Previous Page Next Page 
అహల్య పేజి 27


                                        16


    ఇంద్ర సఖి భూలోకం నుంచి వచ్చీరాగానే, ఇంద్రుణ్ణి దర్శించుకుని తను భూలోకం వెళ్ళి అహల్యను కలుసుకుని ఆమెతో మాట్లాడి ఆమె అభిమానాన్ని సంపాదించుకుని ఆత్మీయురాలి అహల్య సఖిగా తిరిగివచ్చిన విషయం తన ప్రభువైన ఇంద్రుడికి చెప్పాలని ఎంతగా ఉవ్విళ్ళూరిందో అంతగా నిరాశకు లోనైంది.


    ఆమె ఇంద్రలోకం చేరేసరికి అక్కడ ఇంద్రుడే లేడు. ఆయనా తదితర దిక్పాలురూ, దేవతలూ, ఋషులు, అందరూ కట్టగట్టుకుని విష్ణు సందర్శనార్ధమై వెళ్ళారు. ఎందుకంటే...


    లంకానగర పాలకుడైన పౌలస్త్యబ్రహ్మ- రావణ బిరుదాంకితుడు భూలోకంలోని వన వాటికల్లో నివశిస్తూ ముక్కు మూసుకుని విష్ణునామ సంకీర్తనలలో ముప్పొద్దులా గడిపే మునులను, సాధువులనూ హింసిస్తున్నాడు. వారు చేసే యజ్ఞ యాగాదులను భగ్నం చేస్తున్నాడు, చేయిస్తున్నాడు. పతివ్రతల చెర పడుతున్నాడు. అతని ధాటికి లోకమంతా తల్లడిల్లిపోతున్నది.


    అతని బాధ భరించలేని ఋషులంతా పనిగట్టుకుని దేవేంద్రుడి సన్నిధికి వెళ్ళి మొరపెట్టుకున్నారు యజ్ఞాదులు చేసి హవిస్సులు అర్పించేది ఇంద్రాది దేవతలకే కదా! తమ దీక్ష కొనసాగడం లేదని, తమ జీవనానికి భంగం వాటిల్లుతూ ఉన్నదని, ఏం చేయడానికీ పాలుపోని స్థితిలో ఉన్నామని మొరపెట్టుకున్నారు.


    ఇంద్రుడికి కాళ్ళూ, చేతులూ ఆడలేదు.


    రావణుడి శక్తి ముందు అష్ట దిక్పాలుర బల సంపన్నత ఏమీ పనిచేయలేదు. బ్రహ్మ ఇచ్చిన వరాలలాంటివి. శివుడు మెచ్చి ఇచ్చిన వరం- నరవానరుల చేత తప్ప- మరొకరి చేత చావు లేదనే వరం వల్ల మరీ విజృంభించాడతను.


    రావణుడు అతనికి కుమారుడు జన్మించబోయే నవగ్రహాధిపాలితమైన జాతక చక్రాన్ని తనకిచ్చివచ్చిన రీతిలో- అతడు మహాజ్యోతిర్విద్యావేత్త కనుక- రూపొందించుకుని అలా గ్రహాల్ని శాసించి కదలక మెదలక నిలిచేలా చేశాడు.


    అప్పుడే తామెవరూ అతన్నేమీ చేయలేమనే విషయం స్పష్టాతి స్పష్టంగా నిర్ణయమైపోయింది.


    తేలిపోయిన బలంతో విషయం తేలిపోయాక ఇక విచారించి ఫలమేమిటి? ఆజ్ఞ మీరిన శని కాలు విరగ్గొట్టి అతన్ని శాశ్వతంగా కుంటివాడిని చేసి మందుడనే పేరు నిర్ధారించాడు కదా!


    అందుకని- తన వద్దకు వచ్చిన ముని జనాన్ని తనలోకంలో ఉన్న దేవగణాన్ని వెంటబెట్టుకుని విష్ణు సన్నిధికి వెళ్ళి పురుషసూక్తం పఠించి ఆయన్ని ప్రసన్నుడిని చేసుకుని విన్నవించుకున్నాడు.


    వారితో పాటు భూదేవి వెళ్ళింది.


    తనా భారం మోయలేకున్నానని, ఆ రాక్షసుని తప్పించమనీ ప్రార్థించింది. పాల సముద్రంలో శేష శయ్యపై విలాసంగా శయనించి శ్రీదేవి పాదాలు వొత్తుతూ వుంటే హాయిగా వున్న విష్ణువు చిద్విలాసంగా నవ్వాడు.


    'కాలం కర్మం కలిసి రావాలి. రావణుడి పాపం పండాలి! అప్పుడే నేను అవతారం ఎత్తుతాను. అయోధ్య నగరాధీశుడైన దశరధుడు సంతానం లేక పరితపిస్తున్నాడు. ఆయన సంతానంగా మేం జన్మిస్తాం.


    మేం అంటే నేను కౌసల్య కడుపున శ్రీరామచంద్రమూర్తిగా, ఈ ఆదిశేషుడు సుమిత్ర గర్భాన లక్ష్మణుడిగా, శంఖు చక్రాలు భరత శతృఘ్నులుగా కైకేయి సుమిత్రల గర్భాన జన్మిస్తారు.'


    'నాతో పాటు దేవగణం, ఋషిగణం అంతా భూలోకం వస్తారు. ఈ శ్రీమహాలక్ష్మి మిధిలా నగరాధీశుడైన జనక మహారాజు ఇంట వెలుస్తుంది. అయోనిజగా జన్మించే సీత రావణ వినాశనానికి హేతువవుతుంది. అంతవరకూ ఓపిక పట్టకా తప్పదు. ఆ బాధలను ఓర్చకా తప్పదు' అన్నాడు.


    కష్టాలకు ఒక తుది వుంటుందీ అంటే అదే పెద్ద సుఖంగా భావిస్తారు అందరూ. కష్టాలు గట్టెక్కుతాయంటే ఏనాటికైనా సరే కష్టాల కడలి గట్టెక్కగలమనే విశ్వాసంతో సుఖాపేక్షతో కష్టాన్నీ, కష్టకాలాన్నీ సుఖంగా గడిపేస్తారు అందరూ. అదీ దేవ మానవ సహజ లక్షణం.


    శ్రీమహా విష్ణువు అలా సెలవివ్వగానే నారదమహర్షి ఆనందంతో విష్ణునామ సహస్రం పఠించాడు. అతనితో దేవతలంతా గొంతు కలిపారు.


    ఇక వెళ్ళండి అన్నట్లు శ్రీమహావిష్ణువు చిరునవ్వులు చిందించాడు.


    వెంటపెట్టుకు వెళ్ళిన దేవతలు ఋషిగణంతో స్వర్గం చేరుకున్నాడు ఇంద్రుడు. మునులంతా తిరిగి భూలోకం వెళ్ళిపోయారు. అలా వచ్చి తిరిగి వెళ్ళినవారిలో గౌతమ మహర్షి కూడా ఉన్నాడు. కానీ ఇంద్రుడికి తనున్న బాధలో గౌతముడి చరిత్ర అహల్య కథ ఏదీ గుర్తుకు రాలేదు. తిరిగి వచ్చిన ఆ పగటి పూట ఇంద్రసఖి కనిపించేదాకా గుర్తే రాలేదు. ఆమె కనిపించగానే అంతా గుర్తొచ్చి నందనవనంకేసి నడిచాడు.


                                       17


    రోమపాద రాజర్షి తమ నగర రాజ్యానికి విచ్చేసిన ఋష్యశృంగమహర్షికి అఖండ స్వాగతం ఏర్పాటు చేశాడు. అడవిలో జటాజూటధారిగా అయిన తండ్రిని, తోటి మునులనూ జంతువులనూ మాత్రమే చూసిన ఆ యువ మహర్షి- విభాండకుడు తను తప్ప మరేమీ లోకం విషయాలూ తెలియకుండా కొడుకును పెంచిన కారణంగా- తొలిసారి తమ ఆశ్రమ పాంత్రాలకు వచ్చిన రాజ నర్తకినీ వారి చెలికత్తెలనూ చూసి అబ్బురపడి వారితో చెలిమి కట్టి వారివల్ల ప్రభావితుడై నావ ఎక్కి అది పయనించే విషయం కూడా తెలుసుకోలేని ముగ్ధత్వంతో మొహంతో నగర ప్రాంతాలకు వచ్చీరాగానే ఆ జనాన్నీ ఆ జీవనాన్నీ ఆ మేడలనూ ఆ మిద్దెలనూ పశువులనూ శిశువులనూ పరీక్షగా చూస్తూ ఆశ్చర్యపడుతూ వారినడిగి విషయాలను తెలుసుకుంటూ వారిలో కలిసిపోయాడు.


    నగర వీధుల గుండా పయనించి రాజాంతఃపురం ప్రవేశించగానే ఆయనకు ప్రధాన ద్వారం వద్దనే అఖండ స్వాగతం లభించిందాయనకు. పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. బ్రాహ్మణోత్తములు, రాజ పురోహితులూ రోమపాదుడు స్వయంగా ఆయన కాళ్ళు కడిగి స్వాగతం పలికారు.


    మళ్ళీ యీ పాదాలను కన్యాదాన సమయంలో కడిగితే తన జన్మ తరిస్తుందనుకున్నాడాయన. అక్కడ కొడుకు కనిపించక ఆందోళన చెందుతున్న విభాండకుడికి విషయం వివరించి ఆయన్ని శాంతపరిచి, ఆయననూ నగరానికి పిలుచుకుని వచ్చారు. సాదరంగా సగౌరవంగా స్వాగతం పలికారు.

 Previous Page Next Page