Previous Page Next Page 
నా జీవితం నీ కౌగిలిలో పేజి 27


    "పని లేని మా బాస్ లాంటి లాయర్లే" పక్కనున్న సుబ్రమణ్యం అన్నాడు.

 

    "కొటేషనివ్వకు. డిస్మిస్ చేసేస్తాను. ప్రొబేషన్ పిరీడ్ అవనివాడు కొటేషనివ్వగూడదు. గుర్తించుకో..." అసిస్టెంట్ సుబ్రమణ్యం మీద కళ్ళురిమాడు లాయర్.

 

    "చూడు జిగురుమూర్తీ...! నిన్నందరూ జి. గురుమూర్తి అని కాకుండా, జిగురుమూర్తీ అని ఎందుకంటారో నాకిప్పుడే అర్ధమైంది. కానీ నేచెప్పేది విను. మా యింట్లో అవుట్ హౌస్ లో ఆంజనేయులు అనే వాడు, వాడి ఫ్రెండూ దిగారు. వాడికి పెళ్ళి కాలేదని చెప్పాడు. లవ్ ఎఫైర్లేవీ లేవని చెప్పాడు. కానీ వాడికోసం... ఇవాళ పొద్దున్నే ఎవరో అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయెవరో... వాళ్ళిద్దరి మధ్యా సంబంధం యేమిటో కనుక్కో."

 

    "అలా అంటున్న సమయంలోనే లోన్నించి భువనేశ్వరి వచ్చింది.

 

    "ఆంజనేయులూ... అమ్మాయీ అంటున్నారు... ఆ జంట గురించే కదా... ఆ జంటను మీరు చూసే ఉంటారు కదూ? ఎలా ఉన్నారిద్దరు...? ముచ్చటైన జంట కదూ!?"

 

    ఆ మాటకు ఏమనాలో తెలీక జిగురుమూర్తి, భుజంగరావు వేపు చూశాడు.

 

    "ముచ్చటైన జంటే కదా... లాయర్..." లాయర్ ఏం వాగుతాడో అనే భయంతో తను అనేసి లాయర్ని కూడా అనమన్నట్టు సంజ్ఞ చేశాడు భుజంగరావు.

 

    లాయర్ ఆ విషయాన్నేం పట్టించుకోలేదు.

 

    "మరి... అయ్యగారేమో... డిటెక్టివ్ కేసన్నారు... ఏమండీ..." అంటూ భుజంగరావు వేపు చూడ్డం, భుజంగరావు చాచి ఫెడీల్మని జిగురుమూర్తి చెంపమీద ఒక్కటిచ్చుకోవడం జరిగిపోయింది.


                                                *    *    *    *


    రోడ్లన్నీ సర్వ్ చేసుకుంటూ, అవ్వీ ఇవ్వీ మాట్లాడుకుంటూ ఇద్దరూ ఇంటికొచ్చే సరికి ఏడయింది.

 

    గేట్లోకి వెళ్ళబోతున్న వాడల్లా, గార్డెన్లో అవుట్ హౌస్ వేపే చూస్తూ నిల్చున్న భువనేశ్వరిని చూడగానే 'కెవ్వు'మని అరిచాడు ఆంజనేయులు.

 

    "మాటల్లో మరిచే పోయాను... అమ్మాయి లేకుండా వెళితే ఎలారా?"    

 

    "అమ్మాయా... ఏ అమ్మాయిరా?"

 

    "అదేరా... నా భార్య... తరణి... తరణి...."

 

    "తరణా... రోడ్డు మీద కెళ్ళాక... ఫిట్సొచ్చి పడిపోయింది. నర్సింగ్ హోంలో చేర్పించాం... ఓ అయిదు నెలలు డాక్టరు హాస్పిటల్లో ఉంచమన్నాడు... అంతే సఫా... ఎలా వుంది... కహాని...?" అన్నాడు ఆనందం.

 

    "కధ బాగానే వుంది గానీ, ఆంటీ నమ్మదేమోరా..." బేలగా అన్నాడు ఆంజనేయులు.

 

    "ప్రపంచంలో దేన్నీ ఎవరూ నమ్మర్రా... నమ్మించాలి... అంతే... పద... నేనుండగా భయమెందుకు పద..."

 

    "సుందోప సుందులిద్దరూ ముందుకు నడిచారు.

 

    "ఏం బాబూ... అమ్మాయేది..." భువనేశ్వరీదేవి అమ్మాయితోనే మొదలెట్టడంతో విసుక్కున్నాడు ఆంజనేయులు.

 

    "చచ్చింది..." కసిగా గొణిగాడు.

 

    "ఏదో సొణుగుతున్నావ్... గట్టిగా చెప్పు..." రెట్టించింది ఆంటీ.

 

    "ఏం... లేదు... పిన్నిగారూ... మలక్ పేటలో మా సిస్టర్ పెదనాన్నగారి అమ్మాయుంది. ఉదయాన్నే వచ్చేస్తానని అక్కడి కెళ్ళింది... ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తుంది" చెప్పాడు ఆనందం.

 

    "ప్రతీసారీ వాడి పెళ్ళాం గురించి నువ్వు చెప్తావేమయ్యా... అవునుగానీ, కొత్తగా వచ్చిన అమ్మాయిని ఎవరైనా పంపిస్తారుటయ్యా" కోప్పడింది ఆంటీ.

 

    "కొత్తగా ఎవరొచ్చారాంటీ... మేరీ ఇక్కడే ఉంటోందిగా... సిటీ అంతా బాగా తెలుసు..." గబుక్కున అన్నాడు ఆనందం.

 

    "మేరీయా... అదెవరు?"

 

    తలబాదుకున్నాడు ఆంజనేయులు.

 

    "నర్సింగ్ హోం కధ చెప్తానని, మలక్ పేట కధ చెప్పావ్... మళ్ళీ రంగస్థలంలోకి ఈ మేరీని తీసుకొచ్చావ్? లాభం లేదు... ఇన్ని తలాతోకా లేని అబద్ధాలతో జీవించే కన్నా, ఇల్లు ఖాళీ చేసెయ్యడమే బెటర్..." మనసులో చికకుపడి ఆనందాన్ని పక్కకు లాగి...

 

    "అది కాదు ఆంటీ గారూ... మేరీ కాదండీ... తరణీ... మా తరణి వాళ్ళ పెదనాన్న గారమ్మాయి ఇద్దరికీ చిన్నప్పటి నుంచి దోస్తీ ఎక్కువటండి... కలిసే 'జీళ్ళు' అవీ తినడం, కాలవల్లో ఈతలాడ్డం, కలిసే కొబ్బరి చెట్లెక్కడం ఇవన్నీ చేశారటండీ... ఇవ్వన్నీ నాకు దార్లో చెప్పి, ఉదయాన్నే వచ్చేస్తానని ప్రామిస్ చేసి వెళ్ళిందండీ... హైద్రాబాద్ రాగానే అడిగిన మొదటి కోరిక. తీర్చాలి కదండీ..." అని అంటున్న దశలో...

 

    "నేన్నమ్మణు..." అనుకుంటూ భుజంగరావు ప్రవేశించాడు. ఆయనకు ఉదయం మేరీ వచ్చి వెళ్ళిం దగ్గర్నించీ ఆంజనేయులు మీద చెడ్డ అనుమానంగా ఉంది. ఆ కసిని ఇలా వ్యక్తం చేశాడు.

 

    "బాబాయిగారూ... మీరు కూడా మా పట్ల విలన్ గా ప్రవర్తించకండి. అసలే విధి ఆడుతున్న వింత నాటకంలో, కేరక్టర్స్ ఏవిటో తెలియక, ఆ కేరక్టర్స్ ఏమిటో తెలిసినా, చేతిలో స్క్రిప్టులేక నానాబాధలూ పడుతున్నాం బాబాయిగారూ..." బయటికే ప్రాధేయపడ్డాడు అనందం.

 

    "అయితే ఉదయం వచ్చిన అమ్మాయెవరు...? అబద్ధం ఆడకుండా చెప్పు?"

 

    పక్కన భార్య ఉందనే విషయం మర్చిపోయి బయటికన్నాడు.

 

    "అదేం ప్రశ్నండి.. మన ఆంజనేయులు పెళ్ళాం... తరణండి... ఊర్నించి వచ్చింది కదండీ... అందుకే చెప్పాను... సిటీలో కెళ్ళొద్దని... చుట్టలు తెచ్చుకుంటానని సిటీలోకెళ్ళారు బాబూ... అప్పట్నించీ ఇదీ వరస... పోనీలెండి.. అమ్మాయి ఉదయం వస్తుంది కదా... రండి భోజనాలు చేద్దాం..."

 

    ఆ టాపిక్ ని ఆవిడ 'కట్' చెయ్యడంతో ఊపిరి పీల్చుకున్నాడు ఆంజనేయులు.


                                               *    *    *    *


    మర్నాడు ఆంజనేయులు, ఆనందం కోసం ఎదురుచూస్తూ కూర్చుంది భువనేశ్వరీదేవి.

 

    "ఏమండీ... అమ్మాయి ఉదయాన్నే వస్తుందన్నారు కదండీ... రాలేనట్టుంది" భర్తనడిగింది ఆవిడ.

 

    "నాకేం తెలుసు... ఏదైనా డ్రామా ఆడుతున్నారేమోనని ణా అనుమానం..." చుట్ట పొగ గుఫ్, గుఫ్ మని వదుల్తూ అన్నాడాయన. మేరీ విషయం ఇతమిద్ధంగా ఆయనకేమీ తెలియక పోవడంతో వాళ్ళ మీద కసిని ఆ విధంగా తీర్చుకున్నాడాయన. 

 Previous Page Next Page