Previous Page Next Page 
నా జీవితం నీ కౌగిలిలో పేజి 28


    "డ్రామాలా... నా దగ్గరా... కుదరదండోయ్... ఇవాళ అటో, ఇటో తేలిపోవాలి... అంతే..." అంటూ ఆవిడ గయ్ మంటున్న దశలో ఆంజనేయులొక్కడే ప్రవేశించాడు.

 

    "నువ్వొక్కడివే వచ్చేవేం బాబూ... తరణేదీ..." సౌమ్యంగా అడిగిందావిడ.

 

    "తరణాండీ... తరణి... మలక్ పేట నుంచి తీసుకురావడానికి ఆనందంగాడు వెళ్ళాడండి..." టక్ మని అబద్ధం ఆడేసేడు.

 

    "నీ పెళ్ళాన్ని... నువ్వు తెచ్చుకోవాలి గానీ.. ఆ కోతి వెధవని పంపించడమేమిటోయ్...?"

 

    "ఇవాళ నాకు ఆఫీసులో ఇన్ స్పెక్షన్ అండి... అందుకని..."

 

    "అయితే వాళ్ళొచ్చేక... అందరూ కలిసి భోంచేద్దామంటావా..." వెటకారంగా అన్నాడు భుజంగరావు.

 

    ఆ వెటకారం అర్ధమైంది ఆంజనేయులికి.

 

    "వాళ్ళక్కడే భోజనం చేసేసి వచ్చేస్తామన్నారు."

 

    "అయితే మనం భోజనాలు చేసేద్దాం... పద..." భువనేశ్వరీదేవి లోనకి దారి తీసింది.

 

    ఆ వెనక నెమ్మదిగా నడుస్తున్న ఆంజనేయుల్ని భుజంపట్టి లాగి-

 

    "నిన్నుదయం వచ్చిన అమ్మాయెవరు... చెప్పు...?" చెవిలో గుసగుసలాడాడు భుజంగరావు.

 

    "ఆ అమ్మాయ్ వచ్చింది... నాకోసం కాదండీ... ఆనందంగాడి కోసం... బాస్ కూతురట... వాడంటే, ఆ అమ్మాయికి ఏదో ఇష్టంలా కూడా ఉంది."

 

    "నీకేం రిలేషన్స్ లేవని నమ్మమంటావా?"

 

    "లేవండీ.. ఫెయిత్ ఫుల్లీ యువర్సండీ... నన్ను నమ్మండీ..."

 

    "గమనిస్తున్నాను... తిక్క తిక్క వేషాలు వేసేవంటే... నాకు తెలుస్తుందిలే... ఆ మర్నాడే ఇల్లు ఖాళీ... కబడ్దార్..." హెచ్చరించాడు భుజంగరావు.

 

    భోజనాలయిపోయాక....

 

    "చూడు అంజిబాబూ... నువ్వూ, అమ్మాయీ రేపు మరేం ప్రోగ్రాములూ పెట్టుకోకండి... ఉదయాన్నే నేనొచ్చి, అమ్మాయిని మా ఇంటికి తీసుకొస్తాణు... రెండ్రోజులు ఇక్కడే ఉండండి... పురోహితుడికి కూడా కబురు చేస్తాను... దగ్గరుండి ఆ శుభ'కార్యం' జరిపించేస్తే...."

 

    భువనేశ్వరి మాటలకు ఏమనాలో తెలీక, స్థాణువులా నిలబడి పోయాడు ఆంజనేయులు... ఒకింత సేపటికి తేరుకొని గదిలో కొచ్చి పడ్డాడు.

 

    రేపుదయం పెద్దావిడ ఊరుకోదు. ఉదయాన్నే వచ్చేస్తుంది. అమ్మాయీ ఎవరూ లేకపోవడంతో, ఇదంతా 'బోగస్' అని గుర్తు పట్టేస్తుంది. అంతే... ఇల్లు ఖాళీ... దాంతో రోడ్డు మీద పడడం ఖాయం...

 

    గదిలో జుత్తు పీక్కుంటూ 'ఫాన్'లా తిరుగుతున్నాడు  ఆంజనేయులు.

 

    అప్పుడే ఎంటరయ్యాడు ఆనందం.

 

    "బయట లైట్లన్నీ ఆరిపోవడం చూసే వచ్చా..." కాళ్ళు చాపుకుని ఓ మూల కూర్చుంటూ అన్నాడు ఆనందం.

 

    "రేపుదయానికి ఇక్కడో ఆడపీనుగు లేకపోతే, మనపని అయిపోయినట్టే..." ఆంటీగారు రేపేం చేద్దామనుకుంటున్నారో చెప్పాడు ఆంజనేయులు.

 

    "మీ ఇద్దర్నీ వాళ్ళింటికి తీసుకెళ్తుందా... పురోహితుడికి కబురు పెడుతుందా... రాత్రికి శోభనమా... అరే అంజిగా... నిజంగా అమ్మాయే గనక వుంటే... మన పని ఎంత బావుండేదిరా... 'ఫ్రీ ఆఫ్ కాస్ట్' మీద బండి నడిచేసేది కదరా..." సంబరపడుతున్నాడు ఆనందం.

 

    "ముందు ప్రోబ్లమ్ ని పట్టించుకో... ఈ తరణి గోల నుంచి తరుణోపాయం ఆలోచించు..."

 

    "బాగా ఆలోచించా... అన్యధా శరణం నాస్తి... రాత్రికి రాత్రి ఉడాయిస్తేనే మన పరువు దక్కుడు... అంతే..." అలవోకగా అన్నాడు ఆనందం.

 

    "అంతేనంటావా...?" నీరసంగా అన్నాడు ఆంజనేయులు.

 

    "అవున్రా... మీ ఆఫీసు బాస్ ఈ ఏరియాలో ఉండమన్నాడు గానీ... ఈ ఇంట్లోణే వుండమనలేదు కదా... ఇక్కడుంటే, రోజు రోజుకీ ఈ 'అమ్మాయి' సమస్య ఎక్కువ కావడం ఖాయం... దీని కోసం మనం అడ్డమైన అబద్ధాలాడడం ఖాయం... కొన్నాళ్ళకు ఆ అబద్దాల ఊబిలో మనం కూరుకు పోవడం ఖాయం... అందుచేత ముందు, ముందు మరిన్ని ప్రమాదాలు జరక్కుండా ఉండాలంటే, ఇప్పుడే జాగ్రత్త పడడం మంచిది. తర్వాత నీ ఇష్టం..."

 

    కళ్ళు తిరిగినవాడిలా తలపట్టుకుని కూర్చున్నాడు ఆంజనేయులు.

 

    "గోల్డ్ లాంటి అవుట్ హౌస్ రా... భోజనం ఫ్రీ... కాఫీ ఫ్రీ... టిఫిన్ ఫ్రీ... ముత్యాలముగ్గు బిల్డింగ్ లో హాయిగా వుండొచ్చనుకున్నాగానీ, ఇలా  అవుతుందని..." అక్కడ ఉండడానికి ఇంకా అవకాశం ఉంటుందోనని ఆలోచించాడు ఆంజనేయులు. ఎక్కడా లంకె కుదరలేదు.

 

    సరిగ్గా రాత్రి పదకొండు గంటలైంది.

 

    పాత అలారం వాచీ 'కీ' తిప్పుతూ స్"అరిగ్గా నాలుగ్గంటలకు అలారం పెడుతున్నాను... లేవగానే నువ్వు చాపను చంకలో పెట్టుకుంటున్నావన్న మాట, నేను తలగడను చంకలో పెట్టుకుంటానన్న మాట... ఈ చీరలూ అవీ సూట్ కేసులో సర్దేస్తామన్న మాట... అంతే... నాలుగున్నరకల్లా మనం పరార్..."

 

    "ఒరే ఆనందం ఇంకేదైనా అవకాశం ఉందేమో, ఒక్కసారి ఆలోచించరా..."

 

    "ఇంకా ఆలోచించు... ఆలోచించు అని... నన్ను తినెయ్యకు... నువ్వుండాలంటే ఉండు... నేను మాత్రం... మరి ఉండను గాక ఉండను... అంతే... నాలుగ్గంటలకు నువ్వు లేచినా, లేవకపోయినా నేను వెళ్ళిపోవడం ఖాయం..."

 

    ఆ మాటకు మరి మాట్లాడలేదు ఆంజనేయులు.

 

    "ఆ అవుట్ హౌస్ లో ఆఖరి గుడ్ నైట్ రా..." పడుకునే ముందు అన్నాడు ఆనందం.

 

    "అలారం మోగగానే... నన్ను లేపురోయ్..." ముసుగేసేస్తూ మళ్ళీ అన్నాడు ఆనందం.

 

    ఏం జవాబివ్వలేదు ఆంజనేయులు.

 

    "రేపట్నించి మళ్ళీ పేవ్ మెంట్ లైట్ తప్పదన్నమాట..." నిద్రలో జారుకుంటూ అనుకున్నాడు ఆంజనేయులు బాధగా.


                            *    *    *    *


    సరిగ్గా ఆరుగంటలైంది.

 

    తలుపు దబదబా చప్పుడవడంతో సడన్ గా మెలుకువొచ్చింది ఆంజనేయులికి.

 

    పక్కకు తిరిగి చూశాడు. ఆనందం లేడు.

 

    తనని లేపకుండా వాడొక్కడే లేచి వెళ్ళిపోయాడా? గబుక్కున లేచి కూర్చుని చుట్టూ చూశాడు.

 

    నిద్రలో దొర్లుకుని వెళ్ళిపోవడం అలవాటు కావడంవల్ల, బెడ్ రూం తలుపు దగ్గర అడ్డంగా పడుకుని వున్నాడు ఆనందం.

 Previous Page Next Page