Previous Page Next Page 
ఆఖరి మలుపు పేజి 28


    అది కృష్ణాజీ ఫోటో.


    ప్రెసిడెంట్ చే గోల్డ్ మెడల్ అందుకుంటూ ఉండగా తీసిన ఫోటో అది.


    చాలాసేపు అతని ఫోటో వేపు చూస్తూ ఉండిపోయాడు రాజా.


    తర్వాత ఆ ఫోటో ఉన్న పేపరు షీట్ ని చింపి, జాగ్రత్తగా మడతపెట్టి, తన జేబులో పెట్టుకున్నాడు.


    తర్వాత అర్పిత ఉన్నవేపు తిరిగాడు.


    ఆమె లేదు అక్కడ.


    అటే చూస్తూ కూర్చుండిపోయాడతను.


    అరగంట గడిచింది.


    అప్పుడు మళ్ళీ కనబడింది అర్పిత. ఆమె ప్రక్కనే ఆ గర్విష్టి అమ్మాయి. బహుశా అక్క అయి వుండాలి. ఇద్దరూ దాదాపు ఒకే పోలికలతో వున్నారు. స్కూలుకి బయలుదేరారేమో, ఇద్దరి చేతుల్లోనూ పుస్తకాలు వున్నాయి.


    అక్క గుమ్మం దగ్గరికి వచ్చేసింది.


    చెల్లెలు అర్పిత మాత్రం వచ్చేముందు వంగి, తండ్రి కాళ్ళకు దణ్ణం పెట్టి మరీ వచ్చింది.


    ఎందుకో తెలియదుగానీ ఆ సీన్ అతడిని హఠాత్తుగా అప్ సెట్ చేసేసింది.


    ఆ అమ్మాయికి తండ్రి అంటే అంత భయభక్తులు ఉన్నాయన్నమాట!


    తనకీ ఒక తండ్రి ఉన్నాడు.


    కానీ కాళ్ళకి దణ్ణం పెట్టాల్సినంత గొప్పవాడు కాడు.


    తను పుట్టిన తరువాత ఎవరి కాళ్ళకీ దణ్ణం పెట్టలేదు. అసలు అటువంటి మనిషి ఎవరూ తనకి తగల్లేదు కూడా.


    దిగులంటే తెలీదు అతడికి. కానీ ఆ రోజు, అప్పుడు, మొదటిసారిగా దిగులనిపించింది. తను గడిపే జీవితం అంటే హఠాత్తుగా విసుగనిపించింది.


    మళ్ళీ అర్పితవేపు చూశాడు.


    అర్పితని వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకుని, నుదుటిమీద ముద్దు పెట్టుకుని, ఆప్యాయంగా ఏదో అడుగుతున్నాడు.


    ఆయన ఆ అమ్మాయిని అడుగుతున్నదేమిటో వినబడలేదు రాజాకి.


    కానీ ఊహించడానికి ప్రయత్నించాడు.


    "అన్నం తిన్నావా అమ్మా? పుస్తకాలన్నీ తీసుకున్నావా? డబ్బులున్నాయా? జాగ్రత్తగా వెళ్లేం! మధ్యాహ్నం అన్నం తినడం మర్చిపోకూ! సాయంత్రం ఆడుకునేటప్పుడు జాగ్రత్తేం! వెళ్ళిరా తల్లీ! జాగ్రత్త నాన్నా!"


    సరిగ్గా అవే మాటలు అంటున్నాడు ఆ పెద్దమనిషి తన కూతురు అర్పితతో. ఆయన పేరు సదాశివ బ్రహ్మం. పెద్దకూతురు అంకితవేపు చూశాడాయన. ఆ అమ్మాయికి తనంటే అంత లక్ష్యం లేదు. తనంటేనే కాదు- ఎవరన్నా కూడా లక్ష్యం లేదు ఆ అమ్మాయికి. పెడసరి స్వభావం.


    ఇంకోసారి అర్పిత తల నిమిరి, సాగనంపాడు ఆయన.


    వెళ్తూ వెళ్తూ రాజావేపు చూసి నవ్వింది అర్పిత.


    చెయ్యి ఊపాడు రాజా.


    తర్వాత చాలాసేపు అలాగే కూర్చుండిపోయాడు.


    ఆ తర్వాత జేబులోనుంచి పేపరు కట్టింగ్ తీశాడు. ధర్మదేవతకి దత్తపుత్రుడిలాంటి కృష్ణాజీ ఫోటో వైపు చూస్తూ ఉండిపోయాడు.


    క్రమంగా, అతనికి తెలియకుండానే అతని చేతులు ఆ ఫోటోలోని అతని మొహం దగ్గరికి తీసుకొచ్చాయి.


    అప్రయత్నంగానే ఫోటోని కళ్ళకి అద్దుకున్నాడు రాజా.


    వెంటనే అతనికి అపారమైన రిలీఫ్ కలిగినట్లయ్యింది.


    తనకి తెలిసిన వాళ్ళలో గొప్పవాళ్ళు లేకపోవడమేం?


    టైగర్ కృష్ణాజీని మించిన గొప్పవాడు ఈ ప్రపంచంలో ఎవరుంటారు?


    ఇదిగో....ఈయన గొప్పాడే కావచ్చు.


    కానీ సొంత కూతురి మీద ప్రేమ చూపించడం అంటే అదేమంత గొప్ప!


    ఒక కిలాడీ నాకొడుకుని చేరదీసి, వాడికి చదువు చెప్పించడానికి పాతికవేలు యిచ్చిన వాడిది కదా గొప్పతనం అంటే!

    
    వీళ్ళందరి గొప్పతనమూ ఆ మాటకొస్తే ప్రపంచంలో వున్న గొప్పోళ్ళందరి గొప్పతనమూ కలిసి కృష్ణాజీ కాళ్ళ ముందు కుప్పపోసినా ఆయన మంచితనంలో మూడోవంతు వుండదు!


    ఒక్కసారిగా అర్థం అయ్యింది రాజాకి.


    కృష్ణాజీ గొప్పతనం ,మంచితనం, నిజాయితీ, దేశభక్తి....


    తనకు తెలియకుండానే రాజా కళ్ళెంబడి నీళ్ళు తిరిగాయి. ఆయనతో తను రూడ్ గా మాట్లాడిన మాటలన్నీ గుర్తొచ్చాయి.


    అన్నిట్లోకీ కూడా రాజా తలుచుకుని సిగ్గుపడేటట్లు చేసిన విషయం.


    ఆయన ముందు తను సిగరెట్ కాల్చడానికి ట్రై చేయడం.


    దానికి ఆయనేమీ అనకుండా, కేవలం ఒక్క చూపు చూశాడు.


    అబ్బ....ఆ చూపులో బాధ....ఆరోపణ....


    ఫోటో ఉన్న పేపరుని నేలమీద పెట్టాడు రాజా.


    కృష్ణాజీ తాలూకు ఫుల్ లెంగ్త్ ఫోటో అది. కాళ్ళు కనబడుతున్నాయి.


    వంగి, నుదుటిని కృష్ణాజీ కాళ్ళకి ఆనించాడు రాజా. అతని కళ్ళలో నుంచి రెండు నీటి చుక్కలు రాలి ఫోటోని తడిపాయి.


    అలా ఒక్క నిమిషం పాటు వున్నాడు రాజా.


    తర్వాత చటుక్కున లేచాడు. అతని కళ్ళలో ఒక నిశ్చయం కనబడుతోంది యిప్పుడు.

 Previous Page Next Page