Previous Page Next Page 
పడుచుదనం రైలుబండి పేజి 28


    "ఆయన కూడా ఏదన్నా ఆపదలో పడ్డారేమో" లక్ష్మి కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ అంది.


    "అలాంటిదేమీ జరిగి వుండదు. మీకోసం ఇక్కడికి వచ్చి వెళ్ళి ఉంటారు. మీరు కనిపించకపోవడంతో మళ్ళీ అక్కడికి ఎక్కడకో వెళ్ళి ఉంటారు" అని చెప్పింది వందన.


    ఆమెతోపాటు ఆమె భర్త రాకకోసం నిరీక్షిస్తూ అటు ఇటు వెళ్ళే రైలు ప్రయాణీకులను చూస్తూ రాత్రి తొమ్మిది గంటల దాకా స్టేషన్ లోనే ముగ్గురు స్నేహితురాళ్ళతో గడిపింది.


    "మీరు కనబడక మీవారు పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళారేమో! పోనీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వద్దామా! పోనీ మనం కూడా రిపోర్ట్ ఇద్దాం!" రాణి అంది.


    "నేనిక్కడే కూర్చుంటాను. వారెక్కడికి వెళ్ళినా ఇక్కడికే వస్తారు. ఏ కారణం చేతనయినా రాలేకపోతే మాత్రం చెప్పలేను. వస్తే తప్పకుండా వస్తారు. నేను మాత్రం పోలీస్ స్టేషన్ కి రాను. ఆ ఎర్ర టోపీలు చూస్తేనే నాకు చచ్చే భయం" అంది లక్ష్మి.


    అందరు అక్కడే కూర్చుండిపోయారు.


    లక్ష్మి గురించి వివరాలు అడిగింది వందన.


    "అత్తింటి పేరు... పుట్టింటి పేరు...అటు పుట్టింటి వారి సంగతి... ఇటు అత్తింటివారి సంగతి..."


    "మూడ్రోజులు తన పెళ్ళి చాలా వైభవంగా జరిగిందని... మూడు అబార్షన్ లు అయిన తర్వాత ఒక బాబు పుట్టాడని... ప్రయాణంలో తిప్పడం ఇష్టంలేక అత్తగారి దగ్గరే ఉంచి వచ్చానని" లక్ష్మి తన కుటుంబం గురించి వివరంగా చెప్పింది.


    కబుర్లతో అలా... అలా రాత్రి పదిన్నర అయింది.


    "పోలీసులంటే మీకెందుకు భయం?" వందన అడిగింది.


    "పోలీసుల సంగతి మీకు తెలీదమ్మా! ఒకసారి మా ఇంట్లో రెండు గదుల వాటాని ఒక భార్యా భర్తకి అద్దెకి ఇచ్చాం. వాళ్ళు నిజంగా భార్యాభర్తలు కారట. అలా నటిస్తూ ముదనష్టపు వ్యాపారం చేసే రకంట. పోలీసులు వచ్చి ఓ అర్థరాత్రి వాళ్ళని పట్టుకొన్నారు. సరే పట్టుకున్నారు కదా... ఊరుకోవచ్చు కదా... తెలిసి తెలిసి వాళ్ళకి మేము ఇల్లు అద్దెకి ఇచ్చామని చెప్పి మధ్యలో మా ఇంట్లో అందరిని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించారు. అప్పట్నించి పోలీస్ స్టేషన్ మొహం చూడనని ఒట్టు వేసుకున్నాను" లక్ష్మి చెప్పింది.


    "కొంపదీసి మీవారు కూడా అలాంటి ఒట్టు పెట్టుకోలేదు కదా?" సుందర సుకుమారి అడిగింది.


    "వాళ్ళకేమమ్మా మగాళ్ళు! ఎక్కడికయినా వెళ్ళి రాగలరు. నా బాధల్లా ఈ రాత్రికి నేను కనబడక వారు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో, వారు ఎంతగా అల్లల్లాడుతున్నారో! అనే" లక్ష్మి అన్నది.


    "మీ వారికి మిమ్మల్ని అప్పగించే మేం వెళతాం" అంది వందన.


    "మీకెందుకమ్మా ఇబ్బంది. మీరు వెళ్ళండి నేను ఎదురుచూస్తూ ఉంటాను" అంది లక్ష్మి.


    తెలుగింటి ఆడపడుచు... మరో భాష రాదు... స్టేషన్ లోనే లక్ష్మిని వదిలేసి వెళ్ళిపోవడానికి వీళ్ళకి మనసొప్పలేదు. చాలాసేపు లక్ష్మి భర్తకోసం ఎదురుచూసారు. విసుగుపుట్టి చివరికి ఓ నిర్ణయానికి వచ్చారు.


    "ఎంతసేపని ఇలా చూస్తాం? అర్థరాత్రిపూట మేం హోటల్ రూమ్ కి చేరడం కూడా మంచిది కాదు. మేము హోటల్ కి వెళతాం. మీరు కూడా మాతో రండి. ఈ రాత్రికి మా రూమ్ లో పడుకుందురుగాని. ఉదయమే మళ్ళీ అందరం కలిసి రైలు స్టేషన్ కి వద్దాం. మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళటానికి మాకు మనసొప్పడం లేదు" చెప్పింది వందన.


    మొహమాటంతో "వద్దంది" లక్ష్మి. "ఇప్పటికే మీరు చాలా శ్రమపడ్డారు" అంది. "ఆయన ఏమయ్యారో! ఏమిటో!" అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. "నేనిక్కడే ఉంటాను. మీరు వెళ్ళండి" అంది.


    చివరికి


    వీళ్ళ నలుగురి బలవంతంతో ఆ రాత్రికి వాళ్ళతోపాటు వాళ్ళ రూమ్ లో గడపటానికి నిశ్చయించుకుని "సరే" అంది.


    ఎవరికి వారే "హమ్మయ్య" అనుకొన్నారు.


    టాక్సీ మాట్లాడుకుని రాత్రి పదకొండు దాటాక ఆ సమయంలో ఐదుగురు ఎక్కి హోటల్ రూమ్ కి బయలుదేరారు.


                                        12


    తెల్లవారు ఝాము.


    మూడుగంటలు దాటుతూ వుంది.


    "హత్య...హత్య...లేవండి...లేవండి...అయ్యో...అయ్యో...అమ్మో...అమ్మో..." అంటూ గావుకేకలు పెట్టింది" సుందర సుకుమారి.


    ఆ అరుపులకి ముగ్గురికి మెలకువ వచ్చింది.


    వందన లేస్తూనే "అయ్యో...ఏమయిందే! లైటు వెయ్యండి అంది.


    "ఓ అమ్మో! నాకాళ్ళు వణికిపోతున్నాయ్! నేను లేవను బాబోయ్ లేవను గాక లేవను" ప్రమద దుప్పటి నిండుగా ముసుగు వేసుకుని చెప్పింది.


    "ఆ కూర్చున్నది సుందరేనా! దానికేదో అయ్యిందేవ్" రాణి పెద్దగా అరిచి చెప్పింది.


    "మీబొంద అయింది. లైటు వేయకుండా ఏమిటా ఇది?... అంటూ మంచంమీంచి క్రిందకి దూకి వెళ్ళి పెద్దలైటు స్విచ్ వేసింది వందనాదేవి.

 Previous Page Next Page