ఆ అమ్మాయి ఇలా చాలా మాటలు పడింది. అవమానాలు పొందింది.
తిట్లే దీవెనలుగా, చీత్కారాలే పొగడ్తలుగా భావించి ఏవీ లెక్కచేయక మొండి తనంతో ఏడ్చి గోలచేసి పసితనంలోనే భోజనం చేయనని నిరాహారదీక్షలు చేసి అనుకున్నవి చాలావరకు సాధించింది. ఉత్త సాధించటమే కాదు. విజయం సాధించింది. అన్ని వేళలా అన్నింటా.
ఎందుకే అమ్మా తిట్లు తింటావు! అని తల్లి బాధ పడేది. వాళ్ళ బిడ్డలకి చదువు రాకుండా ఈ అమ్మాయికి చదువు వస్తున్నదని అత్తలు మామయ్యలు చాలా బాధపడే వాళ్ళు. తాతయ్య ఒక్కడే కాస్త ఆ అమ్మాయి పక్షాన వుండే వాడు. అదే కొండంత అండ ఆ అమ్మాయికి. స్కాలర్ షిప్ తో పట్టణంలో వుండి చదవ గలిగిందంటే కేవలం పట్టుదల, కృషి అంతే.
పట్టుదల, కృషి వుంటే చాలా విజయాలు చూడవచ్చు. ఆరోగ్యం అంటూ వుంటే అదే పెద్ద భాగ్యం అనుకున్న ఆమె పరిధిలో వీలయిన విద్య నేర్చుకోవటం మొదలుపెట్టింది. లోకం తీరు జీవితానుభవాలు ఎన్నో తెలుసుకుంది.
అమ్మాయి పెరిగి పెద్దదయింది. పెళ్ళీడు కొచ్చింది. ఆమె తల్లి శరీరం చాకిరీతో అలసి సొలసిపోయి, ఇంక ఈ బ్రతుకుని ఈడ్వలేను అన్నట్లు ఓ రోజు జ్వరంతో తీసుకుని తనువు చాలించింది. విషపు జ్వరం ఆమె జీవితానికి విముక్తి కలిగించింది.
అమ్మాయి వంటరి దయిపోయింది. ముసలి తాతయ్య అండ కొద్దిగా వుంది అంతే. ఈ అమ్మాయిని మూడో పెళ్ళి ముసలాడికిచ్చి చేయాలని పెద్ద మామయ్య, ఓ పిచ్చాడి కిచ్చి చేయాలని చిన్న మామయ్య వాళ్ళ శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి వారే తమ మాటే నెగ్గాలని పట్టుదలతో వున్నారు.
అటు చూస్తే దుర్మార్గంతో అమ్మాయి మెడలొంచాలని చూసే మామయ్యలు ఇటు లోకం చూస్తే పశువులు, తోడేళ్ళు, నరమాంసం రుచి మరిగిన పులులు, కోతిమూకలు, గండు పిల్లులు. అటుచూస్తే నుయ్యి, ఇటుచూస్తే గొయ్యి. అప్పుడా అమ్మాయి పరిస్థితి ఏమిటి! ఏం చేయాలి!" అంటూ కొద్దిసేపు దీక్ష ఆగింది.
'అవును ఏం చేయాలి?' ఎవరికి వారే ఆలోచిస్తూ వుండిపోయారు.
దీక్ష ఈ కథ ఎందుకు చెప్పింది అన్న ఆలోచన వాళ్ళలో ఎవరికి ఆ నిమిషాన రాలేదు. కథలోని అమ్మాయి పరిస్థితిగురించి మాత్రమే ఆలోచించారు వాళ్ళంతా.
వాళ్ళ ఆలోచనలకి ఓ రూపం రాకముందే దీక్ష మళ్ళీ పెదవి కదిపింది నెమ్మదిగా.
"అనగనగా ఓ అమ్మాయి కథ చివరికి ఏ మలుపు తిరిగిందని ఆ విషయం ఇప్పటికిప్పుడే మీకు తెలుసుకోవాలని వుండటంలో వింతలేదు, విడ్డూరం లేదు. అది సహజం. అది చివరికి చెపుతాను. ఎందుకంటే మరికొద్ది సేపటిలో మీ ముందు ఈ స్టేజీ మీద ప్రదర్శించబోయే ఓ ప్రదర్శన అందరూ స్త్రీలు పాల్గొంటున్నది. మీరు మరి కొద్దిసేపటిలో చూడబోతున్నారు.
అదేమిటో అన్నది మీరు తెలుసుకో గోరుతున్నారు. దాని విషయమై అత్యంత ఉత్సాహంగానూ వున్నారు. అవును కదూ! నే చెప్పేకన్నా మీరు చూశారనుకోండి, అది చాలా అద్భుతంగా వుంటుంది కదా! అందుకే చెప్పను. మీ కళ్ళకి ఆనందం కలిగిస్తాను చూడండి. చూడండి. చూసి ఆనందించండి. అంతేకాదు ఆలోచించండి, దీర్ఘంగా ఆలోచించండి.
మరికొద్దిసేపటిలోనే మొదలయ్యే ఈ ప్రదర్శనలో నేను మీకు కథ చెప్పిన అమ్మాయి వుంటుంది. ప్రదర్శన పూర్తి అయిన తరువాత అమ్మాయిని పరిచయం చేస్తూ కథ చివరి మలుపు. నేను పాంప్లెట్లు పంచిన కారణము, ఇంకా చాలా చాలా చెప్పి పెద్దల ఆశీస్సులు పిన్నల అభినందనలు కోరుతాను. కొద్దిసేపు సహనంతో మీరు వేచి చూడండని కోరుతూ ప్రస్తుతానికి శలవు తీసుకుంటున్నాను.
దీక్ష వినయంగా చెప్పి మరోసారి నమస్కారం చెప్పి స్టేజీకి అటుపక్కకి దిగిపోయింది.
అందరూ ముఖ ముఖాలు చూసుకున్నారు.
సస్పెన్స్ నవల, సస్పెన్స్ సినిమాలో కూడా చోటు చేసుకొని వింత సస్పెన్స్ వాళ్ళ మనసులని వేధిస్తున్నది. దీక్షని తొలిసారి చూసిన దగ్గర నుంచీ అన్నీ ప్రశ్నలే. జవాబు మాత్రం ఏ మాత్రం కొద్దిగా కూడా వూహకి అందలేదు వాళ్ళలో ఎవరికీ!