Previous Page Next Page 
నా జీవితం నీ కౌగిలిలో పేజి 30


    "నేను కాదురా బాబూ..." అన్నాడు ఆనందం మెల్లగా తేరుకుంటూ.

 

    "మరి?!" ఈసారి ఇద్దరూ షాక్ తిన్నారు.

 

    ముందుగా ఆనందం తేరుకున్నాడు.

 

    "మేరీమాథ్యూస్ ని తీసుకొచ్చి మొత్తానికి కష్టం నుంచి గట్టెక్కించావ్. అది ముందే చెప్పి ఏడవొచ్చుగా?"

 

    ఆనందం మాటలకి ఆంజనేయులు మరో షాక్ తిన్నాడు.

 

    "మేరీ మాథ్యూసూ లేదు... విన్నీ మండేలా లేదు లోన ఎవరో వున్నారు. అది మాత్రం నిజం. అది మేరీ కాదు" ఆంజనేయులు పిచ్చెక్కి పోతూ అన్నాడు.

 

    "అసలు మనం విన్నది అమ్మాయి గొంతేనా? ఇంతకీ ఈవిడ ఇంకా లోపలే ఏం చేస్తోంది?" ఆనందం అన్నాడు వారగా వంట గడికేసి చూస్తూ.

 

    "వెధవ ఐడియాలు నువ్వే వేస్తుంటావ్... చెప్పు... నిజం చెప్పు. నువ్వే ఆ అమ్మాయిని రాత్రి తెచ్చి దాచి వుంచావ్ గదూ?" ఆంజనేయులు గద్దించాడు.

 

    "ఓరి నాయనో... ఇది అటు తిరిగి... ఇటు తిరిగి నాకే చుట్టుకుందేరా బాబు" గొల్లుమన్నాడు ఆనందం.

 

    "వేషాలెయ్యకు. సరిగ్గా ఫోటోలో వున్న అమ్మాయే ఆ గదిలో వున్నదని ఆంటీగారు కన్ ఫర్మ్ చేశారు. ఫోటో వెతికి తెచ్చిన నీకు... అందులో ఉన్నమ్మాయి తెలీదంటే నమ్ముతానా?" ఆంజనేయులు గయ్ మని లేశాడు.

 

    బిక్కచచ్చిపోయాడు ఆనమం. మతిభ్రమించినట్లుగా అనిపించింది.

 

    తనేదో తమాషాకి ఫోటో స్టూడియోలో ఒక ఫోటోని ఎత్తుకొస్తే, సరిగ్గా అందులోని అమ్మాయే ఎలా వచ్చింది!"

 

    అది తరువాత... ముందా అమ్మాయిని చూసి ఒక నిర్ణయానికి రావాలనుకున్నాడు ఆనందం.

 

    మరో అయిదు నిమిషాల తర్వాత బైటికొచ్చింది భువనేశ్వరి.

 

    "నాతో హాస్యాలేమిటయ్యా... అమ్మాయితో చెప్పాను... ఇద్దరూ టిఫిన్ కి ఇంటికి రండి... నేను చెయ్యాల్సిన పనులు చాలా వున్నాయి. వస్తాను..." అంటూ గబగబా బయటికెళ్ళిపోయిందావిడ.

 

    ఆవిడలా బయటికెళ్ళిపోవడం, లోన్నించి ఓ అమ్మాయి రెండు కాఫీ కప్పులతో గదిలోకి నెమ్మదిగా రావడం ఒకేసారి జరిగాయి.

 

    తెల్లమొహం వేసుకుని ఆంజనేయులు, వెర్రిమొహం వేసుకుని ఆనందం చూస్తుండిపోయారు.  

 

    పాల బొమ్మలాంటి పదహారేళ్ళ అమ్మాయి... చక్కగా, తెల్ల కలువల్లా కళ్ళు... పున్నాగ పువ్వులా ముక్కు... భోగీ మంట దగ్గర చలికాగుతున్నపుడు అరచేతులెలా ఎరుపెక్కుతాయో అలాంటి పెదాలు... ఆ పెదవుల మీద కష్టాల్ని మరిచిపోయేటట్టు చేసే మనోహరమైన నవ్వు.

 

    అబిడ్స్ ఫోటో షాపులోని ఆల్బమ్ లోంచి దొంగిలించుకుని తెచ్చిన ఫోటోలోని అమ్మాయి, ఈ అమ్మాయీ... అచ్చు ఒక్కరే!!

 

    "ఒరేయ్... ఫోటోలోని అమ్మాయిరా" కేకేశాడు ఆనందం మతి భ్రమించినవాడిలా.

 

    "పరాయి వాళ్ళను చూస్తున్నట్టు ఏవిటా చూపు... ముందు కప్పు తీసుకోండి" ఆంజనేయులు కళ్ళవేపు చూస్తూ కప్పు చేతికి అందించింది.

 

    "ఫోటోలోని అమ్మాయి గురించి తర్వాత ఆలోచిద్దువుగాని, ముందు కాఫీ తీసుకో అన్నయ్యా" ఆనందానికి కాఫీకప్పు అందించిందా అమ్మాయి.

 

    కొద్ది క్షణాలవరకూ జరిగిందేమిటో వారికర్ధం కాలేదు.

 

    తమ ఎదుట ఉన్నది అమ్మాయే... అది నిజం... ఇది ఇద్దరికీ జీర్ణమయింది. ఆ అమ్మాయి ఫోటోలో వున్న అమ్మాయే అని ఆనందానికి అర్ధమైంది. అంతవరకూ ఫోటో చూడని ఆంజనేయులికి ఆనందం చెప్పగా అర్ధమయింది.

 

    ఇద్దరూ డీప్ షాక్ కి లోనయ్యారు. తేరుకోటానికి చాలాసేపు పట్టింది.

 

    "నీ పేరు..." తడారిపోయిన గొంతుతో అడిగాడు ఆంజనేయులు.

 

    "ఎప్పుడూ నా పేరు మర్చిపోవడమేనా? మీరు... వెనకటికో ఈగలా అయిపోతున్నారు... మీరు... నా పేరు... తరణి... స్నానం చేసొస్తాను... ఈ లోపల.. అన్నయ్యా మీరు కబుర్లాడుకుంటుండండి" నవ్వుతూ లోనకెళ్ళిపోయింది తరణి.

 

    "ఒరేయ్... అంజిగా... నిజంగా నీ పెళ్ళామే కదూ... నాకు తెలీకుండా... మీ ఊళ్ళో పెళ్ళి చేసేసుకుని సడన్ గా ఇప్పుడు తెప్పించేసుకున్నావ్ గదూ... ఒరేయ్... ఆప్తమిత్రుడ్నే... నా దగ్గర కూడా రహస్యాలేవిటిరా?" వేడిని లెక్కచెయ్యకుండా కాఫీని గడగడా తాగేస్తూ అన్నాడు ఆనందం.

 

    "ఒరేయ్... సత్తె ప్రమాణికంగా ఆవిడెవరో, ఎలా వచ్చిందో నాకూ తెలీదురా... మా వూళ్ళో నా పెళ్ళీ జరగలేదు... అది పెళ్ళామూ కాదురా... నన్ను నమ్మరా... నిజం రా బాబూ..." ఏడుపు ముఖం పెట్టి అన్నాడు ఆంజనేయులు.

 

    "అచ్చు... పిన్నిగారికి చూపించిన ఫోటోలో అమ్మాయే... ఎలా వచ్చిందంటావ్?" అడిగాడు ఆనందం అనుమానంగా.

 

    "అదే నాకూ తెలీకుండా వుందిరా... ఇది నిజమా... లేక సిటీ బస్సులో డ్రీమా... ఇప్పటికీ నాకు నమ్మకం కలగడంలేదు... వుండు... అసలు వ్యవహారం ఏంటో లోనికెళ్ళి చూసొద్దాం..." అంటూ బెడ్ రూంలో కెళ్ళాడు.

 

    అక్కడో సూట్ కేసు, దానిమీద పాత చీర, జాకెట్టు వున్నాయి.

 

    బయటికొచ్చాడు.

 

    "ఈ అమ్మాయెవరో... సరంజామాతో వచ్చేసిందిరా... ఎవరై ఉంటారంటావ్...?" అడిగాడు ఆంజనేయులు.

 

    "నేన్నమ్మన్రా... అడ్డవైన వాళ్ళూ ఇంటికెలా వస్తార్రా... నీ పెళ్ళామే..." మళ్ళీ మొదటికొచ్చాడు ఆనందం.

 

    "మళ్ళీ ఆ మాటన్నావంటే... చంపేస్తాను" అని గట్టిగా అరవబోయి బాత్ రూమ్ లో ఆ అమ్మాయి ఉందని జ్ఞాపకం వచ్చి, మెల్లగా అన్నాడు ఆంజనేయులు.

 

    "మరెవరు...? నిన్ను పరీక్షించటానికి ఆ భుజంగరావు గారే ఈ అమ్మాయిని పంపారేమో...?!" ఆనందం సాలోచనగా అన్నాడు.

 

    "కాదు... ఇదంతా నీ మాయే... ఈ అమ్మాయి నీ చెల్లెలు... కట్నం ఇచ్చి పెళ్ళి చెయ్యాల్సి వస్తుందని ఇలా నాటకమాడి రప్పించావ్. అవునా?" ఆంజనేయులు ఆనందంవేపు పెను అనుమానంతో చూస్తూ అన్నాడు.

 

    ఆనందంకి ఆంజనేయులన్నది వెంటనే అర్ధంకాలేదు.

 

    "జేబులో నీ చెల్లెలి ఫోటో పెట్టుకొనే ఆ రోజు అబిడ్స్ ఫోటో స్టూడియోకి నన్ను తీసుకెళ్ళావ్. ఆ తరువాత ఆ స్టూడియో వాళ్ళ ఆల్బమ్ లో దొంగిలించినట్లు నాటకం ఆడి, నీ జేబులోని ఫోటోయే తెచ్చి భువనేశ్వరీదేవిగారికిచ్చావ్. సమయం చూసి నీ చెల్లెల్ని రంగప్రవేశం చేయించావ్. హమ్మ... హమ్మ... ఎంత గుండెలు తీసిన బంటువురా... ఆనందం...!!!" గుండెలు బాదుకుంటూ అన్నాడు ఆంజనేయులు.

 

    ఆనందం వెర్రి చూపులు చూడటం మొదలెట్టాడు.

 

    ఆంజనేయులన్న దేమిటో ఒక్క ముక్కా ఆనందానికి అర్ధం కాలేదు.

 

    "ఎంత తెలివిగా నన్ను కమిట్ చేయించావ్ రా...?" పళ్ళు నూరుతూ అంటున్న ఆంజనేయులి కాళ్ళపై ఒక్కసారి విరుచుకు పడిపోయాడు ఆనందం.

 Previous Page Next Page