా వదిలెయ్యండి! నే వెళ్ళి ఆమెను ఎత్తుకొస్తాను. పాకశాసనుడు (ఇంద్రుడు) పాపకుడు (అగ్ని) పరేతపతి (యమధర్మరాజు), పాకహస్తుడు (వరుణుడు) పంచముండ (నేను) - మనం ఈ అయిదుగురం కలిసి - పాండవులు ద్రౌపదిని పంచుకున్నట్లు పంచుకొని అనుభవిద్దాం! అన్నాడు కలి.

    ఆ మాటలు విని నలుగురూ ఛీ! ఛీ! అని చివాట్లు పెట్టారు. నలుడి ధర్మ నిరతని పొగిడారు.
    అప్పుడు కలి వాళ్ళకు నమస్కరించి తానెలాగయినా కొన్నాళ్ళు భూమ్మీద వుండిపోయి ఆ రాజ్యంలో ఎవడో ఒకడు తప్పుచేస్తే తాను వాడిలో దూరిపోయి - ఆ రకంగా - ప్రజల తప్పు రాజుదే కాబట్టి - రాజును పట్టి పీడిస్తానని వెళ్ళిపోయాడు.

    హర్షనైషధాన్ని ఆంధ్రీకరించిన శ్రీనాధుడు శృంగార నైషధంలో కలి చేష్టల్ని, కలి బుద్ధిని, కలి విజృంభణాన్ని ఎంతో చక్కగా చెప్పాడు.

                                                                         ----*----
 

 Previous Page Next Page