Previous Page Next Page 
సరస్వతీ మహల్ పేజి 27

                                                    ఇసుక తిన్నెల వన్నెల వెన్నెల "రాణి"

    పేరువిని భ్రమించి, ఆనందించి, మోజుపడి రచన చేయడం ఈనాడు వింటున్నాం. పేరుపెట్టాక--- పెట్టిన పేరుమీది గౌరవంతో రచన చేశారు ఆరుద్ర. శ్రీయుత కాటూరి వెంకటేశ్వరరావు ఏదో సంకలనం చేస్తూ అందులో 'త్వమేవాహం' అనడానికి సినీవాలి ఉటంకిస్తే, దాన్ని సార్ధకంచేసి కావ్యం రాశారు ఆరుద్ర.

    "కిన్నెరసాని" అని వాగు పేరు వినగానే రసించి పరవశించి ఓ అందమైన కధ అల్లి "దాని సంగీతం ఆత్మలోనదిస్తే" అదో చక్కని గేయకావ్య మైంది. అది తెలుగు పాటల తీపి అయ్యింది. చిరుతేనెలా, అచ్చరల గొంతులా, గజ్జియల మ్రోతలా నాట్యం చేసింది. తెనుగువారికి ప్రతిపద స్మరణీయమైంది. ఒక కవి సమ్రాట్టు, గుండెనుంచి జాలువారి నది నీటిలో, మెలిజడ సందులో, నీటి ముడిపొందులో సాగి "తెనుగు వాగై" పారింది తెలిపూల తేనేవాకలు వారగా చేసింది.

    "వనములను దాటి వెన్నెల బయలు దాటి"న కిన్నెరసాని తెనుగు మాగాణాన్ని సస్యశ్యామలం చేసింది తెలుగు దేశాన్ని సంగీతమయం చేసింది. తెలుగువారి నోళ్ళల్లో "ముక్తగీతికవోలె మ్రోగింది" .... తెలుగు రసికుల గుండె చిను రసాప్లావితం చేసింది. ఆనాటినుంచి ఈనాటిదాకా "కిన్నెరసాని" ఏమి కిన్నెరసాని!" అనిపిస్తోంది. కొబ్బరిపాలు వాకలు కట్టిస్తోంది.

    ఇంతగా అలరించేందుకు అందులో ఏముంది? "అందరు తెలుగు కన్నెల మల్లేనే ఉద్విగ్న హృదయ కిన్నెర ఎక్కువ తెలుగు కుటుంబాల్లో సామాన్యమైన అత్తా కోడళ్ళ పోరాటం ఆ ఇంట్లోనూ వెలిసింది. కొడుకు సుఖమెరుగని అత్తకు కిన్నెరమీద నిందలారోపించటం పని అయ్యింది. ఒకప్పుడు ఆవిడ చేసిన నింద భరించడం మహా పతివ్రత అయిన కిన్నెరకు కష్టమైంది. కిన్నెర హృదయం శోకం చేత ప్రళయ సముద్రం అయింది---"

    కరిగి నీరై వాగై ప్రవహించింది తల్లిని కాదని లేని, భార్యను
    ఓదార్చలేని కిన్నెర భర్తశోకించి శోకించి శిల అయినాడు....
   
    సర్వజన సామాన్యమైన సమ్మాన్యమైన కధ కాబట్టి కిన్నెరసాని పాటలు ఇంకా తెలుగు గొంతుల్లో పలుకుతూ ప్రతిధ్వనిస్తున్నాయి.

        ఓహో కిన్నెరసానీ!
        ఓహో కిన్నెరసానీ
        ఊహమాత్రము లోపల
        నేం నిలువవే జవరాలా

    అంటూ భార్య వెంట పరిగెత్తి పరిగెత్తి ఆమె రాళ్ళవెంట పరిగెడుతూ వుంటే "రాలపైన తొలినాళుల, కాలిడిగా నోర్వలేవు. రాలను కొండలగుట్టల నేలా ప్రవహించెదవో" అని కుమిలిపోయిన భర్తవ్యధార గాధ ఇది.

    "నీవు మహా పతిశీలువు కావని నేనింటి నంటే, అని కుమిలి కుమిలి యేడిచి కంఠము సన్నవడిన భర్త నిర్ణిద్రరోదనాగానమిది.

    ఒడలెరుగకుండా రోదించి రోదించి "రాయివోలె అయిపోయిన నాధుని కధ" ఇది.
    అతనికి భార్యంటే ఎంత ప్రేమో! ఎడమ చేతి కొంగును ఒడిచి పట్టుకొని---ఆమెనీరైతే "తడిచేతను కొంగు లేక తడబడిన" ప్రియుడతను! ఆమె కన్నులు మీనాకృతి; అందుకే ఆమె కనులు చూసి ఆమెను నదీమానుషజన్మగా భావించిన భావుకుడతడు! పెళ్లామంటే చెప్పలేనంత ప్రేమ! ఆమె పాదాలు ఫాలాన మోచిన రసికుడు.

    అక్కడ చెమ్మటను వాగైన ఆమెపై ప్రేమ తలపోసి వెతల నందిన దుఃఖితుడు!
   
        ఇంత కోపమేమిటికే
        ఇంత పంత మేమిటికే
        ఇంతులు జగమున పతులకు
        ఇంతలు సేయుదురటవే

    అని నిష్ఠురమాడిన నిర్మల హృదయుడు. కరిగి నీరైనా - ఆ చిన్ని తరగల చాలులో ఆమె మేని పసందులు వెన్నెలవలె కన్నులకు కనిపించాయని మురిశాడు.

    ఆమె నవ్వులు పెరుగులుగా ఆమె వళులు తరగలుగా ఆమె కన్నులు మీనులుగా అయ్యాయని ఊహించాడు. ఆమె జఘనాన్ని ఇసుక తిన్నెగా చూసిన తన కన్నులు నేలమీద ఊడిపడలేదని - లోలోనే ఉరిసి పోయాయని కుమిలిన దుఃఖార్తుడు.

    వర్ణించడంలో కవులు స్త్రీల జఘనాన్ని ఇసుక తిన్నెలలో పోల్చడం సంప్రదాయం. కానీ ఇక్కడో! ఏ స్త్రీ అయితే తన కన్నుల పండువుగా తన జీవిత సర్వస్వంగా తన జీవన దీపంగా వుండిందో ఆమె నదిగా మారింది! అప్పుడామె కన్నులు చేపలయ్యాయి. జఘనం ఇసుక తిన్నె అయ్యింది. అహో విశ్వనాధుల సృష్టి! "అనుభవ రసికో విజానాతి."

    ఇక ఆ కిన్నెర నడక ఆమె నృత్యం సంగీతం ఎంత గొప్పగా వుందో పొంగిన కడలికి తెలుసు. ఉప్పొంగిన ఆ జడధిని చూసి దుఃఖించిన కిన్నెరకు తెలుసు ఓదార్చిన గోదావరికి తెలుసుఆమీద కిన్నెర వైభవం! అదెలాంటిది?

                                                  ----*----

 Previous Page Next Page