నా మొహంలో నిరాశ చూసి "చూడమ్మా విజయా! నీకు తల్లిలాంటి దాన్ని చెపుతున్నాను. వాడు కాస్తంత దుడుకువాడు. చిన్నప్పటినుంచి కోపం, పట్టుదల, తనదే పై చెయ్యిగా ఉండాలనే పంతం వాడికి. పుట్టుకతో వచ్చిన గుణాలు ఒక పట్టానపోవు. తల్లిదండ్రులం గనక వాడి కోపం, పంతం సహిస్తాం. అలాగే పెళ్ళయ్యాక భార్యా అవన్నీ చూసీచూడనట్టు సర్దుకోవాలమ్మా!"
"అత్తగారూ! సహించడం అంటే ఎంత వరకండి? ఎంత భార్య అయినా తిట్టి కొట్టి రాక్షసుడిలా ప్రవర్తిస్తే సహించగలదా," ఆవేశంగా అన్నాను.
"చూడమ్మా! సహించక ఎదురుతిరిగేవే అనుకో. వాడి కోపం మరింత ఎక్కువవడం. ఇద్దరి మధ్య కలతలు మరింత ఎక్కువయి ఇల్లు నరకం అవడం మినహా ప్రయోజనం ఏముంది? భార్యాభర్తలలో ఎవరు తగ్గారన్నది కాదు ముఖ్యం. సంసారం సాఫీగా నడవడం."
"ఇవన్నీ పాత మాటలు. మొగుడు ఎలాంటివాడైనా, తిట్టినా, కొట్టినా సహించి పడుండాలి అనే పతివ్రతల రోజులు కావు ఇవి. భార్య అంటే బానిస కాదు అని తెలియజెప్పె రోజులు. భార్యని తోటి మనిషిగా, తన ఇంట్లో సమాన స్థాయినిచ్చి చూడని భర్తని ఏభార్యా క్షమించదు" తీవ్రంగా అన్నాను.
"క్షమించక ఏం చేస్తుందమ్మా ! నీ వెర్రికాని, ఎంత రోజులు మారినా, మన ఆడవాళ్ళ కథలు మారవమ్మా!" ఆవిడ అదోలా నవ్వి అన్నారు.
"ఆ కథల్ని మీ తరం స్త్రీలు మార్చలేక పోయారు. ఆ పని ఈ తరం స్త్రీ చేస్తుంది" నిబ్బరంగా అన్నాను.
ఆవిడకి ముందు రోజు సంగతి బెంగుళూరులో నన్ను ఎలా బందీని చేసింది అన్నీ చెప్పి, "ఈ స్థితిలో నేనే కాదు ఏ ఆడదైతే మాత్రం సహిస్తుంది? ఈ రోజు ఇంకా ఇక్కడ ఉన్నానంటే మీ మొహం చూసి. బెంగుళూరులో ఆయన భయంకొద్ది తప్పించుకునే మార్గంలేక పడి ఉన్నాను. లేదంటే ఆ రోజుతోనే ఆయనకు నాకు సరి అయ్యేది" ఆవేశంగా అన్నాను.
ఆమె కలవరపడ్డారు "తొందరపడకమ్మా! భర్తని కాదన్న ఆడదానికి పుట్టింట కూడా స్థానం దొరకదు. నీవు ఉద్రేకపడి చెయ్యగలిగింది ఏమీ ఉండదు."
"ఉద్రేకం, ఆవేశం నాలో ఇప్పటికే సగం చచ్చాయి. మిగతా సగం పూర్తిగా చావకముందే నా ఆత్మాభిమానం కాపాడు కోవాలి. మా నాన్నగారి కీ సంగతి తెలిస్తే తమ ముద్దుల ఏకైక గారాల పట్టికి పట్టిన గతి చూసి లోకాన్ని లెక్క చెయ్యరని నా నమ్మకం. పోనీ, పుట్టింట ఆదరణ లభించకపోతే ఏదో ఉద్యోగం చేసుకు బతక లేకపోణు. ఏ బతుకయినా ఈ బతుక్కి తీసిపోదండి."
ఆవిడ తెల్లబోతూ, "నీవు చాలా దూరం ఆలోచిస్తున్నావు విజయా! అంత అవసరం వస్తుందనుకోను. వాడిని మేము చీవాట్లు పెట్టాం. వాడు మారుతాడు. నీవూ మరో అవకాశం వాడికి యియ్యాలమ్మా! ఊ అంటే ఆ అంటే విడిపోవడానికి యిది విదేశం కాదమ్మా!" నచ్చచెప్పసాగారు.
"హుఁ - మారితే సంతోషమే. కాని నాకా నమ్మకం లేదు. ఆయన మారేలోగా నేను మిగిలివుంటానా?" శుష్కహాసం చేశాను.
ఆవిడ జవాబు యివ్వలేనట్టు నిస్సహాయంగా చూశారు.
"అత్తగారూ! ముందే చెపుతున్నాను. రేపు ఏనాడో నేను ఇల్లు వదలవలసివస్తే నన్ను దూషించకండి. మీరు కన్నతల్లిగా నన్ను అభిమానంతో చూశారు గనక మీ మాట మన్నించి, ఆయనకి ఒక అవకాశం యిస్తాను. ఆయన మారితే గతం మరిచి క్షమిస్తాను. లేదంటే లోకానికి భయపడి మాత్రం ఆ నరకంలో బతకను." నా నిశ్చయం తెలియజేశాను.
* * *
"ఎంత తేలిగ్గా అంతా నా చేతిలో వున్నట్టే నిబ్బరంగా చెప్పాను ఆ రోజు".
"ఏం. ఏమయింది? ఆయన మారలేదా?" శారద ఆరాటంగా అడిగింది.
"ఆయన మారితే అసలీ కథే వుండేది కాదుగా?" విజయ నవ్వింది.
"అవునవును. తరువాత ఏం జరిగింది!"
"తరువాత ఓ పదిహేను రోజులు నేను అత్తవారింట్లోనే వున్నాను. మనిషి దొరకలేదని దొరగ్గానే వచ్చి తీసికెడతానని మామగారికి ఆయన రాశారు. ఈలోగా మా యింటికి వెడదామంటే ఎప్పుడొస్తారో నని వెళ్ళనీయలేదు మా అత్తగారు. ఇంటికి ఉత్తరం రాద్దామనుకున్నాను. ఆయన వ్యవహారం ఎలా ఉంటుందో చూడకుండా ముందే ఈ సంగతులు రాసి వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని కేవలం క్షేమంరాసి వూరుకున్నాను.
అక్కడుండగా ఓరోజు ఆయన పెళ్ళికి మధ్యవర్తిత్వం వహించి సుశీలతో మాట్లాడడానికి వెళ్ళిన ఆయన వచ్చారు. మాటల్లో సుశీల ఈ వూర్లోనే వుంటుందని విన్నాక ఆమెని ఒకసారి కలుసుకోవాలన్న కోరికని అదుపులో పెట్టుకోలేక పోయాను.
అత్తగారు "వద్దమ్మా! ఇంటిగుట్టు రచ్చకెక్కించినట్టవుతుంది" అన్నారు.