"బాబూ... అంజిబాబూ..."
బయటి నుంచి భువనేశ్వరీదేవి గొంతు వినిపిస్తోంది. దబదబా తలుపు శబ్దం వినబడడంతో, ఎవరో చరిచినట్టు ఆనందానికి మెలుకు వొచ్చింది.
వాడు లేవగానే అడిగిన మొదటి మాట.
"ఒరే... అంజిగా... నాలుగ్గంటలకు అలారం మోగలేదా..."
"మోగలేదు... అందుకే ఈ మోత... ఇప్పుడేం చేద్దాం రా..." అడిగాడు ఆంజనేయులు భయంతో ఒణికిపోతూ.
తలుపు బాదుడు ఇంకా ఎక్కువైంది. ఆనందంకి చెమటలు పట్టేశాయి.
"తలుపు తీయటం, ఒక్కదూకు దూకటం, తిరిగి తుపాకీ దెబ్బకు దొరక్కుండా పారిపోవటం. అంతే ఇప్పుడు చేయగలిగేది" అన్నాడు ఆనందం తేరుకుంటూ.
"అంతా నీ వల్లే జరిగింది. రాత్రే పారిపోదామని చెప్పాను. రాత్రి బస్ స్టాండ్ లో పడుకుంటే పోలీసులు పట్టుకెళ్తారని, తెల్లవారు ఝామునే వెళ్ళిపోదామని చెప్పి ఇంతదాకా తెచ్చావ్. ఆ అలారం మొగి చావలేదు. ఆంటీ తేరుకునేలోపే పారిపోవాలి. ఆంటీ వెంటనే తేరుకోకుండా చేయాలంటే ఒకటే మార్గం. తరణి వంట గదిలో ఉంది. వెళ్ళి చూసుకోమని చెప్పాలి. ఆమె లోపలకెళ్ళి వెతుకుతుండగా మనం ఉడాయించాలి. జాగ్రత్త... దొరికామో పచ్చడే..." అంటూ ఆంజనేయులు రన్నింగ్ రేస్ కోసం దమ్ము తీసుకున్నాడు.
ఆనందం కూడా గుండెలనిండా గాలి పీల్చుకున్నాడు.
తలుపు తీసేశాడు ఆంజనేయులు ప్రాణాలు ఉగ్గబట్టుకొని...
"ఏం అంజిబాబూ... ఇంత మొద్దు నిద్రయితే ఎలాగయ్యా... అమ్మాయేం చేస్తోందీ... లేవలేదా..." ప్రశ్నల పరంపరను కురిపిస్తూ తలుపుకి అడ్డంగా నించుందామె.
పారిపోవటానికి అవకాశం లేకపోయేసరికి ఇద్దరూ ప్రేతాల్లా అయిపోయారు.
ఆమె తిరిగి గద్దించేసరికి వెంటనే తేరుకున్నారు.
"లోపలుంది. ఇంకా నిద్రపోతోంది. మీరే వెళ్ళి లేపుకోండి" అన్నాడు ఆంజనేయులు ఒకింత చిరాగ్గా.
"ముందయితే మీరు లోపలకు రండి. వంట గదిలోకి వెళ్ళండి..." అన్నాడు ఆనందం పారిపోయే అవకాశం కోసం చూస్తూ.
ఆమె అలా లోపలకు వస్తుండగానే పనివాడు వచ్చి ద్వారబంధం దగ్గర ఆగిపోయాడు.
తలుపు దగ్గర మరో ప్రతి బంధకం ఎదురు కావటంతో ఇద్దరూ పిచ్చెత్తి పోయారు.
"ఈ సూట్ కేస్ లేమిటి...? ఎక్కడికైనా వెళ్తున్నారా?" వంటగది కేసి వెళుతూ అనుమానంగా అడిగింది భువనేశ్వరీదేవి.
"మరే... కాశీకి వెళ్దామని..." అన్నాడు ఆనందం కసిగా.
"పానకంలో పుడకలా వీళ్ళిద్దరి మధ్య నువ్వెందుకు? నువ్వెళ్ళు కాశీ. అసలు మొన్ననే చెబుదామనుకున్నాను. అమ్మాయి వచ్చాక కూడా నువ్వు లోపల పడుకుంటున్నావెందుకు? వరండాలో చావొచ్చుగా..." అందామె ఆనందం కేసి చూస్తూ.
ఒక్కసారి భోరుమని ఏడ్చేశాడు ఆనందం.
భువనేశ్వరీదేవి, పనివాడు కంగారుపడిపోయారు.
"సర్లే... ఏడుపు ఆపు..." అని ఆనందాన్ని గద్దించి, వంటగదికేసి వెళ్ళి, "అమ్మాయ్... తరణీ... తరణీ... ఆరునూరైనా ఇవ్వాళ నిన్ను చూడాల్సిందే... బయటకు రా... నా దగ్గర సిగ్గెందుకమ్మా బయటకు రా..." అంది.
సమాధానం లేదు. చిన్న శబ్దం కూడా రాలేదు. దాంతో ఆమెలో ఒకింత అనుమానం ప్రవేశించింది.
"త్వరగా వచ్చేయాలి..." అంది తిరిగి భువనేశ్వరీదేవి.
"వస్తుందిలే... రడీగా వుండు" అని కసిగా లోలోనే అనుకున్నారిద్దరూ.
ఈలోపు ఆంజనేయులు, ఆనందం కళ్ళ ద్వారానే చాలా మాట్లాడేసుకున్నారు.
ఉన్నట్లుండి తుఫాన్ లా దూసుకుపోయి వాకిట్లో వున్న పనివాడ్ని ఆనందం నెట్టి వేయాలి. అదే అదునుగా పారిపోవాలి. ఆ వెంటనే ఆంజనేయులు పారిపోవాలి.
ఆ పథకాన్ని అమలుపర్చే ప్రయత్నంలో వుండగా...
"నువ్వు రాకపోతే నేనే వస్తున్నాను" అని భువనేశ్వరీదేవి అనటం, లోపలకు వెళ్ళటం ఒకేసారి జరిగింది.
పనివాడ్ని తోసుకొని పారిపోయేందుకు ఆఖరిసారి ఇద్దరూ ఊపిరి తీసుకున్నారు.
"ఏంటమ్మ అంత సిగ్గు? ఇంతసేపు ఏం చేస్తున్నావ్... ఒళ్ళంతా ఆ చెమటలేమిటి?" అని వినిపించింది.
ఆంజనేయులు, ఆనందం ఒకరికేసి ఒకరు ఆశ్చర్యపోయి చూసుకున్నారు.
"చిదిమి దీపం పెట్టుకోవచ్చు. ఇంత అందమైన పెళ్ళామనేనా బయటకు చూపించటం లేదు మీ ఆయన?"
ఆంజనేయులు ఆనందం కేసి పిచ్చి చూపులు చూశాడు.
"లోపల ఒకమ్మాయి ఉన్నట్లే మాట్లాడేస్తుందేమిటి? ఈమెకు గాని పిచ్చిపట్టిందా?" అన్నాడు ఆనందం చిన్నగా ఆంజనేయులి చెవిలో.
"మీ ఆయనిచ్చిన ఫోటో చూసి అందంగానే వుంటావని ఊహించాను, కాని మరీ ఇంత అందంగా వుంటావనుకోలేదు."
ఇద్దరూ ఉలిక్కిపడి, దడుచుకుని, వీపులు చరుచుకున్నారు అసంకల్పితంగానే.
"వామ్మో... ఈమెకి నిజంగానే పిచ్చి పట్టింది. ముందేమో అమ్మాయి ఉన్నట్లు మాట్లాడింది. ఆపైన నేనేదో గాలికి తెచ్చిన ఫోటోని గుర్తుకు తెచ్చుకొని అచ్చు అలాగే వుందని, అంతకంటే అందంగా వుందని అంటోంది. ఏమిటీ పరిస్థితి?" ఆనందం చిన్నగా గొణిగాడు.
"ఈమెకెలాగూ పిచ్చి పట్టిందిగదా... మనల్ని అంతగా సతాయించక పోవచ్చు. ఈమెనెలాగూ భుజంగరావు గారు ఎర్రగడ్డలో చేర్పించేస్తారు. ఉండిపోదామా? జీతం మిగులుతుందిరా ఇక్కడుంటే?" అర్ధిస్తున్నట్లుగా చిన్నగా ఆనందం చెవిలో అన్నాడు.
"రండి పిన్నిగారూ... లోపలకు రండి..." అని ఓ అమ్మాయి గొంతు వినిపించటంతో ఆంజనేయులు, ఆనందం వెయ్యి మేఘావాట్ల విద్యుత్ షాక్ తగిలినట్లయిపోయారు.
లోన్నించి నిజంగానే అంత అందమైన, మధురమైన మంద్రస్వరం వినిపించిందా?! ఇది నిజమా? భ్రమా?!
"వేసిన వేషాలు చాల్లే... ఆడవేషం వేసింది చాలలేదా? గొంతు మార్చి మాట్లాడుతున్నావ్?" తల వంచుకొనే ఆనందాన్ని మెల్లగా మందలించాడు ఆంజనేయులు.
ఆనందం బిత్తరపోయాడు.