Previous Page Next Page 
గాడ్స్ గిఫ్ట్ పేజి 28

    అతని బాధామయ గాధ విన్న ప్రతి మగవాళ్ళు కంటతడి పెట్టారు. అతనికి సాయం చేస్తామని మాట ఇచ్చారు.
   
    అంతే.
   
    అక్కడే ఆ రోడ్డు మీదనే అతని చుట్టూ ప్రహరీ గోడలా యుక్త వయసొచ్చిన కుర్రాళ్ళు నిలిచారు. పెద్ద పెద్ద బ్యానర్లు తయారయ్యాయ్. ఉద్యమం ఊపిరి అందేలా దినపత్రికలు కూడా ప్రముఖంగా ఈ వార్తఃని ప్రచురించాయ్.
   
    కఫూర్ ఆనాటి నించి పూర్తిగా నిరవధిక నిరాహారదీక్ష ఘోర మౌనవ్రతం పూని అక్కడే అలానే కూర్చుండి పోయాడు.
   
    రోజు రోజుకి కఫూర్ క్షీణించిపోతున్నాడు. పైగా అతనిప్పుడు వట్టి మనిషి కూడా కాదు. ఆడపిల్లలకు  అదో తమాషాగా ఉంటే మగ పిల్లలకు ఏదో సాధించాలనే పట్టుదల ఏర్పడింది.
   
    కఫూర్ ఎక్కడ మరణిస్తాడోనని ప్రభుత్వం దిగివచ్చింది. ముఖ్యమంత్రిగారు తన మందీ మార్భలంతో వచ్చి "కఫూర్ ని మౌనవ్రతం మానమని అతని కోరికేమిటో చెబితే తీర్చే దారి చూస్తాను" అని చెప్పాడు.
   
    కఫూర్ మౌనవ్రతంలో ఉండటంవల్ల అతని తరపున నిలిచినా మగ పిల్లకాయలు తలో మాట మాట్లాడారు.
   
    "కఫూర్ ని రేప్ చేసింది అంబుజవదనతోపాటు మరో ముగ్గురు ఆడపిల్లలు. ఇప్పుడు కఫూర్ కడుపులో పెరుగుతున్నది ముగ్గురు మగపిల్లలు. ఈ ముగ్గురు మగబిడ్డల తల్లులు ఆ నల్గురు ఆడవాళ్ళలో ఒకరు కావచ్చు. లేక ఇద్దరు కావచ్చు- ముగ్గురు కావచ్చు.
   
    ఇది పరీక్షలవల్ల అంత తొందరగా తేలే విషయం కాదు. కఫూర్ కోరిక ఏమిటంటే "తన కడుపులో పెరుగుతున్న ముగ్గురు మగబిడ్డలకి ఈ నలుగురిలో తల్లులెవరయినా కావచ్చు.
   
    కాని తాను మాత్రం ఆ నలుగురు ఆడపిల్లల్ని పెళ్ళిచేసుకుని తనకు పుట్టబోయే పిల్లలకి తల్లులు వీళ్ళేనని లోకానికి చూపించి తను శీలవంతుడినని నిరూపించుకోవాలని" ఈ మౌనవ్రతాన్ని చేపట్టాడు. కనుక మీరు ఆ నలుగురు ఆడపిల్లల్ని వప్పించి కఫూర్ తో పెళ్ళి జరిపించండి.
   
    కాదంటే అతనికి మరణమే శరణ్యం. కఫూర్ తరపున ఈ మాటలు మేము మీకు చెబుతున్నాము" అంటూ మగపిల్లల కాయలంతా ముఖ్యమంత్రిగారి చుట్టూ చేరి గోలగోలగా అరిచి మరీ చెప్పారు.
   
    "అదెలా కుదురుతుందయ్యా! ఆ ఒక్కమ్మాయిని అంటే నయానో భయానో ఒప్పించి ఆ పిల్లకి జీవితంలో పెళ్ళికాకుండా చేసి ఎప్పటికో అప్పటికి నీ బిడ్డలకి తల్లి అయ్యేలా చేయగలను. ఒకేసారి నలుగురిని పెళ్ళాడుతానంటున్నావ్. అదెలా కుదురుతుంది? వాళ్ళు ఒప్పుకోవాలి కదా!
   
    ఇప్పటికే వాళ్ళల్లో ఎవరికయినా పెళ్ళయి వుంటే అదో కష్టం. నలుగురిలో ఎవర్నో ఒకర్ని అంటే ఎలాగో అలా..." లబ్బున గోల పెడుతూ నెత్తి-నోరు బాదుకొంటూ ముఖ్యమంత్రిగారు వాపోతూ మరీ చెప్పారు.
   
    "ఎందుకు కుదురుదండీ? అలనాడు ద్రౌపది అయిదుగురు మగవాళ్ళను పెళ్ళాడలేదా? చాలాకాలం క్రితం చాలాకాలాల్లో చాలాయుగాల్లో చాలామంది మగవాళ్ళు చాలామంది భార్యలతో చాలా చక్కగా సంసారాలు చెయ్యలేదా?
   
    ఈనాడంటే సృష్టి తారుమారయి మగవాళ్ళక్కూడా కడుపులు రావటంవలన శీలమనేది ఆడదానికే కాదు మగవాడికి వుండాలి. బహుభార్యాత్వం ఉండరాదు. "ఒకే పురుషుడు ఒకే స్త్రీ" అంటూ కొత్త పద్దతులు ప్రపంచంలో ప్రవేశింపచేయబడ్డాయ్"
   
    అని ఒకతను పురాణగాధలెత్తుతూ ఉదాహరణలు చూపిస్తూ ఒక మగవాడు నలుగురు స్త్రీలని పెళ్ళాడవచ్చని నొక్కి వక్కాణించి మరీ చెప్పాడు.
   
    "ఒక పురుషుడు నలుగురు స్త్రీలని పెళ్లాడితే అదో పెద్ద విప్లవం అవుతుంది. ఉన్నా సమస్యలు చాలక కొత్తవి సృష్టిస్తారంటావేమిటయ్యా! మరో మార్గం ఏదయినా చూడండి" అంటూ ముఖ్యమంత్రిగారు నచ్చచెప్పబోయారు.
   
    "సమస్యలెక్కడయితే ఉంటాయో పరిష్కారాలక్కడే ఉంటాయ్ కొత్త రూల్స్ ప్రవేశపెట్టండి ఒక స్త్రీ నలుగురు మగవాళ్ళను పెళ్ళాడొచ్చు. ఒక పురుషుడు నలుగురు ఆడవారిని పెళ్ళాడొచ్చు నంటూ." ఒక యువకుడు సరదాపడిపోతూ ఉచిత సలహా ఇచ్చాడు.
   
    "మీకేమయ్యా! మీది ఉడుకురక్తం ఆవేశంగా ఎన్ని కబురులైనా చెపుతారు. ప్రజలకి నచ్చజెప్పాలంటే నా తలప్రాణం తోకకి వస్తుంది" అన్నాడు.
   
    ముఖ్యమంత్రిగారు ఆ  మాట పూర్తిచేశారో లేదో జనంమధ్యలోంచి ఓ ఆకతాయి కుర్రాడు "ముఖ్యమంత్రిగారికి తోకుందోచ్" అంటూ గట్టిగా అరిచి గబుక్కున ఊరుకున్నాడు.
   
    అతని మాటలకి అందరూ గొల్లున నవ్వారు.
   
    ముఖ్యమంత్రిగారి ముఖం చింతపిక్కయింది. అధిక జనాభా పెరిగి ఓ పక్క మేము కొత్త ప్రణాళిక లేర్పరచి చస్తుంటే ఈ ప్రజలకి బుద్దిలేకుండా ఒక్కొక్కరి కడుపులో ఒకరికి నలుగురి చొప్పున మోస్తూ భారతదేశ జనాభాని ఆకాశంలో చుక్కల్లా లెక్కపెట్టలేనంతగా పెంచేస్తున్నారు.
   
    చెబితే వినిపించుకొని చావరు. మూఢప్రజలు. ఏమన్నా అంటే మౌనవ్రతాలు-నిరవధిక దీక్షలు....వీళ్ళ పిండాకూడు...నా శ్రాద్ధము" అనుకొని పైకి గంభీరంగా మొహంపెట్టి-
   
    "నేను ఆ నలుగురమ్మాయిల దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడి వస్తాను. సమస్యనెప్పుడూ ఒకే కోణంనుంచి చూడరాదు. ఈ విషయంలో కఫూర్ కి న్యాయం కలుగచేస్తానని" చెప్పి ముఖ్యమంత్రిగారు కారెక్కి ఆ నలుగురమ్మాయిల దగ్గరికి బయల్దేరాడు.
   
    మగవాళ్ళందరూ కలిసి "ముఖ్యమంత్రిగారికి జై" అన్నారు. ఆ తర్వాత "కఫూర్ కి జై" అన్నారు.
   
    కొద్దిసేపు అక్కడ జైజై ధ్వనులు సాగిం తరువాత సద్దుమణిగింది.
   
    కఫూర్ మౌనవ్రతం సాగించి దీక్షబూని అప్పటికి వారమైంది. అప్పటికే గుండెల్లో ప్రాణాలు కళ్ళల్లోకొచ్చి నిలిచాయి. ఆ కళ్ళల్లోంచి ప్రాణాలెక్కడ శాస్వతంగా బయటికి పోతాయోనని కళ్ళుమూసుకొని నీరసంగా పడుకున్నాడు కఫూర్.
   
    అతని తరఫున చేరి ఈ దీక్షద్వారా పోరాడుతున్న మిత్రులు ఉత్సాహవంతులయిన యువకులు, స్త్రీలను నిందిస్తూ పాటలు అందుకొన్నారు.
   
    ఆ పాటలు వినీవిని కఫూర్ కర్ణేంద్రియాలు పూర్తిగా దిబ్బెళ్ళు పడిపోయాయి.
   
    అతని గోడేం పట్టని శీలవంతులయిన యువకులు ఉత్సాహంగా పెద్ద పెట్టున తమ నిరసన వ్యక్తం చేస్తూ రకరకాల పాటలు పాడుతూనే వున్నారు.
   
    ఆ ప్రదేశమంతా పాటలతో దద్దరిల్లిపోతూ వుంది.
   
                                             *    *    *    *

 Previous Page Next Page