Previous Page Next Page 
ఆఖరి మలుపు పేజి 27


    ఒక కుర్రాడు తననే అనుసరిస్తూ వస్తూ ఉండటం ఆయన గమనించలేదు. ఇంట్లోకి వెళ్ళి కండువా వంకీకి తగిలించి, కుర్చీలో కూర్చున్నాడు.


    ఒక నిమిషం ఆగి అక్కడికి వెళ్ళాడు రాజా.


    "సార్! కాసిని మంచినీళ్ళిప్పిస్తారా?" అన్నాడు మర్యాదగా.


    ఆయన ఒకసారి రాజా వేపు చూసి, లోపలికి తిరిగి పెద్దగా అన్నాడు.


    "అమ్మాయ్ అర్పితా! ఈ పిల్లాడికి కాసిని మంచినీళ్ళు తెచ్చిపెట్టు" అన్నాడు.


    "వస్తున్నా నాన్నా...!" అని ఒక అమ్మాయి గొంతు వినబడింది. చాలా సౌమ్యంగా వుంది ఆ గొంతు. వెంటనే ఒక పదహారేళ్ళ అమ్మాయి బయటికి వచ్చింది. వంటి మీద చౌకరకం గుడ్డలు. కానీ మొహంలో మాత్రం అదో రకమైన అహంభావం కనబడుతోంది. కొద్ది క్షణాల క్రితం వినబడిన సౌమ్యమైన గొంతుకీ, ఈ అమ్మాయి మొహంలో కనబడుతున్న భావానికి ఏ మాత్రం సంబంధం లేదు.


    ఈ అమ్మాయి చేతిలో మంచినీళ్ళ గ్లాసు లేదు. రాజా వేపు ఒకసారి ఎగాదిగా, తృణీకారంగా చూసింది ఆ పిల్ల. తర్వాత గూట్లో నుంచి అచ్చనగాయలు తీసుకుని ఆడుకోవడానికి బయటికి వెళ్ళిపోయింది.


    ఆ వెంటనే వంటింట్లో నుంచి బయటికి వచ్చింది ఇంకో అమ్మాయి. ఇందాక వినబడిన గొంతు తాలూకు ఓనరు యీ పిల్లే అయి వుంటుందని తక్షణం అర్థమైపోయింది రాజాకి.


    ఈ అమ్మాయి చేతిలో ఉంది మంచినీళ్ళ గ్లాసు.


    ఈ అమ్మాయి కూడా చాలా సాదాగా ఉన్న పరికిణీ, జాకెట్టు వేసుకుని వుంది. పెద్ద పెద్ద కళ్ళు, నవ్వుతూండే పెదిమలు.


    "ఇదిగో" అని గ్లాసు రాజాకి అందించింది ఆ పిల్ల. ఆ అమ్మాయి పేరే అర్పిత.


    గ్లాసు అందుకోవడానికి చెయ్యి జాచాలని కూడా తోచలేదు రాజాకి. చేష్టలుడిగినట్లు ఆ అమ్మాయి వేపు చూస్తూ వుండిపోయాడు.


    మనసులోనే అనుకున్నాడు రాజా.


    "ఇన్షాల్లా! లవ్ చేస్తే ఇట్లాంటి అమ్మాయినే లవ్ చెయ్యాలి.


    అతనికి అంత పెద్ద ఆలోచన రావడం అదే మొదటిసారి.


    ఆ ఆలోచన రావడంతోబాటే, ఆ పెద్దమనిషికి టోకరా ఇవ్వాలనే ఆలోచన రాజా మనసులోనుంచి మాయమైపోయింది.


    మంచినీళ్ళు తాగి, గ్లాసు అందించేటప్పుడు కావాలని వేళ్ళు తాకించాడు రాజా.


    కానీ ఆ అమ్మాయికి రాజాకున్నంత లోకానుభవం ఎక్కడిది?


    దయగా నవ్వింది తను.


    ఫ్యాంటు జేబులో చేతులు పెట్టుకుని బయటికి వచ్చేశాడు రాజా. ఆ అమ్మాయి యింకా అక్కడే నిలబడి కుతూహలంగా అతన్ని చూస్తోంది.


    ఆ అమ్మాయి అటెన్షన్ ని అలాగే ఆపెయ్యాలనిపించింది రాజాకి. తన హీరోయిజం ఆ అమ్మాయి ముందు ప్రదర్శించాలనిపించింది.


    అర్జెంటు పనున్నట్లు ఆ దార్నే పోతున్న ఒక కుక్కని అదిలించాడు రాజా.


    అది పళ్ళు బయటపెట్టి గుర్రుమంది.


    "కొడతా" అన్నట్లు దాన్ని బెదిరించి, రాయి ఒకటి అందుకున్నాడు అతను.


    అది బెదిరి కుయ్యోమంటూ పారిపోయింది.


    గేదెల మంద ఒకటి వెళ్తుంటే, ఒక గేదె తోక పుచ్చుకుని మెలిపెట్టి "అహెయ్! ఠుర్! ఠుర్!" అన్నాడు.


    గేదె ఆక్వార్డ్ గా పరిగెత్తడం మొదలెట్టింది.


    "నాకు భయమే లేదు చూశావా?" అన్నట్లు ఆ పిల్లవేపు చూశాడు రాజా.


    నున్నగా గుండు చేయించుకున్న పిల్లాడు ఒకడు అటే వస్తుంటే -


    "తిరుపతి గుండు, తిన్నంగుండు, బజారుకొస్తే భద్రంగుండు..." అని ఫెడీమని వాడి నెత్తిన కొట్టాడు.


    వాడు అంతదూరం పరిగెత్తి, తర్వాత తిట్లు లంకించుకున్నాడు.


    అర్పిత వేపు చూశాడు రాజా.


    ఆమె నవ్వుతోంది.


    అర్పిత వాళ్ళ ఇంటికి ఎదురుగా ఒక చిన్న షెడ్డు లాంటిది ఉంది. అరుగు, దాని మీద గోడలు... పైన రేకులు....


    "అంజన్ వ్యాయామశాల" అని రంగుల అక్షరాలతో రాసి ఉంది గోడ మీద.


    రాజాకి చదవడం రాదు.


    కానీ అతని సిక్స్ త్ సెన్స్ కి అర్థం అయ్యింది.


    అది ఒక వ్యాయామశాల అని.


    మామూలుగా వ్యాయామశాలలు ఉస్తాద్ ల కంట్రోల్లో, ఒక్కోసారి రౌడీల కంట్రోల్లో వుంటాయి.


    దీనికి ఉస్తాద్, రౌడీ ఎవరన్నా కాదుగదా!


    అరుగు మీదికి ఎగిరి గబగబా నాలుగు పల్టీలు కొట్టాడు అతను.


    తర్వాత ఓరగా అర్పిత వేపు చూశాడు.


    గోడకీ, రేకుకీ మధ్య ఉన్న ఖాళీలో నాలుగు రోజుల క్రిందటి పేపరు గుచ్చి వుంది.

    
    దాన్ని తీశాడు రాజా.


    పేపరుతో అరుగు ఒక మూల దులిపి శుభ్రం చేశాడు.


    పేపరు మధ్య షీటు తెరిచి, దాన్ని నేల మీద పరిచి, కూర్చోబోతూ వుండగా-


    పేపర్లో ఉన్న ఒక ఫోటో అతనికి కనబడింది.


    పేపరు మీద కూర్చోకుండా, మోకాళ్ళ మీద ప్రక్కన కూర్చుని, పేపరు ఎగిరిపోకుండా చేతులు ఆనించి చూశాడు రాజా.

 Previous Page Next Page