పార్వతమ్మ దగ్గరగా వెళ్ళి "మీకు తలనొప్పి వచ్చిందని తెలియదు ఆంటీ!" అంది పద్మిని నొచ్చుకుంటూ.
పార్వతమ్మ మాట్లాడలేదు.
"తల నొక్కితే తలనొప్పి కాస్తయినా తగ్గుతుందని మీరే చెప్పారుగా ఆంటీ! తల నొక్కనా!" పద్మిని అడిగింది. పార్వతమ్మ తలమీద చేయివేస్తూ.
విసురుగా పద్మిని చేతికి అవతలకి నెట్టేసి ఆ పక్కకి తిరిగి పడుకుంది పార్వతమ్మ.
"తల నొప్పివస్తే తను మాట్లాడకుండా యెవరూ దగ్గర మాట్లాడకుండా వుంటే పార్వతికి తలనొప్పి తగ్గుతుంది. మీ ఆంటీకి తలనొప్పి తగ్గిందాకా మనం మౌనవ్రతం పాటించటం మంచిది" తెచ్చి పెట్టుకున్న నవ్వుతో అన్నాడు శంకర్రావు.
అలాగే అన్నట్లు తలాడించింది పద్మిని.
ఆ తర్వాత ఎవరూ మాట్లాడుకోలేదు.
పార్వతమ్మకి వచ్చింది తలనొప్పి కాదని...మనసు బాగుండక అలా ఉందని...బహుశా ఏడుస్తూ కూడా ఉండి ఉండొచ్చుననీ...దీని వెనుక యేదో పెద్ద కారణం ఉండే ఉంటుందనీను...ఆ నిమిషాన పద్మిని అనుకుంది.
పద్మిని ప్రియదర్శిని అనుకుంది అక్షరాల నిజం. కాకపోతే ఆ నిజం యేమిటన్నదే పద్మినికి తెలియదు.
అంతే!
15
రోజుకో కొత్త కథ.
అలా చెప్పకపోతే పనిమనిషి లచ్చికి తోచదు. తోమిన అంట్లని పొడిగుడ్డతో తుడిచి ఒక్కొక్కటి పెరటిలో అరుగుమీద బోర్లిస్తూ లచ్చి కథ చెబుతున్నది.
పార్వతమ్మ వింటూ మధ్య మధ్య "అయ్యో పాపం!" అంటూ సానుభూతిగా మాటాడుతున్నది.
తనకు జరిగిన అనుభవంతో పేదవారిమీద గతంలో ఉన్న జాలి, దయ, సానుభూతి, కరుణ అన్నీ ఎగిరిపోయాయ్ పద్మిని ప్రియదర్శినికి.
పార్వతమ్మకి రోజుకో కథ వినిపించి జాలితో ఆమె హృదయం పొంగిపోయేలా చేసి చివరికి యే పచ్చడో, కూరో అడిగి ఇంటికి తీసుకెళుతూ తన పబ్బం గడిపేసుకుంటుంది పనిమనిషి లచ్చి.
ఈ మధ్య ఇరుగు పొరుగు వారిలో కొన్ని దారుణ సంఘటనలు, వారి సంసారంలో వున్న సమస్యలు, వారికున్న అప్పులు, వారిలో కొందరిళ్ళలో ఎదిగిన మొగపిల్లలకి ఉద్యోగాలు రాకపోవటం. ఎదిగిన ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోవటం, చాలీచాలని జీతాలు...అప్పులు...రూపాయి పూలకోసం మొగుడ్ని దేవురించే అతివలు...పెళ్ళాం పుట్టింటికి వెళతానంటే పంపించని భర్తలు...ఇవన్నీ చూసి పార్వతమ్మ ద్వారా తెలుసుకొని...కష్టాలనేవి ఇటు పేదవారికి ఉండవు అటు ధనవంతులకీ ఉండవు. ఈ మధ్యరకం సంసారం గడిపేవారికే ఉంటాయని మరో గాఢ విశ్వాసములో పడిపోయింది పద్మిని.
లచ్చి యేదేదో కల్పించి పార్వతమ్మతో చెబుతూంటే అక్కడే ఉండి వింటున్న పద్మినికి ఒళ్ళు మండింది. ప్రస్తుతం ఒళ్ళు మండినా, కళ్ళు మండినా తను చేసేదేమీలేదు. అలా అని ఊరుకోక పద్మిని వాదన వేసుకుంది మధ్యలో కల్పించుకొని మాట్లాడుతూ.
"నీ సంసారంలో కష్టాలున్నాయంటే ఒప్పుకుందాం కాని మీ ఇరుగు పొరుగు, మీ చుట్టాలు పక్కాలు అందరికీ కష్టాలంటే నమ్మదగిందిగా లేదు" అంది పద్మిని.
"మా పేదవారి కష్టాలు మీలాంటి వారికేం తెలిస్తాయి లేమ్మా! రెక్కాడితేగాని డొక్కాడని బ్రతుకులు మావి" మాటలు సాగదీస్తూ అంది లచ్చి.
"మీ ఇళ్ళల్లో ప్రతివారు సంపాదించేవారే. మొగుడు రిక్షా తొక్కితే పెళ్లాం పాచిపనికి వెళుతుంది లేకపోతే మరో కూలిపనికి వెళుతుంది. ఇంకా ఎంతమండి పిల్లలుంటే అంతహాయి. వాళ్ళకి ఐదేళ్ళు దాటుతూనే ఏదో వక పనిలోకి వాళ్ళని పంపిస్తారు. ఈ లెక్కన మీ ఇళ్ళల్లో అందరూ సంపాదించేవాళ్ళే! ఏదన్నా చిన్న విషయంవస్తే మాకన్యాయం జరిగిందంటూ కట్టగట్టుకొని పోరాడుతారు. మధ్యతరగతి సంసారాల్లో అలా కాదు. సంపాదించేది ఒకడు తినేది పదిమంది! తగినంత డబ్బు ఉండదు! కోరిన కట్నాలు ఇవ్వలేరు.
ఈ రిజర్వేషన్ లవల్ల చాలామందికి ఉద్యోగాలు కూడా రావడంలేదు. మీలో ప్రతివాళ్ళకి నివసించడానికో గుడిశె ఉంటుంది. మధ్యతరగతి సంసారంలో వున్నవారికి ఒకరికి యిల్లువుంటే పదిమంది అద్దె యిళ్ళల్లో నివసిస్తూ బాధపడాల్సిందే! సంఘము, గౌరవమర్యాదలు...ఎన్ని విదాలో కృంగిపోతున్నారు వాళ్ళు."
పద్మిని ప్రియదర్శిని మాట పూర్తిచేయకముందే "ఓలమ్మో! ఓలమ్మో మా కష్టాలు మీకెరికేంటి? నా మావ రిచ్చాబండి తొక్కుతాడు నిజమే! అలా అని వాడేమన్నా యింటికి డబ్బులు తెచ్చిస్తాడా? ఇవ్వనే యివ్వడు! రిచ్చా తొక్కి ఆడు సంపాదించేదంతా ఆడి తాగుడికే సరిపోతుంది" గుండెలు బాదుకొన్నంత పనిచేస్తూ లచ్చి అంది.
"తనకొచ్చిన సంపాదనతో ఇంటికి ఖర్చుపెట్టడమో, లేక దాచుకోవడమో చెయ్యాలి. తాగి యెవరిని ఉద్దరిస్తున్నట్టు? రిక్షా తొక్కుతున్నాడు. సంపాదించుకొంటున్నాడు. ఆ డబ్బు పెట్టి తాగుతున్నాడు. తాగకపోతే ఆ డబ్బులు మిగులుతాయికదా" అంది పద్మిని.
"ఆ...మిగులుతాయ్, మిగులుతాయ్...! రిచ్చా తొక్కడమంటే తుర్రుబుర్రుమని కారు నడిపినంత తేలికకాదు. రిచ్చా నడపాలంటే చచ్చే ఓపిక కావాలి. ఓపిక కోసం తాగుతాడు."
"ఓపికకోసం తాగుతాడు__తాగుడుకోసం రిక్షా తొక్కుతాడు అంతేగా నువ్వు చెప్పేది! తాగడం కోసమే రిక్షా తొక్కేట్టయితే ఆ పని వ్యర్ధం. మరోపని మరోపని చేసుకోవచ్చు. ఇవన్నీ వంకలు లారీలు తోలేవాళ్ళు, బస్సులు నడిపేవాళ్ళు వాళ్లుకూడా ఇదేమాట చెప్పి ఫుల్ గ తాగుతున్నారు" వెంటనే అంది పద్మిని.
"చినిమాలు చూసి మాట్లాడుతున్నారా చిన్నమ్మగారూ! ఒకసారి మా పేదల యిళ్ళకొచ్చి చూడండి. మా బతుకులు ఎంత అద్దాన్నంగ ఉన్నాయో తెలుస్తుంది" అంది లచ్చి.
"అక్కర్లేదు, మీ బతుకులెలాంటివో నాకు తెలుసు. నేనవి కళ్ళారా చూసే వచ్చాను" ఆ మాటని వెంటనే నాలిక్కొరుక్కుంది ఆమె.
"ఎట్టా, ఎట్టెట్టా?" అంటూ నోరు వెళ్ళబెట్టింది లచ్చి.
"నేను వక ఆరునెలలు పేదవాళ్ళ బతుకులమీద సర్వ్ చేసే చిన్న ఉద్యోగం చేశాను. అందువలన చెప్పగలుగుతున్నాను" అంది ఆమె.
"మీరేమైనా చెప్పండి నామమాత్రం చస్తే వప్పుకొను" లచ్చి తెగేసి చెప్పేసింది.
పద్మిని మళ్ళీ యేదో మాటాడబోయింది. ముందే గ్రహించిన పార్వతమ్మ "మనం చూసింది విన్నది నిజం అనుకుంటే ఎట్లా? నువ్వు లోపలికి వెళ్ళి చదువుకో పద్మినీ" అంటూ కనుసౌంజ్ఞ చేసింది.