Previous Page Next Page 
రాగవాహిని పేజి 28

    ఈ స్విచెస్ నొక్కితే ఆటోమేటిక్ గా కిటికీలు తెరుచుకుంటాయి. మూసుకుంటాయి.

    ఇది ఏసి ఆన్ చేసే స్విచ్. క్రిందికి నొక్కితే ఆగిపోతుంది.

    ఇది సీలింగ్ ఫేన్ స్విచ్.

    ఇదో యిది మంచానికే వున్న ఫేన్ స్విచ్.

    ఇది షాండిలర్ స్విచ్. ఇది బ్లూమూన్ లైట్ స్విచ్. ఇది జీరో కేండిల్ స్విచ్. ఇది మంచానికున్న బల్బుకి. ఇది ఈ టేబిల్ లైట్ కోసం.

    ఇది టేప్ రికార్డర్ కు. ఇది రికార్డ్ ప్లేయర్ కోసం. ఇది రేడియోకి ట్రాన్సిస్టర్ ఇదో మంచానికే బిగించాడు.

    ఇది కాళ్ళవైపు వున్న అద్దంపై వుండే తెర తీసేందుకి.

    ఈ బటన్ నొక్కితే దోమతెర దిగుతుంది. ఇది నొక్కితే తెరలేస్తుంది!

    ఆపరేట్ చేస్తూ చూపించేడు సతీష్.

    "ఈ భోగాలన్నీ అనుభవించే అదృష్టవతి ఎవరో?" అప్రయత్నంగా అంది సత్య.

    అతను సత్యకేసి చూశాడు.

    "ఇక్కడకూడా కొన్ని పుస్తకాలున్నాయ్. అదిగో రేక్."

    "ఇక్కడే అవసరమయితే భోజనం చేయడానికి మినీ టేబిల్ పెట్టించారు. దీనికే ఎటాచ్ డ్ బాత్ రూం వుంది.

    ఒక్కమాటలో చెప్పాలంటే ఇక్కడికి వస్తే క్రిందికి దిగకుండా అన్నీ అరేంజ్ చేసుకోవచ్చు. పడుకుంటే లేవ్వలసిన అవసరం లేకుండా సరిపుచ్చుకోవచ్చు. ఆఖరికి మంచాన్ని అటూ ఇటూ కదల్చాలన్నా క్రింద రోలింగ్ వీల్స్ వున్నాయి. స్విచ్ నొక్కితే డైరక్షన్ దిద్దితే అక్కడికి వెళ్ళి ఆగుతుంది.

    కళ్ళు విప్పారేయి. ఎన్నడూ కనీ, వినీ ఎరుగని వాటిని చూసి మతిపోయి నట్టయింది.

    మంచానికి కాస్త దూరంలో ఓ సోఫా వుంది.

    దానిముందు టీపాయ్, మరో రెండు కుర్చీలు.

    "ఆ మంచంపై కూర్చుంటావా? ఇక్కడ కూర్చుంటావా?" తన కుర్చీలో కూర్చుంటూ అడిగేడు.

    "ఊహు! అదృష్టమన్నది ఒకేసారి స్విచ్ అవుతుందట. ఓ పండితుడు చెప్పేవారు. ఏనుగెక్కే యోగమేవుంటే గుళ్ళో రాతి ఏనుగుని ఎక్కిస్తే ఆ యోగం పోతుందట. నే కూర్చోను మళ్ళీ దానివైపు చూసింది.

    తెల్లటి పాలనురుగులాంటి ఫోంబెడ్. మల్లెపూవులాంటి బెడ్ షీట్. మంచుకన్నా తెల్లనయినా దిండు గులాబీలు.

    "హ్ ఆర్టిస్టిక్!" అనుకుంది. ఆ మంచం చాలా విశాలంగావుంది. ఎటు చూసినా పది అడుగుల పొడవుంది. ఎవరు పడుకున్నా పాల సంద్రం మధ్యలో వున్నట్టుగా వుంటుంది.

    "కాఫీ త్రాగుతావా?"

    "ఇప్పుడా?"

    "ఆఁ"

    "సరేఁ"

    "అయితే ముందుగా కొంచెం తిను."

    అని లేచివెళ్ళి ఫ్రిజ్ తెరచి ఓ ఆపిల్ పండు తెచ్చి ముక్కలు చేశాడు. ప్లేట్లో పెట్టి ఆమె ముందు తోచాడు. షెల్ఫ్ తెరచి ఓ ప్యాకెట్ బిస్కట్స్ పెట్టాడు.

    టీపాయ్ కున్న బెల్ నొక్కాడు. అది వంటింట్లో మ్రోగింది. మెల్లగా ఒక్కోముక్కే తింటూ ఆలోచిస్తోంది సత్య.

    ఆమె ఆలోచనలన్నీ అతని చుట్టూనే.

    మరో అయిదు నిమిషాల్లో క్రిందినుంచి కాఫీ తెచ్చాడు నాయర్.

    అతనా రోజే ఉద్యోగంలో చేరేడు. జానకమ్మకి ఎసిస్ట్ చేయటానికి.

    కాఫీ తాగిన కప్పులందుకుని వెళ్ళేడు నాయర్.

    "ఇక వెళదామా క్రిందికి."

    "ఊఁ"

    క్రిందికి దిగుతూ వుంటే ఇంద్రలోకం నుంచి చంద్రలోకానికి వచ్చినట్టుగా వుందామెకి. శరీరం హాయిగా తేలిపోతున్నట్టుగా వుంది. మనస్సూ అంతే!

    "నేను అలా క్లబ్సువేపు కెళ్ళొస్తాను."

    "క్లబ్బుకి వెళతావా?"

    "వూఁ"

    "ఎందుకు?"

    "ఎందుకేమిటి? ఆఫీసర్సంతా యీ వెనింగ్స్ ఎలా ఎంజాయి చెయ్యాలి? క్లర్క్ అంటే ఫైల్స్ జరక్కపోతే రాత్రి పదిదాకా పని చెయ్యాలి. కానీ ఆఫీసరుకేం పనే? టంచన్ గా అయిదు కొట్టగానే బయట పడతారు. అప్పటినుంచి రాత్రి పడుకునే దాకా ఏం చెయ్యాలి?"

    "నువ్వు ఆఫీసరువి కాదుగా డ్రైవర్ వి--"

    "ఈ ప్రపంచంలో అంతా డ్రైవర్సే. సంసార సాగరాన్ని లాగకపోతే ఆ బండి కదలదు. సన్నాసికయినా తన జీవన శకటాన్ని డ్రైవ్ చేసుకోవలసిందే. లేకపోతే దార్లో ఏ అందమైన అమ్మాయికో జిష్ కొట్టేసి యాక్సిడెంటయిపోతాడు."

    పకపక నవ్వింది సత్య.

    "అది సరే! ఇంతకీ పనేమిటి?"

    "ఆఫీసర్స్ క్లబ్బులో సవాలక్ష పన్లు. ఇన్ కంటాక్స్ గొడవలు, పర్మిట్ల గొడవలు- బిజినెస్ గొడవలు- ఎన్నో.... గొడవంటే గోడౌన్ గుర్తుకొస్తోంది- ఆ బ్యాంక్ మేనేజర్ని కలవచ్చు అక్కడే!"

    "మరింకేం పనిలేదా?"

 Previous Page Next Page