"ఆ తర్వాత ఏమైందో తొందరగా చెప్పండి" రాణి ఆత్రుతగా అడిగింది.
"ఏమౌతుంది? గోతిలో దిగాను. తెలుగువాడు నాతో మాట్లాడటం చూసి ఎవరిదోవన వాళ్ళు వెళ్ళారు. వాడి మాటలు నమ్మిన నేను వేగంగా వాడి వెనకనే పార్క్ లోకి దారితీశాను. ఓ పక్క చీకటి పడబోతున్నది-మరోపక్క భయం. ప్రాణాలు బిగబట్టుకొని వాడితోపాటు సగం దూరం లోపలికి వెళ్ళాను. అప్పుడు...అక్కడ..."
"ఆ తర్వాతది మేము ఊహించగలం లేండి. వాడు చటుక్కున వెనుదిరిగి జేబులోంచి కత్తితీసి ఉంటాడు...మీ ఒంటినిండా బంగారు నగలు వున్నాయికదా! వాడెవడో పక్కా మోసగాడు...దొంగ వెధవ! తెలివిగా మిమ్మల్ని దారి మళ్ళించి అక్కడిదాకా తీసికెళ్ళి కత్తి చూపించి బెదిరించాడు అంతేనా!" సీను మొత్తం ఊహించుకొని ప్రమద అడిగింది.
"సరీగ్గా జరిగింది అదేనమ్మా! నా ఒంటిమీద నగలు చూసి వాడికి కళ్ళు కుట్టాయి. ఈ ఒక్క గొలుసే అయిదు శెవర్లు. మొత్తం ఒంటిమీద నగలు యాభై శెవర్ల బంగారం. "ప్రయాణంలో బంగారు నగలన్నీ వేసుకువెళ్లొద్దే!" అని మా అత్తగారు చెబుతూనే వుంది. మా ఆయన విన్లేదు "పక్కన నేనుండగా భయమేంటి?" అన్నారు. నాక్కూడా నగలపిచ్చి. నగలు పెట్టుకుని ప్రయాణమై వచ్చాను. నా ఒంటిమీదున్న నగలు చూసే వాడికి కళ్ళు కుట్టాయి. సమయానికి మీరు రాబట్టి నా ప్రాణాలు...నా నగలు దక్కాయి. మొండిధైర్యంతో అరిచాను. వాడిచేతిలో కత్తి చూసి కూడా ఎలా అరవగలిగానో నాకే అర్థంకావడంలేదు" అమాయకంగాను...కాస్త భయంగాను చెప్పింది లక్ష్మి.
నలుగురు లక్ష్మిని పరీక్షగా చూశారు. మనిషి ఎత్తరికాదు. అలాగని మరీ పొట్టికాదు. తెల్లటి తెలుపు కాకపోయినా చూడంగానే తెలుపు అనిపించేలా శరీరం కలర్ ఉంది. పైసా అంత కుంకంబొట్టు... సిగలో మల్లెపూల దండ...ఒళ్ళంతా నగలు... జరీ చీరలో కాస్త కలిగున్నవారి ఇంటి ఆడపడుచులా ఉంది. అమాయకమైన చూపులు... మొండితనానికి చిహ్నంగా బిగించిన పెదవులు... ఆమె ఒంటిమీద నగలనే కాదు మనిషిని కూడా మరోమారు చూడబుద్దేస్తోంది. మహా అయితే ముప్పయ్ అయిదేళ్ళు వుండొచ్చు. అంతకుమించి పెద్దది మాత్రం కాదు.
లక్ష్మి చెప్పింది అంతా విని "లేచినవేళ మంచిది అనుకొంటుంటారే... అలా అనుకోండి. మేము కాదు మిమ్మల్ని రక్షించింది... పైనున్న గాడ్" పెద్ద మనసుతో అంది ప్రమద.
"మీ అడ్రస్ చెపితే మిమ్మల్ని అక్కడ విడిచి వెళతాం" వందనాదేవి చెప్పింది.
"అడ్రసా! అదేదో నాకు సరీగా తెలీదే! అదో చిన్న సత్రం.అక్కడ చిన్న గది అద్దెకి తీసుకున్నాం. హోటల్లో గదులకన్నా సత్రంలో గదులే మంచివని మావారు అన్నారు. స్టేషన్ కి దగ్గరగా ఉంటుందని వారన్నారు. నేనిప్పటిదాక కానరాక వారు గాభరాపడి... అయ్యో...
అప్పుడే వాళ్ళ ఆయన గుర్తుకొచ్చినట్టున్నాడు. "అయ్యో!" అంటూ వాపోయింది శ్రీలక్ష్మి.
అన్ని స్ట్రీట్ లైట్లు ఒక్కసారిగా వెలిగాయ్.
"అమ్మో! చీకటి కూడా పడుతోంది" లబలబ లాడింది లక్ష్మి.
"పోలీస్ స్టేషన్ కి వెళ్ళి రిపోర్టిస్తే ఎలా వుంటుందే వందనా! రాణి అడిగింది.
"అమ్మో! పోలీస్ స్టేషనే! నాకు పోలీసులంటే చచ్చే భయం. నేన్రాను బాబోయ్" లక్ష్మి అరిచినట్టే అంది.
"మీరలా భయపడి అరవబోకండమ్మా! మేం ఏదో ఒకటి చేస్తాం కదా!
మేము మీలాంటి ఆడవాళ్ళమే. భయపడనక్కరలేదు. మిమ్మల్ని మీవారి దగ్గరికి చేరుస్తాం. అంతేగాని మధ్యలో వదిలేసి పోం. కాకపోతే ఏ సత్రమని వెతకాలి! ఎలా వెతకాలి! అన్నదే అర్థం కావడం లేదు. ఇలా ఎప్పుడయినా ఆపద వస్తే ఏం చేయాలో మీవారెప్పుడయినా చెప్పారా! పోనీ సత్రం గుర్తులన్నా తెలుసా" వందన అడిగింది.
"నేను... మావారు ఒక మాట అనుకొన్నాము. నీవు ఎక్కడ తప్పిపోయినా గాభరా పడకు. రిక్షా ఎక్కేసి రైలు స్టేషన్ లో అని చెప్పి స్టేషన్ దగ్గరకు వచ్చి వుండు. నేను రైల్వేస్టేషన్ లో నిన్ను వెతుక్కుంటాను అని చెప్పారు. అవసరానికి నా దగ్గర ఉంటాయని ఓ ముప్పై రూపాయలు రుమాల్లో చుట్టుకొని ఇదిగో ఇక్కడ పెట్టుకున్నాను." అంటూ జాకెట్ లోపల మడతపెట్టి వున్న డబ్బులున్న రుమాల్ ని తీసి చూపించింది లక్ష్మి.
"చాలా తేలికయిన ఉపాయం చెప్పారు. ఈ ఉపాయం చెప్పిన మాటల్నిబట్టే మీవారు చాలా తెలివిగలవారని తెలుస్తోంది" వందన అంది.
"మా ఇంట్లో కూడా అందరూ మా వారిని తెలివిగలవారనే అంటుంటారు" కించిత్ గర్వంగా చెప్పింది లక్ష్మి.
"ఇప్పుడు మేమందరం కలిసి మిమ్మల్ని స్టేషన్ కి తీసికెళతాం. ఈపాటప్పటికే రైల్వేస్టేషన్ లో మీవారు మిమ్మల్ని వెతుకుతూ ఉంటారు. వెళదాం పదండి" అని చెప్పి టాక్సీ వందన మాట్లాడింది రైల్వే స్టేషన్ కి.
అందరు కలిసి రైల్వేస్టేషన్ కి రావడం... లక్ష్మి భర్తకోసం వెతకడం జరిగింది. అతని జాడమాత్రం కానరాలేదు.
స్టేషన్ బయటేకాక ప్లాట్ ఫారమ్ టికెట్ తీసుకొని స్టేషన్ లోపలికి కూడా వెళ్ళి అంతా గాలించారు. లక్ష్మి భర్త మాత్రం కానరాలేదు.