Previous Page Next Page 
మాయ జలతారు పేజి 27


    "ఎవడూ మాట్లాడ్డేం?"
    "ఏం మాట్లాడమంటావ్ దొర?" అడిగాడొకడు.
    "సిగరెట్లు తెమ్మని మొత్తుకోవడంలె"
    "పైసలిస్తే తెస్తం గద?"
    అప్పుడర్థం అయింది రాజారావుకు - డబ్బివ్వకుండా, తెమ్మనకుండా వాగడం తనదే తప్పని! అలా తన తప్పు పనివాళ్ళముందు వ్యక్తపరచడం ఇష్టంలేక "వెధవలు, చెప్పొద్దూ డబ్బు కావాలని" అంటూ డ్రాలోంచి డబ్బుతీసి పారేశాడు. అది అందుకొని వెళ్ళిపోయారు సిగరెట్లు తేవడానికి నౌకర్లు.
    వ్యవహారం అంతా అస్తవ్యస్తం అయినట్లు కనిపించింది రాజారావుకు. నారాయణరావు అప్పు చేయడం విషయంలోనే అతనికి అనేక ఆలోచనలు వచ్చాయి. ఏ ఒక్కదాన్నీ స్థిరపర్చలేకపోయాడు. గదిలో పచారు చేస్తూ ఆలోచించసాగాడు కాని, సిగరెట్టు లేనిదే ఆలోచనంటూ వచ్చేట్టు లేదు. ఇంతలో సిగరెట్టు పెట్టెలు తెచ్చి డ్రామీద పెట్టి వెళ్ళిపోయాడు ఒకడు. వెంటనే సిగరెట్టు వెలిగించాడు. గట్టిగా దమ్ములాగి కుర్చీమీద కూర్చొని పొగ మబ్బులు వదిలాడు. పొగతోబాటు, మనసులో అంతసేపటి నుంచి కూడిన జిడ్డు, ఏదో చిరాకు వెళ్ళిపోతున్నట్లనిపించింది. రెండు దమ్ముల్లాగే వరకు బుర్ర తేలికైనట్లనిపించింది.
    ఆ పొగ మబ్బుల్ను చూస్తూ కూర్చున్నాడు. అతనికి రజని గుర్తుకు వచ్చింది. రజని ప్రవర్తన వింతగా తోచింది. ఒక్కసారి రజని దగ్గరికి వెళ్ళివస్తే కొంత ఆహ్లాదం కలుగుతుంది. ఆవిడ దగ్గర ఏముందో తెలియదు. ఆవిడ నవ్వుతే ఇతని గుండెలో వెన్నెల చేలు పండుతాయి. సిగరెట్లు త్రాగుతూనే గదిలో అడుగుపెట్టాడు. రజని నిద్రపోతూంది. చెక్కిళ్ళమీద కన్నీటిధారలు ఎండిపోయిన చారలు కనిపిస్తున్నాయి. అయినా, ఆవిడ ముఖంలో ఏదో ఆకర్షణ కనిపించిందతనికి. ముఖంమీదికి పడివున్న వెంట్రుకల్ను పైకి నెట్టాడు. కాసేపు అక్కడే కూర్చున్నాడు. తర్వాత లేచి తన గదిలోకి వెళ్లిపోయాడు.

                              12

    శ్రామికుల రక్తంతో డొక్కనింపుకొని కుంగిపోయాడు సూర్యుడు. బాలయ్య గుండెలోలా చీకట్లు లోకమంతటా వ్యాపించాయి. ఫ్యాక్టరీలు వగైరాలు మనిషి శక్తిని పీల్చుకొని పంపించివేయగా, కళకళలాడుతూ వెళ్ళినవారు డీలాపడిపోయి తిరిగి వచ్చేస్తున్నారు! పరమయ్యా వచ్చేశాడు. రావడం రావడమే బాలయ్య ఇంటికి వచ్చాడు. "బాలయ్యన్నా! రాముడి దగ్గిర్నుంచి కారొచ్చింది" అంటూ లోపల ప్రవేశించాడు. ఆ మాటలు అమృతవృష్టిలా పనిచేశాయి బాలయ్యమీద. దూరంగా ఉన్న కొడుకు గుర్తుకు వచ్చాడు. కబురులేదు అక్కణ్ణుంచి, ఇవ్వాళ వాడి దగ్గరనుంచి వార్త అందింది.  
    "పరమయ్యన్న, సత్తెం గొచ్చినాదె?"
    అలాగా, ఇగనేనబద్ధమాడినట్లనా? చూస్కోరాదు! నీకు సుత చదువత్తదికద" అని ఒక ఇన్లాండ్ లెటర్ ఇచ్చాడు.
    ఉత్తరం మడత విప్పింతరవాత కాని దీపం అవసరమనే విషయం తెలియలేదు బాలయ్యకు. ఒక నిట్టూర్పు విడిచాడు. ఉత్తరం మదిచాడు. దీపపు బుడ్డి అందుకొని ఊపి చూచాడు. ఏదో గలగలా అంది తప్ప నూనె లేదు. అది గ్రహించాడు పరమయ్య. బుడ్డి తీసికెళ్ళి కుర్రాడికి డబ్బిచ్చి కిరసనాయిలు తెప్పించాడు.
    నూనె వచ్చి, దీపం వెలిగేలోపల బాలయ్య బుర్రలో అనేక ఆలోచనలు ముసిరాయి. రాము తనకెందుకు ఉత్తరం రాయలేదు? ఆ ఆలోచనతోపాటే కోపం వచ్చేసిందతనికి. పెళ్ళాం - ఛీ - పెళ్ళాం ఏమిటి - అమ్మాయి దొరగ్గానే తనతో పనితీరిపోయినట్లేనా? తనకంటే పరమయ్య దగ్గరవాడైపోయాడా ఉత్తరం రాయడానికి! పెంచి పెద్దవాణ్ణి చేశాడు తాను. ఇంతలోనే మరచిపోయాడు. అబ్బ! ఎంత కృతజ్ఞుడు! అయినా, పక్షులకు రెక్కలు వస్తే ఉంటాయా?
    పరమయ్య దీపం వెలిగించాడు. ఇల్లు యావత్తు వెలిగిపోయింది. మడత విప్పాడు బాలయ్య. అతనికి అట్టే చదువురాదు. ఏదో గుణించుకొని మెల్లగా చదవగలడు. అలా చదివే ప్రతి అక్షరంలోనూ అతనికేదో ఆనందం, ఉత్సాహం, శక్తి, సత్తువ కనిపించాయి. అతని వదనం వికసించింది. హృదయం పొంగింది. ఉత్తరం మొత్తం చదివాడు. తండ్రికి రాయడానికి భయంగా వుంది కాబట్టి పరమయ్యకు రాస్తున్నానని రాశాడు రాముడు. ఆ వాక్యాలు చదివి కళ్ళు తుడుచుకున్నాడు బాలయ్య. త్వరలో శలవు మీద వస్తానన్న వాక్యాలు అతనికి అంతులేని ఆనందాన్ని కలిగించాయి.

                           * * * *

    రామారావూ శారదా బొంబాయి రైలెక్కారు. రైల్లో ఒకతను కనిపించాడు. అతడు బట్టల మిల్లులో పనిచేసేవాడు. మిల్లు పని వారికి నాయకుడు. రామారావు కథ విన్నాడు. ఈ విషయం తల్లిదండ్రులతో చెప్పి ఉండాల్సిందన్నాడు. రామారావు తన ఇబ్బందులు వ్యక్తపరచాడు. అతడు ఆ యువ దంపతులను బొంబాయిలో మురికివాడలోని తన గుడిసెకు తీసికెళ్లాడు.
    అన్యాయాన్ని చూచి సహించలేకపోవడం అతనిలోని మొదటి లోపం. అమాంతంగా దాన్ని ఎదిరించడానికి ఉరకడం రెండో లోపం. బాధలో ఉన్నవాణ్ణి చూచి కరిగిపోవడం మూడో లోపం. తన సర్వస్వం ఒడ్డీ వాణ్ణి కాపాడ్డం అతని నాలుగో లోపం. ఈ లోపాలుండడం వల్ల అతనికి అనేకసార్లు అనేక శిక్షలు పడ్డాయి. అలాంటివాడు రామారావు దంపతులకు సహాయపడ్డాడంటే ఆశ్చర్యమేమి?
    పూలదండలు వేయించి వారి పెళ్లి చేసి మురిసిపోయాడు. వారి పెళ్ళిని రిజిస్టరు కూడా చేయించాడు. ఒక బట్టల మిల్లులో కొలువు ఇప్పించాడు. అతని ప్రభావం రామారావు మీద బాగా పడింది. మనిషి పూర్తిగా మారిపోయాడు. అతనిలో ఉన్న బలహీనతలన్నీ అంతరించాయి. శక్తిమంతుడైనాడు. అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యం వచ్చిందతనికి. అతణ్ణి నాయకుడుగా గుర్తించారు కార్మికులు.
    దేశం కరువు వాత పడింది. పరాయి దేశాలకు మస్లిన్ ఎగుమతి చేసిన దేశంలో పత్తి కొరత ఏర్పడింది. ఈజిఫ్టు, అమెరికా మున్నగు దేశాలనుంచి పత్తి దిగుమతి చేసుకోవాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది. ధరలు విపరీతంగా పెరగసాగాయి. బీహారు, ఉత్తరప్రదేశ్ లలో అన్నం కరువేకాక నీటి కొరత ఏర్పడింది. దాహానికి నీరు దొరక్క అలమటించి పసిబాలలు సహితం ప్రాణాలు వదిలారు. బెంగాలు కరువును తలదన్నిన కరువు వచ్చినా దేశం కదల్లేదు.
    అలాంటి పరిస్థితిలో పత్తి కొరత సాకుమీద కార్మికుల్ని ఉద్యోగాల్లోంచి తొలగించారు యాజమానులు. రామారావు అది సహించలేకపోయాడు. మొత్తం బట్టల మిల్లుల్లో సమ్మె చేయించాడు. సమ్మె విజయవంతంగా సాగింది. యజమానులు రాజీకి రాక తప్పిందికాదు. తుదకు తీసివేసిన పనివారినందరినీ పనిలోకి తీసుకున్నారు. రామారావును బట్టల మిల్లుల కార్మికులంతా నాయకుణ్ణి చేశారు. అతణ్ణి ఊరేగించారు. పూలదండలు వేశారు. జయ జయధ్వానాలు చేశారు.
    శారద అదంతా చూసింది. పొంగిపోయింది.
    కొద్దిరోజుల్లో వీలుచూసుకొని వస్తానని రాశాడు రామారావు.
    బాలయ్య పొంగిపోయాడు. అతని ఆనందానికి అంతులేదు. కథంతా పరమయ్యకు చెప్పాడు. పరమయ్య భార్య వచ్చింది. పిచ్చయ్య వచ్చాడు. ఒక్కొక్కరే అంతా అక్కడ కూడారు. పరమయ్య సగర్వంగా అందరికీ అల్లుని కథ వినిపించాడు. అంతా రామారావులోని మార్పును విని ఆశ్చర్యపోయారు. సంతోషించారు.

                                         * * * *

    సూర్యుడు ఉదయించడమూ ఆకాశాన పాకడమూ జరిగాయి. ఎవరో వచ్చారని లేపితేకాని లేచాడు కాదు బాలయ్య. కళ్ళు నులుపుకుని చూచాడు. ఎదురుగా యిద్దరు యమభటుల్లా కనిపించారు. గుండె జల్లుమంది.
    ఇద్దరిలో ఒకడు పొడవైనవాడు. బాగా బలంగా ఉన్నాడు. నెత్తిమీద వెంట్రుకలు చాలా చిన్నవిగా కత్తిరించి ఉన్నాయి. గుండ్రని మాంసలమైన ముఖం, కళ్ళు చిన్నవి. ముక్కు పొట్టిది. మెడలో తాయెత్తుగల నల్లని దారం కట్టుకున్నాడు. బాగా పైకివున్న బిగువైన లాల్చీ పైజమా వేసుకున్నాడు. చేత కర్ర పట్టుకున్నాడు. పేరు మహమ్మద్ హుసేన్. రెండోవాడు పొట్టిగానూ బలంగానూ ఉన్నాడు. నల్లగా బొగ్గులా ఉంది అతని ముఖం. వెంట్రుకలు బాగా పొడుగ్గా ఉన్నాయి. వెంట్రుకల్లోంచి నూనె కారుతూంది. ముఖం కోలగా ఉంది. బలిష్ఠమైన శరీరం. కళ్ళు చిన్నగానే ఉన్నా ముక్కు బాగా లావుగా వుంది. పెద్ద పెద్ద చారల బ్లూషర్టు, బిగుతైన ప్యాంటు తొడుక్కున్నాడు. అతని చేతులో కూడా కర్ర ఉంది. పేరు రామ్ మనోహర్ సింగ్. వీరిద్దరూ దాదాలు ఉస్మాన్ సైనికవర్గంలోనివారు. వీరేమీ పనిచేయరు. గుడిసెల సంఘం డబ్బుతో పోషించబడుతుంటారు.

 Previous Page Next Page