Previous Page Next Page 
అహల్య పేజి 28


    విభాండకుడు వైశాలీ నగరాన్ని చేరుకునే వేళకే ఋష్యశృంగ మహర్షి రాజాంతపురంలో విడిదిచేసి నగర జీవితానికి, నాగరిక లక్షణాలకూ అలవాటుపడి ప్రకృతి గురించి సృష్టి గురించి ప్రజా జీవనాన్ని గురించి తెలుసుకున్నాడు.


    ఋష్యశృంగుడు రాజ్యంలో పాదం మోపీ మోపగానే, పెళ్ళికి విచ్చేసే పెద్దల్లాగ ఎక్కడెక్కడి మేఘాలూ వాయు వేగంతో వచ్చి వైశాలినీ జలమయం చేశాయి. వర్షం దేశ ప్రజలందరికీ హర్షదాయకమయింది.


    ఆ గతించిన విషయాలన్నీ విభాండక మహర్షికి వివరంగా విన్నవించుకుని తమకూ, తమ రాజ్యానికీ ప్రాణభిక్ష పెట్టి ప్రజలను కరువు రక్కసి కరకు కోరల నుంచి రక్షించిన ఋష్యశృంగమహర్షికి కృతజ్ఞతగా తన కుమార్తెనిచ్చి పెళ్ళి చేస్తాననీ కోరి ఆయన అంగీకరించగానే దశరధమహారాజుకి వర్తమానం పంపి వారు వైశాలికి దయచేయగానే శాంతాదేవిని ఋష్యశృంగుడికి ఇచ్చి వివాహం జరిపించారు.


    అప్పుడు దశరధుడు పుత్రకామేష్టి చేయాలనే కోరికను వెలిబుచ్చాడు. తగిన సమయం వస్తుందనీ తనంతట తానే వర్తమానం చేసి వస్తాననీ, అయోధ్యలో ఆ యాగం జరిపించగలననీ అన్నాడు ఋష్య శృంగుడు.


    అవన్నీ జరిగి చాలాకాలమైంది.


    ఇప్పుడా గతమంతా దశరధుడు తన మనస్సులో మళ్ళీ తలపోశాడు. ఆయనకు వశిష్టులవారు శ్రీ మహా విష్ణువు ఇంద్రాది దేవతలకు చెప్పిన విషయాలన్నీ వివరంగా చెప్పారు. యాగం జరుగుతుందనీ యజ్ఞ పురుషుడు ఫలితాన్ని ప్రసాదిస్తాడనీ తత్పలితంగా దశరధుడికి ఒక్కరు కాదు ఇద్దరు కాదు నలుగురు కొడుకులు జన్మిస్తారనీ చెప్పాడు.


    అవతార పురుషుడు తన కొడుకుగా పుడతాడని తెలియగానే దశరధుడి ఆనందానికి హద్దు లేకపోయింది. 'ఇన్ని సంవత్సరాలు కొడుకులు లేకుండా జీవితం గడిచిపోయింది. ఇంకెన్నాళ్ళయినా ఇంకెన్నేళ్ళయినా వేచి ఉంటాను. గురుదేవా! కులాన్నుద్ధరించే కుమారుడు వంశాన్నుద్ధరించే తనయుడిగా శ్రీమహా విష్ణువే జన్మిస్తాడంటే అంతకంటే నా జన్మకు ధన్యత ఉందా? ఈ దశరధుడికి జన్మ సార్ధకమైంది మహర్షీ!' అన్నాడు.


    దశరధుడి బ్రహ్మానందాన్ని చూసి బ్రహ్మర్షి వశిష్టుడు కూడా బ్రహ్మానందభరితుడైనాడు. ఇక్ష్వాకు కుల దీపకుడిగా రఘు వంశ పయః పారావార రత్నంగా జగన్నాటక సూత్రధారి జన్మిస్తే ఆయనకు గురువుగా కుల గురువుగా తన తపస్సు తన జన్మ తరించినట్లే! ఏ మహర్షికీ లభించని గౌరవం అనుకున్నాడు వశిష్ట మహర్షి.


                             *    *    *    *


    బ్రహ్మానంద సబ్రహ్మచారులయిన ఆ ఇరువురూ మౌనంలో మునిగి ఆశ్రమ వాటికలో పెంచిన పూలచెట్ల నుండి పూలను కోసుకుని పూజకు బయలుదేరింది అహల్య.


    ఆమెకు అప్పుడెప్పుడో యిలాగే పూలు కోసుకుంటుండగా దేవలోకం నుండి వదిగి వచ్చానని ఇంద్రసఖి తనతో మాట్లాడి తనతో స్నేహం నెరిపి ఎప్పుడంటే అప్పుడు ప్రత్యక్షమై వచ్చి మాట్లాడి చూసి వెళతానన్న మాటలు గుర్తుకొచ్చాయి.


    'ఎన్నేళ్ళయింది ఇంద్రసఖి వచ్చి వెళ్ళి? ఇదిగో వస్తానని వెళ్ళింది. మళ్ళీ రాలేదు. అయినా తన వెర్రి గానీ ఆ ఇంద్రలోకంలో ఆ దేవేంద్ర వైభవంలో ఆ శచీపురంధరుల సన్నిధిలో తను గుర్తుకు వస్తుందా?' అనుకుంది.


                                       18


    హిమవత్ పర్వత సానువుల మీదుగా వెళుతున్నది పుష్పకవిమానం. అందులో విశ్రాంతిగా చేరగిలబడి ప్రకృతిని పరిశీలనగా చూస్తున్నాడు లంకేశ్వరుడు.


    ఎగుడుదిగుడు కొండలు- ఆ కొండలన్నీ శ్వేత వస్త్రంతో కప్పినట్లుగా తెల్లని దట్టమైన మంచు. పర్వత సానువుల నుంచి లేలేత ఎండకే కరిగి నీరై ప్రవహించే మంచు నీళ్ళు, జలపాతాలు. ఎక్కడో పుట్టి కిందికి జారి ప్రవహిస్తున్నట్లుగా నదీ ముఖంగా సాగే నదులు.


    అక్కడక్కడా పెరిగిన దట్టమైన పొదరిళ్ళు. ఎత్తయిన చెట్లు. ఏనుగులు మొదలైన జంతువులు. లేళ్ళ వంటి సాధు మృగాలు. పరిశీలనగా చూస్తున్నాడు రావణబ్రహ్మ.


    అటు లంక నుంచి బయలుదేరి- ఆ దక్షిణాగ్రం నుంచి ఈ ఉత్తర గిరిశిఖరాల వరకూ పయనిస్తూ ఎన్నెన్నో నదులు, ఎన్నెన్నో నగరాలు, మరెన్నో తటాకాలు, సస్యశ్యామలమైన పొలాలు, దట్టమైన అడవులు చూస్తూ వస్తూ ఉన్నా ఈ రమణీయకతే వేరనుకున్నాడు మనసులో.


    అవును. ఎందరు దేవాధిదేవతలున్నా పరమ మహేశ్వరుడు స్థాణుమూర్తి రుద్రుడు గిరిజానాధుడు ఆ శంభుడు- ఆ శంకరుడూ- ఆయన వంటి దైవం మరెవరున్నారు? అసలు శివుడితో పోల్చదగినవారా వారంతా? వారితో శివుడిని పోల్చవచ్చా? నిజంగా అది పాపం! శాప కారణం.


    అలాగే ఎన్ని కొండలున్నా ఎన్ని నదులున్నా ఎన్ని దేవాలయాలున్నా పరమశివుని దేవాలయం ఈ హిమాలయంతో సాటి ఏదీ రాదు. ఈ గంగా నదితో సాటి ఏ నదీ లేదు. అందుకే కదా ఈశానుడీ ఉత్తర దిగ్భాగంలో ఈ హిమాలయాలలో విడిది చేసేది.


    శివుడు చిత్తాన తోచగానే లంకేశ్వరుడి చిత్తం మళ్ళీ శివుడి చరణాలను స్మరించింది. తాను అశువుగా ఆర్తిగా ఆవేదనతో ఆ పరమశివుని స్తుతించిన స్తోత్రం గుర్తుకు వచ్చింది.


    రావణుడి మదిలో ఒక విధమైన ఉత్తేజం పొంగుకువచ్చింది. కంఠమెత్తి ఆ స్తోత్రం అంతా పఠించాడు. ప్రార్థన శ్లోక పఠనం పూర్తికాగానే పరమశివుడే ప్రత్యక్షమైనట్లుగా అనిపించింది.


    'శివా! శంకరా! నీలకంఠా! నిజభక్త వశంకరా!' అంటూ అప్రయత్నంగా శివుడిని స్మరించాడు. అఘస్మరహరుడు కనుల ముందు పార్వతీ సమేతంగా కనిపించినట్లు భాసించింది. మనస్సు మరింత సేద తీరింది.


    పుష్పక విమానం తన మందగతిని తాను సాగిపోతూనే ఉన్నది. ఆనందం నిండిన మనస్సుతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్న హిమవత్ పర్వత సానువుల్ని చూస్తున్నాడు రావణుడు. అప్పుడు- అక్కడికి చాలా క్రిందలో- కొండల మధ్య ఓ ఆశ్రమ వాతావరణం కనిపించింది. దానికి కొంత దవ్వులో వితర్ధిక- దానిపై ధ్యాన ముద్రలో తపోనిష్టలో ఉన్న ఒక స్త్రీ.

 Previous Page Next Page