Previous Page Next Page 
జన్మభూమి పేజి 28

    "పుణ్యం కంటే కూడా 'కీర్తికం జాతి' ఎక్కువ పట్టుకున్నట్టుంది. డాక్టర్ కేశవరావు దిగ్రేట్ అనిపించుకోవాలన్న తాపత్రయం కనిపిస్తూంది నాకు మీలో" హాస్యంగా ఏడిపించింది.
    కేశవరావు ఒక్కక్షణం వూరుకున్నారు.
    "నీవేం అనుకో నాకేం. పనిచేసి ఫలితం ఆశించడంలో తప్పు ఏం వుంది. నా వూరికి నేనేం చేశానో చెప్పుకోవడం కంటే చూపడం నాకిష్టం. అదిచూసి నలుగురూ ఆ బాట నడుస్తారని ఆశించడంలో తప్పేంలేదు. "కీర్తికం జాతి" పేరు పెట్టుకో...
    "అబ్బబ్బ... ఏదన్నా అంటే చాలు చిన్నపిల్లల్లా ఉడుక్కుంటారు. అంత సెన్సిటివ్ నెస్ పనికిరాదు. యూ ఆర్ గ్రేట్ అంటారు బాబూ. కావలిస్తే ఈ వూరు పేరు మార్చేసి కేశవపురం అని పెట్టించేయమంటానులెండి" రాజేశ్వరి హాస్యంగా అంది.
    "కేశవపురం! ఇదేదో బాగున్నట్లుందే! బాబ్బాబు వూరిలో వాళ్ళకి సిఫార్సు చేద్దూ" ఆయన హాస్యంగా అంటూ నవ్వారు.
                                   *    *    *
    ఆరోజు ఆస్పత్రి ప్రారంభోత్సవం. సరిగ్గా సమయానికి ఎమ్మెల్యే బుచ్చిరెడ్డి వూరిలోకి వచ్చాడు ముందురోజు. ఎవరిని పిలిచి ప్రారంభోత్సవం చేయడం అని ఆలోచించిన కేశవరావు సమస్య తీరింది. రంగా, వాసు, పిల్లలు అంతా కలిసి రంగు కాగితాలు కట్టి గుమ్మానికి రిబ్బను కట్టారు. పురోహితుడు వచ్చి మంత్రోచ్చారణ మధ్య గుమ్మం దగ్గిర కొబ్బరికాయ కొట్టించాక బుచ్చిరెడ్డి రిబ్బను కత్తిరించారు. అంతా చప్పట్లు కొట్టి లోపలికి నడిచారు. ఎదురుగా కనిపించే హాలు వచ్చినవారు కూర్చోడానికి, కుడివైపు గది డాక్టరు రోగులని పరీక్షించే గది. ఎడమవైపు గది ఆపరేషన్ థియేటరు. వెనకాతల హాలు నాలుగు మంచాలతో ఎవరన్నా ఇన్ పేషంట్లుగా చేరడానికి వీలుగా వుంది.
    ఓపక్క గది లేబర్ రూముగా మార్చారు. చిన్నచిన్న ఆపరేషన్లు, పోర్టబుల్ ఎక్స్ రే మిషనుతో ఎక్సరే ఫోటోలు తీయడానికి ఇ.సి.జి. మిషను, స్కానింగ్ మిషన్ అన్నీ ఎక్కడెక్కడ సర్దారు. ఆపరేషన్ పరికరాలు, డిస్ పోజబుల్ సిరంజ్ లు, కత్తులు, కటార్లు, స్టెరిలైజింగ్ సామానులు, ముఖ్యమైన మందులతో బీరువా అన్నీ కలిపి ఆస్పత్రి చూడగానే పేషంటుకి అక్కడ వైద్యం బాగా జరుగుతుంది అన్న నమ్మకం ఏర్పడేట్టు ఉంది.
    అంతకు ముందురోజే నర్సు విమలమ్మ వచ్చింది. రిటైరయినా వయసు యాభైఎనిమిదేళ్ళున్నా దృఢంగా వుంది. గవర్నమెంటు ఆస్పత్రిలో పనిచేయడంతో అన్నిరకాల కేసులు చూసిన మనిషి, డాక్టరు లేకపోయినా కాస్త సంబాళించగల శక్తిసామర్థ్యాలున్న మనిషి అన్పించింది చూడగానే. చామనఛాయ రంగులో, నెరిసీ నెరియని జుట్టు, కళ్ళజోడుతో గంభీరంగా వున్న విమలమ్మని చూడగానే కేశవరావుకి తన సెలక్షన్ సరి అయిందనిపించింది.
    "ఏమ్మా! రిటైరయ్యారు. హాయిగా యింటిపట్టున వుండకుండా యింత దూరంలో గ్రామానికి ఎందుకు వచ్చారు?" వచ్చినరోజు యింటర్వ్యూ చేస్తూ అడిగారాయన.
    "నిజం చెప్పనా డాక్టర్- నా భర్త పోయారు. నా కొడుకు, కూతురు ఎవరి కాపరాలు వారికి వున్నాయి. వున్న వూరిలో ఉంటే కొడుకు దగ్గిర వుండాలి. అది నాకిష్టం లేదు. నా కోడలూ ఉద్యోగం చేస్తుంది. రిటైరయ్యాను కనక ఇంటిపని, పిల్లల పని నాదని ఆమె అనుకోవచ్చు. ఒకే యింట్లో వుంటే అభిప్రాయభేదాలు తలెత్తి ఆప్యాయతలు దూరం కావచ్చు. ఇంకా నా ఒంట్లో ఓపిక వుంది. నే కావాలంటే సిటీలోనే ఉద్యోగం దొరుకుతుంది. కానీ వాళ్లకి దూరంగా వుండాలనే యిలా వచ్చాను. వచ్చాక మిమ్మల్ని చూశాక నా నిర్ణయం సరైనదనిపించింది. యిలాంటి గొప్ప డాక్టరు దగ్గిర నర్సుగా పనిచేయడం నా అదృష్టం అని భావిస్తాను. ఇంత మంచి మనసుతో యిలా పల్లెలో ఆస్పత్రి పెట్టి ఉచితవైద్యం అందించాలనుకునే మీకు నా చేతనైన సహాయం అందిస్తాను. బతకడానికి తినాలి, తినడానికి డబ్బు వుండాలి గనక జీతం కాస్త ఇవ్వండి. కొంత పెన్షన్ ఎలాగో తినడానికి వస్తుంది. మిగతాది మీరివ్వండి..." ఫ్రాంక్ గా అంది విమల.  
    "మీ బస... ఈ వూరిలో పెద్దగా యిళ్ళు అద్దెకి దొరకవు."
    "వంటరిదాన్ని ఈ ఇంట్లో ఇన్ని రూములున్నాయి. ఒక రూములో యిక్కడే వుంటాను. అది మీకూ మంచిదే. ఎవరన్నా ఇన్ పేషంట్లు ఉన్నప్పుడు నేను చూసుకుంటాను. డాక్టరుగారూ, నా వృత్తి అంటే నాకు అభిమానం, గౌరవం - నర్సుగా నా సేవలు మీతోపాటు నేను ఈ వూరి ప్రజలకు అందిస్తానని మనస్పూర్తిగా మాటిస్తున్నాను."
    "అడ్వాన్సుగా కొంత తీసుకుని మీకు కావాల్సిన సామానులు...వంటకి కావాల్సినవన్నీ కొనుక్కోండి..." ఆయనకి నర్సుని చూశాక కాస్త నిశ్చింతగానే అన్పించింది. తను లేనప్పుడు పేషంట్లని ఆమాత్రం మేనేజ్ చెయ్యగలదన్న నమ్మకం కలిగింది.
    ఆస్పత్రి రిబ్బను కత్తిరించాక ఎమ్మెల్యే చిన్న ఉపన్యాసం ఇచ్చాడు. కేశవరావు చేస్తున్న మంచి పనుల గురించి, రోడ్డు యింత త్వరలో అయిపోవడం చూసి మెచ్చుకున్నారు.
    దానికి నవ్వుతూ కేశవరావు "వట్టి పొగడ్తలు మాకొద్దు సార్. మేం అందరం చందాలు వేసుకున్నాం. మీ చందా మిగిలిపోయింది ఇంకా" అని నవ్వుతూ అంటించారు.
    "ఇంకా స్కూలు బాగు చేయించాలి, బ్యాంకు ఖాతాలు అందరిచేత తెరిపించాలి. మీ నియోజనవర్గం ఇది. మీ సహాయం కావాలి మరి"
    "తప్పకుండా, తప్పకుండా చేయిద్దాం... నా పర్సనల్ చందానే కాకుండా ప్రభుత్వం జన్మభూమి పథకం కింద యిచ్చేది తొందరగా తెప్పిస్తా..." దర్పంగా అన్నాడు.
    "ప్రతియేడు మీ నియోజకవర్గంలో పనులకింద ప్రభుత్వం ప్రతి ఎమ్మెల్యేకి కొంత డబ్బు కేటాయిస్తుందనుకుంటాను. ఆ నిధులు మరి ఏవిధంగా ఖర్చు పెడతారు మీరు" లౌక్యం తెలియని కేశవరావు మొహం మీద అడిగేయడంతో గతుక్కుమన్నాడు బుచ్చిరెడ్డి.
    "ఈ ఏదో మంచినీటికి, రోడ్లకి, దీపాలకి, వ్యవసాయ కాలువ మరమ్మత్తులకి...ఆ ఎంతలెండి ఇచ్చేది...ఇదిగో రెండు బోర్లు తవ్వించాలనే వచ్చాను... రోడ్లు ఎలాగో మీరు వేయించారు. కనుక దీపాలు పెట్టిద్దాం...ఆ స్కూలుకి కూడా కొంత గ్రాంటు శాంక్షను ఇస్తాలెండి."
    "ఇక్కడ ప్రతివారు వారి తాహతుకొద్ది అందరూ ఇచ్చారు. ఈ బీదవారిని మళ్ళీ స్కూలు బిల్డింగుకి అడగాలంటే మొహమాటంగా వుంది. ఈసారి స్కూలు బాగుచేయించడానికి ప్రభుత్వం మీకిచ్చినదానితో- నేను, మరికొంతమంది వూరిలో డబ్బున్నవాళ్ళు మాత్రమే ఖర్చు భరిద్దాం" కేశవరావు నిక్కచ్చిగా అన్నాడు.
    డాక్టర్ కి ముఖ్యమంత్రి దగ్గరవున్న పరిచయం బుచ్చిరెడ్డికి తెలుసు. తను అటు ఇటు మాట్లాడితే మీ ఎమ్మెల్యే మీరిచ్చిన గ్రాంటులు నియోజకవర్గానికి ఏం వుపయోగించాడు అని నిలదీయవచ్చు. ఇలాంటి చదువు, డబ్బు, పలుకుబడి వున్నవాళ్ళదగ్గర జాగ్రత్తగా వుండాలని అతనికి తెలుసు. అంచేత గత్యంతరంలేక "తప్పకుండా...తప్పకుండా స్కూలు బాగుచేయించే ముందు డబ్బిస్తా" అన్నాడు.
    "అయ్యా! మీరు మాకెక్కడ దొరుకుతారు మళ్ళీ- మీ అసెంబ్లీ విడుదల అవుతుంది. హైదరాబాదు వెళ్ళిపోతారు. మీరంతా బిజీ మనుషులు. మిమ్మల్ని మేం పట్టుకోవడం కష్టం గాని, రేపు ఉదయం ఈ శ్రీనివాస్ ని పంపిస్తాను, చెక్ యివ్వండి. అసలు ముందు డబ్బు ఎంత జమ అయ్యిందీ చూసుకుని పని ఆరంభించాలి. వచ్చిన డబ్బునిబట్టి ఇంకో రూము కూడా ఆఫీసుకి వేయించి, వరండాలో రెండో గ్రిల్ పెట్టిస్తే మొత్తం ఐదు క్లాసులకి సరిపోతుంది. అంచేత డబ్బు ముందే సమకూర్చుకోవాలి-" కేశవరావు అమెరికాలో గడిపిన మనిషి. ఈ దేశ రాజకీయాలు తెలియవు. అవినీతి ఎంతలా వేళ్ళు పాతుకుపోయిందో ఆయనకి సగం సంగతులు అర్ధంకావు. అక్కడిలా అంతా నిజాయితీపరులు అని ఆయన అనుకుంటాను. కేశవరావు మాటలతో ఎమ్మెల్యేకి పచ్చివెలక్కాయ పడింది. కక్కలేక మింగలేక 'సరే సర్! రేపొద్దున చెక్ ఇస్తాను' అని గబగబ ఎందుకొచ్చానురా బాబూ అన్నట్టు పారిపోయాడు.
    "బాగా నిలదీశారు సార్. మీరడిగారు కాబట్టి విధిలేక యిస్తాడు డబ్బు. ప్రభుత్వం ఎమ్మెల్యేలకి తమ నియోజకవర్గానికిచ్చే గ్రాంట్ అంతా వాళ్ళే దిగమింగుతారు. ఏ గ్రామమైనా చూడండి వీళ్ళెవరన్నా ఏదన్నా చేస్తారేమో. ఎన్నికలపుడు చేసిన వాగ్దానాలు మళ్ళీ ఎన్నికల వరకు వాగ్దానాలుగానే మిగిలిపోతాయి. బోర్లు హరిజనవాడలో ఒకటే వుంది. వూరి మధ్యన ఒకటి తవ్వించమని ఎన్నిసార్లు మొత్తుకున్నా యిదిగో అదిగో అంటాడు. స్కూలు, హాస్పిటల్, లైబ్రరీ, రోడ్లు వీటన్నింటికి ఎంతోకొంత గ్రాంటు వుంటుంది. అది వీళ్ళ జేబుల్లోకే వెళుతుంది. ఐదేళ్ళలో ఎంత డబ్బు చేసుకుందామా అని. వూరి గురించి ఎవరికి కావాలి. మాలాంటివాళ్ళం అడిగితే ఇదిగో అదిగో అనేవాడు. మీరడిగితే యింకేం అనలేక యిస్తాడు ఈసారి" ప్రెసిడెంటు అక్కసుగా అన్నాడు.

 Previous Page Next Page