Previous Page Next Page 
జన్మభూమి పేజి 27

    "నేను తాతయ్య అవుతే నీవు మామ్మవి అయిపోతావు జాగ్రత్త" బెదిరిస్తున్నట్టు అని నవ్వారు. వచ్చిందగ్గిరనుంచి శ్రీనివాస్ ఇంటిని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. తను పుట్టి పెరిగిన ఇల్లా ఇది అని విస్తుపోయాడు.
    "యేమిటి, ఇల్లంతా యిలా మారిపోయిందని అన్నీ చూస్తున్నావా. నమ్మశక్యంగా లేదు" అంటూ నవ్వి భుజం తట్టాడు.
    "ఇప్పుడు చెప్పు నీ ప్లాన్స్ ఏమిటి. ఈ వూర్లో వుండి నాకు హెల్ప్ చేస్తావా. మొత్తం మనీ మేటర్స్ డీల్ చెయ్యాలి. లెక్కలు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఏడు ఆడిట్ చేయించాలి. అకౌంట్, బ్యాంక్ పనులు, అప్పులు, వడ్డీలు, బకాయిలు చెల్లించడం, ప్రతి రైతుకీ ఖాతా తెరవాలి. అవన్నీ సావకాశంగా వివరిస్తాం. మీ నాన్న హెల్ప్ చేస్తాడు. ఇదంతా చేయాలి. వూరికే కాదులే... నీకు జీతం ఇస్తాను. నా పర్సనల్ అసిస్టెంట్ పోస్టు అనుకో. నా కరస్పాన్ డెన్స్ అంతా చూడాలి. నా దగ్గర పోర్టబుల్ టైపు రైటర్ వుంది. మీనాన్న నీకు టైపు వచ్చాన్నాడు. ఏమిటి అలా చూస్తున్నావు. ముందు ఈ వూర్లో ఉండడానికి మెంటల్ గా ప్రిపేరవ్వాలి నీవు..."
    శ్రీనివాస్ అక్కడికి వచ్చిన అరగంటలోనే డాక్టర్ కేశవరావుని అంత పెద్ద డాక్టరు, అమెరికా నుంచి వచ్చిన ఆయన్ని, అందంగా హుందాగా వున్న రాజేశ్వరిని, ఆ ఇంటిని, సామానుని చూసి సగం సరెండర్ అయిపోయాడు. ఈయన తమకి కూడా కొత్త యిల్లు కట్టించి ఇచ్చాడని తల్లి చెప్పింది. ఇంత డబ్బు సంపాదిస్తున్న ఈయన దగ్గిర ఉద్యోగం యిస్తానంటుంటే ఇంకేం కావాలి. తన ఉత్త బి.కాం.తో ఇంతకంటే మంచి ఉద్యోగం ఎవరిస్తారు. బ్యాంకు పరీక్ష అయితే అప్పుడే చూసుకోవచ్చు. ఆ మాటే పైకి అన్నాడు.
    "తప్పకుండా వెల్దువుగాని బ్యాంకులో ఉద్యోగం వస్తే- నీ ప్యూచర్ పాడుచేసుకోనవసరం లేదు. పరీక్షకి ఇక్కడుండే ప్రిపేర్ అవ్వు. అంతవరకు ఇక్కడ ఆ పనిచూడు. తర్వాత సంగతి తరువాత చూసుకుందాం."
    వాసు అంగీకారంగా తల ఆడించాడు. "మావాడిని నీకప్పగించాను మామయ్యా- ఇంక నీ ఇష్టం వాడ్ని ఎలా తీర్చిదిద్దుతావో. వాడి చేత ఏం చేయించుకుంటావో, ఏం ఇస్తావో వాడికి, నీవు చూసుకోండి-" గడుసుగా అన్నాడు.
    కేశవరావు నవ్వారు. "అర్థమైందిలే నీ గడుసుతనం - నీ కొడుకు చేత వూరికే ఏం చేయించుకోనులే-" అన్నాడు.
    "రంగా ముందు మీరిద్దరూ కల్సి ఈ వూర్లో రైతులు, భూసాములు అందరిపేర్లు ఎన్ని ఎకరాలుంది ఆ లిస్ట్ తయారుచేసి ప్రతివారికొక ఖాతా పుస్తకం తయారుచేసే కార్యక్రమం పూర్తిచేయండి. మునసబుగారి దగ్గర లిస్ట్ ఉంటుంది. ఆయన హెల్ప్ తీసుకోండి-" అని పురమాయించాడు.
    "ఆ అన్నట్టు మనం నర్స్ ల కోసం పేపర్లో ప్రకటన ఇచ్చాం కదా. ఇదుగో ఆరు అప్లికేషన్ లు వచ్చాయి. ఇందులో ముగ్గురు నచ్చారు - ఒకామె గవర్నమెంటు ఆస్పత్రిలో పనిచేసి రిటైరయిన ఆవిడ కూడా ఉంది. పిల్లలు బాధ్యతలు లేవు. భర్త పోయాడట. అలాంటి ఎక్స్ పీరియన్స్ నర్సయితే మనకు సుఖం. ఆమెని రమ్మందామని ఆలోచిస్తున్నాను. ఇంకో పెళ్ళికాని అమ్మాయి వుందికాని "ఎక్స్ పీరియన్స్ అట్టే లేదు-" సాలోచనగా అన్నాడు.
    "రిటైరయిన ఆమెనే పిలవండి - పురుళ్ళు అవీ చూసుకుంటుంది - మీకు ఆ విషయాల ఎక్స్ పీరియన్స్ లేదు గనక గైనిక్ ప్రాబ్లమ్స్ ఆమె కాస్త చూసుకోగల్గుతుంది" సలహా ఇచ్చింది రాజేశ్వరి.
    "ఆ - వాసూ శుభస్య శీఘ్రం. పని ఈ ఉత్తరంతో ఆరంభించామే- ఇదిగో ఈ విమలమ్మ అనే ఆమెకి అపాయింట్ మెంట్ లెటర్, మిగతా వారికి రిగ్రెట్ లెటర్స్ టైపు చేసి సంతకం తీసుకుని పోస్టు చెయ్యి-" పని అప్పగించారు కేశవరావు.
    "రాజేశ్వరీ ఆ టైపు రైటర్ అది వాసుకి చూపించు. ఆఫీసు గదిలోకి తీసుకెళ్ళు" అన్నారు. నాల్గు గదుల్లో ఒకటి ఆయన స్టడీ రూముగా ఏర్పాటు చేసుకున్నారు. ఆయనఅందించిన ఉత్తరాలు పట్టుకొని రాజేశ్వరి వెంట నడిచాడు వాసు.
    "రంగా ఆస్పత్రి పని ఎంతవరకు వచ్చింది."
    "సున్నాలు వేస్తున్నారు. ఇంకో రెండు రోజుల్లో తలుపులకి, కిటికీలకి పెయింటింగు పూర్తి అవుతుంది. మరో నాల్గు రోజుల్లో ఫర్నిచర్ రాగానే అన్ని సర్థించి మళ్ళీ వారానికల్లా మొదలుపెట్టొచ్చు. ఈలోగా నర్సు కూడా వస్తుంది గదా. ఒక ఆయాని కూడా కుదర్చాలి. ఆస్పత్రి శుభ్రం చేయడం, బల్లలు క్లీన్ చేయడం.
    "ఆ సరే చూడు. ఆ పని అయ్యాక ఆ కూలీలని యిటు పంపించు. ఈ పాకేజీ పెట్టెలు అవి విప్పించాలి జాగ్రత్తగా. పోర్టబుల్ ఎక్స్ రే. ఇ.సి.జి.మిషను స్కానింగ్ మిషను థియేటర్ సామానులు అవి అన్నీ జాగ్రత్తగా దగ్గరుండి విప్పించాలి.
    "అన్నీ నేను చూసుకుంటాలే మామయ్యా - అలా మనసబుగారి దగ్గరకెళ్ళి రైతుల లిస్ట్ తీసుకెడతా. రాత్రికి వాసు, నేను కూర్చుని పుస్తకాలు తయారుచేస్తాం..." రంగా లేచి వెళ్తూ అన్నాడు.
    "నిజంగా వూర్లో రంగా వుండడం నాకు సగం బరువు తగ్గింది సుమా. లేకపోతే వంటరిగా నేనేం చెయ్యలేకపోయేవాడినేమో. తిరుగుడు పని అంతా తనే చూస్తున్నాడు. పాపం- ఇప్పుడు వాసు వచ్చాడు కనక కాస్త సుళువవుతుంది పని.
    'ఆ - ఇంతకీ వాసుకేం జీతం ఇస్తే బాగుంటుంది' కాస్త గొంతు తగ్గించి అడిగారు.
    "ఏడెనిమిది వందలన్నా ఇవ్వకపోతే బాగుంటుందా! రాజేశ్వరి నెమ్మదిగా అంది."
    "అంతేనా. నేను పదిహేనువందలన్నా ఇవ్వాల్సి ఉంటుందనుకున్నాను. ఏడెనిమిది వందలంటే మరీ తక్కువ కదా-మరీ బొత్తిగా ముప్పైఐదు డాలర్లు..."
    "మీకు అమెరికాలో ఉండి ఆ స్టాండర్డ్ లో ఆలోచించడం అలవాటయిపోయింది. డాలర్లలో ఆలోచించడం మానండి. రూపాయిలలో ఖర్చుపెడుతున్నారు ఇక్కడ... ఆ ప్రకారం జీతాలు ఉంటాయి. ఇండియాలో బి.కాం. చదివిన వాడికి ఏమీ పెద్ద ఉద్యోగాలు రావు.
    ఏదన్నా ప్రైవేటు కంపెనీలలో పనిచేసినా మొదట్లో వెయ్యి రూపాయలుంటుందేమో. పోనీ నా మాట కాదు, మీ మాటా కాదు వెయ్యి యివ్వండి" అంది రాజేశ్వరి మధ్యస్థంగా.
    "ఇప్పుడీ నర్సు, ఆయా, వాసు వాళ్ళందరికీ జీతాలు మీ స్వంత డబ్బులోంచేగా ఇవ్వాలి. డబ్బుంది గదా అని మరీ ఎక్కువ జీతాలిచ్చి వాళ్ళని పాడుచేయకండి" అని సలహా కూడా ఇచ్చింది. అంగీకారంగా తల ఆడించాడు కేశవరావు.
    "ఇప్పటికి యిండియా వచ్చిందగ్గిరనుంచి ఏమాత్రం ఖర్చు అయిందో ఓ లెక్కా పత్రం ఏమన్నా రాస్తున్నారా లేదా. ఇంటికోసం ఖర్చు, ఆ తర్వాత రోడ్డు, ఆస్పత్రి, గుడి బాగుచేయించారు. యివన్నీ డిటైల్డ్ గా కాకపోయినా కనీసం మొత్తం ఖర్చు అయినా రాస్తున్నారా. కూర్చుని తింటే కొండలన్నా తరుగుతాయి అంటారు. కాస్త చూసి ఖర్చుపెట్టండి."
    నా లిమిట్స్ నాకు తెల్సులేవోయ్. నేను అనుకున్న అంకె దాటకుండా జాగ్రత్తపడ్డానులే.
    నా సంపాదనలో పావువంతు కంటే ఎక్కువేం అవదులే. నేను ఎంత ఖర్చుచేసినా, అయినా మనకింకేం కావాలి. అమెరికాలో వున్న రెండిళ్ళు పిల్లలిద్దరికి చెరోటి వుంది. హాస్పిటల్ విక్రమ్ కే వెళ్తుంది. మనవలందరిపేరా ఇన్ వెస్ట్ చేశాం. యింతో అంతో వాళ్ళ పెళ్ళిళ్ళకి పేరంటాలకి బంగారం, వెండి చేర్చావు. వాళ్ళూ బోలెడు సంపాదిస్తున్నారు. యింకా యింకా జాగ్రత్తగా కూడబెట్టి ఎవరికి పెట్టాలి. మన ఇద్దరికీ ఎక్కడున్నా ఈ స్టాండర్డు తగ్గకుండా ఉంటే చాలు. ఈ వూర్లో మన సంసారానికేం ఖర్చుంది.  
    అమెరికాలో తిండి చవకయినా అక్కడికంటే యిక్కడే ఇంకా చవకగా వుంది. పాలు, కూరలు, బియ్యం అవీ ఫ్రీ. కారు ఖర్చు ఎప్పుడో విజయవాడో, హైదరాబాదో వెళితేగాని వుండదు. ఇక్కడ నేనేం సంపాదించడం లేదు కనక టాక్స్ లేదు. అంచేత ఉన్న డబ్బు ఇంకేం చేస్తాం. ఏదో ఇలాంటి మంచిపనులు చేసి పుణ్యం మూటకట్టుకుందాం."

 Previous Page Next Page