Previous Page Next Page 
డి.కామేశ్వరి కథలు పేజి 28


    'బాబుగారు, టిఫిను పెట్టాను-' వంటావిడ సీతమ్మ వినయంగా అంది - మీరు పిలవక్కరలేదు, టైమయితే నేనే వస్తా.' చదువుతున్న పేపరు వంచి తలెత్తి ముఖం చిట్లించి అన్నారాయన - వంటావిడ ముఖం చిన్నపుచ్చుకుని లోపలికెళ్లిపోయింది. రాజేశ్వరి వెళ్లి పట్టుమని ఇరవైనాల్గు గంటలు గడవలేదుకానీ ఇంట్లో ఏదో వెలితి, శూన్యం - ఆ శూన్యం ఆయన మనస్సులో ఏర్పడింది. ఏదో చాలా నిబ్బరంగా, గంభీరంగా పైకి వున్నా నిన్నటినించి ఆయన మనసు మనస్సులో లేదు - రాజేశ్వరి వెళుతూ వెళుతూ లాంచనంగా ఏదో చెప్పాలని చెప్పినట్టు' వెళ్తున్నాను - జాగ్రత్త' అని మాత్రం అంది. ఆయన ముఖం పక్కకి తిప్పుకున్నాడు - కనీసం గేటు వరకయినా సాగనంపడానికి వెళ్లకుండా వీధి వసారాలో పడక కుర్చీకంటుకుపోయి కూర్చున్నారు." నాన్న ఫోను చేస్తుంటాను, జాగ్రత్త' అన్నాడు కొడుకు. దానికీ జవాబు లేదు - ఆవిడ వెళ్లాక వంటరిగా తల్లివదిలి వెళ్ళిపోతే చిన్నపిల్లాడు ఉక్రోష పడినట్టు రాత్రంతా మనస్సులో మధనపడ్డారాయన -
    'ఏమిటివి యిడ్డెన్లా, యిటకరాళ్ళా - యింత గట్టిగా వున్నాయేమిటి' సీతమ్మ గతుక్కుమని 'అమ్మగారు చెప్పిన విధంగానే చేశానండి' వినయంగా అంది - 'ఆవిడ చేసినట్టు చేస్తే మెత్తగా దూదుల్లా వుండాలి, రాళ్లలా వున్నాయి- రేపయినా సరిగా చేయండి - 'టిఫిను ప్లేటు ముందునించి లేచి వెళ్లిపోయారు విశ్వనాథం - 'వరాలూ.. ఏమోచ్చాయో ఈ యిడ్డెన్లకి - మెత్తగా లేవు-' పనిమనిషి చేతిలో ఓ యిడ్డెనుపెట్టి చూడమంటూ అంది సీతమ్మ -' బానే వున్నాయమ్మా- ఏటో అయ్యగారికి కళకళలు లెండి. అయ్యో టిఫిను తినలేదా ఆయన' ఏమో బావులేవేమో. నాకు వంటలు తప్ప టిఫిన్లు చేయడం అలవాటు లేదు అంచేత సరిగా రాలేదేమో - 'పెళ్లిళ్లు, శుభకార్యాల పెద్దవంటలు అలవాటు తప్ప ఇళ్లల్లో అలవాటులేని ఆవిడకి నిజాయిని టిఫిన్లు చేయడం రాదు-' అమ్మగారు చెప్పినట్టే రుబ్బి నూక కలిపాను మరి' స్వగతంలా అనుకుంది. 'ఏమిటండీ యిది పులుసేనా, యింత చిక్కగా గంజిలా వుంది - బెల్లం పడనేలేదు.. చారేమిటి యింత పుల్లగా పులుసులా వుంది. యీ కూర నీళ్ళోడుతుంది - వంట రాదా మీకు - ఇదివరకెక్కడ చేయలేదా - వంట యిలా తగలేశారు - పొద్దుట టిఫిన్ లా చేశారు-' మొహం చిట్లించి దురుసుగా అన్నాడాయన - సీతమ్మ తెల్లపోయింది. వంట రాదా అంటుంటే ఆవిడకేం జవాబివ్వాలో తెలియలేదు - ముప్పై ఐదేళ్ళుగా ఇంచుమించు రోజూ చేసే వంట చక్కగా గుమ్మడికాయ ముక్కలు ములక్కాడలు, దుంపలు వేసి పులుసుపెడితే అలా అంటారేమిటి - గుమ్మడికాయ పులుసు సీతమ్మగారే పెట్టాలంటారు తిన్నవాళ్లు- పెద్దవంటలు అలవాటయి కాస్త కాస్త వండడం వల్ల పడాల్సినవి సరిగా పడలేదా ఏమిటి చెప్పా - మధనపడింది. తీరా భోజనానికి కూర్చుని రుచులు చూస్తే అన్నీ సరిగానే వున్నాయనిపించి యింకెవరితో చెప్పుకోవాలో తెలియక పనిమనిషితో చెప్పుకుంది. అమ్మగారు వెళ్ళిన కోపం మీమీద చూపిస్తున్నాడయ్యా -' వరాలు నవ్వి అంది. గత పదేళ్లుగా పనిచేస్తున్న వరాలుకి యింట్లో అయ్యగారి సంగతి బాగానే తెలుసు. 'అమ్మగారు వంటరిగా వదిలి వెళ్లిపోనారని అయ్యికి బాధ. ఈరోజు వంట సరిగా లేదని కాదు. అమ్మ ఎంత బాగా వండినా ఏదో వంకలు పెట్టడం ఆయనకి అలవాటు' తేలిగ్గా తేల్చేసింది - 'అంతేనంటావా, అమ్మబాబోయ్ - యిలా అయితే - ఇలా వంకలు పెడితే ఎలా చేస్తా' అంది సీతమ్మ.
    'వరాలూ - లోపల్నించి కేక. 'ఏటయ్యగారు-' ఏమిటి ఆరిన బట్టలన్నీ కుప్పలా పడేశావు మంచంమీద. మడత పెట్టాలని తెలీదా. మడత పెట్టి స్టాండు మీద పెట్టు -' ఆర్డరు వేశారు - 'నేనెప్పుడూ పెట్టలా, అమ్మగారు మడతెట్టుకునేవారు' 'అంటే మీ అమ్మగారు లేకపోతే బట్టలలా పడేస్తే నే మడతలు పెట్టుకోవాలా హుంకరించారు - వరాలుకి అమ్మగారు మడత పెట్టమని చెప్పలేదు - ఆవిడ హడావిడిలో మర్చిపోయిందేమో - నెమ్మదిగా కింద కూర్చుని మడతలు పెట్టింది. ఏమిటే లాల్చీ అలా మడత పెడ్తున్నావు - మళ్లీ తొడుక్కోవాలా వద్దా - అలా అడ్డంగా ఏమిటి నిలువు మడత పెట్టు - వరాలు అయోమయంగా చూసింది. 'పో అవతలికి బట్టలు మడతపెట్టడం చాతకాదు - ఆడదానివి గాదు!" వరాలుని పొమ్మని నాలుగు బట్టలు అరగంట కూర్చుని విప్పి మడిచి మడతలు పెట్టుకున్నారాయన. పెళ్లికి ముందు తల్లి. పెళ్లయ్యాక భార్య చాకిరి చేయడం అలవాటయిన ఆయన మంచినీళ్లు కూడా బిందెవంచి ముంచుకుని ఏనాడు తాగలేదు. తాగిన గ్లాసు అలా కింద పెట్టడం తప్ప ఏనాడు తీయలేదు - బట్టలు రెడీగా పక్క రెడీగా, భోజనం, టిఫిను ప్రతిది వేళవేళకి అమర్చి పెట్టే భార్య - మొగుడంటే చేయించుకునే తప్ప చేసే జాతి కాదని ఆయన విశ్వాసం - అది ఆ యింట్లో ఆయనకొచ్చిన సంస్కారం. తల్లి ఏనాడు వంటింటి గడపదాటని మహా ఇల్లాలుగా బతికింది. ఆవిడ ఆయనకి ఆదర్శం! దానికితోడు తండ్రి పెళ్లికాంగానే చేసిన నీతి భోధ -' ఒరేయ్ నానీ, ఈ ఆడవాళ్ళున్నారు చూశావూ - వెంట్రుక వాసంత దారి యిచ్చావో ఆ వెంట్రుక పట్టుకునే తలమీదకెక్కి నిన్ను ఆడిద్దామనుకుంటారు - అలాంటి పొరపాటు చేయకుసుమా, ఎక్కడుంచాల్సిన వాళ్ళని అక్కడ వుంచితేనే మనకి లొంగుతారు-' అన్నాడాయన కోడలు కాపురానికి వచ్చిన మూడో రోజు కొత్త పెళ్ళాం నూతిలోంచి నీళ్ళు తోడుతుంటే ఆమె చేతిలో బాల్చి తీసుకుని నీళ్లు తోడి గాబు నింపిన కొడుకుని చూసి "పాపం కొత్త మోజు, పిచ్చి సన్నాసిని యిలా వదిలేస్తే రేపట్నించి నీళ్లే తోడిస్తుందో - వాకిళ్లే తుడిపిస్తుందో. ఆడంగి వెధవలా వీడా పనులు చేసి వంశ గౌరవం మంట గలిపేస్తాడేమో,' ననిపించి కొడుక్కి హితబోధ చేశాడు - ఆ మాటలు, విశ్వనాథం గారి బుర్రలో బాగానే దూరాయి. తండ్రి అనుభవంతో చెప్పిన మాటలు ఆయన మీద బాగానే పనిచేశాయి. తండ్రి తల్లి మీద అధికారం చెలాయిస్తూ చేయించుకునే పనులు చూసి మొగుడంటే అలాగే వుండాలి అన్న నమ్మకం కలిగించింది. దానికితోడు రాజేశ్వరి కాస్త చదువుకున్న ఆవిడ పుస్తకాలు, పత్రికలు చదువుతుండేది. మెట్రిక్ వరకే చదివినా, ఆవిడ కాన్వెంటు చదువుతో ఇంగ్లీషు బాగానే మాట్లాడేది పేపరు చదివి రాజకీయాలు చర్చించేది. ఇంట్లో తల్లిలా వంటింట్లోనే రోజంతా పడివుండకుండా పనిచేసుకుని గదిలో కూర్చుని పుస్తకాలు చదివేది. నాజుగ్గా చీరకట్టి, వళ్లు, ఇల్లు పొందికగా సర్దడం - ఆవిడ ప్రతి పనిలో, చేతలో, మాటలో ఆధునికత కనిపించేది - తనతో మాట్లాడినప్పుడు తల్లిలా భర్త అంటే భయపడకుండా తన మనసులో భావాలు స్వేచ్చగా చనువుగా వ్యక్తీకరించడం, తనకి నచ్చినిది వాదన చేసి తప్పొప్పులు చర్చించి వప్పించాలని ప్రయత్నించే ధోరణి అదిచూసి ఈమెకి కాస్తః అలుసిస్తే తర్వాత తనని లెక్క చెయ్యదు తండ్రి చెప్పింది నిజం, మొక్కగానే వంచాలని నిర్ణయం తీసుకుని రాజేశ్వరిని అదుపాజ్ఞలో వుంచడం ఆరంభించారు విశ్వనాథం - ఆవిడ చెప్పినదానికి వప్పుకోకుండా తనన్నదే రైటనడం, యింట్లో మగాడిదే పెత్తనం, ఆడది వంటింటి వరకే పరిమితం అన్న విషయాలు ఆవిడకి వంటబట్టించేందుకు కాస్త ఇబ్బందే అయింది - అయినదానికి కానిదానికి కయ్యానికి కాలు దువ్వినట్టు ఎందుకు మాట్లాడి, అలా కసిరి అధారిటి చేసి చెప్పడం ఎందుకు సౌమ్యంగా చెప్పరాదా అని బాధపడేది. ఆమాటే అంటే నోరు మూసుకో నీ అతి తెలివి చూపించకు అని అనవసరంగా కోప్పడే భర్త తత్వం అర్థం కాలేదావిడికి - వాదిస్తే మరింత కోపం తెచ్చుకుని రోజుల తరబడి మాట్లాడకపోవడం, చిన్న పొరపాటు జరిగినా అందరిముందు అవమానపరచడం - కొన్నాళ్లలా జరిగినా భర్తని మార్చుకోలేక, అందరిలో చిన్నపోవడం ఇష్టంలేక ఆమె ముభావంగా తనపని తను చూసుకునేది - ఉద్యోగం వచ్చి వేరింటి కాపురం వచ్చినా భర్తలో మార్పు లేకపోవడంతో అతని మనస్తత్వం అంతే అని సరిపెట్టుకుని బతకడం నేర్చుకుంది - భార్యగా తన కర్తవ్యం నిర్వర్తించడం తప్ప వారిద్దరి మధ్య సయోధ్యత, సామరస్యం, అనురాగం లోపించాయి ఆ కాపురంలో - పిల్లలు పుట్టారు - పెరిగారు - చదువులు పెళ్లిళ్లు అయి వెళ్లి వాళ్ళిద్దరూ వంటరిగా మిగిలినా మనస్సులో మాట స్వేచ్చగా ఏనాడు చెప్పుకోలేక వంటరితనము అనుభవించింది - తన పని, తన పుస్తకాలు, తన పూజ, మొక్కలు అలవాటు చేసుకుంది ఆవిడ. ఈ విధంగా విశ్వనాథం గారు భార్యని తన చెప్పు చేతల్లో వుంచుకుని సాధించాను అనుకున్నారు తప్ప కాపురంలో తను కోల్పోయిందేమిటో ఆయన గ్రహించుకోలేదు - వయసు మీద పడి, ఉద్యోగం లో రిటైరయి యింట్లో కూర్చోడం ఆరంభించాక ఆయన చిరాకులు, సాధింపులు, కసుర్లు మరింత ఎక్కువై రాజేశ్వరికి భరించలేనంత నైరాశ్యం ఓ రకమైన విరక్తి, భర్తంటే ద్వేషం మరింత పెరిగి ఆ పరిసరాలనించి, ఆ వాతావరణం నించి కొన్నాళ్ళు దూరంగా వెళ్లి ప్రశాంతంగా తను జీవించాలి. భర్తకు తనంటే ఏమిటో, తను లేని లోటు ఎలా వుంటుందో తెలియచేయాలన్న పంతం వచ్చింది -అడుగడుగునా అన్ని అమరుస్తుంటే ఆయనకి తెలీడం లేదు - దూరం వెళితే విలువ తెలుసొస్తుంది అని కొడుకుతో ప్రయాణం పెట్టుకుంది.

                                                                               *    *    *    *    *

 Previous Page Next Page