"గీత మీ కాబోయే భార్య. ఆవిడ గురించి చెప్పడానికి నేనెంతటిదాన్ని. ఈ నిర్ణయం సరి అయిందో కాదో ఆలోచించుకోవాల్సింది యిప్పుడుయిప్పుడు కాదనుకుంటాను." ఆమె మాటల్లో కఠినతకి కృష్ణమోహన్ ఆశ్చర్యంగా చూశాడు. ఆమెనించి ఏదో ఓదార్పు, సానుభూతి ఆశించిన అతను ఆ మాటకి దెబ్బతిన్నాడు "అవును, నిజమే - యిప్పుడేమనుకోడానికి టూలేట్ ..." అంటూ అదోలా నవ్వాడు. అతని నవ్వు, ఆ మాటలు చూసేసరికి సరోజ కోపం చప్పున చల్లారి అతనిపట్ల మమత పొంగింది. ఒక్కక్షణం గీత గురించి అంతా చెప్పేయాలని, కృష్ణమోహన్ లాంటి మంచి మనిషికి గీతలాంటి అహంభావి తగినది కాదని చెప్పాలనిపించింది. కాని తను చెప్పడం, నేరాలు చెప్పినట్లు అసహ్యంగా వుంటుంది. ఎలా చెప్పడం? ఎలా చెప్పగలదు! ఆమె ఆలోచన తెగకముందే కృష్ణమోహన్ అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
* * *
మర్నాడు ఆస్పత్రిలో పని చూసుకుంటుండగా గీత వచ్చింది. ఆమెని చూసిన కృష్ణమోహన్ మొహం తిప్పుకున్నాడు "సారీ మోహన్, కోపం వచ్చిందా..." గోముగా అంటూ దగ్గరకి వచ్చి బుజం పట్టుకు తిప్పుకుంది. "ఎక్సూజుమీ నిన్ననవసరంగా గొడవ జరిగింది నామూలంగా..."
"థాంక్సు, అనవసరంగా గొడవ చేశానని గ్రహించావు. అంతే చాలు" బింకంగా అన్నాడు కృష్ణమోహన్. "గీతా, ఒక సంగతి చెప్తాను. దయచేసి విను. మా అమ్మ బ్రతికినంతకాలం మా యింట్లో మా అమ్మ అభీష్టానికి వ్యతిరేకంగా నేనేం చెయ్యను, అలా అని భార్యకివ్వాల్సిన స్థానం యీయనని అర్ధంగాదు. కన్నతల్లిగా, పెద్దావిడగా ఆమెని గౌరవించడం నా ధర్మం. నాతోపాటు అది నీ ధర్మంకూడా కావాలి. అలా అని గుడ్డిగా తల్లి చెడ్డచేస్తే అనుసరించేటంత అవివేకినికాను. మా అమ్మ మనసు, ఆవిడ వ్యక్తిత్వం గురించి నాకు బాగా తెలుసు. ఆవిడ అనవసరంగా ఒకరిని నొప్పించే తత్వం కల మనిషికాదు. అలాంటి ఆమె నిన్న అలా మాట్లాడిందంటే ఆమె మనసు నీవెంత నొప్పించావో అర్ధం కాలేదా? అది మొదటిసారి కాదు. చాలాసార్లు జరిగింది కనకే ఆవిడ అంత మాత్రం మాట్లాడింది. నీవిది అర్ధం చేసుకుంటే నీకు నాకు మంచిది..." గంభీరంగా అన్నాడు.
అతిప్రయత్నంమీద గీత ఆవేశాన్ని అణుచుకుంది. నిన్న అలా మాట్లాడినందుకు తల్లి మందలించటం, పెళ్ళయ్యే వరకు జాగ్రత్తగా వుండాలని తండ్రి బోధనతో, ప్రోద్బలంతో క్షమాపణ చెప్పడానికి వచ్చింది. కాని వచ్చాక కృష్ణమోహన్ ఎంత నెమ్మదిగా చెప్పినా అతని మాటల్లో కఠినత, ఆజ్ఞాపన ఆమె అహాన్ని మళ్ళీ రెచ్చగొట్టింది. అల్లారుముద్దుగా పెరిగిన గీత, ఒకరిని ఆజ్ఞాపించడం తప్ప, ఒకరి ఆజ్ఞ పాలించడం అలవాటులేని గీత ఇంకా పెళ్ళి కాకుండానే కృష్ణమోహన్ చూపించిన అధికారం ఆమెలో పౌరుషాన్ని రెచ్చగొట్టింది. అయినా నిన్న తండ్రి బోధ గుర్తు తెచ్చుకుని ఆవేశాన్ని అణుచుకుంది. కాని అడగదలిచింది అడగకుండా వుండలేక పోయింది.
"అంతే.....అత్తగారి పాదపూజ చేసుకొంటూ మడికట్టుకు మూల కూర్చోమనా నీ ఉద్దేశం, నేనలా కూర్చోలేనని నీకు తెలుసు-" నిర్లక్ష్యంగా అంది.
"పెద్దలని గౌరవించాలంటే పాదపూజ చెయ్యమని కాదు. గీతా, మనకిష్టం లేనిదైనా కొన్ని విషయాలలో ఇతరుల అభిప్రాయాలని గౌరవించాలి. అయిష్టత వ్యక్తం చేయకుండా వూరుకోడం అలవరచుకోవాలి. ఇన్నాళ్ళు నీవు ఆడిందాటగా పెరిగి వుండవచ్చు, ఒక యింటి కోడలి వయ్యాక ఆ యింటికి అనుగుణంగా మారాలి"
"ఓహో...అత్తింటికోడలు అంటే వ్యక్తిత్వం చంపుకుని పడివుండాలని నాకు తెలియదులెండి. మోహన్, ఈ నాన్సెన్స్ నాకు చెప్పకు-ఇంతకీ నీ యీ నీతిబోధ అంతా, ఆ సరోజని ఏమీ అనవద్దని చెప్పడానికేనా - సరోజని మీ అమ్మ, నీవూ నెత్తికెక్కించుకున్నారు గనక నన్నూ ఎక్కించుకోమని చెప్పడానికా! ఆ ముసలావిడకి బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఇలా మారినందుకు చాలా విచారంగా వుంది" వ్యంగ్యంగా అంది మోహన్ మొహం ఎర్రబడింది.
"గీతా! సరోజని ఏమన్నా అంటే మా అమ్మకాదు ఇకపై నేనూ వూరుకోను" కఠినంగా అన్నాడు. ఆమాటతో గీత మొహం జేవురించింది. "ఓహో అంత ప్రేమ అన్న మాట!"
"ప్రేమో, అభిమానమో-నీ కర్ధం కాదులే-
"మోహన్ మా యింట్లో పనివాడిని, నిన్ను ఒకలా ట్రీట్ చేస్తే నీ కెలా అనిపిస్తుంది." హేళనగా రెట్టించింది.
"సరోజ పనిదికాదని లక్షసార్లు చెప్పాను." కోపంగా అన్నాడు మోహన్.
"అది మీరణుకోవచ్చు కాని నేననుకోవడంలేదు." పెంకిగా అంది. కృష్ణమోహన్ విరక్తిగా చూశాడు.
"అనుకోకపోతే జరిగే అనర్ధాలకి నేను బాధ్యుడను గాను." విసురుగా అన్నాడు.
"అంటే!" ఆవేశంగా రెట్టించింది" "బెదిరిస్తున్నావా."
"గీతా, ప్లీజ్ యిక్కడనించి వెళ్ళు, నన్ను రెచ్చగొట్టకు." చిరాగ్గా అన్నాడు....గీత మొహం జేవురించింది. పెదాలు బిగబట్టి చూసింది.
"మోహన్.....నీ వింతలా మారిపోతావని నే నెప్పుడూ అనుకోలేదు.. ఆ సరోజ వచ్చిం దగ్గరనించి నీవు మారిపోయావు మోహన్ ఆ సరోజలో నీవేం చూసావు. ఆమె నాకంటే దేవిలో ఎక్కువని నిన్నింత ఆకర్షించింది" ఆవేశంగా, ఉక్రోషంగా అంది. ఆ ఉక్రోషం ఏడుపులోకి దింపింది. అక్కడ కుర్చీలో కూలబడి టేబిల్ మీద మొహం పెట్టి ఏడవడం మొదలు పెట్టింది గీత.