ఫోన్ కి ఆ వైపునున్న హరికుమార్ ఆమె రీజనింగ్ కి అప్రతిభుడే అయ్యాడు.
"ప్రస్తుతానికి అలా అనుకొనే ప్రొసీడవ్వు. బైదిబై....సుచిత్ర తల్లిదండ్రుల విషయంలో ఏమైనా ప్రోగ్రెస్ వుందా?"
"బయలుదేరబోతున్నాను. ఈరోజే నన్ను వాళ్ళు రమ్మన్నది....రాగానే మీకు ఫోన్ చేసి చెబుతాను" అందామె.
"బెస్టాఫ్ లక్" చెప్పాడు హరికుమార్.
ఫోన్ ని క్రెడిల్ చేసిందామె.
ఆ కేసులో పడిన ఒక్కో చిక్కుముడి క్రమంగా విడిపోబోతున్నాయి. దాంతో ఆమె రెట్టింపు ఆత్మవిశ్వాసంతో గదిలోంచి బయటకు వచ్చింది.
అప్పుడు సరిగ్గా సమయం సాయంత్రం ఏడుగంటలయింది.
వ్యానిటీ బ్యాగ్ లో బురఖా, మైక్రో కేసెట్, కార్డర్ సర్దుకొని కాలి నడకన పల్లవీ ఎన్ క్లేవ్ కి బయల్దేరింది.
* * * *
నాయుడికి- చిదంబరానికి- నిరంజనంకి ఎవరికి అందవలసిన వాటాలు వారికి బయట రామదాసు సూచనల మేరకు కిట్టూ అందించేశాడు.
రాత్రి సరిగ్గా ఎనిమిదిన్నరకు వివేక్ ఒక కునుకు తీసి లేచాడు. రాత్రంతా తీసుకొనే ట్రైనింగ్ మూలంగా అతనికి నిద్ర సరిపోవటంలేదు. అయినా లెక్కచేయడం లేదు.
"ఈ రోజు నుంచి తొమ్మిదికే అన్నారు" అడిగాడు వివేక్.
రామదాసు సంతృప్తిగా చూశాడతని వైపు.
"మేకప్ కిట్ రావాల్సి వుంది. కిట్టూకి కబురుచేశాను. అదీ రాత్రికే లోపలకు చేర్చబడవచ్చు. ఈ రోజు శారీరకమైన శిక్షణకు గేప్ ఇచ్చి మేకప్ చేసుకొనే విధానాల గురించి వివరిస్తాను...." అని రామదాసు అంటుండగానే నాయుడు అటూ ఇటూ చూస్తూ వచ్చాడు. అతనితో చిన్నసైజు కార్డ్ బోర్డ్ అట్టపెట్టె ఒకటుంది.
నాయుడు వెనకే వచ్చిన నిరంజనం, రామదాసు సెల్ తాళం తీశాడు. నాయుడు ఆ పెట్టెని రామదాసుకి అందించాడు.
అతను దాన్ని తెరిచి చూసి అన్నీ సరిగానే కిట్టూ పంపించినట్లు గ్రహించి సంతృప్తిగా తలపంకించారు.
ఆపైన నాయుడు కనుసైగ మేరకు వివేక్ సెల్ తాళంతీసి, వివేక్ రామదాసు సెల్ లోకి వెళ్ళాక పరిసరాల్ని గమనిస్తూ ఆ ఇద్దరూ ఆ వార్డ్ కి చెరో వైపు వెళ్ళి నుంచున్నారు.
"నేరస్థుడు నేరం చేయడానికి ముందే తీసుకోవాల్సిన జాగ్రత్త ఒకటుంది. అది ఐడెంటిఫికేషన్స్ మిస్సింగ్. నేరం చేయటానికి బయలుదేరిన దగ్గర్నుంచి, నేరం చేసి తిరిగి సే ఫెస్ట్ ప్లేస్ కి వచ్చేలోపు ఎప్పుడూ ఒకే డ్రస్ లో వుండకూడదు. ఒకే హెయిర్ స్టయిలుండకూడదు. ఒకే నడక వుండకూడదు. ఒకే వాహనం వాడగూడదు. ఒకే షూస్ వాడకూడదు. ఐస్ ఎక్స్ సోజరీ మరీ ప్రమాదం.
ఎప్పటికప్పుడు ఐడెంటిఫికేషన్స్ మారిపోతుండాలి. నేరం చేయటానికి బయలుదేరినప్పుడు ఒక డ్రస్ లో వుంటే నేరంచేశాక తిరిగొచ్చేప్పుడు వేరే డ్రస్ లో వుండాలి.
నేరంచేసి పారిపోయేటప్పుడు ఒకే వాహనంలో ప్రయాణించకూడదు. నాలుగైదు చోట్ల ఆగిపోయి టాక్సీ నుంచి ఆటోకి-ఆటోనుంచి రిక్షాకి-రిక్షా నుంచి సిటీబస్ కి-దాన్నుంచి తిరిగి టాక్సీకి ఇలా మారిపోవాలి. కార్లయితే మారుతీ నుంచి అంబాసిడర్ కి- దాన్నుంచి ఫియట్ కి- దాన్నుంచి జిప్సీకి మారాలి. వీలయితే ట్రైన్, లారీ కూడా.
అన్నీ మారుతీకార్లే దొరికాయనుకో వివిధ రంగులున్న కార్లు వాడాలి. ఒకే కారు దొరికినప్పుడు వేరే దారిలేనప్పుడు- నెంబర్ ప్లేట్స్ సైజుతో వుండే ఐదారు కాగితాలపై డిఫరెంట్ నెంబర్స్ రాయించి పెట్టుకోవాలి. మధ్యమధ్యలో ఆగి ఆ కాగితాన్ని అంటించుకొని ముందుకు సాగాలి. ఎవరయినా చూసినా అది ఏ కారు- ఏ కలర్ - ఏ నెంబరో పోలీసులకి చెప్పాడనుకో వాళ్ళాదారంట ఛేజ్ చేస్తూ వస్తారు.
వాళ్ళు నిన్ను సమీపించేలోపు నీ కారు నెంబరు మారిపోతే అంతగా అనుమానించరు.
అలాగే కారు మారినా- కారు కలర్ మారినా- వాహనం మారినా- నెంబరు మారినా పోలీసులు రాంగ్ వేలో వెళ్ళిపోతారు...." చెప్పుకుంటూ పోతున్నాడు రామదాసు.
ఆ వివరాల్ని తన ఫోటోగ్రాఫిక్ మెమెరీలో నిక్షిప్తం చేసుకుంటున్నాడు వివేక్.
కాలం గడిచిపోతోంది.
వివేక్ కాకలుతీరుతున్నాడు.
* * * *
సరిగ్గా తొమ్మిది గంటలకు సుచిత్ర ఇంటి తలుపు తట్టింది మనోజ్ఞ.
ఒకింతసేపటికి తలుపులు తెరుచుకున్నాయి.
"ఫాతిమా బేగమ్...." అంది సుచిత్ర తండ్రినుద్దేశించి.
"వెతగ్గా వెతగ్గా ఎట్టకేలకు దొరికిందమ్మా" అని ఉత్సాహంగా ఆయన లోపలకు వెళ్ళి ఒక తెల్లకాగితం పట్టుకొచ్చాడు.
దాన్ని తీసుకొని పరిశీలించి చూసింది మనోజ్ఞ. కొత్త పేపర్ మీద కొత్త ఇంకుతో చేసిన సంతకంలాగే వుంది.
ఆమె కళ్ళు ఒక్కక్షణం మెరిశాయి.
"అయితే ఓ పని చేయండి-రేపు సరీగ్గా మీరు 8-30 కి మెహిదీపట్నం చౌరాస్తాలో వుండండి. నేనక్కడికి వస్తాను. ఇద్దరం వెళ్ళి డ్రా చేసుకొద్దాం" అంది మనోజ్ఞ.
కావాలనే అలా అంది.
ఆయన సంతృప్తిగా తల పంకించాడు.
ఆ హాలు నలువైపులా చూస్తున్న మనోజ్ఞ చూపులు చటుక్కున ఒక చోట ఆగిపోయాయి.
మనోజ్ఞ చూపులాగినచోట ఫోనుంది. "ఒకసారి ట్రావెల్ ఆఫీసుకి ఫోన్ చేసుకోవచ్చా?" అందామె రెట్టింపుగా.
ఆయన తలూపాడు అంగీకారసూచకంగా. ఆమె ఫోన్ దగ్గరకు వెళ్ళి ఆ ఫోన్ నెంబర్ చూసింది- 244442. వాళ్ళకు అనుమానం రాకుండా ఉండేందుకు ఏదో నెంబర్ డైల్ చేసి ఆ వైపు ఎంగేజ్ వచ్చినా రేపు రాత్రికి దుబాయ్ కి ఫాతిమాబేగమ్ పేరు మీద టిక్కెట్ కావాలి. ఎవైలబిలిటీ ఉందా అని అడిగి కాసేపు ఆగి థాంక్స్ చెప్పి వచ్చింది.
"నే వస్తానండి. రేపుదయం పనయిపోతే రేపు రాత్రి ఫ్లైట్ కే నేను దుబాయ్ వెళ్ళిపోవాలి. అందుకని రేపు మీరు వచ్చేప్పుడు సుచిత్ర సంతకం ఉన్న కాగితం తీసుకురావడం మర్చిపోకండి.
నాకు చాలా బాధగా వుంది. ఏ అచ్చటా ముచ్చటా తీరకముందే సుచిత్ర వెళ్ళిపోయింది. వస్తానండి" అని వెనుదిరిగిందామె.
* * * *
"ఎందుకలా చేశావ్? ఆ కాగితం తీసుకుని వచ్చేస్తే పోయేదిగా?" మనోజ్ఞతో అన్నాడు హరికుమార్ ఫోన్ లో.
"అలా చేస్తే వాళ్ళకు అనుమానం వచ్చేస్తుంది. అసలు నన్నో భయం వెంటాడింది. సుచిత్ర బతికే వుంటే సంతకంచేసి ఒక కాగితం పంపించమని వీళ్ళు ఆడిగుంటే- సుచిత్ర ఎందుకని ఖచ్చితంగా అడుగుతుంది. వీళ్ళు నా విషయం చెప్పేస్తే నాది నాటకమని తేలిపోతుంది. అప్పుడాళ్ళు ఆ కాగితం లేదనేవాళ్ళే. ఆమె ఎక్కడో ఫోన్ లేనిచోట వుండి ఉండాలి. పోస్టల్ ద్వారానో, కొరియర్ ద్వారానో ఒక కాగితం మీద సైన్ చేసి పంపించమని వీళ్ళు రాసుండాలి- ఆమె సైన్ చేసి పంపి వుండాలి."
"ఏసేస్....మన అదృష్టం బావుండి వాళ్ళు వాళ్ళ కూతురితో డైరెక్ట్ గా మాట్లాడి వుండరు. ఒకవేళ మాట్లడుంటే?"
"ఏముంది....మెల్లగా జారుకొనేదాన్ని"
"కొత్త పేపర్- కొత్త ఇంకేనంటావా?"
"ష్యూర్....అయినా రేపు ఆ విషయాన్ని తేల్చేస్తాను" అంది మనోజ్ఞ.
"నువ్వింతవరకు సుచిత్ర సంతకం చూడలేదుగా? ఆడి ఫోర్జరీ కాదని ఎలా చెప్పగలవు?"
"అది రేపే తేల్చుకుంటాను"
"ఎలా?"
"రేపు సుచిత్ర సంతకాన్ని సేకరిస్తాను. దానితో రైటింగ్ ఎక్స్ పర్ట్ దగ్గరకు వెళతాను."
"ఎలా?"
"రేపు చెబుతాను. ఇప్పుడు నేను అర్జంటుగా 22 వేలు తయారుచేసుకోవాలి. ఉంటాను మరి."
"ఎందుకు?"
"రేపది సుచిత్ర తండ్రికివ్వాలి గదా"
"రేపు నేను బ్యాంక్ నుంచి డ్రా చేసి తీసుకొచ్చిస్తానని చెప్పి సుచిత్ర సంతకమున్న కాగితాన్ని తీసుకొని వచ్చేయాల్సింది. అప్పుడు ఈ డబ్బు ఖర్చుండేదికాదుగా?"
"అలా చేస్తే ఖచ్చితంగా అనుమానం వస్తుంది. ఆయనసలే అనుమానపు మనిషి. భార్యని, కొడుకుని ఈ రోజు కూడా నోరెత్తనివ్వలేదు."
"నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను మనోజ్ఞా! నీలా పోలీసులు పట్టుదలతో, నిజాయితీతో శోధిస్తే దోషులుగా మార్చబడే ఎందరో నిర్దోషులు బయటకొచ్చేస్తారు. వెరీగుడ్! ప్రొసీడ్" అన్నాడు హరికుమార్ ఫోన్ కి ఆ వైపు నుంచి.
ఆమె ఫోన్ ని క్రెడిల్ చేసి, తన దగ్గరున్న డబ్బుని బ్యాంకువాళ్ళు చేసే విధంగా బండిల్స్ గా చేసే పనిలో నిమగ్నమైపోయింది.
* * * *
అర్దరాత్రి దాటి పది నిమిషాలయింది.
"నీకు డ్రైవింగ్ వచ్చా?" అడిగాడు రామదాసు.
"వచ్చు" అన్నాడు వివేక్.
"వెరీగుడ్....నాకోపని తప్పింది. నీకు డ్రైవర్ ని చూడవలసిన అవసరం లేకుండా పోయింది. ఇకపోతే నేను చెప్పేది జాగ్రత్తగా విను-