Previous Page Next Page 
తిరిగి దొరికిన జీవితం పేజి 28


    కృష్ణమోహన్ కంగారుపడ్డాడు. "గీతా, ఏమిటిది, ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు. మనం తర్వాత మాట్లాడుకుందాం. నీవింటికెళ్ళు."
    "ఊ హు వెళ్ళను..." అంటూ లేచి గభాలున అతని గుండెలలో మొహం దాచుకొని "మోహన్ ఐ లవ్ యూ మోహన్ నాకు కాక నీ హృదయంలో ఇంకెవరికి స్థానం యిచ్చినా భరించలేను మోహన్ నీవా సరోజ గురించి నాతో మాట్లాడకు మోహన్ నేను భరించలేను."
    "గీతా, ఏమిటీ మాటలు, వదులు యిది ఆస్పత్రి అని మరిచిపోతున్నావా" అంటూ మృదువుగా వదిలించుకున్నాడు. ఇది వరకయితే కృష్ణమోహన్ యిలాంటి అవకాశాన్ని వృధా పుచ్చేవాడు కాదు. ఈరోజు గీత స్పర్శ అతనిలో ఏ చైతన్యాన్ని, ఉద్రేకాన్ని రేకెత్తించలేదు. అంతేకాక గట్టిగా గీత ఆరోపణలు అబద్దమనీ ఖండించలేకపోయాడు. అతనికి తెలియకుండానే అతనిలో ఈ మార్పు కలగడం అతనికి తెలియదు. కాని గీత గుర్తించింది. అతను తనకు దూరమతు తున్నాడన్న సంగతి అర్ధం అవగానే గీత అతడ్ని ప్రసన్నుడిని చేసుకోవాలని ఆరాటపడింది. చప్పున మొహానకవళికలు మార్చేసింది. అతని మొహం పట్టుకు తనవైపు తిప్పుకొని "వెళ్ళిపోతాను, నామీద కోపం లేదని ఒకమాట చెప్పు" అంది అర్ధిస్తున్నట్టు అంత బేలగా ఎప్పుడూ మాట్లాడని గీత మొహం చూచేసరికి కృష్ణమోహన్ మెత్తపడ్డాడు...
    "కోపంలేదు. నీవు పెంకితనం మొండితనం మానేసి ఇలావుంటే నాకెందుకు కోపం వస్తుంది" అన్నాడు లాలనగా నచ్చచెప్పే ధోరణిలో.
    "మరి నేనిలా వుండాలంటే అది నీలో వుంది...నా కెప్పుడూ కోపం తెప్పిస్తావు నేనెంతో ప్రేమగా దగ్గరకి వచ్చేసరికి ఏదో అంటావు నాకు కోపం వస్తుంది." గీత బుంగమూతి పెట్టి అమాయకంగా అంది.
    "సరే....బాబూ నీవింక వెడ్తావా అవతల పేషంట్లు కూర్చున్నారు" అన్నాడు నవ్వి మోహన్.
    "ఓకే-బై-బై-టా-టా" అంటూ అతని చెంప సుతారంగా చేసి విలాసంగా బ్యాగ్ తిప్పుకుంటూ వెళ్ళింది గీత. అలావెడ్తున్న గీతనిచూసి ఎందుకో నిట్టూర్చాడు మోహన్.
    
                                     *    *    *
    
    "సరోజా, యివాళ రవీంద్రభారతిలో నుంచి డాన్స్ పోగ్రాం వుంది. మోహినీ భస్మాసురడాన్స్ డ్రామా-వెడదామా" కృష్ణమోహన్ మధ్యాహ్నం నిద్రలేచి కాఫీ తాగుతూ అడిగాడు.
    "నేనా...నేనెందుకు....మీరిద్దరూ వెళ్ళండి...!" అంది ముభావంగా.
    "ఎవరిద్దరు?" కనుబొమలు ముడిచి అడిగాడు మోహన్.
    సరోజ అదోలా నవ్వింది..." మీరు మీ శ్రీమతి గారు."
    ఆ నవ్వు చూసేసరికి కృష్ణమోహన్ కి కోపం వచ్చింది. "నేను, నా శ్రీమతి వెళ్ళేట్లయితే నిన్నెందుకు పిలుస్తాను -నీవు వస్తావో రావో చెప్పు - ఇంకో విషయం నీకనవసరం-" కోపంగా అన్నాడు. అతని అనవసర కోపానికి సరోజ కాస్త ఆశ్చర్యపడింది. అసలీ మధ్య ఎందుకో కృష్ణమోహన్ చాలా చిరాగ్గా, అన్యమనస్కంగా వుంటున్నాడు - ఎప్పుడూ సౌమ్యంగా చిరునవ్వుతో వుండే అతని మొహం కళావిహీనమై ఏదో ఆలోచనలతో విసుగ్గా వుంటున్నాడు - ఏదో సమస్య అతనిని వేధిస్తూన్నట్టు కనిపిస్తున్నాడు - సరోజ, సరస్వతమ్మ రెండు మూడుసార్లు అడిగినా ఏం లేదన్నాడు.
    "ఏమిటిరా ఆ కోపం -" ప్రక్కనేవున్న సరస్వతమ్మ సరోజ చిన్నపుచ్చుకోడం చూసి సున్నితంగా మందలించింది.
    "అవునమ్మా - గీతతో వెళ్ళే మాటయితే ఆవిడ గారికి యిలాంటివి యింటరెస్టులేదని తెలుసుగదా యీవిడ నెందుకు అడుగుతాను -ఏదో పోనీ సంగీతాభిరుచి అది వుంది. యిలాంటివి యిష్టపడుతుందని..."
    "పోనీ గదా అని నామీద అంత జాలి మీకెందుకు లెండి" సరోజ ఉడుకుమోత్తనంగా అంది.
    "ఏమిటర్రా యిద్దరూ చిన్నపిల్లల్లా - వెళ్ళమ్మా సరోజా, సరదాగా -ఎప్పుడూ యిల్లు కదలనే కదలవు - వాడన్నట్టు నీకు యిలాంటివి యిష్టంగదా - వెళ్ళిరండి."
    "మీరూ రండి - మేం యిద్దరం వెడితే ఏం బాగుంటుంది - ఎవరన్నా ఏదన్నా అనుకుంటారేమో-" బిడియంగా అంది సరోజ.
    "నిన్నేం కొరుక్కుతిననులే - నాతో రావడం యిష్టం లేకపోతే మానేయి. యీ కుంటి సాకులు ఎందుకు? ఎవరో ఏదో అంటారట" హేళనగా కవ్వించాడు.
    "కుంటిసాకులేంగాదు-ఎవరో ఎందుకు, మీ గీతాదేవి గారికి తెల్సిందంటే -అబ్బాయిగారేం చెపుతారో అప్పడు - ఆవిడ రేపొద్దున నిలేసినపుడు మొహం ఎలా మారుతుందో..." చనువుగా ఎగతాళి పట్టించింది సరోజ. ఆ ఎగతాళి యిదివరకయితే స్పోర్టివ్ గా తీసుకునేవాడు మోహన్. కాని యిప్పుడు మనసు బాగులేని అతనికి సరోజ అతని చాతకానితనాన్ని ఎత్తిపొడుస్తున్నట్లనిపించింది.
    చాలా కోపం, ఉడుకుమోత్తనం వచ్చాయి అతనికి.
    "ఏం, అంత చవట దద్దమ్మలా కనిపిస్తున్నానా. సరోజా, చనువిచ్చానని నెత్తికెక్కాలని ప్రయత్నించకు. నీ హద్దులో నీ వుండు" కోపంగా అని విసవిస వెళ్ళిపోయాడు. ఆ మాటకి సరోజ వెలవెలపోయింది. సరస్వతమ్మకు మొహం ఎర్రబడింది. అవమానంతో సరోజ కళ్ళలో నీరు తిరిగింది. "సరోజా ఛా -ఏమిటది వాడేదో ఇవ్వాళ కోపంగా వున్నాడమ్మా అసలీమధ్య వాడెందుకో చాలా చిరాగ్గావుంటున్నాడు. ఆ కోపంతో ఏదో అన్నాడు. అది పట్టించుకోకు. వాడ్ని నేను కేకలేస్తాగా..." సముదాయించే ధోరణిలో సరోజతో అంది. సరోజ అదోలా నవ్వి కళ్ళు తుడుచుకుంది. "ఆయనన్నదాన్లో తప్పేంలేదులెండి తప్పు నాదే" అంది.
    "వాడెప్పుడూ యిలా లేడు. ఏమయిందో ఈ మధ్య వాడికి అంతుబట్టకుండా వుంది. సరోజ వాడు బాధపడతాడు వెళ్ళమ్మా - వస్తానని చెప్పిరా వెళ్ళు." ఆవిడ ఆవేదనగా అంది. సరోజ ఒక్కక్షణం ఆలోచించి మేడమీదకి వెళ్ళింది.

 Previous Page Next Page