Previous Page Next Page 
వివాహబంధాలు పేజి 27


    ఆకబురువిని వాడు అదోలా అయ్యాడు. చాలా రోజులు ఏదోలా వున్నాడు. మరే సంబంధాలు చూసినా వద్దన్నాడు. ఓ ఏడాది తరువాత నీ సంబంధం వచ్చాక ఇష్టపడ్డాడు. అంతకంటే మాకేం తెలియదు విజయా.
    వాడిలా నీ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తాడని మేం ఎలా కలగంటాం తల్లీ- వుండు అసలు వాడిని నాలుగూ అడుగుతాను. ఇష్టం లేకపోతే మానాలిగాని చేసుకుని ఇలా ప్రవర్తిస్తాడా. వాళ్ళ నాన్నగారితో కూడా చెపుతాను" అన్నారు ఆమె కోపంగా "నీకేం లోటని ఈ వెధవ్వేషాలు వేస్తున్నాడు." అంటూ ఆవిడ భోంచేసి చేయికడుక్కుని మామగారి గదిలోకి వెళ్ళారు.
    ఆ అమ్మాయి ఎవరో? ఎందుకు యీయన్ని తిరస్కరించిందో అని ఆలోచించాను. లేనింటిపిల్ల. ఆస్థి, చదువు అన్నీ వున్న వరుడ్ని తిరస్కరించిందంటే తగిన కారణం వుండే వుంటుంది. ఆ అమ్మాయి తిరస్కారంతో ఈయనగారి అహం దెబ్బతిని ఆ కోపం ఇలా తీర్చుకుంటున్నారు గాబోలు! అసలేం జరిగిందో తెలిస్తే బాగుండు అనుకున్నాను.
    తల్లి తండ్రి గట్టిగా చివాట్లు పెట్టినట్లున్నారు.
    రాత్రి గదిలోకి వస్తూనే తీక్షణంగా నా వంక చూసి "అమ్మతో ఏం చెప్పావు?" అన్నారు కటువుగా.
    ఇంట్లో అంతా వున్నారన్న భరోసాతో నిబ్బరంగా "జరిగినవి. మీ అమానుషత్వం, రాక్షసత్వం" అన్నాను.
    దగ్గిరకివచ్చి చెయ్యి గట్టిగా నొక్కి - "ఎందుకు చెప్పావు?-" కర్కశంగా అన్నారు.
    "విని బుద్ది చెప్తారని" అన్నాను.
    ఆ చెయ్యి వదలకుండా మెలితిప్పుతూ "నీ పొగరు తగ్గలేదన్న మాట" అన్నారు క్రూరంగా చూస్తూ -
    "మీ అహంకారం తగ్గేవరకు నా పొగరు తగ్గదు. ముందా చెయ్యి వదలండి. మీరింత అహంభావులనే సుశీల మీ ఆస్థి అంతస్థు లన్నీ తృణప్రాయంగా చూసి మిమ్మల్ని తిరస్కరించింది. మీకు పాఠంనేర్పింది. అయినా ఆడదంటే మీ చుల్కన భావం పోలేదు. ఆ కోపం ఇతరుల మీద చూపి పగ సాధిస్తున్నట్టు పై శాచికానందం పొందే మీ రాక్షస ప్రకృతి తగ్గేవరకూ నా పొగరు తగ్గదు. స్త్రీ అంటే ఏమిటో ఇప్పటికయినా తెలుసుకోండి. ఆమెని గౌరవించని మగాడు జీవితంలో ఎప్పుడూ బాగుపడడు" శంగా అన్నాను.
    ఆయన మొహం తెల్లగా పాలిపోయింది. అప్రయత్నంగా నా చేయి వదిలి విస్మయంగా చూసారు నా వంక.
    "హు - ఒకసారి మీ అహంకారంవల్ల సుశీలని జార విడుచుకున్నారు. ఇంకా మీ అహం తగ్గకపోతే కట్టుకున్న భార్యనీ కోల్పోతారు అన్నది గుర్తించితే మీకు కూడా మంచిది" గంభీరంగా అన్నాను.
    ఆయన ఆ షాక్ లోనించి తేరుకున్నారు. "నన్ను కాదన్నందుకు సుశీలకి పాఠం నేర్పాను. నన్నీ బెదిరింపులు ఏమి చెయ్యలేవని గుర్తించు. నా మాట కాదన్న వారిని క్షమించే అలవాటు నాకు లేదు" కసిగా హేళనగా విషపు నవ్వు నవ్వారు తల పంకిస్తూ.
    ఇంట్లో అందరూ ఉన్నారనో మరెందుకోగాని అంతకంటే ముందుకు వెళ్ళకుండా వదిలారు నన్ను.
    "మర్నాడు నన్నక్కడ వదిలి ఆయన ఉద్యోగం ఊరు వెళ్ళారు. వెడుతున్నట్టు నాకు చెప్పలేదు. నా సంగతి ఏమిటో చెప్పలేదు.
    ఆయన వెళ్ళాక "ఎక్కడికి వెళ్ళారు ఆయన?" అడిగాను అత్తగారిని.
    ఆవిడ తెల్లబోయి "నీతో చెప్పలేదా. శలవు లేదని వెళ్ళాడు. అక్కడ ఎవరినైనా వంటకి కుదిర్చి, బియ్యం, పప్పులు సామానులు కొని వారం రోజులలో నిన్ను తీసికెడ్తానన్నాడు. అయినా నీతో చెప్పకపోవడం ఏమిటి? నిన్న ఆయన నేను బాగా చీవాట్లు పెట్టాం. "ఆ అమ్మాయిని మర్యాదగా చూడకపోతే వాళ్ళ ఇంటికి పంపేస్తాను" అని మా మామగారు కేకలేశారు.
    వాడు నీకు పొగరని, ఎదిరిస్తావని ఏదో చెప్పబోయాడు.
    "మొదటి రోజునించి ఏ ఆడపిల్లా పొగరుగా ప్రవర్తించదు. అలా ప్రవర్తించిందంటే అది నీ లోపం అన్నమాట" అన్నారు.
    ఇంకేం అనలేదు వాడు.
    ఆ కోపంతో నీతో చెప్పలేదు కాబోలు" ఆవిడ బాధపడ్తూ అన్నారు.
    సాధారణంగా అత్తమామలు కోడలిని సరిగా చూడకపోతే భర్త ఆసరా కోరుతుంది స్త్రీ. అలాంటిది నేను అత్త మామల ఆసరా కోరాను. వారి సహృదయతకి మనసులోనే అభినందించాను.
    "నేనొకసారి అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళి సామానులు తీసుకుని వస్తానండి" అన్నాను.
    "వాడు నీ సామానులు అటే పంపమని రాస్తానన్నాడు. రెండు మూడు రోజులలో వస్తానన్నాడు. నీవీలోపల వెడితే ఎలా ... అక్కడికి వెళ్ళాక వెడ్దువుగానిలే ... లేదంటే కోపంవస్తుంది వాడికి" అన్నారావిడ.

 Previous Page Next Page