Previous Page Next Page 
మాయ జలతారు పేజి 28


    బాలయ్య లేచి బయటికి వచ్చి సలామ్ చేశాడు.
    "లీడరువు నువ్వేనా?" అడిగాడు వెటకారంగా హుసేన్.
    బాలయ్యకేమీ అర్థంకాలేదు. వెర్రిగా చూచాడు. "లీడరేంది?" అడిగాడు.
    "ఏందో ఎరిక చెప్పేటందుకే వచ్చినం గుడిసెల కిరాయెందుక్కడతలేదు?"
    "కిరాయా? యాడ్ది?"
    ఈలోగా పిచ్చయ్య, పరమయ్య మరికొంతమంది కూడారక్కడ
    "యాడిదా? ఎట్లెరికైతది మస్తెక్కింది దాన్ని దింపేటంద్కె వచ్చినం"
    "అయ్యనీ జాగీ రనుకున్నవ ఈ జాగ కిరాయాడిదంటవు మొన్నటిదాక కట్టిందేది? హడ్డీ నరమైతే ఎరికైతది" అన్నాడు రామ్ మనోహర్ సింగ్, చొక్కా చేతులు కిందిదాకా లేకున్నా, పైకి తీస్తున్నట్టు నటిస్తూ.
    "జర మాటలు సీదరానియ్యి ఏమో ఎట్లనో మాట్లాడ్తావూ?" అన్నాడు పిచ్చయ్య కాస్త కోపంగానే.
    "నీ నెత్తి సీదాచేస్తే తెలుస్తది ఎవరనుకున్నవ్?" అని పైకి ఉరకబోయాడు సింగ్. హుసేన్ చేయి పట్టుకుని లాగితే, పిల్లిలా వెనకడుగు వేశాడు గుడ్లురిమి పిచ్చయ్యవైపు చూస్తూ.
    "కిరాయి యాడిదంటావేమయ్యా, జాగకు కిరాయి పట్టలేదా మీరు?" అడిగాడు హుసేన్.
    బాలయ్యకు ఒళ్ళు మండింది. అయినా తమాయించుకున్నాడు. "అన్న! కిరాయెన్నడు కట్టినమే మేము? సంగపు చందన్నరు కట్టినం ఇప్పుడెల్తలేదు కట్తలేం అందుకొచ్చినారు?"
    "ఇగో, లడాయి వడాయి నక్కో మూడునెల్ల కిరాయి గుడిసెకు పంద్రా ఇచ్చేయిరి, ఎళ్ళిపోతాం. ఎక్కి తక్కి మాట్లాడిన్రా - ఇగ మీరున్నరు, మేమున్నం, నా పేరెరికనా - మహమ్మద్ హుసేన్ పహెల్వాన్!"
    ఒకరి ముఖాలు ఒకరు చూచున్నారు గుడిసెలవాళ్ళు.
    పిచ్చయ్య పళ్ళు జల్లుమంది. బాలయ్య కూడా జంకాడు అయినా, ధైర్యంగా అన్నాడు. "చందకోసం జబదస్తేంది మర్జి ఉంటే ఇస్తం, లేకుంటే లేదు"
    "చందేంది బే, బిచ్చమిస్తాన్నవా? జాగమీదుంటాను, కిరాయియ్యాలి. ఆఁ _ ఇదంత నడ్వద్ _ ఏమనుకుంటున్నవో" అన్నాడు సింగ్.
    "జాగేఁ ఉస్మాన్ సాబ్ దా?"
    "కాకుంటే నీ అబ్బదా?"
    "జర సంచ్లాయించక మాట్లాడు" అన్నాడు పిచ్చయ్య.
    "నజ్రాలు వేస్తున్నావ్ బె హరామ్జాదె" అని పిచ్చయ్య మీదికి ఉరికాడు సింగ్. పిచ్చయ్య కూడా సిద్ధమై నుంచున్నాడు. పిచ్చయ్యకు సహాయంగా ఇద్దరు ముగ్గురు వచ్చి నుంచున్నారు. ఊపులో వచ్చాడు సింగ్. ముగ్గురు కలిసి వెనక్కు నెట్టారు. వెనక్కు పడిపోయాడు. అక్కడున్న పిల్లలంతా నవ్వారు. దులుపుకొని లేచి మళ్ళీ మీదికి ఉరకపోయాడు సింగ్. హుసేన్ అతని జబ్బ పట్టుకొని వెనక్కు లాగాడు. ఒక్క మొగ్గు మొగ్గి వెనక అడుగువేసి స్థిరంగా నుంచున్నాడు సింగ్.
    'నువ్వే మురవ్వత్ చూపిస్తాన్నవు వీండ్ల ఇట్ల ఇంటారు నరమ్ చేయాలి. నరమ్ ఛొడిబే పాయి ఉస్మాన్ పాదిక్ తొ చెప్త, నువ్వు సుత వీళ్ళతోనే ఉండు" అని ఎగిరి జబ్బ విడిపించుకోవడానికి ప్రయత్నించి విడిపించుకోలేక రొప్పుతూ అక్కడే ఉండిపోయాడు.
    "ఖాముష్, బక్ బక్ నై" అని బాలయ్య నుద్దేశించి, "ఈ జాగ ఉస్మాన్ సాబ్ పేరైంది. కాయితాలు సుతునై సీద కిరాయిలిచ్చెయిన్రి లేకుంటే ఒకడు బచాయించడు" అన్నాడు.
    "సంగం పెట్టి లచాయిస్త నన్నడే ఉస్మాన్ సాబ్?" బాలయ్యన్నాడు.
    "అదంత నైజానై ఉస్మాన్ సాబ్ జాక్కొన్నడు మీరు కిరాయి బాకీ పడ్డరు. ఇప్పుడు లేదంటరా? ఎప్పుడిస్తరో చెప్పున్రి ఎక్కొటైతండ్రు చూసిన్రా జోఁప్డీలు బచాయించవ్ మీరు బచాయించరు. ఏమన్నా ఇన్నావున్నదా కిరా యియ్యమంటే ఎగనూకుత మంటరు"
    బాలయ్య కుడితిలోపడ్డ ఎలికలా అయిపోయాడు. అంతా అయోమయంగా ఉందతనికి.
    'ఎప్పుడిస్తరో చెప్పున్రి"
    "ఇయ్యం" అన్నాడు పిచ్చయ్య.
    "ఎమ్ దిమాగ్ గిమాగ్ ఫిరాయిస్తున్నాదిబే. కాస్త ఊరుకుంటే బడాయిస్తాన్నవ్ ఉస్మాన్ సాబ్ కు పుట్టినావ్ బే. ఒక్క దెబ్బకు నెత్తి పగుల్తది - ఏమనుకున్నవ్?"
    ఆ తిట్టు భరించలేకపోయాడు పిచ్చయ్య. బాలయ్య మండిపోయాడు.
    "ఏందే ఏమన్నవ్? కుయ్ మల్ల" అని పిచ్చయ్య హుసేన్ మీదికి ఉరికాడు. హుసేన్ కర్ర పైకెత్తాడు. వెనకనుంచి ఒకడు కర్ర లాగేయడంతో పిచ్చయ్య ఊపుతో హుసేన్ మీదపడ్డాడు. హుసేన్ కు పట్టు దొరక్క క్రింద పడిపోయాడు. పిచ్చయ్య వాడిమీదపడి మెడ పట్టుకున్నాడు. పిచ్చయ్య మీదికి దూకపోయిన సింగ్ ను నలుగురు కలిసి పట్టుకొని వెనక్కు లాగి, తలా ఒకటి బాదారు.
    హుసేన్ రొమ్ముమీద కూర్చున్న పిచ్చయ్య రెండు చేతుల్తోనూ మెడ పట్టుకుని ఊపి తల నేలకొట్టసాగాడు. హుసేన్ బలం తక్కువ వాడనికాదు కాని, పట్టు దొరక్క అతని బలం తగ్గిపోగా, ఉద్రేకంలో పిచ్చయ్య బలం హెచ్చింది. గుడ్లు తేలవేయసాగాడు హుసేన్. బాలయ్య  మిగతావాళ్ళు వచ్చి విడిపించగా లేచి నుంచున్నాడు హుసేన్. అతని గుడ్డలన్నీ పాడైనాయి. మెడమీద పిచ్చయ్య గోళ్ళుదిగి రక్తం వస్తూంది. చేత్తో రక్తం తుడుచుకొని చూచుకున్నాడు. కర్ర అందుకోబోయాడు. బాలయ్య కర్రను అదిమిపెట్టాడు.
    "సరే చూస్త" అని "రాబే సింగ్" అని సింగ్ ను పిల్చుకొని బైల్దేరి, "ఈ జోప్డీల్నుంచి ఎల్లగొట్టకుంటే నా పేరు హుసేన్ కాదు" అన్నాడు కొంతదూరం పోయి వెనక్కు తిరిగి.
    "పోబే హిజ్డే పో" అన్నారు గుడిసెలవాళ్ళు మిర్రి మిర్రి చూస్తూ వెళ్ళిపోయారు ఇద్దరు దాదాలున్నూ.
    "ఆడు పైనున్నోడు మనం గరీబోల్లం. గుండల్ను పంపించిండియాల గుడిసెలు పీకిస్తడు. రేపు ఏందో ఇదంత మంచికొచ్చినాది?" అన్నాడొకడు.
    "అరె ఎవడ్రా గట్ల బకాయిస్తాండు. పైనున్నోడైతే పల్లకెక్కి ఊరేగమను పేదోల్ల మీద జులుం చేస్తడా? ఉఖ్డాయిస్తడంటే గుడెస్నె కాదు - నిన్ను కూడ ఉఖ్డాయిస్తడు. చూస్తం ఎట్ల పీకుతడో?" అని చేయి మలిచి కండ చూపించాడు ఒకడు.
    "అన్నదార బలం బలం ఉంటే నెత్తురు కూడు తింటావుర? వాని జాగలుంటవ్ వాన్నే కొడ్తనంటే నాయముండాల్ర నాయం వాడికి కిరాయన్నియ్యాలె గుడిసెలన్న పీక్కోనిపోవాలె అన్యాయం నిలుస్తాదిర, అన్నాయం! దరమరాజులోరు ఎన్ని కష్టాలు పడ్డాడు నాయంకోసం?" అన్నాడు ఒక వృద్ధుడు.
    "ఒహో ఒహో! నీతులు చెపుతాండయ్య! గీ ముసలోళ్ళున్నరే అందరు గిట్లనే! జాగెవనిదో వాడికే ఎరికెలేదాయె. నేను పుట్టకముందు నుంచే ఉంటాన్నరాయె! ఆడి జాగైతే ఇన్నాళ్ళసంది ఎందుకురాడాయె? దొంగలు యాడికి చాలదు బంగ్లమీద బంగ్ల కడ్తరు. గుడిసెలున్నోణ్ణి ఎల్లగొట్టేటందుకు చూస్తరు. ఏమన్న కానియ్యె బాలయ్యన్న, గుడిసె లొదిలెడ్ది లేదు" అన్నాడొక యువకుడు.
    "ఈ లడాయిల నా కాలు వూడ్తది. యాణ్ణన్న ఏరే చూస్కుంట - నీ తల్లి - ఎవరికి పట్టిందిదంత" అని మెల్లిగా జారుకోవడానికి కదిలాడు పరమయ్య.
    పట్టి లాగాడు పిచ్చయ్య . "ఏందో నఖ్రాలు చేస్తాన్నవు నీ కాలు వూడ్తదని మా అందర్ని కొరత కేస్తవా? గూడెం నుంచి కదిల్నవో కాళ్ళిరక్కొడ్తం ఏమనుకొంటున్నవో? చస్తే ఈడనే చావాలె ఒరే పరిమిగా! మడిసి ఒక్కపాలె పుడ్తడు ఒక్కపాలె చస్తడుర ఎట్లెళ్ళ గొడ్తరో చూస్తం. రాబే నిలబడు కొలువూడ్తే చంద చేసి వస్త్రం బే కంజూస్ మా" అన్నాడు తరువాత అందరిని ఉద్దేశించి "బాలయ్య ఎట్లచెప్తే అట్ల చెయ్యాలె చస్తే చస్తం బతుకుతె బతుకుతం ఏమంటవే బాలయన్నా?" అని అడిగాడు.  
    బాలయ్యకు అంతా అయోమయంగా ఉంది. రిక్షాకు బాకీ ఉంది. ఈ రోజు వాడు రిక్షా ఇస్తాడో లేడో తెలీదు. రాత్రి తిండి తినలేదు. ఇప్పటికి చాయ్ లేకున్నా, ఇంత గొడవ జరుగుతున్నా, పిల్లలు వీధిలో కూర్చొని ఒకరి నెత్తిమీద ఒకరు దుమ్ముపోసుకుని ఆడుకుంటున్నారు. చేతికందిన కొడుకు రామారావు లేచిపోయాడు. ఇవన్నీ ఉండగా ఈ గుడిసెల పోట్లాట వచ్చింది. ఆ విషయంలోనన్నా అందరూ కలిసికట్టుగా ఉన్నారా అంటే, ఒకడు కూటికి లాగితే మరొకడు కాటికి లాగుతున్నాడు. ఇద్దరు దాదాలు వచ్చేవరకు ఇలా నీరు కారిపోతున్న జనంతో ఎలా నెగ్గడం? ఏం చేయాలి? తోచలేదు.

 Previous Page Next Page