Previous Page Next Page 
దావాగ్ని పేజి 28


    వేరేదేశాల విషయాల్లో ఇలా చెయ్యలేము సాధారణంగా చాలామంది గూఢచారులకి డిప్లమోటిక్ పాస్ పోర్ట్ వుంటుంది. అది వున్న వాళ్ళమీద ఇక్కడ చర్య తీసుకోవడానికి వీల్లేదు. మహా అయితే, "మీరు మా దేశంలో వుండడం మాకు ఇష్టంలేదు" అని చెప్పేసి, "పర్సానో నాన్ గ్రేటా" గా ప్రకటించి, ఇంటికి పంపెయ్యవచ్చు.  

 

    కానీ పాకిస్తానీలకి డిప్లమోటిక్ పాస్ పోర్టులు ఉన్నా కూడా ముందు దేహశుద్ధిచేసి, తర్వాత క్షమాపణ చెప్పిన సంఘటనలు వున్నాయి.

 

    కానీ...

 

    ఇదే ప్రమాదం పాకిస్తాన్ లో వున్న ఇండియన్ ఏజెంట్స్ కి కూడా తరుచుగా ఎదురవుతూ వుంటుంది.   

 

    చెప్పడం కాసేపు ఆపి, స్నాక్స్ తెప్పించాడు ప్రతాప్ అవి తినలేదు వినీల. అతను ఇంకా ఏం చెబుతాడా అని ఎదురుచూడటం మొదలుపెట్టింది.   

 

    మరలా చెప్పడం సాగించాడు ప్రతాప్.

 

    "1970 ప్రాంతంలో రెండు కథలు ప్రచారంలో వుండేవి. అవి నీకు చెబుతాను. వాటిలో ఏది నిజమైందో, ఏది కట్టుకథో నువ్వు చెప్పాలి ఏం?"

 

    తలూపింది వినీల.

 

    "ఒక సెంట్రల్ యూరోపియన్ ఎంబసీ వుంది ఢిల్లీలో. దానికి ఒకరోజున ఒక ఇండియన్ దగ్గరనుంచి ఒక ఆఫర్ వచ్చింది. సంవత్సరానికి తనకి పదిలక్షలు చెల్లిస్తే ఇండియన్ నేవీ తాలూకు రహస్యాలని ఎప్పటికప్పుడు చేరవేస్తానని ఆ దేశం ఆ ఇండియన్ తాలూకు వివరాలు సేకరించింది. అతనికి నిజంగానే ఇండియన్ నేవీ తాలూకు రహస్యాలు తెలిసే అవకాశం ఉందని నమ్మకం కలిగింది. అతనితో వెంటనే ఒక ఒప్పందం కుదుర్చుకుంది"

 

    "రెండోకథ ఏమిటి?" అంది వినీల.

 

    నవ్వాడు ప్రతాప్

 

    "రెండో కథ ఏమిటంటే పాకిస్థాన్ రాయబార కార్యాలయానికి మన డిఫెన్స్ మినిస్ట్రీలో కావలసిన మనిషి ఒకడున్నాడు. అతనిక్కడి రహస్యాలు అక్కడికి ఎప్పటికప్పుడు చేరవేస్తుంటాడు. అతను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ విమానాల గురించిన రహస్య సమాచారం ఉన్న ఓ ఫైల్ ని పాకిస్థాన్ ఎంబసీకి అందించాడు.

 

    అందుకుగానూ అతనికి పాకిస్థాన్ రాయబార కార్యాలయం శాంక్షన్ చేసిన పేమెంట్ ఎంతో తెలుసా? ఇరవైరూపాయలూ, ఫ్లస్ కాసిని మిఠాయిలు"    

 

    "రెండోకథ కేవలం కట్టుకథయి ఉండాలి, కేవలం అతిశయోక్తి" అంది వినీల తక్షణం.

 

    పెద్దగా నవ్వాడు ప్రతాప్.

 

    "దారుణంగా పొరబడ్డారు. అంటే నువ్వు జేమ్స్ బాండ్ టైప్ నవలలు ఎక్కువ చదువుతున్నావన్నమాట. ఆ రెండు కథల్లో మొదటిది శుద్ద అబద్ధం అంటే ఒక ఇండియన్, ఇండియన్ నేవీ రహస్యాలు సంవత్సరానికి పదిలక్షలు ఇచ్చి అమ్ముతాననడం అబద్ధం కాదు ఆ రాయబార కార్యాలయం అతనితో ఒక ఒప్పందానికి రావడం అబద్ధం. ఈ ఆఫర్ రాగానే ఆ కార్యాలయం దాన్ని తక్షణం చెత్తబుట్టలో పడేసింది.  

 

    "ఎందుకని?" అంది వినీల ఆశ్చర్యంగా.

 

    "ఎందుకంటే ఇలా చెప్పవలసి వచ్చినందుకు వికారంగా వుంది నాకు, చాలా దేశాల దృష్టిలో ప్రపంచంలో అతి చవకగా కొనెయ్యదగ్గ మనుషులు ఇండియాలోనే వుంటారు. ఏ ఫారిన్ ఆఫీసరన్నా ఒక ఇండియన్ కి కొన్ని వందల రూపాయల కంటే ఎక్కువ డబ్బు ఇచ్చాడంటే వాడు పనికిమాలిన వాడని వెంటనే ఉద్వాసన చెప్పేస్తారు."

 

    నాకు ఒక కేసు తెలుసు.

 

    1982లో ఇండియన్ ని ఫ్రాన్స్ దేశానికి చెందిన 'డస్సాల్ట్ ఎవియేషన్' ఏమని కోరిందంటే, తాము అప్పుడే ఇండియాకి అమ్మిన 'మిరేజ్ 2000' విమానాల గురించి కొంచెం మంచిగా ప్రచారం చేయమని. అందుకుగానూ అతను సంవత్సరానికి రెండువేల డాలర్స్ కన్సల్టేషన్ ఫీజు అడిగాడు.  

 

    వాళ్ళు అలాకాదనీ, విమానాల గురించి పత్రికల్లో రాస్తే ఆ రాసిన దాన్ని వాళ్ళ హెడ్ ఆఫీసు వాళ్ళు మెచ్చుకుంటే, ఆర్టికల్ కి మూడొందల రూపాయలు చొప్పున అతనికి అప్పచెబుతామనీ అన్నారు.

 

    అది విన్న ఇండియన్ ఎంతో నొచ్చుకుని, అమెరికన్ ఎంబాసీలో ఉన్న తన స్నేహితుడు ఒకతనితో తన గోడు వెళ్ళబోసుకున్నాడు.

 

    "ఇంతటిదానికి ఊరికే ఇదైపోతావెందుకు?" అన్నాడు ఆ అమెరికన్ ఫ్రెండ్:

 

    "నీకు తెలీదేమో: టాప్ రేట్ ఇండియన్ జర్నలిస్టులకే మేము మూడొందలు ఇచ్చాము. లేకపోతే మామూలుగా అందరికీ ఇచ్చేది ఒక స్కాచ్ విస్కీ బాటిల్ మాత్రమే. అది మాకు ఏభై రూపాయలకి దొరుకుతుంది" అన్నాడు.

 

    అని ఆగాడు ప్రతాప్. "ఇనఫ్: ఇవాల్టికి ఇది చాలు: నౌ యూ స్ట్రివ్" అన్నాడు.

 Previous Page Next Page